Previous Page Next Page 
అమ్మా... నన్ను క్షమించొద్దు పేజి 3


                                  అనురాగ స్మృతి    


  

"త్వరగా రండి. అన్నం చల్లారిపోతున్నది" ప్రభావతి ఆరోసారి కేకేసింది.
"వస్తున్నా ఉండు ప్రభా! న్యూస్ చేసేటప్పుడు వడ్డించొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నీకస్సలు బుద్దిలేదు" విసుక్కుంటూ టి.వి. ముందు నుంచి లేచాడు నారాయణ.
ప్రభావతి మనస్సు కలుక్కుమంది. "విసుక్కోకుండా ఏ పనీ చేయడు కదా!" అనుకుంది కోపంగా.
"ఆ! అదే న్యూస్... ఎన్ని ఛానెళ్లలో అయినా అదే కదా! ఎంతసేపింక.. డాక్టర్ లేటుగా భోజనం చేయొద్దని చెప్పలేదూ" గొణిగింది.
నారాయణ మొహంలోని సీరియస్ నెస్ చూసి ఇంకేం మాట్లాడలేదు.
కంచం ముందు కూర్చున్న నారాయణకు కంది పచ్చడ్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది.
"కంది పచ్చడి చేశావా! చెప్పవేం" అంటూ నోట్లో నీళ్లూరుతుంటే అన్నం కలుపుకోవడం మొదలుపెట్టాడు.
"ఆ! నన్నెక్కడ చెప్పనిచ్చారు. పిలుస్తుంటే ఒకటే చిరాకాయె" అంటూ వెన్నముద్ద తెచ్చి కంచంలో వేసింది ప్రభావతి.
వేడి వేడి అన్నంలో కంది పచ్చడి, వెన్న కలిపి తింటుంటే తన కోసం తనకిష్టమైన విధంగా వంటచేసి పదిసార్లు పిలిచి భోజనం పెడ్తున్న భార్య మీద ప్రేమ ముంచుకొచ్చింది నారాయణకి. తలెత్తి ప్రభావతికేసి చూశాడు.
ఆవిడ తనేమంటాడో అని ఎదురుచూస్తున్నది.
"కంది పచ్చడి బాగుంది ప్రభా!" అనాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి.
అమ్మో! ఇంకేమన్నా ఉందా! ఆడవాళ్లు ఏ పని ఎంత బాగా చేసినా మెచ్చుకుంటే నెత్తిమీదకెక్కి కూర్చోరూ!
తన మొహంలోని భావాన్ని బయటపడనీయకుండానే తల దించుకుని 'చారు' అన్నాడు. ప్రభావతికి వళ్ళు మండింది. గుండ్రాయిలా కూర్చుని గుటుక్కు గుటుక్కుమంటూ ఇంతింత ముద్దలు మింగుతాడేగానీ 'బాగుంది' అనడీయన.
వేడి వేడి చారు అన్నంలో పోసింది. 'బాగుంది చారు' మనసులోనే అనుకుని మజ్జిగన్నం తిని లేచాడు త్రేన్చుతూ.
"ప్రభావతి వంట బాగా చేస్తుంది. తన ఆరోగ్యం బాగుండటానికి కారణం ఆవిడ శ్రద్దే!" అన్నీ స్వగతాలే!
ప్రభావతి వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి ఉయ్యాల బల్లమీద పడుకుని వున్నాడు నారాయణ.
"శయనించారూ! ఉయ్యాల బల్ల ఒకటి నా ప్రాణానికి. దీని మీద పడుకుంటే ఇంక ఏదీ గుర్తుండదు మీకు" అంటూ ఇన్ లాండ్ కవర్, పెన్ను తెచ్చిచ్చింది ప్రభావతి.
"ఏంటే నీ గోల" మళ్లీ విసుకున్నాడు నారాయణ.
"బావుంది వరస. అన్నీ నా గోలలే. అమ్మాయికి పండక్కి డబుల్ కాట్స్ ఇస్తామని అల్లుడికి ఉత్తరం రాసి పడెయ్యండి" పక్కనే కూర్చుంటూ హుకుం జారీచేసింది.
ఉలిక్కిపడ్డాడు నారాయణ.
"డబుల్ కాట్సా! నీకేమైనా మతిపోయిందా! ఉగాది ఇంకా మూడ్నెల్లుంది. ఎనిమిది వేలన్నా అవుతాయి. ఎలా తేవాలి" రుసురుసలాడాడు.
"అవన్నీ మీకెందుకు. ముందు అమ్మాయి మీద అల్లుడి గెంతులు తగ్గుతాయి. అసలే పిల్ల లేవలేనిది కూడా".
ఆవిడ చాటుగా కళ్ళొత్తుకోవడం నారాయణ కంటపడింది.
'సరేలే...' అయిష్టంగా రాయడం మొదలుపెట్టాడు.
ఎలా రాయాలో దాదాపు డిక్టేషన్ లా రాయించింది ప్రభావతి.
ఉత్తరం రాయటం పూర్తిచేసి అతికించాక అడిగాడు-
"డబుల్స్ కాట్స్ ఎలా ఇవ్వగలం ప్రభా! నాచేత వాగ్దానం చేయించావు?"
"అబ్బో! మీరు వాగ్దానాలన్నీ తీరుస్తున్నట్లు... నా పొలం మీద అయివేజు వస్తుందిగా. అదిచ్చి కొందాం" అందావిడ ప్రేమగా.
"వద్దు ప్రభా! నీకసలే ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకో. ఇప్పటివరకు మీ పుట్టింటి వాళ్లు నీకిచ్చిన బంగారం కానీ, పొలం మీద ఆదాయం కానీ నువ్వు వాడుకుంది లేదు. కొన్నాళ్లు నా చెల్లెళ్లు, తమ్ముళ్లు... ఇప్పుడు మన పిల్లలు. ఇంక నువ్వు అనుభవించేది ఎప్పుడు..."
నారాయణ వాదనలో నిజం ఉందని ప్రభావతికి తెలుసు. అయినా ఆ తల్లి మనసు ఊరుకోలేదు.
"నీ. నా... ఏంటండీ! అన్నీ మన బాధ్యతలే!" అంది నిట్టూరుస్తూ.
"ఇంత చేసినా... 'వదినా! మాకు నీ నగలు తాకట్టు పెట్టి పెళ్లి చేశావు' అని నీ ఆడపడుచులు అనలేదు. ఇంక పిల్లల కోరికలు సముద్రాల్లో అలలే" నారాయణ గొంతునిండా కోపం.
"పోన్లెండి... వాళ్ల సంగతి ఎందుకు. మీరన్నారా... నా ఆదాయం కలిపేగా మీరు ఆస్తి పెంచుకున్నారు" అడిగింది ప్రభావతి.
"అదా! అది వేరు. అయినా పిచ్చిదానా! నువ్వు వేరు. నేను వేరు కాదు" నారాయణ సమర్ధించుకున్నాడు.
"అదీ మగవాళ్ల మాట. అదే నేను మీ ఆదాయం కోరితే, నా స్వంతానికి వాడుకుంటే ఇంత సహృదయత ఉండదు పోన్లే! వదిలేయండి పిల్లకి మాత్రం డబుల్ కాట్స్ నేనే కొనిస్తాను" ప్రభావతి నిర్ణయం చెప్పేసింది.
ప్రభావతి అన్నదంటే మాట మీదే నిలబడుతుంది. నారాయణకీ తెల్సు ఆ విషయం. ప్రభావతి ఆ బాధ్యత తన మీద పెట్టనందుకు అతనికి లోపల ఆనందంగానే ఉంది. ఎంతైనా ప్రభావతి లాంటి భార్య దొరకటం తన అదృష్టం. డబ్బు, సేవ, వినయం అన్నీ కలగలిపి దొరికింది.
"ఏంటి ఆలోచిస్తున్నారు" లైటు తీసేస్తూ అడిగిందామె.
"ఏం లేదు" చీకట్లో ఆమెకేసి ప్రేమగా చూశాడు.
కానీ ఆ చీకటిలో అతని చూపులోని ప్రేమ తరంగాలు ఆమెదాకా పయనించనే లేదు.
ప్రభావతి పడుకుంది. కాస్సేపటికి హాయిగా నిద్రపోయింది. నారాయణ ఆమెకేసి చూస్తున్నాడు. కాస్తంత చామనచాయ అయినా కళ గల మొహం. మనిషి అందగత్తె కాదుగానీ మనసు వెన్న. తనది అంటూ లేకుండా జాయింట్ ఫ్యామిలీకి త్యాగం చేసింది. ప్రభావతి వెంట తెచ్చుకున్న ఆస్తి వల్లే తనింతగా ఎదిగాడు. తన అక్కచెల్లెళ్లు కూడా 'మా వదిన చాలా మంచిది' అంటూంటారు. బంధువులంతా ఆమెని పొగుడుతారు కానీ తనే... ఎందుకో ఒకసారి కూడా 'ఈ పని బాగా చేశావు' అని గానీ, నువ్వు నాకు ఇష్టం' అని గానీ ప్రేమ పూర్వకంగా అనలేదు. మొగుడిగా మొగాడిగానే అధికారం చూపిస్తాడు. అనురాగాన్ని కూడా అధికారికంగానే!
ఒకటి రెండు సార్లు చెయ్యి చేసుకున్నాడు కూడా. అతనికి కాస్త 'ఆడపిచ్చి' వున్నా ప్రభావతి నోరు మెదపలేదు. తల్లీ తండ్రీ లేని ప్రభావతి తన వల్ల ఏంపొందింది? చాకిరీ తప్ప...
ఏంటివ్వాళ ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఏదో పేపర్లో కవితలో చదివాడు. బతికుండగానే ఇష్టమైన వాళ్ళందరికీ చెప్పేయాలట... నిజమేనేమో!
ఆలోచిస్తుండగానే ఎప్పుడో నిద్రపట్టింది.
తెల్లారినా వంటింటి చప్పుళ్లూ లేవు. మెలకువ వచ్చి చూసేసరికి ప్రభావతి అలాగే నిద్రపోయి ఉంది.
"ప్రభా!" లేపాడు. పలకలేదు.
చేతితో తట్టాడు. చల్లని మృత్యుస్పర్శ.
ఉలిక్కిపడ్డాడు.
అంతే! ఆ తర్వాత రావలసిన వాళ్ళు వచ్చారు. జరిగేవి జరుగుతున్నాయి. ప్రభావతి పెట్టిన, ఆమె దాచుకున్న స్వంత డబ్బే ఆన్నింటికి...ఆమె చివరి ప్రయాణానికి కూడా సరిపోతున్నది. చావులో కూడా తనని శ్రమ పెట్టలేదు... తను మాత్రం ప్రభావతిని జీవితమంతా శ్రమపెట్టాడు. ఆమె బతికుండగా ఒక్కనాడయినా కృతజ్ఞతలు చెప్పాడా! బయటివాళ్ళయితే చెప్పేవాడు. భార్య గదా! చెప్పలేకపోయాడు.
ఇప్పుడు నారాయణ ఎంత ఏడ్చినా ప్రభావతికి వినిపించదు. అతని మనసులోని భావాలన్నీ కుప్ప పోసినా ఆమె ఇంక వినలేదు. ఆ అదృష్టాన్ని అతను కోల్పోయాడు.
మర్నాడు పేపర్లో ప్రభావతి ఫోటోకి రెండు వైపులా రెండు దీపాలతో అనురాగ స్మృతి' అంటూ ప్రచురించిన సంతాప ప్రకటనలోని హృదయాలను చదవటానికి ఫోటోలోని ప్రభావతి చిరునవ్వుతో ప్రయత్నిస్తోంది. కానీ ఆమెకది సాధ్యంకాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక స్మృతి మాత్రమే!
                                                                                         (పత్రిక, మాసపత్రిక మే 2002)

                                                         * * *

 Previous Page Next Page