Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 31


    తను రాగలగినప్పుడు పిల్లలు అందుబాటులో లేకుండా వెళ్ళారు. దాగుడమూతల జీవితానికి ఇదే ఉదాహరణ అనిపిస్తోంది.

 

    కడుపులో ఆకలి కరకరలాడుతోంది. టైమ్ చూశాడు. ఇంకా ఏడు కూడా కాలేదు. 'అదేమిటో ఇంట వాసన తగలగానే ఆకలేస్తుంది' నవ్వుతూ అనుకున్నాడు.

 

    హాస్పిటల్ పనిలో మునిగిపోతే అసలు ఆకలి తిండీ ధ్యాసే ఉండదు. ఫ్రిజ్ లో చూశాడు. పెరుగు, పాలు తప్ప మరేం లేవు. వంట గదిలోకెళ్ళి డబ్బాలు వెతికితే బిస్కెట్స్ కనిపించాయి. అవి తింటూ కొద్దిగా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టుకున్నాడు. భోజనం కోసం బయటకెక్కడికీ వెళ్ళాలనిపించలేదు.

 

    ఇంట్లోని నిశ్శబ్దం ఏమిటోగా ఉంది. చాలాకాలానికి దొరికిన ఏకాంతమే అయినా, అనుకోకుండా దొరికినందుకేమో బోర్ గా ఉంది.

 

    టి.వి. పెట్టాడు. ఈ టైమ్ లో ఏం ప్రోగ్రాం వస్తుందో కూడా తెలీదు. ఎనిమిది గంటలకు ముందు అతనెప్పుడు ఇంటి మొహం చూడలేదు.

 

    ఏదో తెలుగు సీరియల్ వస్తోంది. ఒక మరుగుజ్జువాడు కుప్పిగంతులు వేస్తున్నాడు. వెర్రి డైలాగులు వదులుతున్నాడు. అదంతా హాస్యమని చూసేవాళ్ళు అనుకోవాలని కాసేపట్లోనే అర్ధమై జుగుప్స కలిగింది. ఆపేద్దామని లేవబోతుండగా సీరియల్ మధ్యలో ఆగిపోయి 'ఒక ముఖ్య ప్రకటన' అంటూ ఓ బులెటిన్ ప్రాసారమైంది.

 

    "సిద్ధార్ధ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ వారి విజ్ఞప్తి! ఎ.బి. నెగెటివ్ గ్రూపు రక్తం దొరకనందున హాస్పిటల్లో రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మనిషికి మనిషి తోడు! రక్తానికి రక్తం తోడు! ఎ.బి. నెగెటివ్ గ్రూపు రక్తం కలవారిలో ప్రాణదాతల కోసం ఎదురు చూస్తున్నాము. మీ రవాణా, వసతి ఖర్చులు హాస్పిటల్ భరిస్తుంది! త్వరపడండి! పోతున్న ప్రాణాలని నిలబెట్టండి! మృత్యువును సవాలుచేస్తున్న మా ప్రయత్నంలో మీ సహాయం అందించండి!"

 

    బులెటిన్ ఆగిపోయింది. పరమేశ్వరం ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు శరత్ చంద్ర. బులెటిన్ ఇచ్చిన విధానం బావుంది. మనిషిని స్పందింపజేసేదిగా ఉంది. అతని మీద మొన్నటి కోపం లేదిప్పుడు. గౌరవం కలిగింది! విషయాన్ని తేలిగ్గా అవతల పడేయకుండా సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నాడతడు.

 

    వంటగదిలో కుక్కర్ విజిల్ వేస్తోంది.

 

    స్టవ్ ఆఫ్ చేసి టవల్ తీసుకొని బాత్ రూమ్ లో కెళ్ళాడు.

 

    స్నానం చేస్తూంటే అనుకోకుండా అతని నోట్లో పాట కదిలింది. మళ్లీ అదే పాట. సాయంత్రం విన్నపాట.

 

    "ఓ బసంతీ పవన్ పాగల్.... నజారే నజారుక్ కోయీ -

 

    యాద్ కర్ తూనే కహాథా - ప్యార్ సే సంసార్ హై-"

 

    వసంత కాలపు పిచ్చిగాలీ వెళ్ళకే, వెళ్ళకే!

 

    ఆపరే ఎవరైనా ఆపరే! 'ప్రేమతోనే ఈ ప్రపంచమంతా' అని నువ్వన్నమాట గుర్తుచేసికో పిచ్చిగాలీ!

 

    అప్పుడే తను ఎం.ఎస్. జనరల్ సర్జరీలో చేరి వున్నాడు. పెదవులపై పాటతోపాటు మనసులో జ్ఞాపకమూ మెదిలింది! మొట్టమొదటి ఆమె పరిచయం.... పాట వల్లే జరిగింది. ఆ రోజు కాలేజీ యూనివర్శిటీ ఫంక్షను స్టేజీకి ఒక ప్రక్కనున్న కుర్చీలలో మెడికల్ కాలేజీ అమ్మాయిలతోపాటు, ఇతర కాలేజీల అమ్మాయిలు కూడా కూర్చుని ఉన్నారు. లైట్లు వెలిగాయి. తెరపైకి లేచింది. నేలమీద చిందరవందరగా తిరుగుతున్న చీమలన్నీ వేగంగా తమ పుట్టలోకి దూరిపోయి, ఒక్కసారిగా నేల ఖాళీ అయిపోయినట్లు, కలగా పులగంగా ఉన్న మాటల శబ్దాలన్నీ ఆగిపోయి గాలి ప్రశాంత పడింది. ప్రశాంత పడిన ఆ గాలి తరంగాల్లో తన పేరుతో కూడిన ఎనౌన్స్ మెంట్ వినిపించింది!

 

    తన పాటతో ప్రోగ్రాం స్టార్టయింది. అమ్మాయిల కోసం వేసిన కుర్చీల్లో చీకట్లో కూడా ప్రత్యేకంగా మెరుస్తూ ముందువరుసలో కూర్చుని ఉన్న అమ్మాయి వయిపు చాలామంది అబ్బాయిల చూపులు పదేపదే తిరగడం గమనించాడు శరత్ చంద్ర. అతను పాడిన ప్రతీ పాట చప్పట్లు మారుమోగుతున్నాయి.

 

    ప్రోగ్రాం మధ్యమధ్యలో పాటలు పాడుతూనే తనూ కుతూహలంగా ఆమె వయిపు చూశాడు. తన పాటలు తన్మయత్వంతో వింటోంది. చప్పట్లు కొడుతోంది.

 

    తెల్లని తెలుపు, కోల మొహంతో ఒద్దికగా అమరిన పెద్ద పెద్ద కాటుకకళ్ళు.... ముంగురులను నుదిటి మీద జారాడిస్తున్న నొక్కుల జుత్తూ- పొందికగా వున్న ముక్కు, నోరూ - లేత గులాబీలా చూసిన కొద్దీ చూడాలనిపించి, హృదయానికెంతో హాయిని కలిగిస్తోంది ఆమె అందం!

 

    తను పాట ముగించినప్పుడల్లా మనసార చప్పట్లు కొట్టడము గమనించాడు. ఫంక్షన్ ముగిసింది. జనమంతా వెళ్ళిపోతున్నారు. తనూ మిత్రులతో కలిసి బయలుదేరాడు.

 

    బారికేడ్స్ మధ్యనున్న దారిలో కొంతమంది అమ్మాయిలు నిలబడివున్నారు. వాళ్ళనిచూసి ఎవరికోసమో ఎదురు చూస్తున్నారనుకున్నాడు.

 

    వాళ్ళని దాటుకొని వెళ్ళిపోతుంటే ఓ అమ్మాయి కాస్త ముందుకొచ్చి నిలబడి "డాక్టర్ శరత్ చంద్రగారూ!" అని పిలిచింది.

 

    ఆగి తిరిగి చూశాడు. ఆ అమ్మాయే! తటపటాయించాడు. "మిమ్మల్నే డాక్టర్....!" అంది అక్కడే ఉండి. ఒక్కడే దగ్గరగా వెళ్ళాడు.

 

    "కంగ్రాచ్యులేషన్స్. మీ పాటలు చాలా బావున్నాయి. మీ కంఠస్వరం అద్భుతంగా ఉంది." ఆ మాట చెప్పేందుకు ఎంత సేపట్నుండో ఎదురుచూస్తున్నట్లు గబగబా చెప్పేసింది.

 

    ఆమె వెనక మిగతా అమ్మాయిలందరూ వచ్చి అదేమాట చెప్పారు అభినందనలందుకోవడం అతనికి కొత్తకాదుగానీ ఆమె మెచ్చుకోలులో ఏదో ప్రత్యేకత అనుభూతమయ్యింది.

 

    "థాంక్యూ వెరీమచ్! మీరంతా.... ఏం చేస్తున్నారు?" అన్నాడు అందర్నీ చూస్తూ, ఆమెని ఒక్కదాన్నీ అడగటం బావుండదని.

 

    "ఎమ్. ఏ చేస్తున్నాం. యూనివర్శిటీ హాస్టల్లో వుంటాం" చెప్పారు వాళ్ళు.

 

    మరింకేం మాట్లాడాలో అతనికి అర్ధం కాలేదు. పేరడిగితే ఏమనుకుంటారో అని సెలవు తీసుకొని వెనుదిరిగాడు.

 

    "మరీ ఇంత మొహమాటమేమిట్రా? అమ్మాయిలు పిలిచి అభినందిస్తే.... ఎడ్రస్ అడక్కుండా....ఛ....ఛ!" విసుక్కున్నారు మిత్రులు. ఆ ఛాన్సు తమకు రానందుకు దిగులుపడ్డారు.

 

    ఎవరు ఎలా అనుకున్నా ఆ రోజు నుండి ఆమె రూపం అతనికి చాలాసార్లు గుర్తొచ్చింది.

 

    "అందమంటే అలా వుండాలి!" అనుకున్నాడు ఎన్నో సార్లు. చూడగానే పిచ్చెక్కించే అందం కాదామెది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ కొత్త కొత్త అందాలను స్ఫురింపజేస్తూ మనసుకి హాయినిచ్చే అరుదయిన అందం అది!

 

    ఆ రోజలా విడిపోయాక మళ్ళీ కనిపించలేదా అమ్మాయి.


                                *    *    *    *

 Previous Page Next Page