కొడుకు భోజనం చేసి ఆఫీసుకి వెళ్లాడు. కోడలు మామూలుగానే స్నేహితుల ఇళ్లకి వెళ్లింది. సీత ఫోటో కేసి బెంగగా చూస్తూ కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి. దగ్గరుండి ప్రేమగా వడ్డించేవాళ్లు లేరు. నిజంగా సీతకెంత సహనం. విసుక్కోకుండా జీవితకాలం సేవలు చేసింది. భార్య విలువ వృద్దాప్యంలో తెలుస్తుంది. నిస్సారమైన వర్తమానం! ఒక్కొక్కక్షణం గడవడం ఎంత కష్టం. కొడుకు కోడలు తనతో మాట్లాడేదీ లేదు. భోజనాల దగ్గర అందరూ కలిసి కూర్చునేది తక్కువే. చిన్నప్పుడైతే అమ్మా నాన్నలతో కలిసే భోజనం చేసేవాడు. వాసుకు ఇష్టంలేని కూరలు సీత అసలు వండేది కాదు. కానీ ఇప్పుడు అవే కనిపిస్తున్నా వాడు పట్టించుకోవడం లేదు.
ఈ ఇంట్లో తనకు ఎవరున్నారని చూరు పట్టుకు వేలాడటం? సీత లేని ఇల్లు... తాను తనకే భారంగా... ఎవరో స్నేహితుడు చెప్పినట్లు ఆ వృద్ధాశ్రమంలో చేరితోనో! అక్కడైతే కనీసం తనలాంటి వాళ్లు చాలామంది... ఆత్మీయంగా... సానుభూతితో... ఒకే పడవ ప్రయాణీకులు... ఆ వూరుపోయి ఓసారి కనుక్కొని రావాలి. ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి రావచ్చు. కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదు. కొంచెం చూపు మసక... అయితేనేం మేనేజ్ చేసుకోవచ్చు. నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని చెప్పులేసుకుని రైల్వేస్టేషన్ వైపు నడుస్తున్నాడు రామకృష్ణ. ఆయన చూపులు మాటిమాటికీ గడియారం వైపే ఆదుర్దాగా చూస్తున్నాయి.
* * *
వృద్దాశ్రమం తోటలో ఉదయపు నీరెండలో పచార్లు చేస్తున్న రామకృష్ణ ఎవరో పిల్చినట్లనిపించి తలెత్తి చూశాడు.
పచ్చగా హుందాగా టక్ చేసుకున్న ఆ యువకుడు తననే పిలుస్తున్నాడు.
"ఏంటి బాబూ?" రెండడుగులు వేశాడు రామకృష్ణ.
"బాబుగారూ... నేను వినోద్!"
రామకృష్ణకు ఆ మాటలకి కళ్లు మెరిశాయి. తరువాత చెమర్చాయి.
"నువ్వా బాబూ...వినోద్! ఎన్నాళ్లకి..." చేతులు పట్టుకొని ఆనందాశ్చర్యాలతో ఎమోషనల్ గా అయిపోయాడు.
ఇక వినోద్ క్షణం ఆలస్యం చేయలేదు. బలవంతపెట్టి రామకృష్ణను ఖాళీ చేయించి వృద్దాశ్రమం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లాడు. రామకృష్ణ ఎంత వారించినా వినలేదు.
* * *
ఏనాటి బంధం. ప్రాణస్నేహితుడు కొడుకు వినోద్. ఉప్పెనలో తల్లిదండ్రులు ఇద్దరూ కొట్టుకుపోతే చేరదీసి పెంచాడు రామకృష్ణ. వాసుకీ, వినోద్ కీ జరిగిన తగాదాలకి కారణం వాసులోని అసహనమేనని తెల్సినా చేసేదేమీ లేక వినోద్ ని చిన్నప్పుడే హాస్టల్ కి పంపేశాడు. ఆ రోజు సీత కూడా ఎంతో బాధపడింది. వినోద్ అలానే చదువుకుని చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకుని ఒకింటివాడవడం ఆనందకరం! ఉన్నతమైన ఉద్యోగిగా ఎదిగినట్లు తెలుస్తుంటే మనసు బెలూన్ లా ఎగురుతోంది.
కారు ఇంటి ముందు ఆగుతుంటే వినోద్ భార్య, మూడేళ్ల కొడుకు సంతోషంగా బైటికొచ్చారు. వారిని రామకృష్ణకు పరిచయం చేశాడు వినోద్.
తన పాదాలకు నమస్కరిస్తున్న నీరజను మనసారా ఆశీర్వదించాడు రామకృష్ణ. "దీర్ఘసుమంగళీభవ" అంటూ.
తల్లిని అనుసరిస్తున్న అభిషేక్ ని ఎత్తుకొని ముద్దాడాడు.
* * *
అడుగడుగునా ఆ ఇంట్లో జరుగుతున్న మర్యాదలకి మనసు పులకరించిపోతోంది. భారమవుతోంది. భయం కలుగుతోంది.
"నీరజా! బాబుగారికేం కావాలో చూడు. నేను ఆఫీసుకు వెళ్లి వస్తాను."
మర్నాటినుంచీ రెండురోజులు సెలవుపెట్టాడు వినోద్. ఎవరెవరినో పిలిచి తనని ఆకాశమంత ఎత్తుల్లో పరిచయం చేస్తుంటే వారించాడు రామకృష్ణ.
"బాబు వినోద్! వృద్ధాప్యంలో నువ్వు నాకు ఇస్తున్న ఆప్యాయతానురాగాల ముందు నేను చేసింది చాలా తక్కువ. నేను మీకు అతిథిని కాను. మీ ఇంట్లో వ్యక్తిని. ఎవరికైనా ఎక్కువ మర్యాదలు చేస్తే కొన్నాళ్లకు భారమవుతారు.
నా కోసం మీ దైనందిన కార్యక్రమం మార్చుకోవద్దు. మీ ఇంట్లో వ్యక్తిగా చూస్తే చాలు. నాకీ బొమ్మ చాలు అంటూ అభిషేక్ ని హృదయానికి హత్తుకున్నాడు రామకృష్ణ ప్రేమగా...
"మీ రాక వల్ల అనాథలమైన మేము ఎంత ఆనందంగా ఉన్నామో! మీకు ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు. అందుకే ఇలా..." నసిగాడు వినోద్.
"సంతోషం అనేదాన్ని షోగా చూపించనక్కరలేదు. అది దాచినా దాగదు. మొహం మీద నాట్యం చేస్తుంది. ఆ ఆనందం నాకు మీ దంపతుల ముఖారవిందాల్లో పురివిప్పి కనిపిస్తోంది. అది చాలు బాబూ!" తృప్తిగా అన్నాడు రామకృష్ణ.
వినోద్ ఇంటికి రామకృష్ణ వచ్చి వారం అయింది. బజారు దాకా వెళ్లి వస్తానని చెప్పిన రామకృష్ణ ఇంటికి వచ్చేటప్పుడు ఏవో ప్యాకెట్లు పట్టుకొచ్చాడు. అందరినీ పిలిచి ఆప్యాయంగా ఇచ్చాడు.
వినోద్ కు సూట్... నీరజకు చీర.
"తాతా! మరి నాకో..." అభిషేక్ ముద్దు మాటలకి కరిగిపోయి వాణ్ణి హృదయానికి హత్తుకుంటూ "ఈ డ్రెస్ నీకు నాన్నా" అంటూ అభిషేక్ డ్రెస్ ఇచ్చాడు రామకృష్ణ. వాడి మొహం విప్పారింది.
"ఇవన్నీ ఎందుకు తెచ్చారు బాబుగారూ" నొచ్చుకున్నాడు వినోద్.
"నా సంతోషం కోసం వినోద్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. నేను వచ్చే ముందే నా పెన్షన్ ఇక్కడికి బదిలీ చేయించుకున్నాను. ఇప్పుడది ఈ నెలకు వచ్చింది. మీ నాన్న ఇస్తే కాదంటావా అమ్మా."
ఆయన మాటలకు నీరజ చలించిపోయింది. దంపతులు ఇద్దరూ రామకృష్ణ పాదాలకు నమస్కరించారు.
"తాతా! నాకీ డ్రెస్ వేయ్..." అభిషేక్ చేయి పట్టుకుని లాగుతుంటే రామకృష్ణ వాడిని ఎత్తుకుని డ్రెస్ వేయటానికి ప్రయత్నిస్తుంటే వినోద్, నీరజల చిరునవ్వుల్లో... ఆనందభాష్పాల్లో... తరతరాల మానవప్రేమ తళుక్కుమంది!
ఆంధ్రజ్యోతి వారపత్రిక 19-5-2000)
* * *