Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 30


    అచ్యుతమ్మ శాంతించలేదు, నామాలయ్య వైపు తిరిగింది.
    "నామాలయ్యగారూ! ఈ దురాగతం ఆపించండీ! మన ఇళ ఎంతటి పవిత్రమూర్తో మీకు తెలుసు. ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. మీరు తలుచుకుంటే ఈ అరెస్ట్ ఆపించగలరు. ఆపించండీ! ఏదైనా చెయ్యండీ!"
    అచ్యుతమ్మ గోడు పూర్తికానిచ్చి చల్లని, మెత్తని చిరునవ్వుతో ఇలా అంది ఇళ. "అమ్మా! నేనిప్పుడు జైలుకెళ్ళినా మీకెవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు గదా! మీరంతా హాయిగానే బ్రతగ్గలరు కదా!"


                                                        13


    ఏమీ తోచక నామాలయ్య ఇంటి అరుగుమీద కూచుంది రాణి. తమ ఇంటివైపే వస్తోన్న చిచ్చుని చూసి తబ్బిబ్బయిపోతూ ఇంట్లోకి పరుగెత్తి "నాయనోయ్, ఆయనొస్తున్నారు" అంది.
    "ఆయనెవడు?" చికాగ్గా అడిగాడు నామాలయ్య. ఇళని బంధించినప్పటినుంచీ అతడి మనసుకి స్థిమితంగా లేదు.
    రాణీ సిగ్గుతో పది వంకర్లు తిరుగుతూ, పైట కొంగు వేలికి చుట్టుకుంటూ "ఆయనే, చిచ్చులయ్య" అంది. నామాలయ్య మనసులోకి ఒక్కసారిగా లక్ష ఆలోచనలు వచ్చాయి.
    "లోపలికి పిలిచి మర్యాదలు చెయ్యి" అన్నాడు. సంబరంగా బయటికి గెంతింది రాణి.
    "రండి, రండి కూచోండి. ఇన్నాళ్ళకు దయ కలిగింది మామీద!" అంది కులుకులుపోతూ రాణి.
    "దయకేం! నువ్వు ఎప్పుడూ నా మనస్సులోనే ఉంటావు" పేము కుర్చీలో కూచున్నాడు చిచ్చు.
    "కాఫీ తీసుకుంటారా?"
    "వద్దు."
    "పోనీ టీ? బోర్నవిటా?"
    "ఊహూ!"
    "మరేం కావాలి?"
    "నువ్వు..."
    "పోండి." కిలకిల సినిమాటిక్ గా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కాఫీ ఫలహారాలతో తిరిగి వచ్చింది.
    "నీ చేత్తో ఏదిచ్చినా అమృతమే!" అంటూ వాటిని తీసుకున్నాడు చిచ్చు. ఈలోగా నామాలయ్య వచ్చాడు. పెదవులు నవ్వుతోన్నా, అతడి నుదుటిమీద అనుమానపు రేఖలు.
    "ఏం చిచ్చులయ్యా ఇటొచ్చినావ్?" పలకరించాడు.
    "ఇక్కడికి రాక ఇంకెక్కడికి పోతాను?" అరిస తుంపుకుని నోట్లో కుక్కుకున్నాడు.
    "అద్సరేలే గాని, ఇదెక్కడి పెంట తెచ్చి పెట్టారండీ, ఊరిమీదకి!"
    "నేను తెచ్చిన పెంటేందయ్యా!"
    "పోలీసులు! ఊళ్ళో పోలీసుల హడావిడి చూసి కోయవాళ్ళెవరూ అడవిలోంచి బయటికి రావటంలేదు."
    నామాలయ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి.
    "పోలీసులా? వాళ్ళెక్కడున్నారయ్యా ఇక్కడ? ఇళమ్మని పట్టుకుపోగానే ఎక్కడివాళ్ళక్కడే పోయారుగా!"
    "మీరు నామాలయ్యగారేనా? నిజంగానే ఊళ్ళో ఏం జరుగుతుందో మీకు తెలీదా? పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు మనూళ్ళో. జ్యోతి జాడ తెలుసుకోకుండా పోరంట!"
    "జ్యోతి? ఇంకేం జ్యోతి? ఇళతో పోయిందిగా!"
    "ఎక్కడికి పోయింది? ఇంకా కనపడుతూనే ఉందిగా!"
    తెల్లబోయాడు నామాలయ్య.
    "ఏంటీ" అన్నాడు తను విన్నది తను నమ్మలేనట్లు.
    "అదేమిటండీ? జ్యోతి కనబడుతూనే ఉందిగా? ఇదివరకు లాగా ఒకదారిలో పోవటం లేదు. అక్కడక్కడ కనిపించి మాయమవుతోంది. జనం విరగబడుతున్నారు. కొండ దేవత గుడికి! ఆ భక్తుల్లో ఎంతమందున్నారో, మఫ్టీలో వున్న పోలీసులు!"
    నామాలయ్య ముఖం కత్తి వేటుకు నెత్తురుచుక్క లేకుండా పాలిపోయింది. అంతలో కఠినంగా అయింది. కళ్ళనిండా ఎర్ర జీరలు!
    "కొండ దేవత గుడి మూసేస్తే సరి!"
    "ఆ గుడి మన ఊళ్ళో లేదు. అడవి సరిహద్దుల్లో ఉంది. కోయవాళ్ళు ఊరుకోరు గుడి మూసేస్తే! వాళ్ళ నమ్మకాలు మీకు తెలుసు. భక్తులు ఊరుకోరు. తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళలో మఫ్టీలో పోలీసులు!"
    నామాలయ్య చిచ్చు ముఖం పరిశీలనగా చూశాడు. వెన్నతిన్న గోపాలకృష్ణుడి ముఖంలా అమాయకంగా వుంది అతడి ముఖం.
    "నేను చేస్తానులే! నువ్వు దిగులుపడకు." వ్యంగ్యంగా అన్నాడు.
    "మీరున్నారనే మా అందరి ధైర్యం" అంతకంటే వ్యంగ్యంగా అని నామాలయ్య చూడకుండా రాణిని చూసి కన్నుకొట్టి బయలుదేరాడు.


                             *    *    *    *


    చిచ్చు ప్రమధపురి రాగానే, జ్ఞానదేవ్ ఎప్పటిలా మండి పడలేదు. ఇళని అరెస్ట్ చెయ్యటం అతడికి చాలా బాధగా ఉంది. ఆ విషయంలో తను ఏమైనా చెయ్యగలిగితే, తప్పకుండా కల్పించుకొనేవాడు. కానీ, ఈసారి మాయమైనది విదుషి.
    "చిచ్చూ! ఇళ_" అని జ్ఞానదేవ్ చెప్పబోతుండగా చిచ్చు చెయ్యి పైకెత్తి "నేను వచ్చింది అందుకు కాదు. కుమార్ ఉత్తరం రాశాడు. అందుకని వచ్చాను" అన్నాడు.
    కోయ యువకుల పేర్లన్నీ మారిపోయాయి. కొమరయ్య కుమార్ అయ్యాడు. సత్తెయ్య సత్యేంద్ర అయ్యాడు.
    ఈ పేర్లు చాలావరకు జ్ఞానదేవ్ సూచించినవే!
    "ఏం వ్రాశాడు?" అడిగాడు జ్ఞానదేవ్.
    "కోయ వాళ్ళందరూ ఈసారి తమ పొలాలు తామే చేసుకోవాలనుకుంటున్నారట! నామాలయ్య తాను చేస్తున్న, లేదా చేయిస్తున్న పొలాలు వదలనంటున్నాడుట! వీళ్ళకు అప్పులు ఎవడిస్తాడో చూస్తానని బెదిరిస్తున్నాడుట! అందుకని వచ్చాను."
    "వెరీగుడ్! ఈ విషయంలో వాళ్ళకి కావలసిన సహాయం చెయ్యి. నీ చదువు ఇలా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది." ఆనందంగా అన్నాడు జ్ఞానదేవ్. వర్ధనమ్మ మాత్రం ఆనందించలేదు.
    "ఒరేయ్! ఇళనే ఖైదులో వేసిన వాళ్ళు, నిన్ను బతకనిస్తారుట్రా. వాళ్ళ జోలికి పోకురా!" అని లబలబలాడింది.
    ఎప్పటిలాగే తండ్రీ కొడుకులు వర్ధనమ్మని వెర్రిబాగుల దానిలా చూసి నవ్వేశారు.
    కోయ యువకులతో కలిసి వాళ్ళ భూములు పరీక్షించాడు చిచ్చు. నామాలయ్య ఆ భూముల్లో కూడా వరి వేశాడు.

 Previous Page Next Page