ఈలోపు ఆమె చేతిలో వుంది నిజమైన చిలుక కాదనీ, బొమ్మనీ పని మనుషులు గుర్తించారు.
"ఇది సిలక కాదా అమ్మగోరూ....బొమ్మా?" కళ్ళింతవి చేసి ఇంతకు ముందు సమాధానం చెప్పిన పనిమనిశే పెద్దగా అంది.
"ఏదో ఒకటిలే అమ్మగోరూ.....పంజెరం బోసిగా వుండాది. దీన్ని అందులో ఎడితే సరి!"
పనిమనిషి అన్నమాటలు ఆమె మనసుమీద బాగా పనిచేశాయి.
దీనికి సంబంధించిన నిజాలు కొన్ని బయటికొచ్చేవరకూ దీన్ని పంజరంలోనే వుంచాలని ఆమె అనుకుంది.
దాన్ని ఆ సమయంలో ఎవరి చేతికిచ్చినా, దాని మెడ దగ్గిర వత్తిడి తగిలేట్టు పట్టుకోవచ్చు! కాగితంలో సూచించిన విషయం జరిగిపోవచ్చు! కొన్నాళ్ళు తనే దీన్ని పంజెరంలో పెట్టి భద్రంగా వుంచితే, మరికొంత సమాచారం తనకు అందే అవకాశం తలెత్తవచ్చు.
ఆమె ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోనికి నడిచింది. హాల్లో ఒకమూల పంజెరం అలాగే కప్పుకు వ్రేలాడుతోంది. అక్కడే క్రింద 'బోన్ సాయి' కల్చర్ లో పెద్ద పెద్ద సిమెంటు టబ్స్ లో 'మరుగుజ్జు' మహావృక్షాలు దట్టంగా పెరిగాయి.
అప్పట్లో ఆమె ఆ పంజరంలో ఒక నిజమైన చిలుకను నేచురల్ 'ఎఫెక్ట్స్' కోసం వుంచింది. కానీ తరువాత ఆమె మనసు అనుకోకుండా ఆవేదనకు గురికావటం మొదలెట్టింది. ఈ కృత్రిమ చెట్లమధ్య ఒక నిజమైన చిలుకను వుంచటం న్యాయం కాదనుకుంది.
అనంతాకాశంలో స్వేచ్చావాయువుల మధ్య దీన్ని వదిలితేనే తన ప్రాణానికి హాయి అనుకుంది.
అనుకుందే తడవుగా దాన్ని వదిలివేసింది.
ఇప్పుడు అదే పంజరంలో ఆమె తన చేతిలోని చిలుక బొమ్మని వుంచింది.
కోటిరూపాయలు! ఆమె విచిత్రంగా నవ్వుకుంది. అలా ఆమె నవ్వు కోవటానికి సరీగ్గా నెలరోజుల క్రితం....
* * * *
"చెప్పండి మాస్టారూ!" ఎదురుగా కూర్చున్న తిరుమలరావుని ఉద్దేశించి రుక్మిణి అడిగింది.
తిరుమలరావు రిటైర్ అయినా లెక్చరర్!
రుక్మిణి మంత్రిగారి భార్య!
ఇప్పుడు మంత్రి భార్య అయినా ఆమె ఒకనాడు తిరుమలరావు దగ్గర చదువుకున్న విద్యార్ధిని! చదువులో చురుగ్గా వుండే ఆమె నైజం తిరుమల రావుకి కూడా వచ్చేది. కాలేజీలో చదువే కాకుండా ఇంటి దగ్గర కూడా ఆమెకు ట్యూషన్ చెప్పేవాడు.
తిరుమలరావు అప్పట్లో తెలివైన పేద విద్యార్ధుల్ని పిలిచి ఉచితంగా విద్యే కాకుండా, తనకున్నంతలో ఆర్ధికసాయం కూడా చేసేవాడు.
ఆయన మనసు ఇటీవల కాలంలో ఒక నిజమైన ఆవేదనకు గురయింది.
ఇక్కడ విద్య వ్యాపారమయింది. ముందు ముందు దేశం అన్నీ కోరతలతోపాటు మేధావుల కొరతను కూడా ఎదుర్కొంటుంది. ప్రతి చిన్న విషయానికి సాంకేతికపరంగా ఇతర దేశాలమీద ఆధారపడే పరిస్థితి తలెత్తుకుంది.
పోటీ పరీక్షల పేరుతో జరిగేది మేధావుల్ని ఎన్నిక చేయటంకాదు. ఓ చీకటి వ్యాపారం నడపటం. పేపర్లు 'లీక్' చేసి లక్షలు సంపాదించుకుంటున్నారు. ఫలితంగా కొద్ది శ్రమ చేసిన విద్యార్ధికి కూడా అన్యాయం జరుగుతుంది.
ముందు ముందు ఈ దేశంలో డాక్టర్లుంటారు. కానీ వారికి వృత్తి సంబంధిత స్కిల్స్ వుండవు. ముందు ముందు ఇంజనీర్లు వుంటారు. ఈ దేశ నిర్మాణంలో వారు కాంట్రాక్టరు కనుసన్నల కోసం అర్రులు చాస్తారు.
ప్రయోగశాలలూ, సైంటిస్టులూ వుంటారు. క్రొత్త విషయం ఒకటీ బయటికి రాదు.
కారణం-వారంతా నిజమైన మేధావులు కాదు గనుక. అడ్డదారుల్లో అందలాలు ఎక్కారు గనుక.
పరిపాలకులంతా కుంభకోణాల కుంజరయుధాలు అవినీతిని తెగమేసి చిన్న సైజు కొండల్లా బలిసి 'ప్రజలు' 'సంక్షేమం' అనే పదాల్నే మరిచిపోయిన వాళ్ళు. వాళ్ళీ దేశాన్ని బాగుచేయరు. విదేశీ పాక్సీ మైండెడ్ వైట్ వ్యాపారసంస్థలకు తాకట్టుపెట్టి బేరాలు కుదుర్చుకుని, డాలర్లను స్విప్ బ్యాంకుల్లో దాచుకోవటం తప్ప.
మరీ దేశాన్ని ఎవరు బాగుచేస్తారు?
ఈ దేశం ఒక వైకుంటపాళీ లాంటిది. ఒక మేదావయిన కుర్రవాడు మెట్లెక్కదానికి ప్రయత్నిస్తే అడుగడుగునా ధనసర్పం అతన్ని కాటేసి క్రిందికి తోస్తుంది.
అందుకే తనొకటి చేయాలనుకున్నాడు.
పేద విద్యార్ధులకు ప్రత్యేకంగా పరీక్షలు జరిపి అందులో తెలివైనవాళ్ళకు ప్రత్యేక శిక్షణ యిచ్చి వారిని నిజమైన సంఘసేవకులుగా మార్చటం. దానికీ మరలా మనీ అవసరం. ముందుగా ఒక కోటి రూపాయలన్నా కావాలి.
సిటీకి దూరంగా 'సైట్' 'ఎంక్వయిర్' చేయాలి. 'షెడ్స్' వేయాలి. హాస్టల్ వసతి ఏర్పాటుచేయాలి. బోధనాంశాల్ని సమకూర్చుకోవాలి. ఏదో కొంత 'పే' చేస్తే చెప్పే అధ్యాపాక బృందాన్ని ఆహ్వానించాలి. వారికి షెల్టరు ఏర్పాటుచేయాలి. ఆ మొత్తం మనీ ఈలోపు అయిపోతే మరలా వేట...!
తను మొదట టార్గెట్ గా రుక్మిణిని ఎన్నుకున్నాడు. ఆమె తనకు ప్రియమైన శిష్యురాలు. తెలివిగలది. చెప్పిన విషయాన్ని హృదయంతో అర్ధం చేసుకోగలదు. మనసు విప్పి మాట్లాడగలదు.
పైపెచ్చు మంత్రిగారి భార్య. ఇవ్వగలదు, లేదా ఇప్పించగలదు. చెప్పగలదు, చెప్పించగలదు. ఆ ప్రాజెక్టుకు ఆమెనే అధ్యక్షురాల్ని చేస్తే....మరింత ప్రయోజనంగా ముందు పరిస్థితి తయారవుతుంది.
ఇప్పుడు ఆమె చలనమంతా సంపన్న వర్గాలమధ్య ఆమె అడిగితే కాదనే వారుండరు.
తిరుపతి హుండీలో లక్షలు పడుతున్న రోజులు. వారాశించే భగవంతుడు విద్యార్ధుల్లో వున్నాడని తెలిస్తే ఒక లక్ష ఇటు పడేయటం పెద్ద శ్రమ కాదు. ఖర్చూ కాదు.
తిరుమలరావుగారు ఆలోచించి, ఆలోచించి రుక్మిణి దగ్గరకొచ్చాడు. తన మాష్టారును చూడటంతో ఆమెకు సంతోషం కలిగింది. ఏదో అవసరమై వచ్చాడనీ, ఆ అవసరాన్ని తీర్చటం తనకు కలిగే ఆనంధమనీ ఆయన చెప్పే విషయం కోసం ఎదురుచూసింది.
మాష్టారు అనుకున్నదంతా ఆమె ముందుంచాడు.ఆమె శ్రద్దగా వింది.
మాష్టారూ తలపెట్టింది మంచి ప్రాజెక్టే! మనీ చాలా కావాలి. ప్రారంభంలోనే కాకుండా దానికి నిరంతరం కావాలి. ఒక కోటి రూపాయలతో ముగిసిపోయేది కాదు.
ఈ పని ప్రభుత్వం చేయాలి.
అయితే చేస్తుంది.
గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజెస్ వున్నాయి. అందులో నిరు పేదలయిన పిల్లలు లేరు. ప్రభుత్వోద్యోగుల పిల్లలూ, మధ్యతరగతి కుటుంబాల పిల్లలూ వున్నారు. వారు కూడా పోటీకి తట్టుకోవడానికి ఖరీదైన కోచింగ్ తీసుకున్నారు. ఆ ఖరీదైన కోచింగ్ అందని నిరుపేద కుటుంబాల పిల్లలు వాటికి దూరంగా వున్నారు.
మాష్టారు ప్రాజెక్టు అలాంటిది కాదు.
నియమనిబంధనలు లేని అన్నీ గ్రూపుల్లోని నిరుపేద పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ. ఆ శిక్షణలో సానబెట్టిన జాతిరత్నాలు బయటకు వస్తాయి.
ఆమె ఆలోచిస్తూ కాసేపు అలాగే వుంది.
తరువాత మనసులో ఏదో నిర్ణయం తీసుకుంది. ఆమెనుండి ఎలాంటి సమాధానం వస్తున్నదో అని 'ఈ గర్' గా తిరుమలరావు ఎదురుచూస్తున్నప్పుడు__
ఆమె చిన్నగా నవ్వి__
"సరే మాష్టారూ! తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఆయన్ను ఈ విషయంలో సలహా అడుగుతాను. అలాంటి ప్రాజెక్టు ప్రభుత్వాలనుండి వస్తేనే మనకు మంచిది. ఒకవేళ ఆయన ప్రభుత్వం తరపున నడపాలనుకుంటే దానికి పరీక్షలు మీరే నిర్వహించండి. నిరుపేదలయిన పిల్లల్ని మాత్రమే తెలివి ప్రమాణంగా రిక్రూట్ చేయండి.
అది ఆయన వీలుకాదంటే....
మనీ ఆయన్నే అడుగుతాను. ఆయన ద్వారా లాభపడిన అనేకమైన వ్యాపార సంస్థలున్నాయి. మరికొన్ని స్వచ్చంద సంస్థలున్నాయి. మనంగా బయలుదేరితే అందరూ తులమో ఫలమో ఇస్తారు. చినుకు చినుకు ప్రవాహమైనట్టు....వాళ్లిచ్చింది ఒక కోటి కాకపోదు" అంది.
ఇంతలో లోపలనుండి క్రీం బిస్కట్లూ, టీ ట్రేలో పెట్టుకుని పని మనిషి వచ్చింది.
తిరుమలరావును తీసుకోవలసిందిగా ఆమె అభ్యర్ధించింది. ఆయన తన ప్రాజెక్టు ఫలించబోతుందన్న ఆనందంలో వారందించిన వాటిని ఆప్యాయంగా తిన్నాడు.
అవి మరింత రుచిగా తగిలాయి.
తిన్నాక ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
* * * *
"మూడ్ గా మాట్లాడకు. వాడెవడో తిరుమలరావు కాదు. తిరుపతి రావు. నేర్పుగా గొరిగి....చివరికా మొత్తం ప్రాజెక్టును ఏ ప్రయివేటు మనిషికో అమ్మి చేతులు దులుపుకుంటాడు.
అందుకే మేం ప్రతిదీ ప్రయివేటుపరం చేస్తుంది. పేద పిల్లలకు అన్యాయం ఎక్కడ జరిగిందంటాడు? వాళ్ళకి జరగ్గూడదనే మేం రెసిడెన్షియల్స్ నీ, అభ్యుదయ పాఠశాలల్నీ, సెంట్రల్ రెసిడెన్షియల్స్ నీ తెరిచింది.
వీళ్ళేం చేస్తుంటారో తెలుసా....సమస్యల్ని వీళ్ళే సృష్టించి చివరికది వక్రిస్తే...మరలా పరిష్కారం కావాలంటూ గుండెలు బాదుకుంటారు.పబ్లిక్ స్కూల్స్ అన్నీ ఎందుకు ఫెయిలయినయ్? మంచి మంచి లెక్చరర్స్ అందులో పాఠాలు చెప్పారా? చెప్పలేదు.