Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 32


    "థాంక్యూ" అన్నాడు నరసింహం ఆనందంగా.

 

    "అదీ నేను చెప్పినట్టు వింటేనే" ఆమె అతనికో నిబంధన విధిస్తూ అంది.

 

    ఇప్పుడతని స్థితి ఎలా వుందంటే అమాంతం మేడ ఎక్కి దూకమన్నా దూకేలా, మంటల్లోకి ఉరకమన్నా ఉరికేలా వుంది.

 

    అతనిలోని విచక్షణా జ్ఞానం నశించిపోయింది.

 

    తార్కికశక్తి అడుగంటిపోయింది.

 

    లోకజ్ఞానం మరుగున పడిపోయింది.

 

    పోలీసు బుర్రనిండా వేరే ఆలోచనలు చోటుచేసుకున్నాయి.

 

    ప్రమాదాన్ని పసిగట్టే జాగిలపు లక్షణం ఆమె అందంతో పోటీ పడలేక ఓడిపోయింది.

 

    ఆమె లక్ష నిబంధనలు విధించినా వాటిని పాటించి ఆమెను సొంతం చేసుకోవాలనే అతను ఆరాటపడుతున్నాడు.

 

    అందుకే అతని ముఖంలో ఇప్పుడు అసహనం తొంగిచూస్తోంది.

 

    "మీరంటే ఇష్టపడే మీకు ఫోన్ చేశాను. మీకు సొంతం కావాలనే మిమ్మల్ని రప్పించుకున్నాను. అలాంటి నేను మీకు దక్కకుండా వుండగలనా? బ్రతగ్గలనా? లేదు. కాణీ అదంటే నాకు ఇష్టమున్నా, తొందరగా దాన్ని స్వంతం చేసుకునే ధైర్యం లేదు. శారీరకంగా సిద్ధంగా వున్నా, మానసికంగా నేనింకా అందుకు నన్ను నేను సిద్ధం చేసుకోలేదు. మనమధ్య స్నేహం, చనువు పెరగాలి. మన బంధం ఒకరోజుతో అంతమయిపోకూడదు. కలకాలం, ఎంతోకాలం శాశ్వతం అనే పదాలు మనకు అన్వయించాలి. ఏమంటారు?"

 

    అతను వెంటనే 'నో' అనకుండా, తను చెప్పిన ప్రపోజల్ కి అతను ఒప్పుకునేలా లౌక్యంగా, లాజిగ్గా అంది.

 

    ఆమె ఆశించినట్టుగానే అతను వెంటనే ఏం అనలేక అలాగే అన్నట్టు తలూపాడు. కాని అప్పుడతని కళ్ళలో తొంగిచూసిన అసంతృప్తిని ఆమె పసిగట్టింది.

 

    "ఇప్పుడే వస్తాను. డ్రెస్ చేసుకోవాలిగా?" అంది అతని అంగీకారం అవసరం అన్న భావాన్ని ధ్వనిస్తూ.

 

    "లంకంత ఇల్లు... ఒంటరిగా జంట... బట్టలు అవసరమా?" బండబూతులు, కర్ణకఠోరమైన ఉపమానాలు తప్ప మరేమీ రాని నరసింహం నోటివెంట ప్రేమ, అనునయం తొణికే మాటలు రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే!

 

    "మరికొన్ని రోజుల తర్వాత అక్కర్లేదేమో"

 

    "కొన్నిరోజులంటే...?"

 

    "ఏమో...రేపే కావచ్చు, లేదా రెండు, మూడు రోజులయినా కావచ్చు." అంటూ చటుక్కున అతనివేపుకి రెండడుగులు వేసి, అతని భుజాన్ని సున్నితంగా కొరికి వదిలేసి లోపలకు వెళ్లిపోయింది.

 

    ఊహించని ఆ చర్యకు అతని నరాలు జివ్వుమన్నాయి.

 

    అంతలోనే అనుమానపు ఆలోచనలు అతని మెదడులో చోటు చేసుకున్నాయి.

 

    'అందమయిన అందగత్తె - చూడగానే మత్తెక్కించగల అవయవ సౌష్టవం, పరుగులెత్తే యవ్వనం, అణువణువునా ఆకర్షణ నింపుకున్న శరీరం- లక్షల ఆస్తి, లంకంత ఇల్లు... నిజంగానే ఈమె తనకు దక్కుతుందా? లేక ప్రాక్టికల్ జోక్ ప్లే చేస్తూందా? ఉహూ- జోక్ కాకపోవచ్చు' అని అనుకుంటేనేగాని సంతృప్తి పడలేకపోయాడు.

 

    తను ఆమె దరిచేరకుండా ఆగలేకపోతున్నాడు.

 

    తను తలుచుకుంటే అప్పటికప్పుడు ఆమెను బలవంతం చేయగలడు. లాకప్ లో అలాంటి బలవంతాల్ని ఎన్ని చేశాడో లెక్కేలేదు. అది తనకు వృత్తిలో పెట్టిన విద్య కానీ, అది- తనను దూరంగా నెట్టివేసే ఆడపిల్ల విషయంలో అమలుపరచవలసిన విధానం. ఈమె తనంటే ముచ్చటపడి పిలిపించుకుంది. మొరటుదనం, మూర్కత్వం, రాక్షసత్వం ఇక్కడ వర్కవుట్ కావేమో?

 

    'ఒకవేళ అలా చేసినా ఆ ఒక్కసారితో ఆమె తనపట్ల విముఖత చూపితే? కేవలం ఒక్కసారితోటే తను తృప్తిపడగల అనాకారి కాదేమో. జీవితాంతం ఆమె తోడును కోరుకునే బ్రెత్ టేకింగ్ బ్యూటీ - పోనీ ఓపిక పడితే పోలా? పైపెచ్చు చచ్చినంత ఆస్తిపాస్తులున్నాయి. ఎన్ని మర్డర్ కేసుల్ని మాఫీ చేస్తే ఇన్ని ఆస్తులు సమకూడతాయి? పైగా అందమైన, డబ్బున్న అమ్మాయిని కీప్ చేయడం సొసైటీలో తనను హీరోగా నిలబెడుతుంది. పొదుగు కోసుకోవడం ఎందుకు? బంగారుబాతుని దురాశకు పోయి చంపుకోవడం దేనికి?' ఒక మనిషి ఇంత దుర్మార్గంగా ఆలోచించగలడా అని మానవత్వమే అచ్చెరువందే రీతిలో సాగిపోతున్నాయి ఎస్.ఐ. నరసింహం ఆలోచనలు.

 

    ఆమె గదిలోంచి రావడం ఒకింత ఆలస్యమైంది.

 

    ఈలోపు అతనిలోని ఆలోచనలు ఆగిపోయి, వాటి స్థానంలో పరిశీలన మొదలయింది.

 

    ఆ హాలంతటిని నిశితంగా పరిశీలించాడు. పురాతన కాలంనాటి వుడ్ ఫర్నిచర్, విలువయిన పురాతన వస్తువులు ఎన్నో వున్నాయి ఆ హాల్లో.

 

    ఈ తరపు పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించే ఒక్క వస్తువూ లేదక్కడ. ఆ యింటి యజమాని అభిరుచికి అబ్బురపడ్డాడు నరసింహం. ఆ తర్వాత 'అంతా - పాతవాసన' అంటూ ఒకింత చిరాకు పడ్డాడు.

 

    ఈలోపు వస్తున్నట్టు శబ్దమయినా లేకుండా ఆమె నరసింహం పక్కన ప్రత్యక్షమయింది ఆమె చేతిలో ట్రే వుంది. అందులో రకరకాల బిస్కెట్లు, టీపాట్ అమర్చివున్నాయి.

 

    ఇప్పుడతని చూపులు ఎత్తయిన ఆమె ఎదపైన, మంగోలియన్ గోబీ మైదానాన్ని తలపింపజేసే ఆమె నాభి ప్రాంతంలో తారట్లాడాయి ఒకింతసేపు.

 

    ఆ తరువాత చిన్నగా నవ్వాడు.

 

    ఇప్పుడతనిలో ఆమెను వెంటనే పొందలేకపోయానే అన్న అసంతృప్తి లేదు. ఎప్పటికయినా ఆమెను, ఆమె సంపదను పొందలేక పోతానా అన్న ప్రగాఢమైన ఆశాభావం అతని కళ్ళలో ప్రోది చేసుకొని వుంది.

 

    ఇద్దరూ మెల్లగా కబుర్లలో పడ్డారు.

 

    "మా నాన్నగారికి పాత వస్తువులంటే ప్రాణం. నాకు, మా మమ్మీకి మోడర్న్ అవుట్ లుక్. మొత్తానికి మొన్నీ మధ్యే ఇంట్లో వున్న పాత వస్తువు లన్నింటినీ వదిలించుకుని కొత్తవి కొనుక్కుంటానని నాన్నగార్ని ఒప్పించాను. వీటిని అమ్మి ఆల్ట్రా మోడర్న్ ఫర్నిచర్ కొనాలి. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి?" మధుమతి దాదాపు అతనికి ఆనుకునేలా కూచుంటూ అడిగింది.

 

    "నాకూ అంతే... పాత వాసన పడదు. అంతా కొత్త... ఆల్ట్రా మోడర్న్ కావాలి..." ఆమెను సమర్ధిస్తూ ఆమెకి మరి కాస్త దగ్గరగా జరుగుతూ అన్నాడు.

 

    ఆమె ప్రశంసగా అతనివేపు చూసింది.

 

    తన అభిరుచిని సమర్ధించినందుకు కృతజ్ఞతను చూపుల ద్వారానే వ్యక్తం చేసింది.

 

    అంతలోనే నరసింహం పక్కనే వున్న ఫోన్ రింగయింది.

 

    అది వింటూనే మధుమతి ఉలిక్కిపడింది.

 Previous Page Next Page