Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 33

    "అదృష్టమైనా, దురదృష్టమైనా ఒక్కసారి మాత్రమే తలుపు తడతాయి. మన బుద్ధుల్ని బట్టి తలుపులు తియ్యక పోవడం, తియ్యడం వుంటుంది.

    అతను అదృష్టదేవత రూపంలో వచ్చి నా తలుపులు తట్టాడు. ఇప్పుడు ధైర్యంచేసి తలుపు తీయకపోతే, నేను నిజంగా దురదృష్టవంతుడినే.

    నేను అదృష్టదేవతను ఆహ్వానించడానికే నిశ్చయించుకున్నాను.

    అతను నా జీవితానికో పెద్ద గిఫ్ట్.

    ఇక ముందు, ముందు....

    అది చదివిన కామాక్షికి భర్త రాసింది ఏమీ అర్ధం కాలేదు. మరికొన్ని పేజీలు ముందుకు చదువుకుంటూ వెళ్ళింది. ఒక వారంలో ఒకసారి, ఒక వారంలో రెండుసార్లు, రౌండ్ గా ఒక సున్నా చుట్టి ఆ సున్నా మధ్యలో అంకెలు వేసి వున్నాయి.

    ఆ అంకెలు ఏమిటో ఎంత ఆలోచించినా కామాక్షికి అర్ధం కాలేదు.

    సున్నా దేనికి గుర్తు? అంకెలు దేనికి గుర్తు?

    అంకెల పక్క లేకపోతే సున్నాకి విలువలేదు. లెక్కలు చెయ్యాలంటే అంకెలు కావాలి, డబ్బు లెక్క పెట్టాలన్నా అంకెలు కావాలి.

    డబ్బు.

    అంతే కామాక్షికి ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది.

    భర్త డబ్బుకోసం ఏదన్నా కానిపని చేస్తున్నాడా?

    భర్త డబ్బు కోసమే పని చేస్తున్నట్లయితే ఆ డబ్బు ఇంట్లోనే వుండాలి! ఇంట్లో డబ్బులేదు. ఏ బ్యాంక్ లోనైనా దాచి వుండాలి. ఆ అంకెలు కూడా డబ్బుకి సంబంధించినవే అయి వుంటాయి.

    డైరీలో ఒకచోట రాసుకున్నాడు కూడా "ఎంత మంచి గిఫ్ట్" అని.

    డబ్బు మూటకి మించిన గిఫ్ట్ ఈ ప్రపంచంలో మారేది వుంటుంది?

    కామాక్షి ఇంక ఎక్కువ ఆలోచించలేదు. బ్యాంక్ పుస్తకం వెతికే ప్రయత్నంలో పడింది.

    బ్యాంకు పుస్తకం కోసం వెతగ్గా, వెతగ్గా ఇస్త్రీ ప్యాంటు మడత లోపల భర్త దాచిన బ్యాంకు పుస్తకం కంటబడింది. గబగబా ఆ బ్యాంకు పుస్తకాన్ని తిరగేసింది కామాక్షి.

    కొత్తగా ఈ ఊళ్ళో ఓపెన్ చేసిన ఎకౌంట్ తాలూకా బ్యాంకు పుస్తకం అది.

    ఆ పుస్తకంలో కొన్ని తారికుల్లో మాత్రమే, పెద్ద మొత్తాలతో డబ్బు వెయ్యటం జరిగింది. డైరీలో రాసుకున్న అంకెలూ, బ్యాంకు పుస్తకంలో వున్న డబ్బు సరీగా ఒకటే. కాకపోతే ప్రతీసారీ డబ్బు జమ చేసినపుడు యాభై రూపాయలు, వంద రూపాయలు అలా చిన్న మొత్తాల తరుగు వుంటున్నది.

    "రిక్షా తొక్కినపుడు ముప్పై నలభై రూపాయలు, ఆటో తొక్కినపుడు యాభై అరవై రూపాయలకి తక్కువ రాదు. ఈ డబ్బు నీ దగ్గర వుంచు" అంటూ భర్త ఒకసారి తనకి రెండు వందలు ఇచ్చాడు.

    అంటే భర్త యిచ్చిన రెండు వందలూ బ్యాంక్ లో వేసే డబ్బులో తీసినవి అన్నమాట.

    భర్త ఒకనితో స్నేహం కలిపాడు. వాడు ఆయనపాలిత అదృష్టదేవత. వాడిచ్చే పెద్దమొత్తాల పేరు నైస్ గా చెప్పాలంటే "గిఫ్ట్" ఇదంతా చూస్తూ వుంటే దీని వెనుక ఏదో పెద్ద కధే వుందనిపిస్తోంది. భర్త చేయరాని పని ఏదో చేస్తున్నాడు. అదేదో ఇవాళే తేల్చుకోవాలి.

    కామాక్షి ఒక నిర్ణయానికి వచ్చింది.

    కామాక్షి అలా నిర్ణయానికి వచ్చిందో లేదో గది తలుపు చప్పుడయింది,

    "కామూ!" అని పాండురంగం మృదువుగా పిలుస్తున్నాడు.

    వచ్చింది భర్తని గుర్తించిన కామాక్షి, తలుపు వేసుకొని తను చేస్తున్న పనికేమీ కంగారు పడలేదు. తాపీగా వెళ్ళి తలుపు తెరిచింది, అతను గదిలోకి రాగానే మళ్ళీ తలుపు మూసింది.

    ఆ సమయంలో ఇంట్లో తండ్రి, అన్నా లేరు. తల్లి వాకిలి వరండాలో కూర్చుని, ఎవరో తెలిసిన ఆమె వస్తే, ఆమెతో కబుర్లు చెబుతున్నది.

    భర్తతో మాట్లాడటానికి కామాక్షికి మంచి సమయం చిక్కింది.

    గది లోపలకి అడుగుపెడుతూ, "తలుపులు వేసుకుని ఏం చేస్తున్నావోయ్ కామూ?" అని చిరునవ్వుతో అడిగాడు పాండురంగం.

    "ఒకటా, రెండా దాదాపు పాతికవేలు కొన్ని నెలల్లోనే నా భర్త ఇంత డబ్బు సంపాదించగలిగాడూ అంటే, నేనెంత తొందరగా లక్షాధికారిని కాబోతున్నానూ అని ఆనందంతో లెక్కలు వేసుకుంటున్నాను" ముఖంలో ఏ భావం వ్యక్తం చేయకుండా తాపీగా అంది కామాక్షి.

    ఒక్కసారిగా ఖంగుతిన్నాడు పాండురంగం.

    "బ్యాంక్ పుస్తకం చూశావా? ఆ డబ్బు....ఆ డబ్బు....నా స్నేహితుడు నా పేర బ్యాంక్ లో దాచమంటేనూ...."

    "బ్యాంక్ లో డబ్బు మాత్రమే దాచమన్నాడా! తనని గూర్చి డైరీలో కూడా రాయమన్నాడా! మొత్తానికి మంచి మిత్రుడే దొరికాడు!" వ్యంగ్యంగా అంది కామాక్షి.

    "నా డైరీ చదివావా?" కోపంగా అడిగాడు పాండురంగం.

    "చదివాను."

    "ఇతరుల డైరీలు చదవటం తప్పని తెలియదా?"

    "నేనింతవరకూ భార్యా భర్తా అంటే ఒకరే అనుకున్నాను. భార్యా భర్తల మధ్య కూడా రహస్యాలు వుంటాయని నేను అనుకోలేదు"

    వెంటనే పాండురంగానికి ఏం మాట్లాడాలో తెలియలేదు. "డైరీ చదవటం మాత్రం తప్పే!" అన్నాడు,

    "నేను చేసింది తప్పే, కానీ నిజం కావాలి నాకు. అతను ఎవరు? అతను ఇప్పుడు డబ్బెందుకు ఇస్తున్నాడు? ఆ వివరం నాకు కావాలి! రిక్షా తొక్కుతున్నాను లాంటి కట్టుకథలు నాకు చెప్పవద్దు. మీరు నిద్రమాత్రలు మంచినీళ్ళ గ్లాసులో వెయ్యటం కూడా చూసాను...." అంటూ కామాక్షి నిలదీసి అడిగింది.

    "కామూ! ఈ దేశంలో చాలామంది భార్యలు భర్త సంపాదన ఎంత ఎక్కువా అని చూస్తారు గానీ, ఎలా సంపాయించి తెస్తున్నాడు అని చూడరు. మనం ఎదగటం నీకు ఇష్టం లేదా?" భార్య భుజంమీద చెయ్యివేసి అడిగాడు పాండురంగం.

    "అంటే మీరు చేస్తున్నపని అన్యాయమైనది అనేకదా అర్ధం" కామాక్షి అంది.

    మరికొద్దిసేపు ఇరువురూ యధాశక్తి వాదించుకున్నారు. ఈ విషయంలో మాత్రం ఎవరూ తగ్గలేదు. చివరికి పాండురంగం విసురుగా బయటికి వెళ్ళిపోయాడు.

    ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి?

    కామాక్షి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది.


                                        26


    ఒకే ఒక్క గుక్క కాఫీతాగాడు మనోజ్.

    చేదు కషాయంలా వుంది కాఫీ. ఆముదం తాగినట్లు ముఖం పెట్టిన మనోజ్ మావయ్య ముఖంలోకి చూశాడు.

    ఛటర్జీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ చక్కగా కాఫీ తాగేస్తున్నాడు.

 Previous Page Next Page