Previous Page Next Page 
సాహసి పేజి 32


    వైశాలి గుండె గుబగుబ లాడింది- వచ్చి పొరపాటు చేశానా భయపడిందో క్షణం. అకస్మాత్తుగా కపాలేశ్వర్ కి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. "ఇందుగారూ... చెప్పటం మరచిపోయాను... ఇరవై ఐదేళ్ళ క్రితం- బొంబాయి నుంచి, ఒరిస్సాలోని కటక్ వెళ్తున్న ఒక విమానం... ఈ అడవుల్లోనే కూలిపోయింది. అప్పట్లో ఆ విమానం కోసం చాలా అన్వేషణ జరిగింది. విమానంగానీ, అందులో మనుష్యులు గానీ, ఎవరూ కనిపించలేదు. ఏమైపోయారో తెలీదు."

    "ఫ్లయిట్ మొత్తం... బరెస్ట్ అయిపోతే... మనుషులెలా కన్పిస్తారు" అన్నాడు యువరాజు నవ్వుతూ.

    "కాదు... అప్పుడు... పేపర్ల వార్తలు... ఎయిర్ పోర్టు అధికారులిచ్చిన, ఇన్ ఫర్ మేషన్ ప్రకారం... విమానం... కాలిపోలేదు... ఇంజన్ ఆగిపోయి ఇక్కడ కూలిపోయిందంతే."

    "మరేమైపోయిందంటారు..."

    "అదే వింత... ఇప్పటికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు..." చెప్పాడు కపాలేశ్వర్.

    "మీరు సడన్ గా భలే సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్తారు..." అంది ఇందుమతి.

    "మన హంటింగ్ కి బయలుదేరడానికి ముందే... మా ఆఫీసు వాళ్ళు ఈ విషయం చెప్పారు" చెప్పాడతను.

    "ఈ హంటింగ్ లో అది బయటపడితే-" అంది వైశాలి.

    "ఈ అడవేమైనా- మ్యూజియమా? ఎక్కడి వస్తువులలా ఉండడానికి-?" నవ్వుతూ అన్నాడు యువరాజు.

    "లేదు- యువరాజూ- ఈ యూనివర్సల్ లో అనంతమయిన, అద్భుత విషయాన్ని మనకోసం పదిలపరిచే అపురూపమైన మ్యూజియమ్స్- ఈ అడవులే-" కపాలేశ్వర్ చెప్పిన విషయాన్ని, ఆలోచిస్తూనే నిద్రపోయింది ఇందుమతి.


                                           *    *    *    *


    అప్పుడు రాత్రి పదకొండు గంటలు దాటింది.

    ఏ చప్పుడికి, 'రియాక్ట్' అయిందో తెలీదు 'రాకీ' భయంకరంగా అరవడం మొదలుపెట్టింది.

    ఆ అరుపులకి అందరికీ నిద్రాభంగమైంది.

    అక్కడికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో, మూడు రోజుల్నుంచీ ఆకలితో అల్లల్లాడిపోతున్న పెద్దపులికి-

    ఓ బురుడు దుప్పి దొరికిపోయింది. బురుడు దుప్పి చావు అరుపుల్ని 'రాకీ' మాత్రమే గుర్తుపట్టగలిగింది.

    బురుగు దుప్పితో ఆకలిని తీర్చుకున్న పెద్దపులి- నెమ్మదిగా ముందుకు వస్తోంది నీళ్ళకోసం.

    ఇందుమతి బృందం, శిబిరాలు వేసుకున్న ప్రదేశానికి పాతికగజాల దూరంలోనే వుంది వాగు.


                   *    *    *    *


    చంద్రబింబం, మబ్బుల వెనుక వెండి డాలులా మెరుస్తోంది. స్వచ్చమైన అడవిమీద పరుచుకుంటున్న వెన్నెల మంచులా కనిపిస్తోంది. సన్నటిగాలికి చెట్ల చప్పుడు మెల్లగా వినిపిస్తోంది.

    యువరాజుకి చటుక్కున మెలుకువొచ్చింది. లేచి కూర్చున్నాడు. వెంటనే పక్కనే వున్న రైఫిల్ ని అందుకున్నాడు.

    "దుప్పి అరుస్తుందంటే- పులి కనబడైనా వుండాలి. నోట కరుచుకు పోయైనా వుండాలి" అప్పటికే, మేల్కొని కూర్చున్న ముత్యాలనాయుడు ఇందుమతితో చెప్తున్నాడు.

    "అది మనుషుల్ని తినే పులే-" మళ్ళీ అన్నాడు ముత్యాలనాయుడు.

    "అంటే- మాన్ ఈటర్-" భయంగా అంది ఇందుమతి.

    "అవును- మన దగ్గరలోనే వుంది. దుప్పిమీద దాడి చేసిందంటే- అది మన మీద దాడికోసమే వచ్చుంటుంది. మేనిటర్ మాత్రమే మనుషుల గుంపుకి ఇరవై పాతిక గజాల దూరంలో కాపు కాస్తుంది... మామూలుగా బలంగా వున్న దుప్పి, పులికి అంత సులభంగా దొరకదు. అంటే- అంతకు ముందు, ఆ దుప్పి, అదే పులిచేత దెబ్బ తినుండాలి-" అన్నాడు ముత్యాలనాయుడు.

    చలి నెగడు పొగచూరుతోంది. రాత్రిపూట ఒంటి కన్నులా వింతగా మెరుస్తోంది.

    అదే సమయంలో-

    గాండ్రు, గాండ్రుమన్న పులిగాండ్రింపు వినబడింది. అతి సమీపం నుంచే పులి అరిచిన అరుపు అది.

    "అంటే- పులి ఆకలి ఇంకా తీరలేదన్న మాట- యువరాజా, పులి- మనవేపే వస్తుండాలి- మనం జాగ్రత్తపడాలి-" హెచ్చరికగా అన్నాడు ముత్యాలనాయుడు.

    అందరూ భయంతో గడ్డ కట్టుకుపోయారు.

    లేచి నిలబడ్డాడు యువరాజు. పులిని వెంటాడడానికి, వేటాడడానికే నిర్ణయించుకున్నాడతను.

    పులికి, మనిషికి దగ్గర సంబంధం వుంది. దెబ్బతిన్న మనిషి, దెబ్బతిన్న పులి రెండూ ఒకేలా ప్రవర్తిస్తాయి మనిషి జనారణ్యంలో తిరిగే పులిలాంటి వాడు.

    ప్రపంచ చరిత్రలో వేటకు అద్భుతమైన స్థానం వుంది. అడవిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే మనిషి తాపత్రయానికి, పరాక్రమానికి వేట చిహ్నమైంది. ఒకప్పుడు షికారుకెళ్ళడం- శౌర్యానికి గుర్తు. షికారంటే వేటే!

    ఒక చేతిలో రైఫిల్ తో పొదలవేపు అడుగేస్తున్న యువరాజు వేపు దిగ్భ్రాంతిగా చూసింది ఇందుమతి.

    "ఎక్కడికి?" ఆ గొంతులో వింత భయం.

    "పులి కోసం"

    "మానీటర్ కు ఎదురుగా వెళతావా-" మళ్ళీ అంది.

    ఇందుమతి కంఠంలో అపరిమితమైన ఆందోళన తొంగిచూసింది.

    వైశాలికి రక్తం గడ్డకట్టుకుపోయినట్లయింది.

    "వెన్నెల్లో మానీటర్ ని కొట్టడం కష్టం- ఈ సమయంలో దానికి అడవి ప్లే గ్రౌండ్ లాంటిది-" కపాలేశ్వర్ సలహా ఇచ్చాడు.

    "మేనీటర్ని ఉపేక్షించగూడదు... అది దొరకకపోతే, కనీసం మనకి దూరంగానైనా తరిమి వెయ్యాలి... దాని భయంతో వేగంగా ముందుకెలా వెళ్ళగలం?"

    ఎప్పుడో, ఎవరో చెప్పగా విన్న విషయం గుర్తుకొచ్చింది యువరాజుకి.

    "నేనూ వస్తాను... పద" పొడవాటి కత్తిని తీసుకుని, తననే అనుసరిస్తున్న ముత్యాలనాయుడ్ని వారించలేకపోయాడు యువరాజు.

    అంతవరకూ విన్పించిన, పులి గాండ్రింపు చటుక్కున ఆగిపోయింది. దట్టమైన బూరుగు చెట్లమధ్య నిలబడి అటూ, ఇటూ వింతగా పరిశీలిస్తున్నాడు యువరాజు.

    "పులి అరుపు, దుప్పి అరుపు, రెండూ ఆగిపోయాయంటే... దుప్పి చచ్చిపోయిందన్న మాట... చచ్చిపోయిన దుప్పిని, పులి తింటోదన్న మాట..." నెమ్మదిగా చెప్పాడు ముత్యాలనాయుడు.

    ఆకు కదిలినా, విన్పించేటంత నిశ్శబ్దం. ఒడల్ని జలదరింపచేసే నిశి నిశ్శబ్దం... అందరూ ఉద్రిక్తత అంచుకు చేరుకున్నారు.

    అదే సమయంలో దూరంగా, ఎండుటాకు మీద ఎవరో పరిగెడుతున్నట్లుగా అడుగుల చప్పుడు...

    "మనకంటే ముందు ఎవరో పులిని తరుముతున్నారు..." యువరాజు అన్నాడు.

    "లేదు... రాజూ... దుప్పిని నోట కరుచుకుని, పులి పరుగెడుతున్న చప్పుడది... ఆ అడుగుల శబ్దాన్ని మనం అనుసరిస్తే..." ముత్యాలనాయుడు నోట్లోంచి ఆ మాట ఇంకా పూర్తిగా రాలేదు.

    తూర్పుదిక్కువేపు దూసుకుపోయాడు యువరాజు.

    సాధారణంగా వేటగాళ్ళు పులిని రెండు రకాలుగా ఎదుర్కొంటారు. ఆహారాన్ని ఎరగా చూపించడం ఒక పద్ధతి- ఆహారాన్ని తినేసి, సేద తీరుతున్నప్పుడు... అకస్మాత్తుగా ఎదుర్కోవడం ఇంకో పద్ధతి.

    మేనీటర్ని ఎదుర్కొనేవాళ్ళు... ఎరగా అయిన మృగాన్ని మేనీటర్ తిన్నదా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి.

    మానవ రక్తానికి, మానవ మాంసానికి అలవాటుపడ్డ పులి నక్కజిత్తులతో ప్రవర్తిస్తుంది. మానవ శరీర వాసనే దానికి కిక్ ఇస్తుంది. ఆ వాసనే రక్తాన్ని రుచి చూసేవరకూ పులిని నిలవ నివ్వదు... వెర్రెత్తిపోతుంది. పిచ్చెక్కిపోతుంది. ఆహారాన్ని దక్కించుకోవటం కోసం ఎన్నో కుయుక్తుల్ని పన్నుతుంది.

    ఆ సమయంలో, ఏ జంతువైనా దానికి కనిపిస్తే... చంపేవరకూ నిద్రపోదు. దాని తర్వాత లక్ష్యం... మనిషి...

    ప్రస్తుతం దుప్పిని చంపి, దాని మెడను పట్టుకుని తీసుకెళ్ళి పోతున్న పెద్దపులి ఆ ప్రయత్నంలోనే వుంది.

    తనను అనుసరించి వస్తున్న మానవ శరీర వాసనను అదెప్పుడో పసికట్టింది. అందుకే తెలివిగా ముందుకు దూసుకుపోతోంది పెద్దపులి.

    డెత్ ట్రాప్ లో ఇరికించడానికి, పులి వ్యూహం పన్నుతోందన్న విషయం తెలీని యువరాజు, ముత్యాలనాయుడు-

    పులి, తమకు సమీపంలోనే ఉందన్న ఉత్సాహంతో ముందు కెళ్తున్నారు.

    వరసగా, సింధూర చెట్లతోపు... ఆ తర్వాత రాళ్ళగుట్టలు... రాళ్ళ గుట్టల వరకూ వచ్చాడు యువరాజు.

    కుడికాలి కేదో మెత్తగా తగలడంతో ఉలిక్కిపడ్డాడు యువరాజు. భయం, నరనరాల జర్రుమని పాకింది. చటుక్కున ఒంగొని చూశాడు మసక వెలుగులో... దుప్పి నుంచి విడిపోయి, కింద పడిపోయిన దుప్పికాలు...

    చేతిలోకి తీసుకున్నాడు... ఇంకా కాలినుంచి కారుతున్న రక్తం... ఆ రక్తం వేడిగా వుంది.

    అంటే-

    పెద్దపులి, ఆ సమీపంలోనే ఎక్కడో వుండాలి. సాధారణంగా పులి, తను చంపిన మృగాన్ని ఎక్కడా వదలకుండా, అనువైన ప్రదేశానికి తీసుకెళ్తుంది తిన్నంత తిని, ఆకలి తీరాక మిగతా శరీర బాగాల్ని ఒకచోట దాస్తుంది. అందుకే నక్కలు, దుమ్మల గుండలు లాంటివి వేటాడే పులికి సమీపంలోనే సంచరిస్తాయి- పులి వదిలేసిన ఆహారాన్ని తినేందుకు.

    ఎక్కడా గాలి లేదు... అడవి మొక్కల పచ్చి వాసన... మంచు కురుస్తున్న మట్టివాసన... యువరాజుకి ఈ అనుభవం చాలా కొత్తగా వుంది.

    జీవితంలో అడవిలోకి, అందునా దట్టమైన అడవిలోకి రావడం మొట్టమొదటిసారైతే, పులిని, అందునా మేనీటర్ ని వేటాడటం ఇదే ప్రధమం.

    మనిషి సాహసిగా మారడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి... ఒకటి ఏమీ తెలియనప్పుడు... రెండు అన్నీ తెలిసినప్పుడు...

    వేట గురించి ఏమీ తెలియకపోవడం, అందులోనూ పులి గురించి అసలు తెలీకపోవడంతో-

    ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు యువరాజు.

    "రాజూ... ఆగు... దూకుడొద్దు... దుప్పికాలు... ఇక్కడుందంటే, పులి ఇక్కడెక్కడో ఉండాలి... నెమ్మదిగా అడుగులు చప్పుడు చెయ్యకుండా నడు..." అనుభవంతో హెచ్చరించాడు ముత్యాలనాయుడు.

    ప్రమాదానికి ఆలవాలమైన అడవి- అందులోనూ దట్టమైన చీకటి- అది పులిగడ్డ- పులి రాజ్యం- పులి విశృంఖల విహారానికి అది నెలవు...

 Previous Page Next Page