ఆ ఆర్ద్రతకు పొంగిపోయింది శోభ.
"మీరు పాడమంటే పాడతాను."
"పాడు."
శోభ మళ్ళీ పాట మొదలుపెట్టింది. మధురమయిన ఆ గానానికి రావు మనసు తేలికయి ఏవేవో మధుర లోకాలలో విహరించింది. అందమైన శోభ కళ్ళు పాడుతున్నప్పుడు భావోద్వేగంతో అరమోడ్పులయి మరింత అందంగా ఉన్నాయి. ఏవో అలౌకిక రసమయి లోకాలకు తాను పోయి పరిసర వ్యక్తులను కూడా తీసుకుపోగలిగే దివ్య గానం శోభది. పాట పూర్తిచేసి "ఎలా ఉందీ?" అన్నట్లు చూసింది.
రావు నావహించిన తన్మయత్వం ఇంకా వదలలేదు.
"శోభా! కావ్యాలలో వర్ణించే గంధర్వులు నిజంగా ఉంటే వాళ్ళంతా నీ పాటవిని ఈర్ష్యపడతారా? సిగ్గుపడతారా?"
ఆనందంతో శోభ కళ్ళు మెరిశాయి. సంతోషాన్ని అణచుకుంటూ హాస్యంగా "పకపక నవ్వుతారు" అని నవ్వేసింది.
తనను తాను మరిచి కొన్ని క్షణాలు శోభ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు రావు. ఆ చూపులు గిలిగింతలు పెట్టగా కొంచెం నర్వస్ గా కదిలింది.
"నువ్వు రావేమో అనుకున్నాను. మళ్ళీ వచ్చావు." బరువుగా అన్నాడు రావు.
జన్మసిద్ధంగా ఉన్న ఆత్మాభిమానం శోభకు తెలియకుండా మేల్కొంది.
చటుక్కున "ఆశకోసం వచ్చాను" అనేసింది. శోభ నాలుక కరుచుకునే లోపలే రావు ముఖం మారిపోయింది.
"ఆశ కోసం వచ్చావా? నీకు చిన్నపిల్లలంటే ఇష్టంలేదు కదూ!"
ఆయా తెలివైనది. రావురాగానే ఆశ నక్కడినుండి తీసికెళ్ళిపోయింది. లేకుంటే రావు మాటలు ఆశ విని ఉండేది. శోభ కంతకంటే దారుణశిక్ష ఉండదు.
రావు ఎత్తిపొడుపు ధోరణి మనసు నెంతగా నొప్పిస్తున్నా సమాళించుకుంటూ "ఒకప్పుడిష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఆశ అంటే ప్రాణం నాకు" అంది.
రావు గట్టిగా నవ్వాడు.
"భలే మనసు నీది శోభా! ఒకప్పుడున్నట్లు ఇప్పుడు లేదు. ఇప్పుడున్నట్లు రేపుండదు. వహ్వా! ఇట్లాంటి మనసుండటం చాలా అదృష్టం. ఎప్పుడెలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు" మళ్ళీ నవ్వాడు రావు.
ఈ అవహేళనకు శోభ మనసు భగ్గుమంది. దుఃఖంతో పూడుకుపోయిన గొంతులోనుండి చెప్పాలనుకున్న ఎన్నెన్నో మాటలు బయటకు రావటంలేదు. ఎంతో అభిమానవతి అయిన శోభ రావుకు తన కళ్ళలో నీళ్ళు కనిపించకుండా తలవంచుకుంది. అంతలో రావు లేచి తన పడకగదిలోకి వెళ్ళిపోయాడు. శోభ గబగబా కళ్ళు తుడుచుకుంది. రావుకు చెప్పెయ్యాలి. అంతా చెప్పెయ్యాలి. తనను తను సమాళించుకుంటూ గదిలోకి అడుగుపెట్టింది.
రావు పడుకుని ఉన్నాడు. శోభను చూడగానే "రా శోభా! నేనే పిలుద్దామనుకుంటున్నాను" అన్నాడు.
రావు ముఖం చూడగానే శోభ ఉలిక్కిపడింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖంలో ఏదో ఉన్మత్తభావం ఉంది. శోభ ముందుకడుగు వెయ్యలేకపోయింది. రావు ముఖం అలా ఇంతకుముందెన్నడూ చూడలేదు.
"రా!" అన్నాడు మళ్ళీ రావు ఆజ్ఞాపిస్తున్నట్లు. శోభ రెండడుగులు ముందుకు వేసింది.
రావు చేతులు జాపాడు.
రావు శోభ నిదివరలో ఎన్నిసార్లో దగ్గిరకు తీసుకున్నాడు. కాని, ఈనాడు జాపిన రావు చేతుల్లో వాలిపోలేకపోయింది. ఏదో అవ్యక్త ఆవేదనతో హృదయం తీవ్రంగా స్పందించింది. బెదురుగా చూస్తూ అలానే నిల్చుంది. తన చేతికందుబాటులో ఉన్న శోభను చెయ్యిపట్టుకుని తనమీద పడేలా లాక్కున్నాడు. ఉలికిపాటునుండి శోభ సర్దుకునే లోపలనే ఆమెను పక్కకు లాక్కుని ఆవరించుకోబోయాడు.
శోభ హడలిపోయింది.
"ఛీ! ఛీ! లేవండి. వదలండి. నేనింకా మీరు మర్యాదస్తులనుకొన్నాను. ఇలా బలత్కారానికి తలపెడతారనుకోలేదు."
"బలాత్కారమా?"
"మరి, ఏవిఁటిది?"
"అవతల వ్యక్తికి ఇష్టంలేనపుడే ఆ పదాన్ని వాడాలి."
"ఇదెక్కడిన్యాయం? ఇట్లాంటిది నాకిష్టమని మీతో అన్నానా?"
"నేనంటే నీకిష్టంలేదా?"
"నేనడిగినదీ, మీరడిగేదీ ఒకటి కాదు."
"రెంటికీ పెద్ద తేడాలేదు."
"మీ దృష్టిలో లేకపోవచ్చు. నా దృష్టిలో రెంటికీ పోలిక లేదు."
రావుకు సహనం నశిస్తోంది. రతీదేవిలా ఎదుటనిలిచి తనను ఊరిస్తున్న శోభముందు అతనికి యుక్తాయుక్త విచక్షణజ్ఞానం నశిస్తోంది.
"చాల్లే! ఎందుకీ వేషాలు? ఇలా నన్ను ఎంతకాలం ఊరిస్తావు? ఏం కావాలో తేల్చి చెప్పరాదూ? ఎందుకో ఎన్నడూ లేనిది నిన్ను చూడగానే నా మనసు వశం తప్పుతోంది. నిన్ను పొందాలి. నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నీకెంత కావాలి?"
అవమాన జ్వాలతో శోభ మనసు భగ్గున మండింది.
రోషంతో కళ్ళు నిప్పులు కురిశాయి.
"ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చిందీ? డబ్బుతో కొనగలిగే అందాలు చాలా ఉన్నాయి. నేను భోగందానిని కాను."
రావు వెటకారంగా నవ్వాడు.
"ఎందుకీ పతివ్రతా వేషాలు? ఎవరికి తెలియని భాగవతం?"
శోభలోనూ సహనం నశించింది. తన సర్వస్వంగా భావించిన వ్యక్తినుండి లభ్యమైన ఈ ఘోరమైన అవమానం ఆమెను పిచ్చిదానిని చేసింది.
"నేను పతివ్రతనని మీతో చెప్పుకోలేదు. వేస్తున్నవి పతివ్రతావేషాలు కావు. పతివ్రతలు మీతో ఇలా గంటలకొద్దీ కబుర్లు చెప్పరు. అన్ని నిందలకూ ఓర్చి మీ ఇంటిమనిషిలా మీ కూతురి జబ్బులో ఆదుకోరు. నేను పరమ పాపిష్టిదానిని. నా పాపపుణ్యాలతో మీకేం నిమిత్తం?"