Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 30


    పరమేశ్వరం సమాధానం చెప్పకముందే- "న్యాయం దృష్టిలో అందరూ ఒక్కటే. కొడుకయినా సరే ఉరికంబం ఎక్కాల్సిందే- అని ఆయన ఉద్దేశ్యం కాబోలు" అన్న స్త్రీ కంఠం వినపడింది.

    పక్కనుంచి వినపడిన మాటలకి పరమేశ్వరం అదిరిపడి అటుచూశాడు. ఎప్పుడొచ్చిందో తెలీదు. ప్రవల్లిక అక్కడ వుంది! అతడి మొహంలో భావాలు మారాయి. ఆమె నవ్వింది.

    ఈ లోపులో పరమేశ్వరం సర్దుకున్నాడు. "అవును. కొడుకైనా సరే. చేసినదానికి శిక్ష అనుభవించాల్సిందే" అన్నాడు కటువుగా.

    "అందులోనూ ఇది కోల్డ్-బ్లడెడ్ మర్డరాయె. వెయ్యిమంది ప్రేక్షకుల ముందు నిర్ధాక్షిణ్యంగా చంపటం-" అంది ప్రవల్లిక.

    అప్పుడొచ్చింది అతడికి ఏదో అనుమానం! సందిగ్ధంగా ప్రవల్లిక విఅపు చూశాడు. ఆమె పెదవులమీద లీలగా కదుల్తున్నట్టుంది నవ్వు. అనుమానం స్థిరపడి, పద్మాకర్ వేపు తిరిగాడు. నేల మీద పడివున్న పద్మాకర్ అప్పుడే లేచి కూర్చుంటున్నాడు. అప్పటివరకూ సీరియస్ గా భయం నటిస్తూన్న విహారి కూడా నవ్వటం మొదలుపెట్టాడు. మిగతా నటులందరూ కూడా అప్పటివరకూ జరిగిన సీన్ ని తమ అవధుల మేరకు నటించినట్టు నవ్వుకుంటున్నారు.

    వర్ధనమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది. "ఏమిట్రా ఇదంతా?" అని కొడుకుని తిట్టింది.

    పద్మాకర్ కల్పించుకుని "స్టేజీమీదే కాదు. తెరపడ్డాక కూడా ఎంతసేపు నటించగలను అని ప్రవల్లికగారితో పందెం వేసానాంటీ" అంటూ నవ్వేడు.

    "ఏడిశావు. కొద్దిగా వుంటే నా గుండె ఆగిపోయి వుండేది" అంది వర్ధనమ్మ. ఈ లోపు ప్రవల్లిక కల్పించుకొని "చిన్న చిన్న విషయాలకే ఆగిపోయే గుండె, రాబోయే పెద్ద పెద్ద షాకులకు ఎలా తట్టుకోగలదా అని చిన్న ప్రయోగం చేసి వుంటారు. అంతేనా పరమేశ్వరంగారూ?" అంది.

    పరమేశ్వరం యిరుకున పడ్డట్టు ప్రవల్లికవేపు చూసి "నాకేమీ అర్ధంకావటం లేదు" అన్నాడు.

    "నిజంగా అర్ధంకావటం లేదా? 'నిజం'పిస్టల్ మార్పిడి ఎప్పుడు జరిగిందో?" రహస్యంగా, అతడికి మాత్రమే వినబడేట్టు అంది. అతడి మొహం ఎర్రరంగుకి మారింది. వర్ధనమ్మ ఇంకా కొడుకునీ, పద్మాకర్ నీ తిడుతూనే వుంది. అయితే ఆమెలో అపాయం తప్పిన ఆనందంవల్ల వచ్చిన కృత్రిమ కోపం మాత్రమే వుంది.

    ప్రవల్లిక మాటలకి, ఏం జరిగిందో అర్ధమయినట్లు -"ఇదంతా చేసింది నువ్వన్నమాట" అన్నాడు పరమేశ్వరం పెదాలు బిగించి.

    "అవును. ప్రవల్లిక అంటే 'పజిల్' అని అర్ధం" సన్నగా నవ్విందామె.

    "కంగ్రాచ్యులేషన్స్. ఇదంతా ఎలా కనుక్కున్నావు?"

    "టెలిఫోన్ ట్రాప్ చేసి వుంచాను. అంతా బయటపడింది" అందామనుకుంది. పైకి చెప్పలేదు. ఈ లోపులో అతడే-

    "నన్ను నువ్వేం చెయ్యలేవు. నీకేం సాక్ష్యమూ లేదు" అన్నాడు తేలిగ్గా.

    "కన్న కొడుకుని జైలుకి పంపాలనుకున్న రాక్షసుడివి. నీకు నా న్యాయస్థానాలు సరిపోవు. నరకమే సరియైన స్థానం. దానికి ఏ సాక్ష్యాలూ అవసరంలేదు."

    "ఇదంతా నేను చేశానని నా కొడుక్కి చెపుతావా?... నమ్మడు."

    "నమ్మడని తెలుసు. అందుకే ఇప్పుడే చెప్పదల్చుకోలేదు. దానికీ టైమ్ వస్తుంది."

    "బెస్టాఫ్ లక్."

    అంతలో వర్ధనమ్మ ఇద్దరితో కలిసి దగ్గిరగా వచ్చింది. "ఎంతలో ప్రమాదం తప్పిందండీ! అదేగానీ నిజం పిస్తోలు అయివుంటే ఏమయివుండేది? ఈ నాటకాలు వద్దని ఇద్దరికీ చెప్పండి." అంది.   

    "నీదంతా పిచ్చి అమ్మా! నాటకంలో నిజం పిస్టల్ ఎలా వస్తుంది?" అన్నాడు విహారి సర్దిచెపుతున్నట్టు.

    "నాకదంతా తెలీదు. ఇంకీ నాటకాలు మానేస్తామని నా మీద ప్రమాణం చెయ్యి!"

    ప్రవల్లిక పరమేశ్వరం వేపు ఓరగా చూసి "నాటకాలు మానెయ్యటం మంచిదే కదా. ఏమంటారు?" అంది.

    పరమేశ్వరం మాట్లాడలేదు.

    "మేమేదో సరదాగా నాటకాన్ని కాస్త పొడిగిస్తే దానికింత భయపడతావేమిటమ్మా. ఏం నాన్నగారూ! మీరేమైనా భయపడ్డారా?"

    పరమేశ్వరం బలవంతంగా నవ్వి "కాస్త భయపడ్డ మాట నిజమే అనుకో. కానీ ఇదంతా నాటకమని ముందే నాకూ తెలిసిపోయింది" అన్నాడు.

    "మీ నాన్నగారు పెద్ద క్రిమినల్ లాయరు కదా విహారీ! ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్ ని భయపడతారని ఎందుకనుకున్నావు? వీటిని చాలా సులభంగా పట్టుకోవచ్చు. ఇంకా పెద్ద ప్లాను వేస్తేగానీ ఎవరూ పట్టుకోలేరు" అంది ప్రవల్లిక.

    "నాకేం అర్ధంకావటంలేదు."

    "కొన్ని విషయాలు అర్ధంకాకపోవటమే మంచిది."

    పరమేశ్వరం ఇంకీ ప్రసక్తి చాలు అన్నట్టు "వెళదామా వర్దనీ" అన్నాడు.

    "నేను మేకప్ తుడుచుకుని తర్వాత వస్తాను" అన్నాడు విహారి.

    "నేను కారువరకూ వస్తాను పదండి...." అంది ప్రవల్లిక.

    "అవసరంలేదు. మేమెళ్తాం, శ్రమెందుకమ్మా నీకు" అన్నాడు పరమేశ్వరం.

    "మీ వెనకే రావటంలో శ్రమేం వుంది? పదండి."

    వర్ధనమ్మ కొడుకుతో, "ఒరేయ్ తొందరగా ఇంటికిరా" అంది. వాళ్ళు వెళ్ళాక పద్మాకర్ విహారితో "అనవసరంగా ఈ నాటకం ఆడామేమో గురూ. మీ అమ్మ ఇక ఈ స్టేజీ వేపు రానిచ్చేలా లేదు" అన్నాడు.

    "అటువంటిదేమీ వుండి వుండదులే."

    "మరి తొందరగా రమ్మంటుందేమిటి?"

    "బహుశ దిష్టి తీయటానికి అయి వుంటుంది."

    ఇక్కడ ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అక్కడ పరమేశ్వరం భార్యతో కలిసి కారెక్కాడు. ప్రవల్లిక మర్యాదగా డోర్ వేసింది. "థాంక్స్" అన్నాడు.

    "ఇంత దానికేనా?"

    "కాదు. నిజం పిస్టల్ సంగతి విహారికి చెప్పనందుకు."

    అతని మాటలు పూర్తికాకుండానే కారు వేగంగా అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. ప్రవల్లిక అలాగే నిలబడి వుంది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు చోటు చేసుకున్నాయి. అదృష్టం బావుండబట్టి ఒకసారి విహారిని 'సేవ్' చేసుకోగలిగింది. ఈసారి పరమేశ్వరం ఇంత చిన్న ప్లాన్ వేయడు. మరెలా? కొడుకూ, అతడూ ఒకే ఇంట్లో వుండేవారు. అతడు ఏం చెయ్యటానికయినా ఛాన్సు లెక్కువ.

    పోనీ విహారికి ఇదంతా చెప్పేస్తే?

    అతడి తండ్రి ఎంత దారుణమైన ప్లాన్ వేసి అతనిని పధ్నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టటానికి ప్రయత్నించాడో విహారికి చెప్పేస్తే..? అతడింత షాక్ భరించగలడా?

    ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. ఆ ఆలోచనల సందిగ్ధంలోనే ఆమె- పరమేశ్వరం నుంచి ట్రాప్ చేసిన టెలిఫోన్ సంభాషణలో ఒక వాక్యం మర్చిపోయింది. ".... సునాదమాల చేతివ్రాతతో పద్మాకర్ గదిలో కొన్ని లేఖలు పెట్టు" అన్న వాక్యం అది. అలా అతడు ఎందుకు అనవలసి వచ్చిందా అని ఆమె ఆలోచించి వుంటే బావుండేది. స్నేహితుడ్ని రక్షించుకునే ప్రయత్నంలో ఆ ప్రేమలేఖల విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం మరో మలుపుకు కారణమయింది.


                       *    *    *


    "నేను మనస్తత్వ శాస్త్రజ్ఞుడ్ని కాకపోయి వుంటే, గొప్ప హస్తసాముద్రికుడ్ని అయి వుండేవాడిని-" అన్నాడు రాబర్టుసన్ అనే సైకాలజీ ప్రొఫెసర్. రెండిటికీ అంత దగ్గిర సంబంధం వుంది. పువ్వు పేరు చెబితేనో, లేక ప్రశ్న అడిగిన టైము చెబితేనో భవిష్యత్తు చెప్పే ఒక క్యోతిష్కుడ్ని ఒకసారి చూడటం జరిగింది. రాబర్ట్ సన్ సూక్తి ఎంతవరకూ నిజమోగానీ, సూడో జ్యోతిష్కుల (దొంగ సన్యాసుల) విషయంలో మాత్రం ఇది నూరుపాళ్ళు నిజం అనిపించింది.

    "చిన్నప్పుడు మీకు ఆక్సిడెంట్ జరిగింది?" అన్న దానికి రెండు సమాధానాలు. కాదు... అవును. కాదంటే- "జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. మీరు మర్చిపోయి వుండవచ్చు" అన్న సూచన. "...చిన్నప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిందండి" చిన్న సందిగ్ధపు సమాధానం! చాలు... "అదే నేను చెప్పేది. ఆ ఆక్సిడెంట్ లో ప్రాణం పోవాల్సింది" అంటూ గర్వపు చిరునవ్వు!! ఇక "అవునం"టే "చూశారా! ఈ లైఫ్ లైన్ చూడగానే తెలిసిపోతోంది. అన్నట్టు మీరొక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆమెతో వివాహం జరగలేదు"... దీనికి మళ్ళీ రెండు సమాధానాలు. కాదు. అవును. దాదాపు ప్రతీవాడూ జీవితంలో ఎవరో ఒకర్ని లవ్వుచేసే ఉంటారు. ఆ పెళ్ళి ఎలానూ జరిగి వుండదు. నూటికి తొంభైమంది ఆ జ్ఞాపకాల్లోకి జారిపోయి తాదాత్మ్యంగా "అవును" అంటాడు! లేదూ కాదంటే- "లేదా, అయితే మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించి గుండెల్లో నింపుకున్న అమ్మాయి ఎవరో వున్నారు."

    "... అవును ఇరవై ఏళ్ళక్రితం మా పక్కింట్లో..." "వద్దు, చెప్పొద్దు. ఈ హార్ట్ లైన్ చెపుతోంది. మీరు ఆ ప్రేమని గుర్తించలేదు. పోన్లెండి. అదీ మంచికే వచ్చింది. పోతే మీరు అప్పుడు ఏదో కష్టంలో వున్నారు. చిన్న సమస్య."

    ఇలా సాగుతుంది ఆ సంభాషణ. దీన్నే కొంచెం పెద్ద ఎత్తులో నిర్వహిస్తే....

    అనంతానంతస్వామికి బారులు తీర్చిన అనంతానంత భక్తకోటి మధ్య నడుస్తూ, అక్కడక్కడ దీవెనలు ఇవ్వటం అలవాటు. అప్పుడెప్పుడో అలా ఆగి, ఒక భక్తురాలికి కుంకుమ ఇచ్చాడు. ఆమె నివ్వెరపోయి, "స్వామీ" అంది. పక్కనున్న మరొకావిడ "స్వామీ! ఈమె పసుపు కుంకుమలకి నోచుకోలేదు" అంది. తన సహజ గాంభీర్యంతో స్వామి నవ్వి "మంచే జరుగుతుంది" అని ముందుకు సాగిపోయాడు. ఆవిడ అలాగే కుంకుమతో నిలబడిపోయింది.

    ఆమే వర్ధనమ్మ.

    ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజు వర్ధనమ్మకి స్వామిమీద గౌరవాభిమానాన్ని విపరీతంగా పెంచేసింది. తన నుదుటున బొట్టు నిలిపింది. స్వామి రూపంలో భగవంతుడే అన్న నమ్మకం కలిగింది.

    ఇందులో చిత్రమేమీ లేదు. సి.బి.ఐ. చీఫ్ అజ్ఞానం కన్నా ఇది పెద్దదేమీ కాదు. జరుగుతూన్న సంఘటనల్ని జ్యోతిష్కుడెప్పుడో చెప్పిన మాటలకి అన్వయించుకుని సంతృప్తి చెందటం (అలా జరగని వాటిని మర్చిపోవటం) సామాన్యుల అలవాటు.

    ఎన్నాళ్ళ క్రితమో చనిపోయాడనుకున్న భర్త తిరిగి లభించటంతో పొందిన ఆనందాన్ని ఆమె స్వామి మహిమకి అన్వయించుకుని, తిరిగి మరొకసారి ఆయన్ని దర్శించాలనుకుంది. అయితే ఈసారి పరమేశ్వరం భార్యగా ఆమె హోదా వేరు. భక్తుల దర్శన సమయంతో నిమిత్తం లేకుండా ఆ దంపతులకి స్వామి అంతఃపురంలోకి వెళ్ళే అవకాశం లభించింది.

    "విహారిని కూడా తీసుకువెళదాం" అన్నాడు పరమేశ్వరం.

    విహారి మండిపడ్డాడు. "నేను స్వామి దగ్గిరకా?" అన్నాడు కోపంగా.

    "ఏం తప్పేముందిరా?" అంది వర్ధని.

    స్వామి ఎటువంటివాడో తల్లికి చెప్పటం అనవసరం అనిపించింది. "నేను రాను" అన్నాడు.

    "మనకెంతో సాయం చేసిన స్వామి గురించే నిర్లక్ష్యంగా మాట్లాడకు" అన్నాడు పరమేశ్వరం. విహారి కాస్త ఆలోచించి "సరే" అన్నాడు.

    ఆ సాయంత్రం ముగ్గురూ స్వామి దగ్గరకి వెళ్ళారు. వర్ధనమ్మ భక్తిగా పూలూ, ఫలాలూ సమర్పించింది. సామాన్యులకే కాదు, పెద్ద పెద్ద అధికారులకి కూడా దొరకని ఆ స్పెషల్ దర్శనం తనకి దొరకటం అదృష్టంగా భావించింది. అంతా తన భర్తకి ఉన్న పలుకుబడి అనుకుంది. ఆమె జీవితంలో అంత ఆనందాన్నిచ్చిన సంఘటనలు చాలా తక్కువ. అసలామె జీవితంలో అంతా విషాదమే. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడటం, కోట్లు కాదని ప్రేమించినవాడితో వెళ్ళిపోవటం, భర్త మరణం- అన్నీ అటువంటి సంఘటనలే. ఇప్పుడే ఆమె జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తూంది.     

 Previous Page Next Page