స్తంభంపక్కన ఆమెని ముద్దుపెట్టుకుంటోవుంటే చూసి, భ్రమపడ్డారు. "నేను పెళ్ళిచేసుకుంటాను." అని అరవబోయి సిగ్గుతో నోరుమూసుకున్నాను. ఆ మాట అంటే ఆకాశం నెత్తిన విరిగిపడుతుందని తెలుసు ఇంక. ఆమెని జన్మలో చూడనీరని, మేము తిరిగిన కాలవగట్లు మేము కూచున్న చెట్లనీడలు, సముద్రతీరాలు, కొండరాళ్ళు అన్నీ యింకా మమ్మన్ని జ్ఞాపక ముంచుకున్నాయేమో!
పన్నెండయింది. పిట్ట యింకా అట్లానే పాడుతోంది. నా తెల్లచొక్కా చుక్కల పావడా గట్టుకింద రోడ్డులో నా .... ణ జీవితపథంలో మాయమైనట్టే మాయమైనాయి. ఆ పిట్ట పాటనివింటో ఉంటే మేర్లీ ఓబెరాన్ మొన్న ఫిలింలో పాడిన పాట జ్ఞాపకం వొచ్చింది. ఆమె పాట వింటోవుంటే నాకు స్వర్గంనించి దిగివొచ్చిన పక్షి పాడుతున్నట్టుంది. ఈ ప్రజల్ని ఒక్క నిమిషం దేవవాయు వులలో వోలలాడించడానికి. కాని ఆమె సన్నగా పిట్టలాగు దీర్ఘం తీస్తోవుంటే నా బెంచిసోదరులు, కూతలుకూసి వెక్కిరించడం ప్ర్రారంభించారు. ఆ సంగీతం వీళ్ళచెవులకి అలవాటుకానిదే కావొచ్చు. అయినా వాళ్ళు కొంచెం నిదానించి ఆలోచించరు. ఆ ఫిల్ము పేరు పడ్డది. దశావతారాలకీ, లవకుశులకీ, అలవాటుపడ్డవాళ్ళకి కూడా ఊపిరి తిరక్కుండా అద్భుతంగా aot చేస్తోంది ఆమె. ప్రతి చిన్ని పద్దతీ యెంతో అనుభవంమీద ఆలోచనమీద యిమిడ్చివుంటారు ఆ ఫిల్ముకి. అల్లా ఆ వొక్క పాటనీ యెంతగొప్పది కాకపోతే పాడించి వుంటారు! సానుభూతితో విని చూద్దామనే జ్ఞానంలేదు. ఆ సంగీతాన్ని యిష్టపడే వాళ్ళున్నారేమో, మన కూతలు కలవడం అన్యాయమేమో అనే సందేహమన్నారాదు అంతేకాదు ప్రేమకోసం కధానాయిక నిప్పుల్లోంచి నడిచే struggle కనపరుస్తోవుంటే అర్ధంగాక వెకిలిగా నవ్వుతారు. ముభారిలో దడుపు నంచుతో సంస్కృత సమాన వ్యాసం గుక్కతిరక్కుండా కొడితేనేగాని emotion యెక్కదు ఆ బుర్రల్లోకి. ఆ heroine కళ్ళల్లో ప్రదర్శించే ప్రేమని వెకిలితనంగా అర్ధంచేసుకుని నీతిచట్టాలుపయోగించి judge చేసే యీప్రజలలో ప్రేమ చచ్చిపోయింది. ఈ దేశానికి పాతివ్రత్యమే మిగిలింది. art అంతరించింది. పాతపుస్తకాల్లో అంత మృదువైన ఘట్టాలు వుండబట్టీ, పాతదేవాలయాల్లో అంత విశాలమైన కళ కనపడుతో వుండబట్టి, యింకా యీ దేశంలో యే నలుగురో రసికులు మిగలబట్టీ కాని యీనాడు యీ దేశంసముద్రంలోకి కుంగిబోతే మాత్రం లోకానికేం నష్టం?
పన్నెండు దాటింది. నీడల్ని మర్రిచెట్టు దగ్గిరగా లాక్కుంది. నీళ్ళు మరీ నీలంగా కనబడుతున్నాయి. చెరువు మీదనించి కిరణాలు కొంచెం యేటవాలుగా మెరుస్తున్నాయి. గేదెలు కళ్ళు మూశాయి తన్మయంలో. రోడ్డుమీద మనుష్య సంచారం లేదు. పాడేపిట్ట యెగిరిపోయింది. గాలి వేపచెట్టు మధ్యకూచుంది. సీతాఫలంకాయ యెండని మదించి తింటోంది. ఇద్దరు పరీక్షార్దులూ, వూరికే బరికేస్తున్నారు. నేను కావిలా యీ ప్రపంచానికి! కనీ, Philosopher చలం Dreamer! నీగతి యిట్లా పట్టిందా చివరికి? చంద్రసదనాల విహారిద్దామనీ, అప్సరసలను లాలిద్దామనీ, ఈశ్వరున్నే ప్రశ్నిద్దామనీ వూహ అల్లే నువ్వు గంటకి రూపాయికోసం యీ వెట్టిచాకిరీకి పూనావా? మూడుగంటలు నువ్వు వ్రాసిన యీ వ్యాసానికి ప్రతిఫలం పత్రికల్లో చివాట్లా!
ఈ మాటేమిటి! యీ బూడ్సులేమిటి? యీ కుర్చీయేమిటి? పైగా కాలమూ కవిత్వమూనా! చెరువులో గొల్లపిల్లల వలె గేదె వీపు నెక్కి ఆడరాదూ? గాలం తీసుకుని నడియేట్లో వేసి మర్రివూడల మధ్య పడుకోరాదూ? గోచీపెట్టి వేళ్ళు లెక్కపెట్టుకుంటో, మొరిగే కుక్కల్ని చూసి నవ్వుతో, వీధులంబడి తిరగరాదూ? ఆ మాధవధార దగ్గిర పాడుకున్న తాగుమోతు వాళ్ళతో కలిసిపోరాదూ? ఇంతకన్న మంచి 'డిగ్నిటీ' వుంటుంది. ఇక్కడ నువ్వుచేస్తున్న ఘనకార్యమేమిటి? ఐదురూపాయలా? సాయింత్రానికి సినీమాకి డబ్బులా! నీ ఖర్మం!
ఇట్టాంటి యెండాకాలపు మధ్యాహ్నాలే, నేనూ.....ణా మా పెట్టిబండి పాకలో విడిచి వుంటే దాంటో యెక్కి కూచునేవాళ్ళం. ఏమేమో ప్రియమైన వుద్దేశ్యాలు ఆమెకి తెలియచెయ్యాలని వుండేది. కాని యిప్పటిమల్లే కవిత్వపు వాక్యాలు నోటికి చప్పున అందేవికావు. ఆ పాకా, ఆ బండీ చీకట్లో నాతో యెందుకంత వోపికగా గంటల కొలది కూచునేదో! వెడతానని అంటుందని భయం. ఆమె బుజానికీ బండికీ మధ్య నా వేలు నలుగుతోంది. ఆమెజుట్టు నా మెడమీద గిలిగింతలు పెడుతోంది. కర్ణుడిలాగు ధీరంగా కదలకకూచున్నాను. మెల్లిగా నా మెడకింద ఆమె పెదిమలు కదిలాయి. అది ముద్దు అవునా కాదా అని యీనాటికీ తర్కించుకుంటో వున్నాను. అడుగుదామా అనుకుంటాను ఆమెని. మర్యాదస్తురాలు, పెద్దకుటుంబానికి అధికారి యామంటుంది?
నా చెంప తడి అయింది.
"ఎందుకు ఎందుకు.....ణా"
"ఎందుకు మరి నీకు__నామీద యింత ప్రేమ?"
ఈ పాతికేళ్ళూ నన్ను అగ్నిలో, అమృతంలో, ముళ్ళలో, మేఘాల్లో లాగి, తిప్పి అదిమిన చేతులూ, పెదవులూ చూపుల్నీ వీటినన్నిటినీ పక్కకి తొలిగించి మృదువుగా పవిత్రంగా నన్ను యిట్లాంటి మధ్యాహ్నమే నువ్వడిగిన ప్రశ్న ప్రతి మధ్యాహ్నమూ నాకు వినపడి నరాల్ని ఝల్లుమనిపించి Wonder చేసేట్టు చేస్తుంది.
వొంటిగంట. అమ్మా! విడుదల.
-------