Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 31

    పద్మజ వివాహం గిరిధర్ తో జరుగుతోందని తెలియగానే శేఖరం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని ఆత్మ ఆ యింటి పరిసరాలను వదిలిపోలేదు. గిరిధర్ ని శేఖరం ఆత్మ ఆవహించడం మొదలుపెట్టింది. నైజీరియాలో 'కూప్' గురించీ, శ్రీ అండ్రోపోప్ మరణం గురించీ ఆ ఆత్మ ముందుగానే తెలియజేసింది. ఈ మధ్య ఇన్ స్పెక్టర్ గోపాల్ తో మాట్లాడుతూ దేశంలో మారణహోమం జరగబోతోందని హెచ్చరించింది. ఆ రకంగానే ఈ నెలరోజుల్లోనే  పంజాబ్ లో జమ్మూ, కాశ్మీర్ లలో, ఢిల్లీ లో ఎన్నోచోట్ల  పలువురి ప్రముఖుల హత్యలు జరిగాయి.


                        *    *    *


    ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డాక్టర్ రామకృష్ణ ప్రొఫెసర్ వర్మగారితో కలసి అక్కడే వున్నారు. గిరిధర్ ను కాకుండా శేఖరం ఆత్మను మాట్లాడించాలన్న  వారి శ్రమ ఫలించింది.

    "శేఖరం, మీరెందుకిలా  చేస్తున్నారు ?" అన్న ప్రశ్నకు "నాకు పద్మజగారంటే  చాలా ప్రేమ. ఆమెను వదిలి వెళ్ళలేకపోతున్నాను" అని సమాధానం వచ్చింది.

    "అయితే ఎల్లకాలం మీరిలా ఉండిపోగలరా ?"

    "ఆ, పద్మజ ఆత్మను నాతో తీసుకెళ్ళగలిగే వరకూ."

    "భవిష్యత్తు గురించి యిన్ని విషయాలు చెపుతున్నారు గదా. మరి అలాంటివి జరగకుండా మీరేం చేయలేరా?"

    "అది నా పరిధిలో లేదు."

    "మీరు శాంతంగా వెళ్ళిపోవడానికి మేమేం చేయగలం ?"

    "ఏమీ చెయ్యకండి. చేసినా ప్రయోజనం వుండదు. నా కోరిక తీరేవరకూ నేను వెళ్ళను, మీరేం చేసినా అది బెడిసికొడుతుంది. జాగ్రత్త!"

    ఇలా హెచ్చరించిన తర్వాత  ఆ ఆత్మ మళ్ళీ మాట్లాడలేదు.

    అయితే ఈ విషయం యిప్పటికే  దేశం అంతా  తెలిసిపోయింది. శేఖరం ఆత్మకు ముక్తి కలిగించాలని  చాలా
చోట్ల చాలా రకాలైన పూజలు జరుగుతున్నాయని తెలియవచ్చింది.

    పద్మజ యింటిచుట్టూ జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసుల్ని పెట్టవలసి వచ్చింది. రోజు రోజుకీ ఎక్కువవుతున్న ఫోన్ కాల్స్ కి సమాధానం చెప్పలేక  ఫోన్ తీసేయించింది.

    ఆ రోజు పద్మజ పుట్టిన్రోజు. వద్దన్నా  వినిపించుకోకుండా గిరి డిన్నర్ ఏర్పాట్లు చేశాడు. ప్రకాశరావు ఫ్యామిలీ, డాక్టర్ రామకృష్ణ, భూతనాథ్ లు వచ్చారు.

    భోజనాలయ్యాక  అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

    "ఎంత దారుణం కదూ, మాజీ ప్రధాన మంత్రికి కూడా సి. ఐ. ఏ. తో సంబంధం వుందట" అన్నాడు డాక్టర్ రామకృష్ణ.

    "ఏదయినా బయటపడే వరకూ అందరూ నీతిమంతులే" అన్నాడు గిరి. హెర్షే వ్రాసిన "మొరార్జీ పేపర్స్" గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు.

    "కోర్టులో కేసు నడుస్తోందిగా. నిజమేమిటో త్వరలోనే బయటపడుతుంది. అప్పటిదాకా ఏ సంగతీ చెప్పడం కష్టం" అన్నాడు ప్రకాశరావు.

    "ఎంతైనా పై పదవిలో  వున్న వాళ్ళకే ఇలా వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువ" అన్నాడు గిరి.

    "అలా అంటే నే నొప్పుకోను. మన బ్యోరోక్రటిక్ సిస్టంలో చప్రాసీనుంచి పై అధికారి వరకూ అందరికీ వార్తలు చేరవేసే ఆవకాశం వుంది" అంది పద్మజ.

    "ఏం హిమజా! నువ్వేం మాట్లాడవేం. జర్నలిస్టువి గదా" అడిగాడు గిరి హిమజ మౌనాన్ని చూసి.

    "మీరే చెప్పారుగా బయటపడేదాకా అందరూ దొరకలేనని. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు" అంది హిమజ పొడిగా.

    "పద్మా! సాగర్ రాగానే వీళ్ళ పెళ్ళి చేసేయాలి. తప్పదు. హిమజ చాలా మూడీగా తయారయిందీ మధ్య" అన్నాడు ప్రకాశరావు.

    "దేశంలో మరో పెద్ద  ఎస్పియనేజ్ రాకెట్ త్వరలో  బయటపడుతుందన్న వార్తలు వచ్చాయి. ఎంతవరకూ  నిజమో?" అన్నాడు భూతనాథ్.

    "ఈ రోజుల్లో ఏది విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. డబ్బుకోసం ఆత్మనే అమ్ముకునే మనుషులున్న  సమాజంలో దేశాన్నమ్ముకోవడం వింతేమీ కాదు."

    "ఆధ్యాత్మిక చింతనా, పాపభీతి గురించి మాట్లాడుతూనే యీ పెద్దమనుషులు డబ్బుకోసం కక్కుర్తిపడుతుంటారు. ఏమైనా అంటే అంతా భార్యాపిల్లలకోసమని నచ్చచెప్పుకుంటారు. వాళ్ళలా  సంపాదిస్తున్నారని తెలియగానే ఆ భార్యాపిల్లలే వాళ్ళ బండారం బయటపెట్టాలి. అప్పుడే వాళ్ళకు బాగా బుద్దొస్తుంది" అంది హిమజ.

    "ఎవరు చేస్తారాపని? తమకోసం  తండ్రి నానాగడ్డీ కరుస్తున్నాడని మరింత సంతోషంగా అనుభవిస్తారే తప్ప ఎవడు వదులుకుంటాడీ సుఖాల్ని " అంది పద్మజ.

    మాటల మధ్యలో  గిరి పైకి వెళ్ళడం గమనించింది పద్మజ. పది నిమిషాలయినా అతను రాకపోయేసరికి తనూ పైకి వెళ్ళింది తలుపు వేసి గడియ పెట్టబడివుంది. పైన శివయ్యతో  గిరి మాట్లాడుతున్నాడు చాలా చిత్రంగా. శివయ్య గిరిని దబాయిస్తున్నాడు. చాలా చిన్నగా వున్నా, వారి స్వరాలు స్పష్టంగా వున్నాయి. పద్మజకి అర్ధంకాలేదు.

    క్రింద హిమజకు యిబ్బందిగా ఉంది, అందరి అతిధులముందు దంపతులు  పైకి వెళ్ళిపోవడం. మామూలుగా అందర్నీ బిజీగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది.

    పైన గదిలోంచి  అస్పష్టంగా మాటలు వినిపించసాగాయి. పద్మ తలుపు కన్నంలోంచి  చూసింది. "దేశంలో పరిస్థితులన్నీ  నీకెందుకు? నువ్వెందుకు చెప్పడం" శివయ్య గిరిని దబాయిస్తున్నాడు. పద్మజకు తను చూస్తున్నది నిజమో కలో అర్ధం కావటంలేదు. తమ పనిమనిషి....శివయ్య - ఇంటి యజమాని గిరిని దబాయించటం!!! గిరి ఏదో నసుగుతున్నాడు.
  

 Previous Page Next Page