"ఆహా.... వీర శివాజీగారు వచ్చేశారండీ!" మళ్ళీ కవ్వించింది రాజ్యం.
"నిన్నూ!" మీద కెళ్లాడు.
"అసలు మీరు ఆ పేరే పెట్టుడాల్సింది సార్" పకపక నవ్వుతూ అంది.
సుదీర్ఘమైన.... మూడురోజుల తర్వాత ఆ నలుగురూ మనసారా నవ్వుకున్నారు.
"థాంక్యూ వెరీమచ్ శరత్ చంద్రా! క్రైసిస్ టైమ్ లో నిలబడి హాస్పిటల్ పరువు నిలబెట్టారు" అంటూ పరమేశ్వరం స్వయంగా వచ్చి శరత్ చంద్రని అభినందించి వెళ్ళాడు.
"కిరణ్! ఇవాళ మీరు డ్యూటీ చేయండి. చలపతిరావుని ఇప్పుడే వార్డులోకి షిప్టు చేయించండి. వెయిటింగ్ లిస్ట్ చూసి ముఖ్యమైన ముందు చేయాల్సిన కేసులు రేపటికి పోస్టు చేయండి" ఎంతో హుషారుగా బాధ్యతలు అప్పగిస్తున్నాడు శరత్ చంద్ర.
ఇక్కడ వీళ్ళంతా ఇంత ఆనందంతో వున్నా ఆ ఆనందాన్ని పంచుకోలేని డాక్టర్ భగవంతం ఇబ్బందిగా కుర్చీలో కదిలాడు.
చలపతిరావు ఎయిడ్స్ తో చనిపోతాడనీ, మంచి పేరు తెచ్చుకొంటున్న డాక్టర్ శరత్ చంద్ర మీద ఈ కేసు ద్వారా కొంత దెబ్బ తీయవచ్చనీ అనుకున్నాడు. చలపతిరావు ఎయిడ్స్ లేకుండా బ్రతికి అతనికి ఆశాభంగం కలిగించాడు.
* * * *
డాక్టర్ కిరణ్ కి అన్నీ అప్పగించి, సెలవు తీసుకున్నారు శరత్ చంద్ర, రవళి. రవళి స్కూటర్ మీద వస్తుంటుంది ఇద్దరూ వెహికల్ పార్కింగ్ వేపు వెళ్ళేందుకు వార్డులని ఆనుకొని ఉన్న పొడవాటి కారిడార్ లోంచి నడుస్తున్నారు.
శరత్ చంద్ర చాలా హుషారుగా ఉన్నాడు. అతని స్పీడుని అందుకోడానికి రవళి ఆయాస పడవలసి వస్తోంది.
ఇంట్లో తన వాళ్ళెవరూ లేరన్న విషయం కూడా అప్పుడు అంతగా బాధించడం లేదతన్ని.
అలా నడుసున్న వాడల్లా సడన్ గా నడక వేగం తగ్గించి వార్డు గుమ్మం ఎదురుగా నిలబడిపోయాడు.
రవళికి ఏం అర్ధం కాలేదు. తనూ ఆగి అడిగింది. - "ఏమయింది సార్?"
ఎదురుగా ఉన్న వార్డు లోపలికి కళ్ళతో చూపిస్తూ తన్మయంగా "పాట....!" అన్నాడు.
పూర్తిగా చీకటి పడని సంధ్య వెలుగు అతని మొహానికి వింత కాంతినిస్తోంది.
వార్డులో రోగులెవరో పెట్టిన రేడియోలోంచి గాలిలో తేలుతూ తెరలు తెరలుగా వస్తూంది పాట.
"ఓ బసంతీ పవన్ పాగల్...."
పిట్టగోడకు చేరగిలబడి తన్మయత్వం చెందుతున్నాడు శరత్ చంద్ర.
రవళికి కొత్తగా కనిపిస్తున్నాడతను. పాట పూర్తయ్యే వరకూ ఆమె అతన్ని డిస్టర్బ్ చెయ్యలేదు.
పాట పూర్తయిన రెండు నిముషాలకు తన్మయత్వం నుండీ తేరుకుని-
"సార్! పాటలంటే మీ కంత ఇష్టమా!" అతనితో అడుగులు కలుపుతూ అడిగింది.
"ఊ....!"
"పాడతారు కూడానా?"
హాస్పిటల్ బయటిమెట్లు దిగుతూ అప్పుడే విన్న పాటని విజిల్ తో చక్కగా పాడి వినిపించాడు.
చెట్ల కొమ్మలు చిన్నగా వూగాయి. ఓ అనుభూతి తెమ్మెర ఆమెని తాకుతూ వెళ్ళింది.
"మార్వలెస్!" ఆనందంగా అంది రవళి చిన్నగా చప్పట్లు చరుస్తూ.
అతను నవ్వాడు.
"మీరు సంగీతం నేర్చుకున్నారా సార్?"
"లేదు, పాటలంటే పిచ్చి. అన్నీ మర్చిపోయేవాడిని. పాటలు నేర్చుకోవడం, పాడటం అదో లోకంగా వుండేవాడిని. కాలేజీ ఫంక్షన్సులో నా పాటలకు ఒక ప్రత్యేకత ఉండేది" గర్వంగా అన్నాడు శరత్ చంద్ర.
కళాకారులు వయసులో ఎంతపెద్దవాళ్ళయినా, తమ కళని ఎవరయినా గుర్తించినా, మెచ్చుకున్నా చిన్నపిల్లల్లా మురిసిపోతారు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు శరత్ చంద్ర.
"మీలో ఇంత ఆర్ట్ వుందని మాకు తెలీనేలేదు. ఒక్కసారయినా మీ పాట మాకు వినిపించలేదేంసార్" నిష్టూరంగా అంది.
"పాట వినిపించడమా? తీరికెక్కడిది? నేను హాయిగా పాడుకొని నాలుగేళ్ళయింది.
"నా..... నాలుగేళ్ళా....?"
"అవును! కళాకారిడిలో కళ బ్రతకాలంటే రొటీన్ నుండీ బయటపడి తన కోసమంటూ.... కేవలం తనకోసమే కొంత తీరిక కావాలి! కార్డియో థొరాసిక్ సర్జరీని నా సబ్జక్టుగా ఎన్నుకున్ననాడే నా తీరికనీ, నా గానాన్ని కోల్పోయాను. మీరిప్పుడు అడిగారు కాబట్టి పాడేశాను గానీ, నేనసలు పాటలు పాడగలనన్న విషయాన్ని కూడా మర్చిపోయాను" దిగులుగా అన్నాడు.
"జీవితంలో గొప్ప ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు సార్!" అంది.
"అవును. చాలా ఆనందాలనే పోగొట్టుకుంటున్నాను" అనుకున్నాడు.
"రోజుకి 14 గంటలు పనిచేసినా ఇంకా చేయాల్సిన పని మిగిలిపోయే శరత్ చంద్రకి కళని బ్రతికించడం కాదు గదా, గుర్తుంచుకునే తీరిక మాత్రం ఎక్కడిది' అనుకుంది జాలిగా. ఇద్దరూ సెలవు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు బయల్దేరారు.
అతను వేగంగా కారు నడుపుతున్నాడు. చల్లని గాలి హాయిగా వుంది. మనసు హుషారుగా ఉంది! పేషెంట్ బ్రతకడం అతని కెంతో హుషారునిస్తుంది. దానికి తోడు ఇవాళ పాట తోడయింది. కారు నడుపుకొంటూ గుర్తొచ్చిన పాటలన్నీ పెద్దగా పాడుకొంటూ యిల్లు చేరాడు.
హుషారుగా కారు దిగి మెట్లెక్కి తను ఫ్లాట్ వైపు చూశాడు. మూసిన తలుపులు మూగబోయిన బ్రతుకుల్లా కనిపించాయి.
"అంకుల్. ఈ తాళం మీకివ్వమని ఆంటీ ఇచ్చి వెళ్ళారు. ప్రక్కింటి పాప వచ్చి తాళం చెవి అందించింది.
"థాంక్సమ్మా!" అంటూ తాళం తీసి లోపలి కొచ్చి ఫ్యాన్ వేశాడు.
టీపాయ్ మీద తెల్లని కాగితం ఫ్యానుగాలికి రెపరెప లాడుతూ ఆకర్షించింది. గాలికి ఎగిరిపోకుండా పేపరు మీద వుంచిన యాష్ ట్రేని తీసి ప్రక్కన పెట్టి పేపరు అందుకొని సోఫాలో కూర్చున్నాడు.
నీలిమ వెళ్ళిపోయే ముందు వ్రాసి వుంచిన ఉత్తరం అది.
"అమ్మా వాళ్ళ వూరు వెళుతున్నాం. నాన్నగారు రమ్మన్నారు - నీలిమ"
అంతే ఉంది. సంబోధన కూడా లేదు. రెండు వాక్యాల ఉత్తరం నీలిమ కోప తీవ్రతను తెలియజేస్తోంది.
పదినిముషాలు అలాగే కూర్చుండిపోయాడు. ఇల్లంతా బోసిగా ఉంది. పిల్లలు తనకోసం ఎంతో ఎదురుచూసినప్పుడు తను రాలేకపోయాడు.