అహ్హాహ్హా! ప్రయాణీకుల అంతం చూస్తాం
మా కాలనీలో కొంతమంది కలసి వేసవి శెలవులకు తిరుపతి, బెంగుళూరులకు టూర్ వేద్దామని నిశ్చయించుకున్నాం. వెంటనే రైల్వేస్టేషన్ కెళ్ళేసరికి నెల్రోజులవరకూ రైళ్ళేమీ ఖాళీ లేవని చెప్పారు వాళ్ళు.
ఇలా లాభం లేదని మా కాలనీ వాళ్ళందరం కలసి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ రోడ్ మాప్, ఆర్టీసీ టైమ్ టేబుల్ దగ్గర పెట్టుకుని టూర్ ప్రోగ్రాం ఫైనలైజ్ చేశాం. తీరా అందరం బయల్దేరబోతుండగా జనార్ధన్ పరుగుతో వచ్చాడు.
"గురూ! మన ఆర్టీసీ హఠాత్తుగా భూతంగా మారిపోయి ప్రయాణీకులందరినీ చిత్రహింసలు పెడుతోందట. ఇప్పుడే ఊర్నుంచి వచ్చిన మా బంధువులు చెప్పారు" మేమంతా నవ్వేశాం.
"జోక్ చేసి వుంటారు! లేకపోతే ఆర్టీసీ భూతమవటమేమిటి? అదేమైనా మనిషా? భూతమవడానికి?"
"అయ్యో! నిజం గురూ! ఈ మధ్య గవర్నమెంట్ డిపార్టుమెంట్లు, కార్పరేషన్ లూ కూడా భూతాలుగా మారుతున్నాయని భూతవైద్యుడు చెప్పాడు."
అతని మాట వినిపించుకోకుండా బస్ డిపోకి చేరుకున్నాం. కిక్కిరిసిపోయిన జనం ఏ బస్ ఎక్కడుందో తెలీక పరుగెడుతున్నారు.
మేము మా బస్ వచ్చే ప్లాట్ ఫారం మీదకు చేరుకోగానే హఠాత్తుగా పైనుంచి 'హ్హాహ్హాహ్హా' అంటూ వికటాట్టహాసం వినిపించింది.
అచ్చం ఆర్టీసీ బస్ లాగానే వుందా భూతం. "ఒరేయ్! ప్రయాణీకుల్లారా! మీ భరతం పడతారా! మీ పాట్లు కుక్కలపాట్లే చూస్కోండి. నా తడాఖా..." అనేసి మాయమైపోయింది. మరుక్షణంలో నిజంగానే ప్రయాణీకులందరూ ఒకటే బస్సులో రెండువందలయాభై మంది చొప్పున కూరుకుపోయి ఎండకు మాడిపోతూ వెళుతున్నారు.
"మనకు రిజర్వేషన్ వుంది! సూపర్ డీలక్స్ కాబట్టి మనకేం భయంలేదు" అన్నాడు రంగారెడ్డి. అతనామాట అనగానే మళ్ళీ భూతం వికటాట్టహాసం వినిపించింది.
మరుక్షణం భూతమే గొంతుమార్చి తిరుపతి వెళ్ళే సూపర్ డీలక్స్ బస్ కాన్సిలయిందని ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. రాత్రివరకూ అందరం అక్కడే నానా చావు చచ్చాం! తాగడానికి నీళ్ళు లేవు. దొరికినా మురిగినీళ్ళు-పిల్లలకు పళ్ళు కొందామా అంటే బయట రూపాయ్ వున్న వస్తువులు లోపల అయిదు రూపాయలు.
రాత్రి ఎనిమిదింటికి ఒక బస్ వచ్చింది. దానికోసం రెండువేల మంది నిలబడి వుండడంతో ఒకరినొకరు తన్నుకుంటూ, మెడకాయలు పిసికేస్తూ అందులో నుంచి రెండు వందలమంది బస్ లో ఇరుక్కుపోయారు.
భూతం మమ్మల్ని చూసి వికటాట్టహాసం చేసింది. "రాత్రంతా చావండిక్కడ" అరిచింది. మేమంతా కంట్రోలర్ దగ్గరకు నడిచాం.
"తిరుపతికి రెండువేలమందిమి వున్నాం సార్! ఒక్క స్పెషల్ బస్ వేసినా కొంతమంది వెళ్ళిపోతాం సార్! కావాలంటే ఇంకా ఎక్కువ ఛార్జీ తీసుకోండి సార్!" అంటూ బ్రతిమాలాం.
అతను మా మాటలు వింటున్నాడనుకున్నాం గానీ భూతం అతనికి చెవుడు తెప్పించిందన్న విషయం తర్వాత తెలిసింది.
సాయిరామ్ పరుగుతో వచ్చాడు. "గురూ! బయట ప్రైవేట్ బస్ రద్దీగా వుంది. పదండి" అరిచాడు ఎగ్జయిట్ మెంట్ తో. మేమందరం పరుగుతో వెళ్ళి ప్రైవేట్ బస్ ఎక్కుతుంటే హఠాత్తుగా ఇంకో భూతం గాల్లో ప్రత్యక్షమైంది.
"హ్హాహ్హాహ్హా! ఒరేయ్ మీరంతా ఆర్టీసీ భూతం తాలూకూ మనుషులు కదరా! నేను ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ భూతాన్నిరా! ఇంత కాలానికి ఆర్టీసీ భూతం మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికిన్ది౧ మీ అంతు చూస్తారా! మీ ప్రయాణం నరకం చేస్తా." అని అరిచి మాయమైపోయింది. అదంతా మా భ్రమ అనీ, నిజంగా ఇంకో భూతం లేదనీ కొట్టిపారేశాడు గోపాల్రావ్!
ప్రైవేట్ బస్ లో పుష్ బాక్ సీట్లలో హాయిగా కూర్చొని అందరం వీడియో సినిమా చూస్తుండగా కొద్దిసేపు ప్రయాణించగానే బస్ సడన్ గా ఆగిపోయింది.
చకచక నలుగురు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంటు తాలూకూ అధికారులొచ్చి అందరి టికెట్లూ చెక్ చేసి 'హ్హాహ్హాహ్హా' అంటూ వికటాట్టహాసం చేశారు.
"ఈ బస్ ఇల్లీగల్ గా నడుస్తోంది కనుక మీరంతా ఇక్కడ దిగి మీ చావు మీరు చావాలి! హ్హాహ్హాహ్హా" అంటూ అరిచాడు.
బస్ ని ఓ మూలకు నెట్టేసరికి మేమంతా ఆడాళ్ళూ, పిల్లలతో తిట్టుకుంటూ బస్ దిగి చీకట్లో హైవే పక్కన నిలబడ్డాం! ఓ పక్క దోమలు, మరో పక్క నిద్ర- పిల్లలు మంచినీళ్ళని గొడవ.
మరికాసేపట్లో అందరం రోడ్ కి అడ్డంగా నిలబడి ఆర్టీసీ బస్ ని ఆపి లోపల స్థలం లేదంటే టాప్ మీదికెక్కి కూర్చున్నాం.
"హ్హాహ్హాహ్హా! నా విరోధి ట్రాన్స్ ఫోర్ట్ డిపార్ట్ మెంట్ భూతంతో స్నేహం చేశారా? మీ అంతు తేలుస్తా! మిమ్మల్ని ఇక్కడే సమాధి చేస్తా!" అంటూ అరిచింది ఆర్టీసీ భూతం! మరుక్షణంలో బస్ ఆగిపోయింది.
"స్ప్రింగ్ ప్లేట్స్ ఇరిగిపోయాయ్. శంషాబాద్ డిపోలోకెళ్తోంది. బస్! ఉదయం ఏడింటికి రిపేరు చేసుకుని వస్తుంది. అంతవరకూ వుంటే వుండండి! పోతే పోండి" అన్నాడు కండక్టర్. అందరం దిగి రోడ్ మీదకెళ్ళి ఓ లారీలో ఎక్కాం.
"హ్హాహ్హాహ్హా! మీరు ఆర్టీసీ భూతం కస్టమర్స్ కదూ? మీ రోగం కుదురుస్తా" అంటూ లారీని చేయి అడ్డంపెట్టి ఆపేశాడు. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు లారీని. 'సీజ్' చేసేసుకున్నారు. సరిగ్గా అప్పుడే ఆర్టీసీ భూతం కూడా వచ్చిందక్కడికి.
"ఏమిట్రా ట్రాన్స్ పోర్ట్ భూతం! నేను అసమర్థుడననీ, అందువల్లనే ఆర్టీసీకి నష్టం వస్తోందనీ స్టేట్ మెంటిస్తావా? నీ ప్రయాణీకులందరినీ నంచుకుతింటారా?"
ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ భూతం ఆ భూతాల్ని ఛాలెంజ్ చేస్తూ తొడలు కొట్టింది.
"నీ ఆర్టీసీ పాసింజర్స్ బయట కనిపిస్తే చాలు ఉప్పు పాతర వేస్తారా? చూస్కో! వీళ్ళనేం చేస్తానో! ఇంకాసేపట్లో సఫొకేషన్ తో కొంతమంది, దాహంతో కొంతమంది పడగొట్టి కొంతమంది పిట్టల్లా ఛస్తారు. ఎలా వుంది నా దెబ్బ- లేకపోతే మా డిపార్ట్ మెంట్ లంచాలు తీసుకుని ప్రైవేట్ బస్ లను ప్రోత్సహిస్తోందంటావా?"
ఆర్టీసీ భూతం మరింత బిగ్గరగా నవ్వింది. "నన్నే అంత మాటంటావురా! చూడు ఈ ప్రయాణికులను ఏం చేస్తానో" అంటూ ఓ ఆర్టీసీ బస్ ని తీసుకొచ్చి మా మీదుగా నడిపించబోయింది!
మేమంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రోడ్ పక్కనే వున్న చేలల్లోకి పరిగెత్తి దాక్కున్నాం.
మాకోసం వెతికి వెతికి రెండు భూతాలు వెళ్ళిపోతూంటే యాదగిరి ఓ చెట్టుమీద నుంచి కోపంగా అరిచాడు.
"అరే భూతాలూ! మీకేం పోయేకాలమొచ్చెరా? మీరిద్దరూ కొట్లాడుకుని మధ్యలో మమ్మల్ని పరేషాన్జేస్తారేం? శరమ్ లేదురా మీకు? మేము డబ్బిచ్చి ప్రయాణం చేసే పాసింజర్సమిరా? అడుక్కుతినే వాళ్ళం కాదు! పుక్కట్ గా బస్ లెక్కేటోళ్ళం కాదు! కన్సెషన్ లు తీసుకునేటోళ్ళం కాదు! మాక్కావలసినన్ని బస్ లేసి మమ్మల్ని మనుషుల్లెక్క చూడండ్రా!"
* * *