Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 3

నీవు చెప్తున్నా పేద విద్యార్ధులంతా అక్కడే అన్యాయం అయిపోయారు. ఇక ఈ సోకాల్డ్ లెక్చరర్స్ వున్నారు చూశావ్! వీళ్ళంతా రాత్రుళ్ళు ప్రయివేటు రెసిడెన్షియల్స్ లో చెప్పి, పగలు పబ్లిక్ స్కూల్స్ లో నిద్రలు పోయేవాళ్ళు. లేదా 'ఆఫర్స్' ఎగరగొట్టేవాళ్ళు. అలా సాగుతున్న ఆ పబ్లిక్ స్కూల్స్ మేం ఎందుకు కంటిన్యూ చేయాలి చెప్పు? అందుకే ప్రయివేటు రెసిడెన్షియల్స్ ని అనుమతించాం.
ఒకటి రెండు వేల రూపాయలు ఎక్కువ ఇస్తున్నారని చెప్పి పబ్లిక్ స్కూల్స్ కి సెలవుపెట్టి ప్రయివేటు రెసిడెన్షియల్స్ లో పనిచేస్తున్న వాళ్ళను ఎంతమందిని చూపించామంటావ్? వందలు కాదు, వేలున్నారు. నిజమైన ఆత్మద్రోహులు వాళ్ళే!
"వీడెవడో తిరుమలరావన్నావు చూడు.... వాడూ అలాంటివాడే అయివుంటాడు. ఇదో కొత్త అవతారం..." మంత్రి అంబరీషుడు అన్న మాటలు ఆయన భార్యకు బాధ కలిగించాయి. వెంటనే అంది-
"అలా అనకండి-ఆయన స్వభావం నాకు తెలుసు! ఆయన గవర్నమెంటు కాలేజీలో పని చేసేప్పుడు పేద     విద్యార్దుల్ని ఇంటికి పిలిచి ఉచితంగా చదువు చెప్పేవారు. వారికి కావాల్సిన మెటీరియల్ కూడా ఫ్రీగా యిచ్చేవారు. మీ దృష్టిలో వున్న మిగతా లెక్చరర్స్లాంటి మనిషి కాదు. మనిషిలో ఒక తపన వుంది. ఏదో చేయాలనే ఆరాటం వుంది. ఏమీ చేయలేకపోయాననే ఆవేదన వుంది. దీన్ని కాదనకండి. ఈ ప్రాజెక్టు మన పేరున ప్రారంభమవుతుంది. ఆయన్ని ఊరికే నిర్వహించమందాం. దాన్ని ఆయనగా చివర్లో కాష్ చేసుకొనేదేం వుండదు...దాని లావాదేవీలన్నీ మన చేతిలో వుంటాయి."
రుక్మిణి మాటల్ని ఆయన విని చిన్నగా నవ్వాడు.
"చూడు రుక్కూ! అలాంటిది 'ఓపెన్' చేయటమే జరిగితే-ఖర్చు ఒక కోటితో ఆగదు. తడిసి తడిసి మోయలేని మోపెడవుతుంది. దీపముండగా చక్కబెట్టుకున్నదంతా దొంగలు దోచినట్లవుతుంది. పనిగట్టుకు సంపాదించుకున్న పన్నీరంతా బూడిదలో పోసినట్లవుతుంది. ప్రయివేటు పరంగా ఆ ప్రాజెక్టు పనికిరాదు. కోటిరూపాయలుంటే మాటలనుకున్నారా?!
నేను చేస్తుంది పరిపాలన. వ్యాపార సంస్థలన్నీ, మరొకర్నీ-మరొకర్నీ అడిగితే...వాళ్ళు క్షణం ఆలస్యం చేయకుండా సూట్ కేసుల్తో తెచ్చికాళ్ళ దగ్గర గుమ్మరిస్తారు. ఆ తరువాత వాళ్ళ గొంతెమ్మ కోర్కెలుంటాయి. తీర్చలేక నేను చావాలి. ఈ విషయాల్ని పత్రికలవాళ్ళు ఊరికే పసిగడతారు. "వ్యాపార వర్గాలచీకటి మూటలందుకుని వారి చేతుల్లో మైనం బొమ్మగా మారిన మంత్రిగారు....వాళ్ళు ఆడమన్నట్టు ఆడి-ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్న తంత్రగాడు-కంత్రీగాడంటూ" అవాకులూ చవాకులూ వ్రాస్తారు. కార్టూన్స్ వేస్తారు. వ్యాసాలు గుప్పిస్తారు.....రంగంలోకి కోర్టులు దిగుతాయి. నిజానిజాల్ని బయటికి తీసి ఎంతటి పెద్దవారినైనా వదలకుండా చార్జ్ షీటు దాఖలు చేయమని సి.బి.ఐ.ని ఆదేశిస్తాయి. ఇప్పటివరకూ ప్రజలముందు చేతులెత్తి గ్రేట్ చేసినవాళ్ళం.... బోనులో పోలీసుల ముందూ, ప్లీడర్లముందూ, జడ్జీలముందూ చేతులు కట్టుకుని ముఖం వ్రేలాడేయాలి! అదెంత అవమానకరమో ఒక్కసారి ఆలోచించు!
అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకు 'ఫుల్ స్టాప్' పెట్టి- హాయిగా నీపనేదో నువ్ చూసుకో."
అంబరీషుడు కోపంగా అన్నాడు. ఆ సమయంలో ఆయన కళ్ళు కాస్త ఎరుపెక్కాయి! ముఖం కందగడ్డలా అయింది.
రుక్మిణి అవాక్కైపోయింది.
ఆయన ఇక ప్రాజెక్టుకు అనుమతించరని తెలిసిపోయింది. ఆయనవంతుగా అడిగిన దానికి అర్ధరూపాయి కూడా రాదు. తానుగా ఏం చేయగలదు. వంటిమీద నగలున్నాయిగాని....అవన్నీ రెండు లక్షలరూపాయలు కూడా ఖరీదు చేయవు.
తిరిగి తిరుమలరావు మాష్టారు వస్తానన్నారు. ఏ విషయమూ తను చెప్తానంది. పనవుతున్నట్టు తను ముఖంలో హామీ తాలూకు నిండుదనాన్ని ఆయన ముందు ప్రదర్శించింది. ఆయన తృప్తిగా వెళ్ళిపోయాడు.
తను కూడా అది సరికొత్త ప్రాజెక్టు అనుకుంది. ఈ సమయంలో దేశంలో విద్యాపరంగా తలెత్తిన సమస్యల్లో తీర్చాల్సిన సమస్య అనికూడా అనుకుంది.
ఇప్పటివరకూ తన భర్త చెప్పిన విషయంలో నిజంలేదని ఆమె అనుకుంది.
ముందుగా ప్రయివేటు పాఠశాలల్ని ప్రభుత్వం అనుమతించింది. సంపన్న వర్గాలన్నీ ముందుకొచ్చి-రెసిడెన్షియల్స్ కట్టి విద్యను వ్యాపారం చేశారు. ఆ వ్యాపారంలో ధనం ఆశతో తెలివిగల లెక్చరర్స్ కూడా పావులుగా మారారు. ఫలితంగా రిజల్ట్స్-ప్రయివేటు పరంగా ఎక్కువచ్చాయి. అవే బాగున్నాయని చివరికి ప్రభుత్వం మరిన్ని ప్రయివేటు సంస్థల్ని ప్రోత్సహించింది. తన నెత్తిని తనే పగలగొట్టుకొని ఎదుటివాడి సంస్థల్ని ప్రోత్సహించింది. తన నెత్తిని తనే పగలగొట్టుకుని ఎదుటివాడి నెత్తికి కిరీటం పెట్టిందీ ప్రభుత్వం!
ప్రభుత్వ డాక్టర్లు ప్రయివేటు ప్రాక్టీసు పెట్టుకోవచ్చు!
లెక్చరర్స్ ప్రయివేట్స్ చెప్పుకోవచ్చు!
సంపన్నులు ప్రయివేటు పాఠశాలలు తెరవవచ్చు!
ప్రభుత్వమే అనుమతించి, అది విషమిస్తే...పబ్లిక్ రంగం ఫెయిలయిందనటం....! పై అధికార్లు గట్టిగా అజమాయిషీ చేస్తే ఎందుకు ఫెయిలవుతుంది?
నిఘా విభాగాలన్నీ ఏమయినయ్!
కోట్లు జీతాలు మేస్తూ చెకింగ్ విభాగం అధికార్లు మౌనంగా ఎందుకున్నారు? కారణం__ఆపై నుండి వారికెలాంటి వత్తిడిలూ లేవు....
రుక్మిణి ఆలోచిస్తూ అలాగే వుందిపోయింది. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. మాస్టారు ఆవేదనలో ఏదో నిజం వుంది. పేదపిల్లలకు అందాల్సిన అవకాశాలేవో అందకుండా పోతున్నాయి. ఈ ప్రభుత్వం అన్నీ ప్రయివేటుపరం చేసి బాధ్యతలనుండి తప్పుకుంటుంది. వారు వారు చాటుగా అందే బ్రీఫ్ కేసులను మోస్తూ....చేతులు దులుపుకుని చిద్విలాసంగా కూర్చోవటం నేర్చుకుంది.
రేపు ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకుంటే....
మూకుమ్మడిగా ఎదురుతిరగరా?!
ఏమో...!
వీళ్ళూ అలవాటు పడుతున్నట్టున్నారు.
అన్నీ రాజకీయపార్టీలే! సేవాసంస్థలు కాదు!
"వాడి హయాంలో వాడ్ని తిననీయ్....మన హయాంలో మనం తిందాం' అంటూ మౌనంగా కూర్చున్నారు.
ఫలితంగా ప్రజల్ని 'మెబిలైజ్' చేసి నిజమైన దారుణాల్లోకి మళ్ళించే పార్టీలు కరువయ్యాయి!
మరలా మాస్టారు వస్తారు...ఆయనకేం చెప్పాలి?
"మంత్రిగారి భార్యనై వుండి ఓ మంచి పనికి మనీ సేకరించ లేనా?"
ఆమె అంతరంగం మరలా ఆవేశపడటం మొదలెట్టింది. అయినప్పుడు మాస్టారుకు జరిగింది చెప్పకూడదనుకుంది.
"మీ ప్రయత్నాలు మీరు చేయండి. స్థలం ఎంక్వైరీ చేయండి. పత్రికా ప్రకటన యివ్వండి....మంచి మంచి టీచర్లను సెలక్టు చేయండి. ప్రాజెక్టు విజయవంతం అవుతుంది. ముందుకుపదండి" అంటూ కొంత ఇనిషియల్ మనీ చేతిలోపెట్టాలి.
అనేకమందికి అనేక ఆశలుంటాయి. వారు వాటిని తీర్చుకొతానికే బ్రతుకుతారు. అవి తీర్చుకొనే అవకాశాల్లో నిరంతరం కృషి చేస్తారు. కష్టపడతారు.
తనకిప్పటివరకు ఎలాంటి ఆశాలేదు. సంసారిక చట్రంలో సగటు జీవితం గడుపుతూ వచ్చింది.
పిల్లలులేరు. పరిశీలించిన డాక్టర్స్ లోపం ఆయనదే అన్నారు. అయినా తను సరిపెట్టుకుంది.
రేపు తను చనిపోతుంది.
ఎందుకు పుట్టినట్టు? ఎందుకు చనిపోయినట్టు?
ఆయన అధిరోహించాల్సిన మెట్లు ఆయన ఎక్కుతున్నాడు. తను ఆయనకు భార్య అయివుండి కూడా నిస్తేజంగా బ్రతుకుతోంది. ఆయన మాత్రం పదవీ, పైకాల్ని చూసుకుంటూ ఆనందపడుతున్నాడు. మరి తనకు?
ఇప్పుడీ ప్రాజెక్టులో తృప్తి ఏదో కనిపిస్తోంది! దీన్ని ప్రారంభించి విజయవంతం చేస్తే ఈ జీవితానికో సార్ధకత వుంటుంది.
పేదపిల్లలకు విద్య! అందులో తెలివిగల పిల్లలకు విద్య! అన్నిదానాల్లోకెల్లా 'విద్యాదానం' గొప్పదన్నారు.
అలాంటి దానాల్లో విద్యను ప్రభుత్వమే వదిలేసిందంటే అంతకంటే శోచనీయం మరొకటి వుండదు.
పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఆ ఉసురు ఎప్పటికైనా తగులుతుంది. వ్యక్తి నుండి వ్యవస్థ వరకూ ఆ శాపం తప్పదు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టును మాష్టారుతో కలిసి తను ముందుకు తీసుకెళ్ళాలి....
ఆమె ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంది.

                    *    *    *    *
అది కంప్యూటర్ టెక్నాలజీ ట్రయినింగ్ సెంటర్.
దాని ముందు ఒక మారుతీ కారు ఆగింది. అందులోంచి ఎత్తుగా స్మార్ట్ గా వున్న ఓ యంగ్ మాన్ దిగాడు.
ఆయన ముక్కు కోటేరులా అందంగా వుంది.
కళ్ళు వెడల్పుగా వున్నాయి. కనుబొమలు నల్లగా, వత్తుగా వున్నాయి. ఫాలం విశాలంగా వుంది. నెత్తిమీద నల్లగా పట్టుగా కత్తిరించబడిన జుట్టు అలలుగా కదులుతోంది.
మనిషి పచ్చగా వున్నాడు.
చారల ఫుల్ షర్టును 'బ్లాకిష్' పాంటులో ఇన్ చేశాడు. కాళ్ళకు ఖరీదయిన హాఫ్ బూట్లున్నాయి.
ఆయన్ను చూడటంతోనే ట్రయినింగ్ సెంటర్ ప్రొప్రయిటర్ కరి కంప్యూటర్ టెక్ ఇంజనీర్ శ్రీనివాస్ ఎదురుగాపోయి షేక్ హేండిచ్చాడు.

 Previous Page Next Page