"నీ మాటలు మితిమీరుతున్నాయి. జాగ్రత్తగా మాట్లాడు" అంటున్నాడు శివయ్య. పద్మజకి అర్ధమైంది....శివయ్య గిరిలో వుండే శేఖరాన్ని హెచ్చరిస్తున్నాడు.
ఇదంతా తనమీద అభిమానంతోనా అని అనుమానపడింది. మరో వేపు ఇంకో అనుమానం.... "దేశంలో పరిస్థితులు" __అన్నంత పెద్దపదం శివయ్య ఎలా ఉపయోగించగలిగాడు?
గుమ్మం ముందే నిలబడి లోపలి మాటలు వింటూంది. లోపల స్వరాలు చిన్నవయ్యాయి.
"క్రింద అందరూ....టూరు....వెళ్ళాలి."
"..........."
"అనవసరంగా ఎక్కువ....చెపుతున్నావు. మరీ దెయ్యానికి హుషారు ఎక్కువ అవుతున్నట్టుంది. దేశం గురించి నీ కెందుకు?"
"..........."
"అది చెప్పటానికి ఇదా సమయం?"
".........."
పద్మజకి మతి పోతోంది.
గిరిని శేఖరం ఆవహించడానికి శివయ్యా కారణం?
ఇప్పుడు శివయ్య మాట్లాడుతూంది గిరితోనా? శేఖరం ఆత్మతోనా?
ఆమె ఆలోచనలలో ఉండగానే చటుక్కున తలుపు తెరుచుకుంది. తప్పుకోవటానికి ఆమెకి టైమ్ లేకపోయింది.
స్థాణువై నిలబడింది.
గుమ్మం దగ్గర నిలబడ్డ ఆమెను చూసి శివయ్య ఉలిక్కిపడ్డాడు. చుట్టూ గాడమైన నిశ్శబ్దం....ముందు కదిలింది గిరి! అతడిలో ఆకస్మికంగా మార్పొచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి.
"పద్మా! ఇక నువ్వు నాతో రావల్సిన సమయం ఆసన్నమైంది అని చేతులు సాచాడు.
పద్మజ కెవ్వున అరిచింది. శివయ్య గిరి వెన్నుని వెనుక నుంచి నిమిరాడు - ఏదో సూచన ఇస్తున్నట్టు!
క్రింద హిమజ లేచి నిలబడింది కంగారుగా.
పై నుంచి పద్మజ పరిగెత్తుకు వస్తూంది. వెనుకనే గిరి....
"ఆగు. నిన్ను వెళ్ళనివ్వను. ఈ రోజుతో మనకు విముక్తి" క్రిందికి దిగుతూ అరుస్తున్నాడు గిరి. వెనుక నుంచి ఏదో మృత్యుదేవత తరుముకొస్తున్నట్టు పద్మజ కంగారుగా మెట్లు దిగుతూంది. అప్పుడు పేలింది వెనక నుంచి గిరిచేతిలో పిస్తోలు__వరుసగా మూడుసార్లు....
పద్మజ శరీరం మెట్లమీద నుంచి దొర్లుతూ....క్రిందపడసాగింది.
హాలులో వున్న వాళ్ళందరూ ఈ ఆకస్మిక పరిణామానికి షాక్ తగిలినట్టు నిలబడిపోయారు.
"అక్కా!" అని అరుస్తూ పరుగెత్తుకువెళ్ళి పద్మజను పట్టుకుంది హిమజ.
అప్పటికే పద్మజ శరీరం రక్తసిక్తమైపోయింది.
"హిమా....శేఖరం....శివయ్య...." ఏదో చెప్పబోయింది పద్మజ గొంతులోంచి రక్తం బయటకు వచ్చింది.
"అక్కా....అక్కా" ఏడుస్తూ పిలవసాగింది హిమజ. ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది.
డాక్టర్ రామకృష్ణ పరుగున వచ్చి పద్మజ పల్స్ చూస్తున్నాడు. విలేఖరి అంబులెన్స్ కు ఫోన్ చేస్తున్నాడు. క్షణాలలో అక్కడంతా హడావుడిగా తయారైంది.
"హ్హ....హ్హ....హ్హ....ఏం ప్రయోజనం లేదు. అయిపోతుంది. నేను కావాలనుకున్నది సాధించాను. వెళుతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను" పెద్దగా నవ్వుతూ గదిలోకి పరుగెత్తాడు గిరి.
అతని వెనుకే ప్రకాశరావు పరుగెత్తాడు.
ఆయన గదిలోకి వెళ్ళేసరికి గదిలో గిరి నేలమీద పడున్నాడు. పిస్తోలు పక్కనే పడివుంది. గిరి స్పృహలోలేడు.
మిసెస్ ప్రకాశరావు వచ్చి హిమజను పట్టుకుంది ఓదార్పుగా.
"ఆంటీ, అక్కయ్యను చంపేశాడు ఆంటీ" ఆమె వడిలో వాలి వెక్కి వెక్కి ఏడుస్తోంది హిమజ.
సాగర్ వూళ్ళో లేకపోవటం చాలా కొరతగా వుందామెకు.
శివయ్య తోటలో గుమిగూడిన వాళ్ళకు వివరించి చెపుతున్నాడు శేఖరం ఆత్మ గురించి, హత్య గురించీ.
గిరికి ఇంకా స్పృహరాలేదు, డాక్టరు ఇచ్చిన ఇంజక్షన్ తో కాస్త కదిలాడు. అతడి ముఖం చాలా నీరసంగా వుంది.
కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపిస్తున్న మనుషులని చూసి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు.
"ఏం జరిగింది? నాకేమయింది ?"
"ఏం జరిగింది డాక్టర్ ? మాట్లాడరేం ?" అసహనంగా అడిగాడు మళ్ళీ.
డాక్టర్ మాట్లాడలేదు. ఇన్స్ పెక్టర్ ఒకడుగు ముందుకేశాడు.
"క్రింద హాల్లో పద్మజ వున్నారు, రండి చూద్దురుగాని" అన్నాడు.
"పద్మజా! పద్మజకేమైంది?" అనుమానంగా చూస్తూ చప్పునలేచి అతనితో కలిసి బయటకు వచ్చాడు గిరి.
పై నుంచి పద్మజ శవం కనిపిస్తోంది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది.
ఒక్కసారిగా "నో" అంటూ క్రిందకు పరుగెత్తాడతను.
"పద్మా, ఎవరు__ఎవరు చేశారీపని ? ఎందుకు ?" ఆవేశంగా అన్నాడు. అతడి కంఠం సన్నగా వణికింది.
"నువ్వే, నువ్వే చంపావు మా అక్కను. ఇంకా ఎవరని అడుగుతున్నావా?" కోపంగా, ఆవేశంగా అరిచింది హిమజ. ఆమె హిస్టీరికల్ గా ఊగిపోతోంది.
"నే....నా?"__గిరి కళ్ళలో షాక్ కనిపించింది.
"నేనా? నేనే చంపానా ? నిజమా ఇన్ స్పెక్టర్ ? నిజమా డాక్టర్?" డాక్టర్ రామకృష్ణను అడిగాడు ఉద్వేగంతో.