Previous Page Next Page 
రక్షరేకు పేజి 31


    ప్రతినెలా అతను జీతంలోంచి పదిహేను, ఇరవై విరగ్గొడుతున్నారు! బాధపడటం కంటే ఏం చెయ్యలేకపోతున్నాడు అతడు.
    "జయన్నా! మీ కేంటీన్ లోంచి స్పూన్స్, ఫోర్క్స్ వగైరా పోతున్నాయా?" అని అదొక మాదిరిగా, అర్ధ గర్భితంగా అడిగాడు వ్యాసమూర్తి.
    ఎవరో కత్తిపెట్టి గుండెల్లో కుమ్మినట్లే అయింది అతనికి. ప్రతినెలా అన్యాయంగా తన కష్టార్జితంలోంచి జీతం విరగ్గొడుతున్నప్పుడు కూడా అతనికి అంత బాధకలగలేదు.
    ఆ స్పూన్ వగైరా ఎలా పోతున్నాయో, కనిపెట్టి తీరాలనుకున్నాడు.
    ముందు క్లీనర్ ని కనిపెట్టి చూశాడు. ఏమీ ఆచూకి దొరకలేదు. వంటమనిషిని కూడా అనుమానించాడు, కానీ, ఆఅనుమానమూ నిరాధారమని తేల్చుకున్నాడు!
    ఎలాగైనా ఆ స్పూన్ల దొంగని పట్టుకోవాలని, ప్రతిక్షణమూ వేయి కళ్ళతో అందరినీ గమనించసాగాడు!
    ఒకనాడు అతను తన కళ్ళని తను నమ్మలేకపోయాడు. రెండువేలకు పైగా జీతం సంపాదించుకునే, ఒక బాధ్యతగల ఆఫీసర్ గారు, టిఫిన్ తిని ఆ స్పూన్ ని నెమ్మదిగా జేబులో పడేసుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా పరుగున వచ్చి ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
    "ఏమిటిసార్? మీరే ఇక్కడి స్పూన్ జేబులో వేసుకుంటున్నారా?" అని గట్టిగా అరిచాడు! ఆ అరుపుకు అందరూ అటు చూశారు.
    ఆశించని ఈ పరిణామానికి అతడు కొయ్యబారిపోయాడు. అతి జాగ్రత్తగా ఎవరూ చూడకుండా ఆ స్పూను జేబులో వేసుకున్నాడు. సర్వ్ చేస్తున్నట్లే ఉండి జైహింద్ బాబు రహస్యంగా తనను గమనించగలడని అతడు ఊహించలేదు.
    జైహింద్ బాబుని కేవలం అనుమానంతో ఇష్టం వచ్చినట్టు తిట్టగలిగిన కేంటీన్ మేనేజరు ప్రత్యక్ష సాక్ష్యంతో ఎదురుగా కనిపిస్తోన్నఆఫీసర్ ని ఏమీ అనలేకపోయాడు.
    కొయ్యబారి నిలబడిన ఆఫీసర్ జేబులోంచి స్పూన్ తనే బయటికి తీసి విజయగర్వంతో మేనేజర్ కి చూపించాడు జైహింద్ బాబు.
    కానీ, మేనేజర్ ముఖంలో దొంగ దొరికిన సంతోషమేమీ కనిపించలేదు. ఎదురు తెల్లగా పాలిపోయింది.
    ఆఫీసర్ గారు జైహింద్ బాబు చెయ్యి విదిలించుకుని దర్పంగా, ఠీవిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
    అంత కష్టపడి ఎంతో నేర్పుతో దొంగని పట్టుకున్నందుకు అతన్ని ఎవరూ అభినందించలేదు. ఏదో ఉపద్రవం జరిగినట్లు, జరగకూడని దారుణమేదో జరిగిపోయినట్లూ అందరూ బ ిత్తరపోయి నిలబడ్డారు.
    అతన్ని హీరోని చూసినట్లు చూడటానికి బదులుగా, ఉరిశిక్ష విధించబడ్డ హంతకుణ్ని చూపినట్లు కోపంగానూ, జాలిగానూ కూడా చూశారు.
    ఆ సాయంత్రమే దయానంద్ గారి నౌకరు వచ్చి "అయ్యగారు నిన్ను రమ్మంటున్నారు" అని చెప్పాడు జైహింద్ బాబుతో.
    అతను వెంటనే. దయాకర్ గారి యింటికి వెళ్ళాడు.
    "రా! కూర్చో!" అని ఒక స్టూల్ చూపించాడు దయానంద్.
    దయానంద్ మంచివాడేకాని అతని ప్రవర్తనలో వ్యాసమూర్తి ప్రదర్శించేటంత విశాల హృదయం కనిపించదు. జైహింద్ బాబుని అంతకు ముందెన్నడూ అతడు కూర్చోమని మర్యాద చెయ్యలేదు.
    ఎంత దయగా చూసినా 'నువ్వొక నౌకరువి సుమా!' అన్నట్లుగానే చూసేవాడు.
    తబ్బిబ్బు పడుతూ కూచున్నాడతను.
    తన జేబులోంచి అయిదువందల రూపాయలు లెక్కపెట్టి అతని చేతిలో పెట్టాడు దయానంద్.
    అతను తెల్లబోయి "ఎందుకు సార్?" అన్నాడు.
    "ఇదివరకు నీ జీతంలోంచి విరక్కొట్టినదానికి మూడురెట్లు నష్టపరిహారం......"
    అతను సంబరంగా "ఎందుకు సార్! దొంగని పట్టుకున్నందుకు బహుమానంగా ఇస్తున్నారా?" అన్నాడు.
    అతన్ని వెర్రివాడిని చూస్తున్నట్లు నిరసనగా, జాలిగా చూశాడు దయానంద్.
    "కాదు. నా సొంత డబ్బులోంచి ఇస్తున్నాను."
    "ఎందుకు సార్! ఇదివరకు నా జీతంలోంచి విరక్కొట్టినందుకా? ఫరవాలేదు. మీరు నామీద చూపిస్తోన్న దయచాలు!"
    ఆ డబ్బు తిరిగి ఇచ్చెయ్యబోయాడతను.
    దయానంద్ తీసుకోకుండా "నేను నీమీద చూపించ గలిగిన దయఇంతవరకే! ఆడబ్బు తీసుకో! మా కేంటీన్ లో వేరే సర్వర్ ని కుదుర్చుకున్నాం! రేపటినుంచీ నువ్వు పనిలోకి రానక్కర్లేదు" అన్నాడు గంభీరంగా.....
    ఉన్నపాటున నెత్తిమీద పిడుగుపడినట్లయిందతనికి. మూర్ఖుడిలా చూస్తూ కూచున్నాడు, చైతన్యం లేకుండా.
    "ఇంక వెళ్ళవచ్చు" అన్నట్లు లేచి నిలబడ్డాడు దయానంద్.
    అతని ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా దయానంద్ చూపులే, అతణ్ని కూచున్న చోటనుండి లేవగొట్టి బయటికి పంపివేశాయి.     

 Previous Page Next Page