Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 31


    "అందుకని సిల్వర్ జూబ్లీ క్లబ్బు పెడదాం"


    "దేనికి సిల్వర్ జూబ్లీ?"


    "నువ్వు పుట్టి పాతికేళ్ళు నిండుతాయి - రేపు డిసెంబరుకి - అప్పటికి మన సొంత క్లబ్బు మొదలెట్టేద్దాం"


    "సరే!"


    "పై ఖర్చులకి..."


    "బ్యాంకు తెరిచాక డ్రా చేసి ఇస్తాలే"


    'చెక్కు బుక్కు ఒకటి సంతకాలు పెట్టి నాకు ఇచ్చెయ్యరాదూ!' అనేద్దామని నోటి చివరిదాకా వచ్చింది పాపారావుకి. కానీ చివరి క్షణంలో తమాయించుకున్నాడు.


    అత్యాశ ఉండడం తప్పు కాదు. కానీ దాన్ని పైకి కనపడనివ్వడం తప్పు! అదీ అతని ఫిలాసఫీ.


    కానీ ఎప్పుడూ ఈ అర్జున్ ని ఇలా జలగలా పట్టుకుని, రక్తం పీల్చినట్లు కొద్దికొద్దిగా డబ్బు లాగడం ఎప్పటికప్పుడు ఇబ్బందిగానే ఉంటోంది. చాలా అలసట కలిగిస్తోంది కూడా. అయినా అర్జున్ గాడి లాంటి అనాడీ గాడికి ఆస్తి ఉండటమేమిటి? తనలాంటి ద్రష్ట దగ్గర దమ్మిడీ లేకపోవడం ఏమిటి? దేవుడికి మేనేజ్ మెంట్ తెలీదు. ఈ ప్రపంచమంతా భగవంతుడు సృష్టించిన నాటక రంగం అనుకుంటే, జీవితం చేతకాని రచయిత రాసిన కామెడీ నాటకంలా ఉంటుంది. పోనీ నటీనటులని చూద్దామా! ఏ పాత్రకీ ఎవరూ అతికినట్లు ఉండరు. తనవరకే తీసుకుంటే, ఈ అర్జున్ గాడు హీరో! తను ఉత్తతైనా తీగాడు! ఏవన్నా అర్థంపర్థం ఉందీ?


    ఈ జీవన్నాటకం అతనికి బోర్ కొట్టింది. సినేరియో మార్చాలనుకున్నాడు. పోనీ, నాటకం రక్తికట్టించడానికి కొత్త పాత్రని ప్రవేశపెడితే!


    అవును! కొత్త పాత్రనే ప్రవేశపెడతాడు.


    అది తన చెల్లెలే! పుణ్యవతి! తన చెల్లెలిని వీడి భార్యగా చేస్తాడు. పైకి కనబడడుగానీ, రోగాలతో పుచ్చిపోయి ఉన్నాడు ఈ అర్జున్. తాళి కట్టాక సంవత్సరం తిరక్కుండా బాల్చీ తన్నేస్తాడు. అప్పుడింక ఆస్తి అంతా తన చెల్లెలి చేతిలోకి వస్తుంది. సహజంగానే తన చెల్లెలు తన గ్రిప్పులోనే ఉంటుంది. అంటే పరోక్షంగా తనే ఆస్తికి అధికారి! ఓ జనరల్ పవరాఫ్ అటార్నీ రాయించుకుంటే చాలు! తనదే రాజ్యం! ఆడింది ఆటా! పాడింది పాటా!    


    నాటక ప్రయోక్తగా తన ప్రయోజకత్వాన్ని ఆరోజే పరీక్షకి పెట్టాడు పాపారావు. మొహానికి మసిపూసుకున్నట్లు విషాదం పులుముకుని, దీర్ఘాలోచనలో ఉన్నట్లు ఫోజు పెట్టాడు.


    ఏమయిందన్నాడు అర్జున్.


    "నీకేం! ఒంటరిగాడివి! అలక్ నిరంజన్! నేను అట్టాకాదుగా! నాకో చెల్లెలు ఉంది! నా పెళ్ళి అయినా కాకపోయినా చెల్లెలి పెళ్ళి చేసి తీరాలిగా!"


    "కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదు! అయ్యే రోజు వస్తే అదే అవుతుంది" అన్నాడు అర్జున్.


    "ఈ మెట్ట వేదాంతం సరేలే! మంచి వరుడు దొరకొద్దూ!"


    "వెదుకుదాం"


    "వెదకడమెందుకూ? గురుడు అప్పుడే చెప్పాడు"


    "ఎవరూ?"


    "గురుడు - అంటే మన పరమశివుడు! నిన్న నైటు క్లబ్బు నుంచి ఇంటికెళ్తుంటే దార్లో దిగివచ్చాడు. ఇద్దరం ఇంటిదాకా నటరాజా సర్వీసు. జట్కా సాయెబు బండి కడతానన్నా వద్దని నడిచెళ్ళిపోయాం."


    "జట్కా సాయిబుకి కూడా కనబడ్డాడా శివుడు?"


    "ఇంకా నయం! నాకు తప్ప ఇంకెవరికీ కనబడడు. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గానీ!"

    
    "గురుడు ఏం చెప్పాడంటే - ఫలాని వరుడితో ముడిపెట్టూ!" అని.


    "ఎవరా వరుడు?"


    "ఇంకెవడు? నువ్వే!"


    "నేనా?"


    "కాదనక! ఇవి చేతులు కావు - కాళ్ళనుకో!" అని కాళ్ళే పట్టుకున్నాడు పాపారావు. ఆ రోజు అతను రెండు బాటిల్స్ తాగి ఉన్నాడు.


    పాపారావుని ఆదుకోవడం 'స్నేహధర్మం' అనుకున్నాడు అర్జున్. ఆ అమ్మాయి మొహమైనా చూడకుండా, పేరైనా అడక్కుండా పెళ్ళి చేసుకున్నాడు.


    అందువల్ల నష్టం కలిగిందా అంటే అదేం కాదు. అతను ముల్లోకాలు గాలించినా కూడా అంతటి అనుకూలవతి అయిన భార్య దొరికి ఉండేది కాదు.


    కేవలం అనుకూలవతేనా?


    కాదు కాదు? అద్భుత సౌందర్యవతి! అభిమానవతి!


    ఆమె పేరు పుణ్యవతి!


    కానీ పెళ్ళి అతనికి కొన్ని ప్రాబ్లెమ్స్ తెచ్చి పెట్టింది.


    అన్నీ బాగానే ఉన్నాయి గానీ, ఆ అమ్మాయి వరస తనకి నచ్చలేదు.


    పేరు పుణ్యవతి కావచ్చు. కానీ ఇంకా ఇంకా పుణ్యం ఆర్జించడానికే తను పుట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉండేది. ఎప్పుడూ పుణ్యకార్యాలూ, పుణ్య స్థలాలూ దర్శించడం, పురాణాలూ.

 Previous Page Next Page