Read more!
 Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 3

 పట్నంలో వున్న కొడుక్కి ఈ నెల చేసి పంపిన పిండి వంటలు పై నెల చేయకుండా జాగ్రత్త పడుతూ చేస్తుంది పార్వతి.
 క్రితం సారి

 అరిసెలు, కజ్జికాయలు, చెక్క పకోడీలు సన్నకారప్పూస చేసి పంపింది. ఈ తఫా పిండివంటలు మారిపోయి గోధుమ       హల్వా పప్పు వుండలు చెగోడీలు కొత్తవి వచ్చాయి.

 భోజనం చేసి శివరావు వెళ్ళాడు.

పార్వతి భోజనం కానిచ్చి పిండివంటలు చేయటంలో నిమగ్నురాలయింది.

 సరిగ్గా నాలుగు గంటలు కావస్తున్న సమయంలో శివరావు పరుగులాంటి నడకతో యింటికి వచ్చాడు. వస్తూనే....

 "పార్వతీ! నేను ఊరు వెళ్ళటం లేదు.

  "అయ్యొయ్యో! అదేమిటండీ! ఉదయం నుంచీ రెక్కలు ముక్కలు చేసుకుని చంద్రానికి యిష్టంకదా అని యిన్ని రకాలు     చేశాను. ఇంక చెయ్యాల్సింది హల్వా ఒక్కటే" అంది పార్వతి.

"అదికాదు నేను చెప్పేది సాంతం విను. హల్వా కూడా చెయ్యి. పొలం తగాదా వచ్చి రాజన్నగారు రామచంద్రంగారు కొట్టుకున్నారు. మనం యీ విషయం దగ్గర వుండి యీ రోజే పరిష్కరించాలి నీవు వూరు వెళ్ళటానికి లేదు అన్నాడు కరణం బాబాయి. ఆయన మాట తీసేయలేను కదా! సరేనన్నాను..."ఇప్పుడు యిదంతా నాకెందుకు! మీరు ఊరికి వెళ్ళటం__"

 "__లేదు. కాని మన పుండరీ కాక్షయ్య బాబాయి సాయంత్రం ఏదో పనిమీద పట్నం వెళుతున్నాడుట. బాబాయి తీసుకెళ్ళి చంద్రానికి యిస్తానన్నాడు. నీవు చేసినవన్నీ పచ్చ బ్యాగ్ లో సర్దివుంచు. పుమ్దరీ కాక్షయ్య బాబాయి మనింటికి వచ్చి బ్యాగ్ తీసుకెళతానన్నాడు." అంటూ అసలు విషయం చెప్పాడు శివరావు.

 "అమ్మయ్య చేసిన శ్రమ వృధా కాదు. చంద్రానికి ఇష్టమైనవి ఎలాగో వాడికి చేరుతున్నాయి" అని తృప్తిపడ్డ పార్వతి "బాబాయి మనింటికి వస్తాడో మర్చిపోయి అలానే వూరికి వెళతాడో?" అంటూ ఓ అనుమానం వ్యక్తం చేసింది.

"తప్పకుండా వస్తానన్నాడు. పోనీ అనుమానం దేనికి హల్వా చేయటం పూర్తికాగానే బ్యాగ్ లో అన్నీ సర్ది నీవే వెళ్ళి బాబాయికి ఇచ్చిరా. ఏ గోలా వుండదు."

"ఆ పని చేస్తాను" అంది పార్వతి.

 "మంచిది. ఈ విషయం చెప్పటానికే వచ్చాను" అంటూ చెప్పినంత తొందరగాను బైటికెళ్ళి పోయాడు శివరావు.

 భర్త అటు వెళ్ళగానే పార్వతి హల్వా చేయటం మొదలుపెట్టింది.

 బైటికి వెళ్ళిన శివరావు ఏవో కాగితాల కోసం హడావిడిగా మళ్ళీ యింటికి వచ్చాడు.

 శివరావు కంగారుగా ఏవో కాగితాలు వెతుకుతుంటే "అదేదో ఏలకుల రసం (ఎసెన్స్) తెచ్చారంటిరే అదెక్కడ పెట్టారని"   సమయానికి గుర్తొచ్చిన పార్వతి అడిగింది.

"అలమరలో పెట్టాను చూడు. చిన్న సీసా పైన కాగితం (లేబుల్) అంటించి వుంటుంది." అని చెప్పి శివరావు కాగితాలు తీసుకుని వెళ్ళిపోయాడు.

 ఆ తర్వాత.

పార్వతి అలమరలో సీసా కోసం చూడటం. సీసా కనిపించక పోవటంతో అలమరా అంతా గాలిస్తుంటే అలమరలో ఓ మూలగా దాచిన చిన్న సీసా కానరావటం "అమ్మయ్య" అనుకుని సీసా తీసుకుని వంట గదిలోకివెళ్ళి సీసా మీద మూత తీసి చూస్తే ఏ వాసనా రాకపోయేసరికి రెండు బొట్లు (చుక్కలు) బదులు చంచాడు ద్రవం హల్వాలో వేయటం జరిగింది.

అప్పటికి ఏ వాసనా రాలేదు.

ఇంట్లో ఏలకులు లేకపోవటం పైగా జలుబుతో ముక్కులు బాగా దిబ్బెడ వేయటంతో పార్వతి వాసన పసిగట్టలేక "నా ముక్కులు పనిచేయటం లేదులే" అనుకుని అంతటితో సరిపెట్టుకోవటం జరిగింది.

పార్వతికి ఇంగ్లీషు రాదు.

 సీసాపై అంటించిన లేబుల్ మీదనున్న అక్షరాలూ ఆంగ్లంలో వున్నాయి. కనుక పార్వతి చదవలేదు.

  పార్వతికే ఇంగ్లీషు వచ్చివుంటే!

 Previous Page Next Page