Previous Page Next Page 
ఆత్మబలి పేజి 33


    ఆశ జబ్బు విషయం ఎత్తేసరికి రావు కొంచెం తగ్గాడు.
    "మూర్తితో యిష్టమొచ్చినట్లు తిరిగే నువ్వు నన్నెందుకు తిరస్కరిస్తున్నావు శోభా?"
    శోభకు తల పగలకొట్టుకోవాలనిపించింది. తన మాటలనసలు వినిపించుకోడేం? ఎప్పటికీ ఒకటే ధోరణి.
    "నన్నర్థం చేసుకోండి. నేను మూర్తిని..."
    "ప్రేమించానంటావా? నన్ను నమ్మమంటావా?"
    వెటకారం నవ్వు. శోభ గుండెలను చీల్చేసే నవ్వు. లాభం లేదు. వెటకారం తప్ప తనకేదీ లభించదు.
    "నేనేమీ అనటంలేదు. అన్నీ మీరే అంటున్నారు."
    "నాకిదంతా దేనికి? నువ్వు కావాలి. నువ్వు ఎంత కోరితే అంత. నీకు కేవలం నామమాత్రపు మొగుడు రావటానికి కట్నంగా కావలసినంత..."
    మాటలు పూర్తికాకుండానే రావు చెంపలు ఛెళ్లున పేలిపోయాయి.
    "ఒళ్ళు దగ్గిరపెట్టుకు మసులుకోండి. మీరిలాంటివారని తెలిస్తే మీ గడప తొక్కేదానినే కాను."
    విసురుగా బయటికొచ్చి రిక్షాలో కూర్చుంది.


                                *    *    *    


    ఇల్లు సమీపిస్తుండగానే లోపలినుండి వినవస్తున్న రోదన ధ్వనులకు గుండెలు చెదిరిపోయాయి శోభకు. ఆతృతగా లోపలికడుగు పెట్టింది. ప్రభాకరం శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎక్కడో వ్రాసినట్లుగా 'చచ్చి బ్రతికిపోయాడు'.
    ప్రభాకరం మృతదేహం మీద సొమ్మసిల్లి పడిపోయిన పార్వతిని పొదివి పట్టుకుని పక్కనే కూలబడింది శోభ.
    పాపం! తన చివరి రక్తపుబొట్టు వరకు కుటుంబంకోసం ధారపోసి చివరకు వెళ్ళిపోయాడు ప్రభాకరం. వదిలిపోతున్న పనికిరాని పాత సంప్రదాయాలనూ, వదలలేక వస్తూన్న రావలసిన మార్పుల్ని అర్థంచేసుకోలేక అన్నగా ముఖ్యంగా, ఒక మొగవాడిగా అధికారం చెలాయిద్దామనుకున్నాడు. అంతకంటే ప్రభాకరం చేసిందేముందీ?
    జీవితమంతా అంధకారమయిపోయిన పార్వతినీ, జీవితాన్ని వదిలిన ప్రభాకరాన్నీ చూస్తూ శిలామూర్తిలా కూర్చున్న శోభ పోస్టుమెన్ కేకతో యాంత్రికంగా లేచి ఉత్తరం అందుకొంది. అది ప్రభాకరానికి. అలవాటుగా పార్వతి కందించింది. ఉత్తరంపై చిరునామా చూస్తూనే ఘోల్లుమంది పార్వతి. తను చేసిన పిచ్చిపనికి తనను తాను నిందించుకొంది శోభ. ఎడతెగక స్రవించే అశ్రువులతో దృష్టి మసకలవుతూండగా వణికే చేతులతో ఉత్తరం విప్పింది. అందులో మూడువేలకు క్రాస్డ్ చెక్ ఉంది. ఒక ఉత్తరం ఉంది. అది ఉమకు తప్పిపోయిన సంబంధం తాలూకు పెళ్ళికొడుకు రాశాడు. తను చేసిన అకార్యానికి చింతిస్తూ క్షమాపణలు కోరుతూ అదివరకు తీసుకొన్న డబ్బు తిరిగి పంపాడు.
    అలవిమాలిన కోపంతో పార్వతి నిలువెల్లా వణికింది.
    ఆ పాపిష్టి సంబంధం మూలంగానే ఆయన జీవితం సర్వనాశనమైంది. ఈ డబ్బుకోసమే తన భర్త జీవితాన్ని బలిపెట్టాడు. నిలువునా దహించివేసే కోపాన్ని క్రక్కుకోవటానికి మార్గమేదీ కనిపించక శోభవంక తిరిగింది పార్వతి.
    "పాపం! ఈయన జబ్బు మూలంగా నువ్వు చాలా కష్టపడ్డావు. ఇదిగో చెక్. అప్పులన్నీ తీర్చెయ్యి."
    చెక్ శోభ చేతిలో పెట్టింది పార్వతి.
    "నేనేం పాపం చేశాను వదినా? అందరూ నన్నెందుకిలా చిత్రవధ చేస్తున్నారు?"
    పార్వతి కూడా కదిలిపోయేలా హృదయవిదారకంగా ఏడ్చింది శోభ.
    ఒకరి ముందు ఎన్నడూ కన్నీళ్ళు పెట్టుకోని శోకమూర్తి శోభను దగ్గిరగా తీసుకుంది పార్వతి.
    శోభా పార్వతుల చేతులనుండి జారిన చెక్ ప్రభాకరం మృతదేహం మీద నాట్యమాడింది.


                                       21


    "మీరు పి.యు.సి. కాలేజీలో చేరి చదవండి. సైన్స్ గ్రూప్ తీసుకుంటే మంచిది. సైన్స్ ప్రైవేట్ గా చదవటం కష్టం." అంది ఉమ.
    చలపతి బెంగగా చూశాడు.
    "నాకు ముప్ఫై నిండిపోయాయి. ఇప్పుడు కాలేజీలో చేరితే అందరూ నవ్వరూ?"
    "మీరు అందరికోసం బ్రతుకుతున్నారా? మీరేం అకార్యం చేస్తున్నారని, సిగ్గుపడటానికి? మూర్ఖులు కొందరు నవ్వితే మీకేం నష్టం?"
    చలపతి సమాధానం చెప్పలేకపోయాడు.
    "ధైర్యంగా కాలేజీలో చేరండి. ఇందులో సిగ్గుపడవలసిందేమీ లేదు."
    "సరే! నాన్నగారితో మాట్లాడతాను." అధైర్యంగానే అన్నాడు చలపతి.
    రాత్రి భోజనాలయి తండ్రి విశ్రాంతిగా కూర్చున్న సమయంలో తండ్రిని సమీపించాడు చలపతి.
    తల్లి దగ్గర వెర్రి గారాబం - తండ్రి దగ్గర వెర్రి భయం.
    సమయాసమయాలు తెలియని గారాబం తల్లిది.
    ఉచితానుచితాలు తెలియని కోపం తండ్రిది.
    ఈ రెండూ సహజంగా మందబుద్ధి అయిన చలతిని తేలికగా వెర్రిబాగులవాడిని చేశాయి.
    "ఏంరా!" గర్జించాడు తండ్రి.
    చలపతి నిలువెల్లా వణికాడు. నోట్లో మాటలు నోటిలో ఆగిపోయాయి.
    "డబ్బులేవన్నా కావాలా? వెధవ జులాయి ఖర్చులు నేర్చుకున్నావు. కాణీ సంపాదన లేదు కాని ఖర్చులు పెట్టడం తెలుసు."
    "డబ్బు కాదు."
    "ఇంకేవిఁటీ?"
    "నేను కాలేజీలో చేరతాను."

 Previous Page Next Page