తను కలలుకన్న పురుషుడు ఎదురుగావున్నా అందుకోలేని అగాథం వుంది ఇద్దరిమధ్య. ఈ మురారి కొద్ది నెలలముందు కన్పించివుంటే ఎంత బాగుండేది?
ఈ సుబ్బారావు పాలపడకుండా వుండేది తాను. హాయిగా మురారిని పెళ్ళాడేది. తను- తను కోరుకున్న పురుషుడికి తనని అర్పించుకొని ఎంత ఆనందంగా జీవించేది?
ప్చ్! జ్యోతి ఆలోచనలు అర్థం పర్థంలేకుండా సగిపోతున్నాయి, పెళ్ళికిముందు మురారి కన్పించినా అంతస్థులు భేదం అడ్డం కాగలదని, తను మురారికి నచ్చేదో లేదో అనేది లోతుగా ఆలోచించే వివేకం లేక పోయింది.
ఈ సుబ్బారావు ముందు తటస్థపడటం వల్ల మురారిని పోగొట్టుకున్నానన్న భావం జ్యోతిలో పాతుకుపోయింది. ఇప్పుడేం చెయ్యడం? దిగులుగా ఆలోచిస్తూంది జ్యోతి.
అసలు మురారి ఉద్దేశ్యం ఏమిటో? మురారికి తనంటే యిష్టమే. కాకపోతే ఇన్నిసార్లు ఎందుకు వస్తాడు?
ఎంత చిన్నప్పటి స్నేహితుడయితే మాత్రం అంత గొప్ప ఉద్యోగంలో వుండి ఇంత పిసరు గర్వం అన్నా లేకుండా కేవలం స్నేహితుడి కోసం ఇంతగా ఏ మగాడూ రాడు!
ఆడదాని ఆకర్షణ ఒక్కటే వాళ్ళనిలా రప్పిస్తుంది. మురారి ఎప్పుడూ తనతోటే ఎక్కువ మాట్లాడతాడు. నవ్విస్తాడు, జోక్స్ వేస్తాడు, కొంటెగా కవ్విస్తాడు. తనకి సినిమాపిచ్చి అని తెల్సినదగ్గరనించీ తన కోసం ఎన్నిసార్లు సినిమా ప్రోగ్రాంలు పెట్టాడు?
సుబ్బారావు రానంటున్నా బలవంతాన రప్పించి "పదరా, పాపం ఆమెకి సినిమాలు ఇష్టం" అని తీసికెళ్ళేవాడు. తనకోసమే పిక్నిక్ ప్రోగ్రాంలు వేసేవాడు. హోటల్స్ కి తిప్పాడు.
"మీరు పరిచయం అయ్యాక ఆదివారాలు టూర్లులేకుండా ఇక్కడ ఉండేట్లు ప్రోగ్రాం వేసుకుంటున్నాను...." అన్నాడు. అంటే.... అర్థం ఏమిటి?
తన కంపెనీ అంత నచ్చిందన్నమాటేగా! ఓసారి అతనింటికి తీసుకెళ్ళాడు. ఎంత చక్కటి ఇల్లు? ఎంత మంచి ఫర్నిచర్ వుంది? రికార్డు ప్లేయర్, టేప్ రికార్డు, మంచి సోఫాసెట్టు ఇంట్లో అన్నీవున్నా అస్త వ్యస్తంగా పడివున్నాయి.
ఎక్కడపడితే అక్కడ పుస్తకాలు - ఫర్నిచర్ అంతా దుమ్ముకొట్టుకొనివుంది.
మురారి సిగ్గుపడుతున్నట్లు నవ్వి "బాచిలర్ గాడి కొంప చూశారా ఎలా వుందో? ఎంతయినా ఆడవాళ్ళున్న తీరుండదు" అన్నాడు.
"అందుకే గదరా పెళ్ళిచేసుకోమంటున్నాను" అన్నాడు సుబ్బారావు.
"బాగుందిరా. నీకంటే లక్కీగా నచ్చిన ఆమె దొరికింది. నాకు ఇంకా దొరకాలిగా" అన్నాడు నవ్వి.
అంటే అర్థం? సుబ్బారావు లక్కీగానుక తను దొరికిందనేగా అర్థం?
జ్యోతి ఎటుచూసినా, ఎలా ఆలోచించినా మురారి మాటలు, చేతలు అన్నీ కలిపి గుణించేసరికి అతనికి తనమీద ఇంట్రెస్ట్ వల్లనే తమ ఇంటికి అన్నిసార్లు వస్తున్నాడని, తనతో అంత చనువుగా వున్నాడని అర్థం అయిపోయింది.
"ఏమిటి? మీరు సినిమా చూడడంలేదా?" ఏదో నవ్వుసీను వచ్చేసరికి అంతా నవ్వారు గొల్లున. జ్యోతి అయోమయంగా చూడడం చూసి మురారి అడిగాడు.
"ఆ.... ఆ.... చూస్తున్నా, కాస్త పరధ్యానంగా వున్నాను...." తడబడింది.
మురారి కాలు పొజిషన్ మార్చుకోవడంలో జ్యోతికి కాలు వత్తుకుంది. అది కావాలనే చేసినట్లు సిగ్గుపడుతూ అలవోకగా అతనివంక చూసింది.
మురారి - ఆ పేరే అందంగా వుంది. అబ్బ! ఏం పర్సనాలిటీ! ఆ నవ్వేకళ్ళు, కొంటెగా వెక్కిరించే పెదాలు, ఆ బలమైన చేతులు, విశాలమైన వక్షం, పరిపూర్ణ పురుషుడు.
అతని చేతులలో ఒడిగిపోని బతుకు ఏం బతుకు? ఆ విశాలమైన గుండెలలో ఒదిగిపోయి, కరిగిపోని స్త్రీ ఎవరుంటారు? ఆ అదృష్టవంతురాలు ఎవరో?..... తనెందుకు కాకూడదూ!
తన ఆలోచనకి తానే ఉలిక్కిపడింది జ్యోతి.
హు! తనెలా అవ్వగలదు? ఈ దేశంలో ఆడదానికి ఒకసారి పెళ్ళయ్యాక చావయినా, బతుకైనా, కష్టమైనా, సుఖమైనా, ఇష్టమైనా, అయిష్టమైనా చచ్చినట్లు పడుండాల్సిందే!
ఇష్టంలేని పెళ్ళినుంచి విముక్తిపొందే అవకాశాలు లేవు. పరువులు ప్రతిష్టలు, కుటుంబాలు అన్నీ అడ్డే! ఈ జన్మకి తనకింక ముక్తిలేదు. ఇలాపడి ఏడవాల్సిందేనా? ఇంతేనా? తనకి నచ్చినవాడు కళ్ళెదుట కన్పించినా ఆశక్తురాలిలా పరిస్థితులకి తలవొగ్గి బతకాల్సిందేనా? ఈ సుబ్బారావు బారి నుంచి తప్పించుకునే దారేలేదా?
ఆలోచిస్తున్న కొద్దీ జ్యోతికి నిరాశ, దుఃఖం, ఆవేశం వస్తున్నాయి. వీల్లేదు. ఎవరికో భయపడి తను జీవితాంతం ఇలా అసంతృప్తిగా బతకదు! బతకలేదు!
తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పొప్పులు, పాపపుణ్యాలు అంతా ట్రాష్! జీవితం ఆనందించడానికి, అనుభవించటానికే!
ఎప్పటి సంగతో, మరో జన్మలో ఏం జరుగుతుందో అనవసరం ఇప్పుడు సుఖం, సంతోషం వెతుక్కోవాలి. ఆ సుఖసంతోషాలకోసం తాను అడ్డదారైనా తొక్కచ్చు!
ఈ నీటి నియమాలు, ఇవన్నీ ఈ మగాళ్ళు ఏర్పరిచిన నీతి సూత్రాలు. ఆడదాన్ని గుప్పెటలో పెట్టుకోడానికి కల్పించిన బంధాలు. మగాడికి లేని నీతి, నియమం ఆడదానికీ అక్కరలేదు!
ఆ ఒక్క గంటలోనూ జ్యోతిని చట్టుముట్టిన ఆలోచనలు ఇవి. ఆ ఆలోచనల మధ్య ఉక్కిరిబిక్కిరి అయి దారీతెన్ను తోచనిదానిలా గడబిడపడిపోయింది.