లీక్ ప్రూఫ్ ప్రభుత్వం
మా కాలనీ జర్నలిస్ట్ గోపాల్రావ్ భార్య హఠాత్తుగా మాఇంటికొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది. అందరం కంగారుపడి ఆమె చుట్టూ మూగాం.
"ఏమిటి సిస్టర్ - ఏం జరిగింది? ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నారు?" అడిగాడు పాల్ కంగారుగా.
"ఆయన పరిస్థితేం బావోలేదన్నయ్యగారూ! పదిరోజుల్నుంచీ ఉలుకూ పలుకూ లేదు. గడ్డం పెంచుకుని అలా మంచం మీద పడుకున్నారు. ఏదో దిగులు పెట్టుకున్నారు- పైకి చెప్పమంటే చెప్పరు"
అందరం గోపాల్రావ్ ఇంటికెళ్ళాం. గోపాల్రావ్ మంచంమీద పడుకుని శూన్యంలోకి చూస్తున్నాడు. చాలాసేపు బ్రతిమాలాక అసలు సంగతి చెప్పాడు.
"గవర్నమెంట్ కి సంబంధించిన రహస్యాలు ఎవరిద్వారానయినా 'లీక్' చేయించి ఆ లీక్ లు రిపోర్ట్ రాసివ్వాలని మా ఎడిటర్ కొత్త రూల్ పెట్టాడు! వారానికి నాలుగు 'లీక్' లయినా కనీసం రుజువులతో తేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని అంటున్నాడు. నేను ఎంత ప్రయత్నించినా ఎవరూ ఇంత చిన్న సీక్రెట్ కూడా 'లీక్' చేయడంలేదు. ఏం చేయాలో అర్థంకాక ఆఫీస్ కెళ్ళడం మానేశాను-" దిగులుగా చెప్పాడు.
మాకందరికీ అతనిని చూస్తే జాలివేసింది.
'అతనికెలాగయినా నాలుగయిదు 'లీక్' లు సంపాదించి పెట్టాలని నిర్ణయించుకుని మా కాలనీలో గవర్నమెంట్ అధికారులతోనూ, రాజకీయనాయకులతోనూ లింక్స్ ఉన్నవారిని వెంటేసుకుని బయల్దేరాం. అందరం సెక్రటేరియట్ లో ఓ సెక్రటరీని కలుసుకున్నాం. ఆయనకూ, ఆయన శాఖ మినిష్టర్ కీ పడడంలేదని మావాళ్ళకెవరో ఇన్ ఫర్మేషన్ 'లీక్' చేశారట.
"ఇతను మా కాలనీ జర్నలిస్ట్ గోపాల్రావ్! 'ఈ క్షణం' పేపర్లో పనిచేస్తున్నాడు. అతనికి ఎవ్వరూ 'లీక్'లు ఇవ్వడం లేదట- అందుకని ఉద్యోగం పోయేట్టుంది. దయచేసి ఏదయినా ఒక్క 'లీక్' అతనికి దానం చేశారంటే మీ రుణం ఉంచుకోడు! మీ ఇష్టానికి వ్యతిరేకంగా మినిష్టరెవరయినా మిమ్మల్ని బదిలీ చేసినప్పుడు మావాడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మినిష్టర్ మీద దుమ్మెత్తిపోసేస్తాడు" అన్నాడు మాతో వచ్చినతను.
సెక్రటరీకి అర్థంకాలేదు కానీ అంతా చెప్పాక "ఓ అదా! మా శాఖలో 'లీక్' లన్నీ న్యూస్ పేపర్స్ కు ఎప్పుడో ఇచ్చేశాం! ఇంకో రెండు నెలల తర్వాత కనబడమనండి౧ కొత్తవేవో వచ్చే అవకాశం వుంది-" అన్నాడు.
మరో నాలుగయిదు శాఖలు తిరిగేసరికి మాకు చిరాకొచ్చింది. తెల్లారి లేస్తే ప్రతి జర్నలిస్టూ బోలెడు 'లీక్'లు సంపాదించి న్యూస్ పేపర్స్ లో బాక్స్ అయిటమ్ గా వేసేస్తుంటే మాకు ఒక్కటి కూడా దొరక్కపోవడమేమిటి?
నిరాశతో మేము తిరిగివచ్చేస్తూంటే మాకు పరిచయమున్న రాజకీయ నాయకుడు కనిపించి మమ్మల్ని చూసి జాలిపడి ఓ మినిష్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
"మీకు 'లీక్' కావాలా? చెప్పరేం మరి? అంటూ తన టేబుల్ సొరుగులో నుంచి ఓ కాగితం తీసిచ్చాడు.
"అందరం అక్కడికక్కడే ఆ కాగితం మడత విప్పి ఆతృతగా చదివాము."
"భారతదేశంపై పాకిస్తాన్ దాడి చేయడానికి జులై మూడో తేదీన ముహూర్తం నిశ్చయించింది" అని వుందందులో.
"ఇది కాశ్మీర్ తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు స్మగుల్ చేస్తూ దొరికిపోయి ఇచ్చిన సీక్రెట్ ఇన్ ఫర్మేషన్" అన్నాడు మంత్రి ఆనందంగా. "ఇది ఇంకే పత్రికకూ ఇవ్వలేదింకా! మీరు కావలసినవాళ్ళు కాబట్టి మీకిస్తున్నాను"
మేము ఆనందంతో పొంగిపోయాం - అందరం కలసి ఆ 'లీక్'ని తీసుకుని హడావుడిగా 'ఈ క్షణం' పత్రికాఫీస్ చేరుకున్నాం. ఆ 'లీక్' సంపాదించడానికి ఎన్ని అవస్థలు పడింది ఎడిటర్ కి చెప్తూండగానే అతను ఆ కాగితం చదివి నాలుగు ముక్కలు చేసి కిందపడేశాడు.
"ఇది లీకా? మీకేమయినా తెలివుందా? పాకిస్తాన్ దాడి చేయనీ, చేయకపోనీ ఆ విషయం ఇప్పుడెవడిక్కావాలి?" అంటూ చింపి అవతల పారేశాడు.
ఈసారి మరో సెక్రటరీని కలుసుకున్నాం. అంతకు ముందురోజే అతన్ని కేంద్రానికి పంపించేయాలని రాష్ట్రప్రభుత్వం నిశ్చయించినట్టు వార్త చదివాం! కనుక అతను కసిగా చాలా 'లీక్'ఇస్తాడని అనిపించింది. తీరా చూస్తే అతనిచ్చే లీక్ ల కోసం వందలమంది గుమిగూడిపోయారతని ఇంటి ముందు.
రికమండేషన్ పెద్దది వుండడంతో మాకే ముందు ఇంటర్వ్యూ దొరికింది. "రాసుకోండి" అన్నాడతను మావంక సీరియస్ గా చూసి.
"హర్షద్ మెహతా మన ముఖ్యమంత్రికి కూడా కోట్ల రూపాయలిచ్చాడు. మన మంత్రులంతా లంచగొండులు! ఇదంతా నేనే చెప్పానని రాయండి" గోపాల్రావ్ కి అనుమానం వచ్చింది.
"కానీ - మీ మాటలను రుజువు చేసే కాగితాలేమైనా..."
"ఇంక రుజువు లేమిటయ్యా? నన్ను బదిలీ చేయడమే పెద్ద రుజువు" మేము నిరాశగా బయటికొచ్చేశాం.
బయటకు వచ్చేస్తూంటే ఓ వ్యక్తి మా దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు సిల్కు లాల్చీలో. "నమస్తే సార్! నేను లీక్ బ్రోకర్ ని! మీకేమైనా లీక్ లు కావాలంటే ఇప్పిస్తాను."
"అదేమిటి? షేర్ బ్రోకర్స్ లాగా లీక్ బ్రోకర్స్ కూడా వుంటారా?"
ఇప్పుడు ఇదే మంచి బిజినెస్సండీ! మీకు తాజా లీక్ లు కావాలా వద్దా చెప్పండి! హర్షద్ మెహతా డబ్బు తీసుకున్న జెపిసి మెంబర్సు ఎవరు? రాష్ట్రపతి పి.వి. గవర్నమెంట్ ని ఎప్పుడు పడగొడుతున్నారు? 1991 నవంబర్ నాలుగున పి.వి. ఎక్కడున్నారు? సి.బి.ఐ. నుంచి మాధవన్ ని బలవంతంగా ఎవరు రిజైన్ చేయించారు? సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ దగ్గర డబ్బు తీసుకున్నాడా?"
మాకు ఆ లీక్ లన్నీ చాలా అద్భుతంగా కనిపించాయ్. "మాకా లీక్ లన్నీ కావాలి! ఎంతకమ్ముతావ్?" అడిగాము అతని చుట్టూ చేరి.
"ఒక్కొక్కటీ పదివేల రూపాయలు- డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ కావాలంటే ఒక్కోటి లక్ష! ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలంటే కోటి రూపాయలు."
మేము నిరాశగా వెనక్కి తిరిగాము. ఓ ప్యూన్ గేటు దగ్గర నిలబడి వున్నాడు. "లీక్ కావాలా సార్? ఫ్రెష్ లీకు సార్! వీరప్పన్ కూడా పి.వి.కి లంచం ఇచ్చాడా అనే లీక్ సార్ - నూటపాతిక రూపాయలు! ఆడియో టేప్ రుజువు కావాలంటే రెండొందలయాభై సార్ - టేప్ జపానోళ్ళది సార్! మంచి క్వాలటీ- టేప్ లో రెండోవేపు పుట్టపర్తి సాయిబాబా లీక్ లు కూడా వున్నాయ్ సార్."
మేమింక ముందూ వెనుకా ఆలోచించలేదు. అందరం కలిసి తలో పాతిక వేసి ఆ టేప్ కొని గోపాల్రావ్ కిచ్చేశాం.
"ముందు నీ ఉద్యోగం నిలబెట్టుకో గురూ! ఈసారి ఇంకొంచెం ఎక్కువ డబ్బు పోగుచేసుకొచ్చి మంచి లీక్ లు కొందాం" అన్నాడు రంగారెడ్డి. గోపాల్రావ్ ఆనందంగా వెళ్ళిపోయాడు.
* * *