"ఏం ఫర్లేదు భవానీ పాడేసెయ్! డబ్బులెలాగూ డాడీ ఇచ్చేస్తారు"
"అంతేనంటావా?"
అతను కర్చీఫ్ తో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని ఎనిమిది లక్షల ఒక్క రూపాయ్ అనబోయేంతలో మరో మూలనుంచీ "ఎనిమిదిన్నర లక్షలు" అన్న గొంతు వినబడింది.
"శభాష్ నెహ్రూ డ్రస్ మీలియనీర్. శభాష్! హమ్ బీ కుచ్ కమ్ నహీ అని ఆ కూలింగ్ గ్లాసెస్ హీరోకు సఫారీ దిల్ వాలా నిరూపించారు. ఇప్పుడు కూలింగ్ గ్లాసెస్ హీరో, ఆ సఫారీ సూట్ కు ఇచ్చే జవాబేమిటి? నెహ్రూ డ్రస్ మిలియనీర్ కి సలాం చేసి ఎవరిదారి వారు చూసుకోవటమేనా?"
"నో!" అరిచాడు భవానీశంకర్.
"తొమ్మిది లక్షలు"
"హాయ్ రాజా హాయ్! ఇస్ కో కహాతే హిమ్మత్! కరోర్ పతీ కూలింగ్ గ్లాసెస్ హీరో పక్కనున్న అందాల బొమ్మ ప్రోద్భలంతో పెంచిన పాట తొమ్మిది లక్షలు."
"పదిలక్షలు" అంది రెండో గొంతు.
వేలం పాట వాడికి నోట మాట రాలేదు కొద్ది క్షణాలు.
"పపపపది లక్షలా?" అడిగాడు అనుమానంగా.
"అవును"
"హాయ్ రాజా కాయ్! సఫారీ సూట్ దిల్ దార్ ఆద్మీ పపపది లక్షలు!"
అక్కడున్న జనంలో సగం మంది వెళ్ళిపోయారు.
"పది లక్షల ఒక్క రూపాయ్" అంది మరో గొంతు!
"హాయ్ శభాష్! నెహ్రూ డ్రస్ మిలియనీర్ చిన్నబుచ్చుకున్న ముఖంతో, కోపంతో, రోషంతో, బాధతో పది లక్షల ఒక్క రూపాయ్"
"ఒక్కసారి- రెండుసార్లు"
"పదకొండు లక్షలు" అరిచాడు భవానీశంకర్.
వేలంపాట వాడికి స్పృహ తప్పినంత పనయ్యింది. కళ్ళు తిరిగినట్లయి కిందకూలబడేసరికి ఎవరో ముఖాన నీళ్ళు కొట్టారు. కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. మిగతా జనంలో మూడొంతుల మంది వెళ్ళిపోయారు.
"వాళ్ళెవరికో పిచ్చెక్కింది. ఇక్కడ మార్కెట్ రేటు నాలుగువేలంటే వాళ్ళు ఆరు వేల వరకూ వెళ్ళిపోయారు" అంటున్నారెవరో.
"పన్నెండు" అన్నాడు రెండో గొంతు.
వేలంపాట వాడు ముందే ముఖాన్న నీళ్ళు కొట్టుకుని కింద పడకుండా నిలబడ్డాడు. కానీ కొంచెం మతి చలించినట్లయ్యింది. "జిఫ్తర్ కసాగూ మిసోచికలసామరిస ఆహేత్ కో దోక్ష పరితసిముగ కఖగఘ" అన్నాడు ప్రక్కనున్నవాడితో పిచ్చివాగుడు వాగుతూ. అతని పక్కన పుస్తకంలో రాసుకుంటున్నవాడు లేచి ఆ పాడే అతని నెత్తిమీద రూళ్ళ కర్రతో కొట్టాడు. దాంతో వెంటనే నార్మల్ అయిపోయాడతను.
"ససససఫారీ సూట్ దిల్ దార్ ఆద్మీ- పన్నెండు లక్షలు"
భవానీశంకర్ నవ్వుతూ ప్రతిమ వైపు చూశాడు.
ప్రతిమ అతని నవ్వుని నమ్మలేదు. దాంతో ఆ నవ్వుని ఏడుపుగా మార్చి చూశాడు. ఆమె చాలా వరకూ నమ్మినట్లు కనిపించింది. అది చాలా ఇన్సల్టింగ్ గా అనిపించిందతనికి.
"పదమూడు లక్షలు" అరిచాడతను.
వేలంపాట పాడేవాడు టేబుల్ మీద నుంచి దభేల్ మని కిందపడిపోయాడు. వెంటనే అతనిని ఇద్దరు కుర్రాళ్ళు స్ట్రెచర్ మీద మోసుకెళ్ళిపోయారు. వాడిని మోసుకెళ్ళిన కొద్ది క్షణాలకి నెహ్రూ డ్రస్ వాలా మిలియనీర్ నెమ్మదిగా మోల్టింగ్ మాన్ లాగా మెల్ట్ అవుతూ నేలమీద కూలబడిపోయాడు.
మొదటి వేలంపాట వాడి స్థానంలో వచ్చిన రెండోవాడు అతని ముఖంలోకి చూస్తూ "పదమూడు లక్షలు! ఒకటోసారి - రెండోసారి" అని అరిచాడు.
"పదమూడు లక్షల ఒకటి" అన్నాడు భవానీశంకర్.
"ఓ శభాష్ కరోర్ పతీ కూలింగ్ గ్లాసెస్ హీరో పదమూడు లక్షల ఒకటి!" అరిచాడు వేలం పాడేవాడు.
అక్కడున్న మిగతా కొద్దిమంది కూడా బయటకు నడిచారు గొణుక్కుంటూ "ముగ్గురూ పిచ్చోళ్ళే! ఏమాత్రం సందేహం లేదు. ఫ్యూర్ మెంటల్ లేకపోతే ఏమిటి ఏడు లక్షల ప్రాపర్టీకి పదమూడు లక్షలా? వీళ్ళు బహుశా ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చి వుంటారు. మనం వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళు ఇక్కడున్నారని ఆచూకీ ఇవ్వటం మంచిది" అంటున్నాడు ఒక మార్వాడీ ఇంకో మార్వాడీతో. ఆ మార్వాడీ అప్పటికే జుట్టు పీక్కుంటూ రోడ్డుపక్కనే వున్న బిచ్చగాడిని బలవంతంగా భుజాల మీద ఎక్కించుకుని విరగబడినవ్వుతూ నడుస్తున్నాడు.
"పధ్నాలుగు లక్షలు" అన్నాడు సఫారీ సూట్ దిల్ దార్ ఆద్మీ. అప్పుడు చూశాడు నెహ్రూ డ్రస్ మిలియనీర్ మార్కండేయులు అటువైపు తిరిగి సఫారీ సూట్ లో ప్రకాష్ ని చూడటంలోనే "య్యాయ్యాయ్యాయ్యాయ్యా" అని అరుస్తూ పక్కనే వున్న పెద్ద బండరాయిని అమాంతం గాలిలోకి లేపి పట్టుకుని ఆ సఫారీ సూట్ వైపు పరుగెత్తాడు.
కానీ గమ్యం చేరకముందే "పదిహేను లక్షలు" అన్న కేక వినిపించింది మరోవైపు నుంచి. దాంతో ఆ బండరాయితో సఫారీ సూట్ వైపు పరిగెత్తడం ఆపి రెండో వైపు చూశాడు.
కూలింగ్ గ్లాసెస్ లో భవానీశంకర్, అతని పక్కనే ఉత్సాహంగా చప్పట్లు చరుస్తోన్న ప్రతిమ కనిపించారతనికి.
"వావావావావావా" అని మరింత ఆవేశంగా బండరాయితో భవానీశంకర్ వైపు పరుగెత్తసాగాడు.
అప్పుడు తెలిసింది భవానీశంకర్ కి, ప్రకాష్ కీ తామిద్దరూ అంతసేపు నుంచి తమలోతామే పోటీ పడటమే కాక తమ అంకుల్ మార్కండేయులుకి కూడా పోటీపడి పాటను అనవసరంగా పెంచారని.
భవానీశంకర్ ముంచుకొస్తున్న ప్రమాదం గమనించి ప్రకాష్ వైపు చూసి గట్టిగా విజిల్ కొట్టాడు.
"హరియప్ మైడియర్ ప్రకాష్! పరిస్థితి విషమించినట్లు అనుమానంగా వుంది. రనప్" అంటూ అరచి తను ప్రతిమ చేయందుకుని బయటకు పరుగెత్తి హాండు లూమ్ హౌస్ లో దూరి కౌంటర్ మాటున కూర్చుండిపోయాడు. వాడి వెనుకే ప్రకాష్ కూడా వచ్చేశాడు ఒగరుస్తూ. "అంతా మెనప్ అయిపోయింది" అంది ప్రతిమ ఆయాసంతో మాట్లాడలేక మాట్లాడుతూ.
"అవును!" అన్నాడు ప్రకాష్.