Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 31
నవ కవిత
సిందూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నయన జ్వాలిక,
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి.
ఘాటెక్కిన గంధక ధూమం,
పోటెత్తిన సప్త సముద్రాల్,
రగులుకొనే రాక్షసి బొగ్గూ,
బుగులుకొనే బుక్కాగుండా,
వికసించిన విద్యుత్తేజం.
చెలరేగిన జనసమ్మర్దం
కావాలోయ్ నవకవనానికి.
రాబందుల రెక్కల చప్పుడు,
పొగగొట్టపు భూంకార ధ్వని,
అరణ్యమున హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గమృగోదగ్ర విరావం,
ఝుంఝానిల షడ్జధ్వానం
కావాలోయ్ నవకవనానికి.
కదిలేదీ, కదిలించేదీ,
మారేదీ, మార్పించేదీ,
పాడేదీ, పాడించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పెనునిద్దుర వదలించేదీ,
పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ,
కావాలోయ్ నవకవనానికి.
3-8-1937
* * *
Previous Page
Next Page