Previous Page Next Page 
రాగవాహిని పేజి 31

    "ఛీ! మనస్సెంత సిగ్గులేంది? మనిషికి సిగ్గులేదంటారు అందరూ కానీ నిజంగా సిగ్గులేంది మనస్సుకి....


    ఎలా పడితే అలా వూహిస్తుంది మనస్సు.

    ఒక్కక్షణం కృష్ణుని కోరుకుంది. మరోక్షణం సతీష్ ని ఆశించింది. ఆ కోరిక ఈ ఆశకి తేడా ఎంతసేపు?

    కొన్ని నిమిషాలు....

    అయినా కృష్ణని వదిలేసినా సతీష్ కి మాత్రం తగునా తను?

    "ఏం తనకేం లోటు?" అనుకుంది మళ్ళీ.

    "ఇంకా....యింకా....

    అతనే డ్రైవర్! డ్రైవరంటే ఎంత బావున్నా తనకంటే తక్కువే కృష్ణ దయ చూడబట్టిగానీ లేకపోతే నెలకు వందో, వంద చిల్లరో తీసుకుని షెడ్స్ లో కాపురం వుండాల్సినవాడూ కాదూ?"

    "సత్యా!"

    క్రిందనుంచి బజర్ మ్రోగింది. ఆమె రాకపోతే పైకి వచ్చి ఏదో ఆలోచనల్లో మునిగిపోయి తన రాకనికూడా గుర్తించకుండా వున్న సత్యని పిలిచేడు సతీష్.

    ఉలికిపాటుతో సోఫానుంచి లేచి కూర్చుంది. ఆ అధాటుకి ఆమె చేతిలోని పుస్తకం "పిగ్మాలియన్" జారి క్రిందపడింది.

    దగ్గరగా వచ్చి ఆ పుస్తకం అందుకొని చూసి "గుడ్, సిగ్మాలియన్ చదువుతున్నావా! బావుందా? షా అంత సులభంగా అర్ధంకాడు! అతని డైలాగ్స్ చాలా గాఢమయిన భావాలతో వుంటాయి. ప్రతి మాటా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి డైలాగో మరెక్కడి డైలాగుకో ముడి పెడతాడు. ఆ డైలాగ్ గుర్తుంటే గాని యీ డైలాగ్ అర్ధం కాదు. మన తెలుగువాళ్ళలో గురజాడలాంటివాడు షా.

    షేక్స్ పియర్ అలాకాదు. మన పింగళి సూరనలాగా వుంటాడు. అతను నాటకాలు కాకుండా ప్రబంధాలు వ్రాసి వున్నా మన సూరన కళాపూర్ణోదయం నాటకంగా వ్రాసి వున్నా ఒకేలాగా వుండేది.

    మన తెలుగు నాటకాలు చదివావా! నాకు కన్యాశుల్కం కంటే చింతామణే నచ్చింది. మధురవాణి నిజాయితి లేని మనిషి చింతామణి అలాకాదు. ఆమెకి వ్యక్తిత్వం వుంది" అని గబ గబా మాటాడేడు.

    ఆశ్చర్యంగా విప్పారిత నేత్రాలతో చూసింది సత్య.

    "నువ్వు.... నువ్వు ఏం చదివావ్?"

    "ముందు చదివింది నీలాగా టెంతే. కానీ మా అయ్యగారు కోచింగ్ ఇచ్చి ఎమ్మే చేయించారు ప్రయివేట్ గా"

    సత్య ఆరాధనా పూర్వకంగా చూసింది.

    "సరే! సరే! మళ్ళీ చూద్దువుగానిలే మెచ్చుకోలుగా! ఈ కలల అలల్లోంచి బయటపడి త్వరగా తయారయివస్తే టౌన్ హాల్లో మంచి డాన్స్ ప్రోగ్రామ్ వుంది. టికెట్లు వచ్చాయి వెళదాం"

    అదోలా చూసింది.

    "నేనేం కొన్లేదు. ఇవి మామూలుగా తగలడతారు మనకి. బయటివాళ్ళు ఇదే టిక్కెట్ కి ఇరవై అయిదు ఇస్తే పేట్రన్ టికెట్ లాగా మనకి రెండొందలు గుంజేస్తాడు. అదంతే!"

    "వెళ్ళాలా?"

    "ఊ! తప్పదు"

    "సరే! పద క్రిందికి."

    మేడనుండి నేరుగా డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళేడు సతీష్. అక్కడికి అతను వెళ్ళేసరికి నలుగురైదుగురు కూర్చుని వున్నారు. అతన్ని చూడగానే అందరూ లేచి నుంచున్నారు.

    "నమస్తే కృష్ణగారూ! నమస్తే!"

    "నమస్తే!"

    సరిగ్గా ఆ సమయంలో అతన్ననుసరించివస్తున్న సత్య ఆ మాటలు వింది.

    ఆమెకూడా డ్రాయింగ్ రూమ్ లో అడుగుపెట్టింది.

    ఒక్క క్షణం అందరూ మళ్ళీ లేచి నుంచున్నారు.

    "కృష్ణాజీ!" ఓ వ్యక్తి పిలిచేడు.

    "వూ?"

    "మీ ఆవిడా"

    "వూఁ! వూహూఁ!"

    "అరె బ్యూటిఫుల్ సెలక్షన్! మంచి జోడి! మీరు మమ్మల్ని పిలవకుండా పెళ్ళిచేసుకున్నారా? వండర్ ఫుల్ మీ రన్నిట్లోనూ అలాగే ఆదర్శంగా వుంటున్నారు. మీకు మంత్రాల్లో ఆచారాల్లో నమ్మకం లేదు గదూ? అందుకే సివిల్ మేరేజ్ చేసుకున్నారా? వెరీగుడ్. కానీ కృష్ణగారూ! కనీసం రిసెప్షనయినా ఎరేంజ్ చేసి వుండవలసింది." ఓ స్త్రీ అంది.

    "చూడగా ఈ మధ్యే పెళ్ళయినట్టుంది. మొన్న ఆదివారం నేను వచ్చాగా! అప్పుడీవిడ లేదు" అంది మరో స్త్రీ.

    వాళ్ళ ప్రశ్నలూ అతని సమాధానాలూ ఆమెలో ఆశ్చర్యాన్ని, కోపాన్ని కలిగించేయి.

    ఒక్కక్షణంలో గిర్రున వెనుదిరిగింది చప్పున.

    "వెళ్ళిపోతున్నారేం! రండి! మీతో పరిచయం చేసుకోవాలి" ఎవరో స్త్రీ పిలిచింది సత్యని.

    "సత్యా! యిలారా!"

    అతని గొంతులో ఏ భావమూలేదు. నిర్వికారంగా నిర్లిప్తతగా పిలిచేడు.

    పధ్యశిలకు కొని పోబోతున్న వ్యక్తిలా వెనుదిరిగి, తన మనోభావాలు దర్పణంలా ప్రకాశించే ముఖాన్ని చూపించకుండా వృదీద్వర్శన లాలనలాగా వచ్చింది అధోవధినయై.

    "నా పేరు సారసాక్షి మా వారు శ్రీనివాస్, ఇండస్ట్రియల్ ఎస్టేటులో స్టిల్ ప్లాంటు నడుపుతున్నాం. మా ఫర్మ్ లో మీ వారిక నాలుగో వంతు షేరుంది" అంది ఓ స్త్రీ లేచి.

    మరో స్త్రీ లేచి చేయి చాచింది.

 Previous Page Next Page