Previous Page Next Page 
మైదానం పేజి 30


    నా వంక చూస్తున్నాయి. చీకటిని చీల్చుకుని అతని చూపులు నన్ను పరేక్షిస్తున్నాయి. వెతుకుతున్నాయి. అర్థం చేసుకుంటున్నాయి. అతని విశ్వాసం, అతని నిశ్శబ్దం, అతని అడుగుల తొందర, అతని చేతుల వూపులన్నీ మాట్లాడుతున్నాయి. తల తిరుగుతోంది, అలసట వదలక నా కళ్ళు మూతలు పడుతున్నాయి. నా హృదయం యింక బాధపడలేనని మూలుగుతోంది. అడుగులు తూలుతున్నాయి. మీరా ఏమిటో మాట్లాడుతున్నాడు. కాని నేను వినలేదో వింటే మరచిపోయినానో! ఏవేవో మాటలన్నాడు దారి పొడుగూతా.
    "నేనింక వూరుకోను. నిన్ను చూడకుండా వుండగలనా? నాకు కనబడకుండా తీసుకుపోతాడా నిన్ను! నాకు తెలుసు నిన్ను చంపుతాడు, నాకు కాకుండా. నువ్వు నా దానివి, నేనెవ్వరికియ్యను. చూస్తూ నేనూరుకోను. నిశ్చయం; రా! నా జీవితమంతా నీ సేవలోనే గడుపుతా."
    "ఎక్కడికేమిటి? ఎక్కడ కన్నాను."
    "మక్కాకీ, బనారసుకి, లాహోరు వెడదాం. ఎక్కడికైతేనేం నువ్వూ, నేనూ కలిసివుంటే చాలదా? వూరూరికి తిరుగుదాం. బిచ్చమెత్తు కొందాం. వాడి దగ్గిర్నించి, ఆ రాక్షసి దగ్గిర్నించి, ఆ సైతాను దగ్గిర్నించి తప్పించుకుంటే చాలు. వాడు నన్నిక తాకడానికి వీల్లేకుండా పోదాం. నా దీదీని అట్లా యేడిపించి, అట్లా నలిపేసి, చీల్చేసి నేనోర్చుకోలేను, నేనూరుకోలేను. నేనూరుకోను. నాదానివి, నన్నేడిపించకు, నన్ను చంపకు, నాదానివే." అంటూ తన కదుముకుంటున్నాడు.
    "వుండు మీరా యెక్కడికి యింకా?"
    "దీదీ, ఏదీ....నువ్వు నా దానివి, నా దానివి రా."
    నన్ను కావలించుకుని ఆక్రమించుకున్నాడు. మా కాళ్ళు చీకట్లో మెలికలు పడుతున్నాయి.
    "వొదులు మీరా! ఇంక రాను - వుండు నాకు నిద్ర వొస్తోంది."
    ముందుకు లాగాడు. నేను తూలాను. కాళ్ళు తొక్కుకుని నేను కింద పడ్డాను; సగం ఇసుకలో సగం నీళ్ళలో, ఎక్కడో చీకటి, నిద్ర అలసట. ఇంక నడవక్కర్లేదు. అంతేచాలు. నా పక్కనే, సగం, నామీద, సగం నా పక్కన మీరా పడ్డాడు. అతనిమీద ఒక చెయ్యి వేసుకుని కళ్లు మూసుకున్నాను.
    "లే, వెడదాం, లే."
    "ఎక్కడికి మీరా?"
    "ఎక్కడికో"
    "నేను రాలేను. నేను రాను. వుండు నాకు నిద్ర వొస్తుంది."
    "రావూ. రావూ? ఇంకా వాడి దగ్గర వుంటావా? నేను వుండనిస్తానా? నా దానివి?"
    ఇది మీరాయేనా? నాకు తెలీదు. శక్తిలేదు. మీరా మాట్లాడుతున్నాడు. మీరా నన్ను లోబరచుకుంటున్నాడు.
    "వాడేనా? వాడిదానివేనా నువ్వు? సొంతం సంపాయించాడు పాపం?"
    మొన్ననేగా తనని అమీర్ మృత్యువు నించి రక్షించాడు? అది కూడా మరిచాడు కదా మీరా? అప్పుడు మరిచాను కాని ఆ సంగతి యిప్పుడు యోచిస్తున్నాను. ఎంత తపనలో కుమలకపోతే, కృతజ్ఞతని కూడా మరుస్తాడు. ఉదారుడు నా మీరా! తక్కిన విషయాల్లో ప్రాణానికి ప్రాణమిస్తారు. స్త్రీ విషయంలో ప్రాణానికి ప్రాణం తీసుకుంటారు.
    "దీదీ, దీదీ, నా దీదీ, రా ఇట్లారా, నీకోసం యీ పెదిమలి కోసం యీ చేతులకోసం-
    ఆ రాత్రి, ఆ నీళ్ళలో, ఇసుకలో, చీకట్లో, మీరా నన్ను తనదాన్ని చేసుకున్నాడు. అతని మనసు నొప్పించే శక్తిగానీ, అతనిమీద అధికారం చేసే శక్తిగానీ నాకు లేదు.
    ఎంత సేపయిందో తెలీదు. కారణం లేకుండానే నాకు తెలివి గలిగింది. మీరా నామీద పడుకొని వున్నాడు. అతని జుట్టు నా మొహంమీద పడ్డది. అతని చేతులు నా వీపుకిందనించి, ఇసుకలో పాకుతున్నాయి.
    అమీరు నన్ను చేసిన గాయంమీద, మీరా మెత్తని పెదిమలు. ఏదో శక్తి నా కళ్ళని విప్పిందే - అదే చీకట్లో బాగా కళ్ళువిప్పి చూసేట్టు చేసింది.
    మా పక్కనే నల్లని ఆకారం. అమీర్ కళ్ళు.
    చేతులో తళతళలాడే కత్తి! మా యిద్దరిమీదా అది దిగుతుందని తెలిసి కళ్ళు మూసుకోబోతున్నాను. జుట్టు పట్టుకుని మీరాని పైకెత్తాడు. నా మీరా కోసం ప్రాణం హడలిపోయింది. పిల్లి నోటిలో చిక్కిన పిచ్చికలాగు కీచుమన్నాడు మీరా. చప్పున లేచి, అట్లా మీరాని కావలించుకుని అమీర్ కత్తికి అడ్డుపడ్డాను. నా బరువుతో మీరా కిందా, నేను పైనా యిసుకలో దొర్లాము.
    "వాణ్ణి వొదులు" అంది అమీర్ గొంతు బొంగురుగా!
    "నన్ను చంపిం తరువాత-"
    "నిజమా-"
    "నిజం"
    "అరే"
    కదలక, మీరాని, బైటికి కనబరచక, నా రొమ్ముతో, నా జుట్టుతో, నా తొడలతో కప్పేశాను. ఎదురుచూస్తున్న కత్తి నా మీద దిగుతుందని. చప్పున నిష్కారణంగా, నా ప్లీడరుగారూ, యిల్లూ, లా పుస్తకాలూ కళ్ళముందుకి వచ్చాయి.
    నిశ్శబ్దం పదినిమిషాలన్నా జరిగివుండాలి. కళ్ళు తెరిచాను....ఎవరూ లేరు.
    లేచాను ఇసుకలో జిగురుగా కాలికి తగిలింది రక్తం....పక్కన అమీర్ పడి వున్నాడు.
    "అమీర్" అన్నాడు మీరా.
    "మీరా పరుగెత్తు, డాక్టర్ని తీసుకురా!" అన్నాను.
    మీరా సంశయిస్తున్నాడు.
    "దీదీ, నా కోసం నువ్వు...."
    "మీరా, పో, తొరగా."
    "దీదీ నిన్నొకత్తెనీ...."
    "మీరా, నాకు కోపం తెప్పించకు."

 Previous Page Next Page