Previous Page Next Page 
సాహసి పేజి 34


    అతనితోపాటు కిందపడిన కొండచిలువ మీద మరో రెండు వేట్లు వేశాడు.

    కొండ చిలువ శరీరము రెండు ముక్కలుగా విడిపోయింది.

    పెను భయాన్నుంచి మేల్కొన్న యువరాజు లేచి, అటూ- ఇటూ చూశాడు. మేనీటర్ కన్పించలేదు.

    రైఫిల్ ని అందుకుని ముందుకు పరుగెత్తాడు.

    పులి వెళ్ళిపోయింది.

    చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఉంటుందా? లేదా? వెళ్ళిపోయుంటుందా?

    "పులెక్కడ కనబడుతుంది? ఎక్కడో పారిపోయుంటుంది... మరి దొరకదు రాజూ" రొప్పుతూ... వెనుక నుంచి వచ్చిన ముత్యాలనాయుడు అన్నాడు.

    "లేదు ముత్యాలూ... ఇక్కడే, ఎక్కడైనా మాటువేసి ఉండవచ్చు" అవకాశం చేజారిపోయినందుకు విచారంగా వుంది యువరాజుకి.

    "లేదు... రాజూ... మేనీటర్... ఏకాంతాన్ని ఎంచుకుంటుంది- ఒంటరి మనిషి మీదే దాడి చేస్తుంది. దాని స్వరూపం అది... రా... వెళదాం..."

    పచ్చటి పులి, పులి భారీస్వరూపం, కళ్ళముందు కదలాడుతూనే వుంది. యువరాజు చాలాసేపటి వరకూ పులి గురించి, కొండ చిలువ గురించి ఆలోచిస్తూనే వున్నాడు.

    అప్పటికి మేనీటర్ కపాలకోన దగ్గరున్న పొదల్లో వుంది.

    జరిగిందేమీ యువరాజు కానీ, ముత్యాలనాయుడు కానీ మిగతా వారికి చెప్పలేదు. భయపడి పారిపోయిందని మాత్రమే చెప్పారు. జరిగింది చెపితే షాకయిపోతారని- దాని మూలంగా ప్రయాణం సజావుగా సాగదని.

    రావిచెట్టు కిందున్న రాతిబండ మీద చిన్న దేవతా విగ్రహం ఎర్రగా మెరుస్తోంది. ఆ విగ్రహం ముందు వాడిపోయిన పూలు, ఎండిపోయిన కొబ్బరి చిప్పలూ వున్నాయి.

    "మనం ట్రైబల్ విలేజ్ కి దగ్గరలో వున్నాం" చెప్పాడు కపాలేశ్వర్.

    అక్కడో గిరిజన గ్రామం వుందని తెలపడానికి గిరిజనులే ప్రత్యేకంగా రావిచెట్టు కింద దేవి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ప్రతి పున్నమికి పూజలు చేస్తారు. అదొక ఆచారం.

    ఆ సమయంలో వాళ్ళు కొండదిగి, లోయలోని మైదాన ప్రాంతములో నడుస్తున్నారు. ఒక్కసారిగా అందరి నడకా హెచ్చింది. చెరువు చెరువు గట్టు నానుకుని వెళ్ళే దారి.

    ఉదయం-

    పదిగంటలవేళ వాతావరణం ప్రశాంతంగా వుంది.

    ఎక్కడినుంచో ఉండుండి తీతువు అరుస్తోంది.

    "తీతువు అరుస్తోందమ్మా... మంచిది కాదు..." చెప్పబోయి ఆగిపోయాడు ముత్యాలనాయుడు.

    తుప్పల మధ్య నుంచి వెళ్ళే వారి దృష్టి నేలమీదే వుంది.

    వాళ్ళలో ఏ ఒక్కరైనా తలెత్తి ఎత్తుగా ఉన్న చెట్లవేపుగానీ, ఆ పక్కనే వున్న కొండవేపుగానీ చూస్తే తెలిసేది!

    కానీ దట్టమైన తుప్పలు, వారికా అవకాశం ఇవ్వలేదు. దట్టమైన బూర్జచెట్ల మధ్యభాగంలో చిన్న చిన్న మంచెలున్నాయి. ఆ మంచెల్లోని ఒక మంచెమీద విప్పసారా మత్తుల్లో ఉన్న ఒక ఆటవిక వ్యక్తి-

    ఏదో అడుగులు వినబడితే-

    పైనుంచి చూశాడు కిందికి.

    కింద వరసగా తమ కొండవేపే వస్తున్న మనుషులు- అతనే మాత్రం మరి ఆలస్యం చేయలేదు. ఒక చెట్టుకొమ్మని అందుకుని ముందు కురికాడు టార్జాన్ పద్ధతిలో చెట్టుకొమ్మ నుంచి కొమ్మకు- అయిదే ఐదు నిమిషాల్లో మెరుపు వేగంతో... అతను చేరాల్సిన ప్రదేశం చేరాడు.

    ఆ ఆటవిక వ్యక్తిని వీళ్ళలో ఎవరయినా చూసుంటే... వీళ్ళ ప్రాణాలు ఆగిపోయేవి.

    అంత భయంకరంగా వున్నాడతను.

    మరో అరగంటలో-

    కపాలకోన ప్రారంభంలోనే అతి ప్రమాదకరమైన సంఘటన ఎదురౌతుందని ఇందుమతి బృందంలోని వారికెవరికీ తెలీదు.

    ఒక్కసారిగా తీతువు అరుపులు ఎక్కువయ్యాయి.

    ఇందుమతి తన కాలికి తగిలిన ఏదో వస్తువుని పరీక్షగా చూసింది.

    అదొక మానవ కపాలం!

    ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది.


                   *    *    *    *


    తమలో రేగుతున్న భయాన్ని పోగొట్టుకునే తరుణోపాయం ఏదో కావాలనిపించింది ఇందుమతికి- లేదంటే వైశాలి ముందు పెయింటయి పడిపోయే ప్రమాదం ఉంది. అంత భయంకరంగా ఉందా అడవి కావాలనే కపాలేశ్వర్ ని మాటల్లో పెట్టింది.

    "ఈ కోటలు, పేటల్ని తల్చుకుంటే... నాకెప్పుడూ విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైనా... ఒక్కసారైనా, దేశమంతా ట్రావెల్ చెయ్యాలని నా కోరిక... అడవిలోకి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు..." ఎండుటాకుల మీద ఇందుమతి అడుగుల చప్పుడు స్పష్టంగా విన్పిస్తోంది.

    "చరిత్రమీద, మమకారమే ఆఖర్లేదు... సంస్కృతి తెలుసుకోవాలనుకునే ఏ వ్యక్తయినాజైపూర్, పాట్నా, జైసల్మార్ లాంటి నగరాల్ని, ఆ నగరాల్లో వున్న కోటల్నీ చూడాల్సిన అవసరం వుంది. అదే మానవ నాగరికత సృష్టికి కారణాలు-" చెప్పాడు కపాలేశ్వర్.

    "మనవాళ్ళు నగరాల్ని, కోటల్ని నిర్మాణం చేసేటప్పుడు... ఒక పథకం ప్రకారం నిర్మించారంటారా..." ఉత్సాహంగా అడిగింది ఇందుమతి.

    "అంటారా అని మామూలుగా అంటారేమిటి- మీరు కౌటిల్యుని అర్ధశాస్త్రం చూశారా? పోనీ, ఒక్కసారి చదవండి... ఎన్ని విశేషాలు తెలుస్తాయో... రామాయణంలోగానీ, భారతంలో గానీ రాముడు, కృష్ణుడు తదితర పాత్రలు... మన సినిమా వాళ్ళ రూపకల్పన చేసినట్టు లేవని చారిత్రకులు చెపుతున్నారు..."

    "మరెలా ఉండేవారు..."

    "పంచ, పైమీద అంగోస్త్రం... గిరజాల జుత్తు... ముడులు... ఆడవాళ్ళకైతే చీర, జాకెట్లుండేవి కావు- ఆటవికమే వారి జీవనం..." చెప్పాడు కపాలేశ్వర్.

    ఆశ్చర్యంగా చూసింది ఇందుమతి.

    "కోటల గురించి చెప్పండి..." సహజమైన ఉత్సుకతతో అడిగింది ఇందుమతి.

    "వీడికి కథలు తప్ప మరేవీ రావు..." అన్నట్టుగా కపాలేశ్వర్ వేపు చూశాడు యువరాజు.

    "ఆర్య సంస్కృతి చాలా గొప్పది. నగరాలకు, పట్టణాలకు అప్పుడే రూపకల్పన జరిగింది. క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దానికి ముందే మన భారతదేశం, అత్యద్భుతమయిన కట్టడాలతో విలసిల్లేది. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో జనావాసాలు, కోటలు గురించి, మనకు విపులమైన వివరణలు కనిపిస్తాయి. రామాయణం, మహాభారత సమయంలో కోటలన్నీ మట్టి కోటలే... మట్టి కోటల తర్వాత వచ్చినవి రాతి కోటలు... బుద్ధుని జాతక కథల్లో మనకు కోటల గురించి, ఆసక్తికరమయిన సమాచారం దొరుకుతుంది...

    మొదట కోటల నిర్మాణం మైదానాల ప్రాంతాల్లో జరిగేవి- కోటకు కొంచెం దూరంలో నది, లేదా ఏరు- తప్పనిసరిగా ఉండాలి- ఆ నదిమీద పున్నమిరోజుల్లో చంద్రబింబం తేలియాడాలి. పరిపూర్ణమయిన వెన్నెల, తమ మీద పడాలని ఆనాటి రాజులు కోరుకునేవారు కోటల్ని కాని, ఒక నగరం, ఒక పట్టణం ఏదైనా వేదాల్లో చెప్పిన ప్రకారమే నిర్మించేవారు. కోటకుగాని, నగరానికి కానీ, పట్టణానికి గానీ మూలదేవతను ప్రతిష్టించిన తర్వాతే, నిర్మాణాన్ని ప్రారంభించేవారు. శత్రువుల బారి నుండి రక్షణ అనే విషయం అలనాటి నిర్మాణాలకు ప్రధానాంశంగా ఉండేది. అందుకే కోట ముందు కందకం, నగరాల చుట్టూ చెరువుల నిర్మాణాన్ని మొదట చేపట్టేవారు. వాటిల్లో మొసళ్ళను ప్రత్యేకంగా పెంచేవారు. రక్షణ దుర్గాల్ని నిర్మించేవారు. మొదట శత్రువులను ఎదుర్కోడానికి, కోటగోడల్ని ఏటవాలుగా, శత్రువులెవరూ అధిరోహించడానికి వీల్లేకుండా నిర్మించేవారు. ఆ గోడల్ని శత్రువులు ఎక్కడానికి ప్రయత్నించే పక్షంలో పెద్ద పెద్ద బండరాళ్ళను, మరుగుతున్న నూనెను పైనుంచి పొయ్యడానికి వీలుగా ఆ గోడలుండేవి.

    ఆ తర్వాత గన్ పౌడర్ వాడకంలోకి వచ్చింది. నాటు తుపాకుల్లో గన్ పౌడర్ ని పెట్టి, శత్రువుల మీద ప్రయోగించేవారు- సురేకారం. గంధకం, బొగ్గుతో గన్ పౌడర్ ని తయారుచెయ్యడానికి ఆయా కోటల్లో ప్రత్యేకమయిన విభాగాలుండేవి. మహమ్మదీయులు భారతదేశాన్ని పరిపాలించడానికి ముందే గన్ పౌడర్ వాడకం ఇక్కడ వుండేది. విదేశాల నుంచి మనదేశాన్ని చూడడానికి వచ్చే యాత్రికుల ద్వారా అప్పటి రాజులు గన్ పౌడర్ ను సంపాదించారు. ముస్లిం రాజుల పాలనలో భారీ ఎత్తున గన్ పౌడర్ వాడకం పెరిగింది. శత్రువులమీద, పెద్ద పెద్ద తుపాకులతో దాడి చెయ్యడానికి కూడా అప్పుడే ఆరంభమైంది.

    క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం నాటికి మధుర, మగధ, అవంతి, కౌశాంబి మొదలయిన రాజ్యాలు... కోటల నిర్మాణాలకు ఉదాహరణలుగా నిలిచాయి. 

    కోటల్లో ప్రధానంగా ఏడు విభాగాలుంటాయి. విమానం లేదా ప్రాసాదం, అంతఃపురం (లోపలికోట), ప్రజల్తో రాజులు కొలువుతీరే రాజభవనం (లేదా దర్బారు హాలు) రాణులు అంతఃపురం- అపాదానాలు (పెద్ద, పెద్ద హాల్స్), నీటి వసతి గృహం, అగ్నికుండం, ఇష్టదేవతల గుడులు... అశ్వ, గజ, పదాతిదళ శాలలు- పూలతోటలు ఉండేవి.

    పటిష్టమయిన వ్యూహంతో పకడ్బందీగా నిర్మించిన కోటల్లో 17వ శతాబ్దానికి చెందిన ఢిల్లీలో వున్న ఎర్రకోట గొప్పది. అప్పట్లో దానిని ఆంగ్లేయులు "ఇఫ్ దేర్ ఈజ్ ఎ పేరడైజ్ ఆన్ ఎర్త్, ఇట్ ఈజ్ దిస్, ఇట్ ఈజ్ దిస్" అని పొగిడేవారు౦- అందుకే ఆ విశాలమయిన కోట వున్న ప్రాంతాన్ని షాజహానాబాద్ అని అనే వారట షాజహాన్. ప్రపంచంలో అతి విలువైన, అతి సుందరమయిన, మయూర సింహాసనాన్ని అధిరోహించేవాడట. మయూర సింహాసనం పూర్తిగా బంగారంతో వజ్రవైఢూర్యాలతో చేయబడింది. ఈ సింహాసనాన్ని ఆస్టిన్ బోర్టెక్స్ అనే ఫ్రెంచి వజ్రాల వ్యాపారి సారధ్యంలో రూపొందించడం జరిగింది. అప్పట్లోనే దీని నిర్మాణానికి 150 మిలియన్ల ఫ్రాంకులు ఖర్చయ్యాయని చరిత్ర చెప్తోంది.

    ఎర్రకోట, ఎర్రకోట లోపల ప్రాసాదాలన్నీ బాగ్దాద్ నగరంలోని భవనాల్ని పోలి ఉంటాయని చరిత్రకారులు చెప్తారు. అందుకు కారణం- బాగ్దాద్ నగరాన్ని షాజహాన్ బాగా ఇష్టపడడమే.

    అలాగే తాజ్ మహల్ నిర్మాణం కూడా.

    షాజహాన్ సౌందర్యాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, షాజహాన్ ని పతనం చేసి, అధికారంలో కొచ్చిన అతని కొడుకులు రక్తపాతాన్ని అంతగా అభిమానిస్తారు. రక్తపాతానికి సిద్ధమయిన సమయంలో షాజహాన్, పెద్ద కొడుకు దారా షికావేపు వున్నాడు- కానీ 1659లో జరిగిన యుద్ధంలో ఔరంగజేబు అధికారంలో కొచ్చాడు. షాజహాన్ ఖైదు చేయబడ్డాడు. కాలపు వంతెనని చరిత్రకర్తలు మాత్రమే అవలీలగా దాటగలరు. చక్రవర్తులు దాటలేరు. అందుకు నిదర్శనం... ఢిల్లీలోని ఎర్రకోట" చెప్పడం ఆపేడు కపాలేశ్వర్.

 Previous Page Next Page