15
తిండిపోతుతనం కూడా వెర్రిబాగులతనంలో ఒక భాగం కాబోలు! సహజమానవ ప్రవృత్తి వికసించక కేవలం పాశవిక ప్రేరణలే ప్రధానంగా జీవించే వ్యక్తులు కావటం వల్ల తిండి యావ ఎక్కువగా ఉంటుందేమో!
ఏది ఏమయినా నాదముని బకాసురుడి లాగానే తినగలడు.... దేవుడి ప్రసాదాలకు వేళా-పాళా లేకుండా అలవాడు పడ్డ వ్యక్తి, సరళ వేళకింత ఆహారం పెడుతుంటే తిని తృప్తిపడలేకపోతున్నాడు! ఎప్పుడూ నాదముని తినటానికేమైనా ఉందేమోనని ఇంట్లో వెతుక్కుంటూ ఉంటే సరళకు చికాగ్గానూ ఉండేది! జాలిగానూ ఉండేది! తన కొద్దిపాటి సంపాదనలో నాదముని ఈ తిండి యావను ఎలా భరించాలో అర్థం కావటం లేదు సరళకి.
సారధి తన మొదటి నెల జీతం తీసుకొచ్చి అక్కచేతిలో పెట్టాబోయాడు. సరళ దానిని అందుకున్నట్లే అందుకుని, మళ్ళీ సారధి చేతికే ఇచ్చి "బేంక్ లో వేసుకోరా!" అంది.
"అదేమిటక్కా! ఉండనీ! నీ దయవల్ల ఇంతవాణ్ని అయ్యాను! నా సంపాదన నీకు కాకపోతే, మరెవరికి?"
"పిచ్చి తమ్ముడూ! నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తే, ఆ సంపాదన తినాలని చదివించానురా నిన్ను? నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి. ఇల్లూ, వాకిలీ ఏర్పాటు చేసుకోవాలి! మంచి సంబంధం చూసుకుని పెళ్ళి చేసుకోవాలి! నువ్వయినా నీ భార్యతో హాయిగా, సుఖంగా కాలం గడపాలి!"
ఈ చివరి మాటలను భరించలేక ముఖం తిప్పుకున్నాడు సారధి!
నాదముని వచ్చాక తనకు డబ్బుకెంత కటకటగా ఉన్నా, తమ్ముడి డబ్బు వాడుకోలేకపోతోంది సరళ! ఎప్పటిలాగే తన కష్టసుఖాలు జైహింద్ బాబుతోనే చెప్పుకుంది.
"జయన్నా! లోకంలో మొగవాడు భార్యబిడ్డల్ని పోషించలేక అవస్థపడతాడు! నేను నా భర్తనీ, కొడుకునీ పోషించలేక ఛస్తున్నాను!"
"అదేంటి సరళమ్మా! మీ భర్త మీ దగ్గిరికి వచ్చాక ఆయన వంతు ఆస్తి మీకే వస్తుందిగా?"
"ఆయన ఆస్తి..... ఎవరిస్తారు మనకి? మనకెలా వస్తుంది అది?"
"ఎలా వస్తుందేంటమ్మా! దావా వేస్తే వస్తుంది.
"ఈ కోర్టులూ, దావాలూ, ఇవన్నీ ఎవరు పడగలరు జయన్నా."
"మేమంతా లేమా?..... వ్యాసమూర్తిగారిని కనుక్కుంటానుండండి....."
ఆరోజే జైహింద్ బాబు వ్యాసమూర్తికి సంగతులన్నీ వివరించాడు. నాదముని ఆస్తి సరళకీ, కిరణ్ కి దక్కే ఉపాయం ఉంటే చూడమని బ్రతిమాలాడు.
"తమ్ముడు వెర్రిబాగులవాడు కనుక ఆస్తిని తనే సంరక్షిస్తానని అనవచ్చు అన్న. అదీగాక నాదముని దావా వెయ్యగలిగేపాటి మానసిక స్థితిలో కూడా లేడంటున్నావు కదా! కొడుకు ఉన్నాడు గనుక మైనర్ హక్కులకోసం దావా వెయ్యచ్చును" అన్నాడు వ్యాసమూర్తి.
జైహింద్ బాబు ప్రోత్సాహంతో, వ్యాసమూర్తి అండదండలతో సరళ తన బావగారితో దావాకి దిగింది.
బోనులో నిలబడవలసి వచ్చినందుకు సరళ లోలోపల లాయర్ అడ్డదిడ్డపు ప్రశ్నలు అడుగుతుంటే, ప్రాణం పోయినట్లే అనిపించింది. కానీ, నిర్భయంగా నిలబడి తనకు జరిగిన అన్యాయాన్ని నిండుకోర్టులో నలుగురి ముందూ చెప్పేసింది.
నాదముని సాక్ష్యం విషయంలోనే అందరూ భయపడ్డారు.
"చెట్లకూ, చేమలకూ సంతానం కలుగుతొంటే, నాకెందుకు కలగదూ?" అనమని నేర్పించాడు వ్యాసమూర్తి. ఆమాట తప్ప మరేదీ మాట్లాడవద్దని చెప్పాడు.
సారధి, జైహింద్ బాబు ఇద్దరూ వీలైనప్పుడల్లా ఆ పాఠాన్ని నాదమునికి నూరిపోశారు. వెర్రిబాగులవాళ్ళు కొన్ని వింతగా ఉన్నవి బాగా పట్టుకుంటారు. ఈ మాటలు తమాషాగా ఉండి నాదమునికి బాగా వంటబట్టాయి.
కోర్టులో తన పాఠం చక్కగా అప్పజెప్పాడు. కోర్టంతా ఘొల్లుమని నవ్వింది. అక్కడితో గొప్పగా తోచి అందరినీ గొప్పగా చూస్తూ "చెట్లకూ, చేమలకూ సంతానం కలుగుతున్నప్పుడు, నాకెందుకు కలగదూ?" అన్నాడు నొక్కి నొక్కి
కేసు గెలవటం కోసమే అయినా ఈ మాటలు విని భరించలేకపోయింది సరళ.
ఎంత రాయిగా మార్చుకున్నా ఆ అభాగ్యురాలి గుండె ముక్కలయింది. ఇంటికొచ్చి కిరణ్ ని దగ్గిరగా తీసుకుని -
"బాబూ! నువ్వు చెట్లకీ, చేమలకీ సంతానం కలిగినట్లు కలిగినవాడివి కావు. నా నోముల పంటవి..... నేను తపస్సు చేసిచేసి ఆ ఆత్మశక్తితో పొందాను నిన్ను...... అలాగే పెంచుకుంటాను" అంది.
కిరణ్ కేమీ అర్ధంకాక తన చిట్టి చేతులతో తల్లి కన్నీళ్ళు తుడిచి తల్లి ముఖంలోకి చూసి నవ్వాడు.
వ్యాసమూర్తి చాకచక్యంవల్ల సరళ గెలిచింది...... అందరూ ఎంతో సంతోషించారు.
"జయన్నా!..... సంధ్యవేళ దీపం పెట్టుకునినేనిక ముందు దేవుణ్ని తలుచుకోనయ్యా! నిన్నే తలుచుకుంటాను" అంది సరళ.
"అదేం మాటమ్మా! వ్యాసమూర్తిగారి దయలేకపోతే, మనమేం చెయ్యగలం? మీరూ, నేనూ, ఇంకా మనలాంటి వాళ్ళం అందరమూ ఆ బాబుగారికి దణ్నం పెట్టుకోవాలి!"
అవునని ఒప్పుకుంది సరళ. కేంటీన్ లో వంటపని మానుకుని వెళ్ళిపోబోతున్నప్పుడు ఆనందం కలగటానికి మారుగా ఏడుపే వచ్చింది సరళకి! జైహింద్ బాబుకీ బాధగా తోచింది.
సర్వెంట్ క్వార్టర్స్ లో నుంచి ఒక మోస్తరు ఇంట్లోకి మారారు సరళ, సారధి, నాదముని, కిరణ్.
సరళ లేకపోవడం చాలా వెలితిగా తోచింది జైహింద్ బాబుకి. అయితే అతడా వెలితిని ఎక్కువకాలం భరించవలసిన అవసరం లేకపోయింది.
కేంటిన్ లో మంచి చిన్న చిన్న స్పూన్స్, ఫోర్క్స్. మాయమవటం మొదలయింది. ఆ నేరం సర్వెంట్ గా పనిచేస్తున్న జైహింద్ బాబు పైనే మోపబడింది. అతడ్ని సంజాయిషీ అడిగారు. తనకేమీ తెలియదని అతడు చెప్పుకున్నా, నేరం అతడే చేశాడని రుజువు చెయ్యలేకపోయినా వాటి ఖరీదు అతని జీతంలోంచే విరక్కొట్టుకున్నారు.
జీతం తగ్గినందుకు కంటే తన మీద మోపబడిన నిందకు అతడు చాలా బాధపడ్డాడు! ఇలా వరసగా రెండు మూడు నెలలు జరిగింది.