క్లబ్బులో పాపారావు అర్జున్ బర్త్ డే కోసం రంగరంగ వైభవంగా అరేంజ్ మెంట్స్ చేసి ఉంచాడు. కొత్తరకం గేమ్స్... సరికొత్త బ్యాచ్ అమ్మాయిలు, కొత్త కొత్త అనుభూతులు!
రాత్రి ఎనిమిదయ్యేదాకా వళ్ళు తెలియని ఎంజాయ్ మెంటులో ఉండిపోయాడు అర్జున్.
ఎంజాయ్ చేస్తున్నానని అనుకుంటున్నాడేగానీ అతని మనసులో ఏదో వెలితిగా ఉంది.
తను పుణ్యవతిని కొట్టాడు!
తను పుట్టిన తర్వాత ఇప్పటిదాకా ఎవరినీ కొట్టలేదు. ఇవాళ మొదటిసారిగా ఓ మనిషిని కొట్టాడు. అది ఎవరు? తన భార్య! పుణ్యవతి! ఎంతో మంచి మనిషి . చాదస్తం ఉంటే ఉండొచ్చుగాక - ఆమెను కొట్టాడు తను!
వెళ్ళి అపాలజీ చెప్పాలనిపించింది. కాననీ అహంభావం అడ్డువచ్చింది.
రాత్రి ఎనిమిదయ్యేసరికి అతనికి ఇంక ఉండబట్టలేననిపించింది.
ఒక్కసారి వెళ్లి పుణ్యవతికి సారీ చెప్పి, తక్షణం మళ్ళీ వచ్చేయాలనుకున్నాడు.
కుర్చీలో నుంచి నిలబడ్డాడు అర్జున్. వళ్ళంతా వికారంగా ఉంది. ఎందుకిట్టా? తాగుడు వల్లనా? కాదే! తను రాటుదేలిపోయాడు. తప్పతాగినా, తూలని స్థితికి వచ్చేశాడు.
కానీ ఎందుకని... అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాడే!
"పాపారావ్" అన్నాడు హీనస్వరంతో.
పాపారావు వచ్చాడు.
"ఏమిటి అర్జున్?"
"వంట్లో బాగాలేదు. వాంతి అయ్యేటట్లుగా ఉంది. ఓసారి ఇంటికెళ్ళి వద్దాం - కారు రెడీ చెయ్"
అతను అలా అనగానే పాపారావు మొహం వికసించింది.
అర్జున్ కి వంట్లో బాగాలేదంటే తన తంత్రం పారిందన్నమాటే!
వీడు పెళ్ళయిన సంవత్సరం తిరక్కుండా టపా కట్టేస్తాడని అనుకున్నాడు తను. న్యాయంగా అయితే అలాగే జరిగి ఉండాలి. ఎంత సారా తాగించాడు తను! ఎంతమంది అమ్మాయిలని తార్చాడు! ఒళ్ళు ఉత్తగుల్ల అయిపోలేదూ? కానీ పుణ్యవతి సేవలతో వెధవ మళ్ళీ ఆరోగ్యం పుంజుకున్నాడు! అందుకని తను ఏం చేశాడు? చెయ్యాల్సిందే చేశాడు. వీడి విస్కీలో విషం కలిపాడు!
ఎఫెక్టు కనబడుతోందన్నమాట!
ఇంటికి వెళ్తావా నాయనా! ఇల్లు చేరేలోగా గూట్లో చిలుక ఎగిరిపోదూ! పద పద!
కారు రెడీ చేశాడు పాపారావు.
చిత్రంగా - కారు గుడిదగ్గరికి రాగానే, మంత్రం వేసినట్లు ఆగిపోయింది!
"ఇంజను హీటెక్కిపోయింది" అన్నాడు పాపారావు.
అర్జున్ కి ఊపిరందనట్లుగా అనిపిస్తోంది. టై లూజ్ చేసుకుని,కార్లోనుంచి కిందికి దిగాడు. మొహానికంతా చెమటలు పట్టేస్తున్నాయి. నిలువెల్లా వణుకు వచ్చేస్తోంది. నోటివెంబడి మాట రావడం లేదు.
తల ఎత్తి చూశాడు.
చిన్న గుట్ట. దానిమీద మెట్లు. దాని మీద ఆలయం!
మెట్లమీద...
పుణ్యవతి... మోకాళ్ళలో తలపెట్టుకుని కూర్చుని ఉంది. ఏడుస్తోందా?
ఏమో!
ఎంత బాధ పెట్టాడు!
గబగబా మెట్లెక్కబోయాడు అర్జున్.
నాలుగు మెట్లెక్కేసరికే ఆయాసం వచ్చేసింది.
రొప్పుతూ, 'పుణ్యవతీ!' అని పిలవబోయాడు.
గొంతు పెగలలేదు. అతనికేదో అయిపోతోంది!
ఒక్కసారి... ఒక్కసారి పుణ్యవతితో మాట్లాడాలి. క్షమాపణ చెప్పాలి. ఇంకెప్పుడూ కొట్టనని.
'పుణ్యవతీ!'
మాట బయటికి రావడం లేదు.
గుడి ముందర పందిరి వేసి ఉంది. పందిట్లో పురాణ శ్రవణం జరుగుతోంది.
శాస్త్రిగారు చెబుతున్నారు.
'పది లక్షల జన్మలు ఎత్తాకగానీ మానవజన్మ లభించదు! క్రిమికీటకాలుగా, కుక్కలుగా, నక్కలుగా పుట్టిన తర్వాతే మానవజన్మ వస్తుంది. ఈ జన్మను వృధా చేసుకోకుండా, ముక్తి పొందడానికి ప్రయత్నించాలి. తప్పులు చేస్తే మళ్ళీ వెనక్కిపోవడం తథ్యం!'
ఒక్కసారిగా కమ్చీతో కొట్టినట్లయింది అర్జున్ కి.
'అయ్యో!' అని మూలిగింది అతని గుండె. పుణ్యవతి ఇన్నాళ్ళనుంచి చెబుతున్నది ఇదే! కానీ తనకి తలకెక్కలేదు.. ఇప్పుడు తలకెక్కుతోంది. కానీ పుణ్యకాలం గడిచిపోయింది! ఈ జన్మ వృధా! వృధా!...