Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 3

    జ్యోతికి ఏం చెయ్యాలో తోచలేదు. తండ్రి అంటే జ్యోతికి భయం. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళాక తండ్రిని ఎలా ఎదుర్కోవాలి?
    "పదవే జ్యోతీ వెడదాం- పెళ్ళికుమారుడిగారిని చూద్దాం -" రజని హాస్యంగా అంది.
    "ఛీ.... పొండి, మీరేం రానక్కరలేదు-" జ్యోతి కోపంగా అంది.
    "మరేం కొరుక్కుతినేయంలేవే- మీ శ్రీవారిని -" పద్మ వేళాకోళం ఆడింది.
    "ఇదిగో - శ్రీవారు గీవారు అలా మాట్లాడితే వూరుకోను.... ఆలులేదు.... చూలులేదన్నట్టు వాడెవడో.... అసలు నేను చూడనే చూడను - ఇంటికెళ్ళి అమ్మతో చెప్పేస్తా" జ్యోతి బింకంగా అంది.
    "అబ్బో - యీ కబుర్లు ఇప్పుడేలే. మేము ఎక్కడ వస్తామోనన్నదా నీ భయం. భయపడకు తల్లీ మేం రాంలే! నీ వెళ్ళి చక్కగా తలొంచుకుని బుద్ధిగా కూర్చుని పెళ్ళికొడుకుచేత యస్ అనిపించుకో.... తరువాత పెళ్ళికి వస్తాంలే. పదండర్రా క్లాసుకి టైమయిపోతుంది, పాపం అది సిగ్గు పడుతూంది. ఏడిపించకండర్రా. చ్....చ్.
    "ఏడవకు నా చిట్టితల్లీ ఏడవకు" ఒక అమ్మాయి జ్యోతిగడ్డం పట్టుకు ఊరించింది. అంతా నవ్వుకుంటూ తోసుకుంటూ బయటికి వెళ్ళి పోయారు.
    అందరిముందు అవమానం జరిగినట్టు జ్యోతికి కోపం వచ్చింది. తమ్ముడివైపు ఒసారిచూసి "పద ఇంటికి. ఇలా కాలేజీకి పంపిస్తారా -" మొహం మాడ్చుకుని. విసవిసలాడుతూ వెళ్ళింది. రిక్షా ఎక్కి ఆవేశం తగ్గాక జ్యోతిని ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు చట్టుముట్టాయి. అప్పుడే తనకి పెళ్ళా? బి. ఏ. అవకుండానే! అసలింతకి పెళ్ళికొడుకు ఎవరు? ఏం చదివాడు, ఎలా వుంటాడు?- బొత్తిగా తనతో చెప్పకుండా ఇలా చేస్తారా? ఎవర్ని తెచ్చినా చచ్చినట్లు చేసుకుంటానని గాబోలు, ఉక్రోషంగా అనుకుంది.
                              *       *       *       *
    "నా ప్రథమ పుత్రిక  చి. సౌ. జ్యోతికి చి. సుబ్బారావునిచ్చి వివాహంబు నిశ్చయించితిమి గావున తమందరు సకుటుంబ బంధు మిత్రులతో విచ్చేయవలెను" అని సూర్యనారాయణగారి శుభలేఖార్థములు అందుకుని బంధుమిత్ర సకుటుంబ పరివారముగా రాకపోయినా వారింట మొదటిపెళ్ళి అని ఇంటి కొక్కరైనా వచ్చారు.
    ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు లేకపోయినా తన తాహతుకి మించి మొదటికూతురని ఆడంబరంగానే చేశారు సూర్యనారాయణగారు. ఆరువేలు కట్నమిచ్చి అల్లుడికి కాళ్ళు కడిగారు. లాంఛనాలు సలక్షణంగా జరిపించారు. ఏర్పాటులు చూసి మగపెళ్ళివారు సంతోషించారు. వంటలు బాగున్నాయంటూ బంధుమిత్రులు మెచ్చుకుంటూ తేల్చారు.
    జ్యోతి కాలేజి స్నేహితులంతా ఆ రోజు బిలబిలలాడుతూ వచ్చి గలగల మాటలతో, నవ్వులతో చలాకీగా అన్నింటా తామే ఉన్నామంటూ కాఫీలు మొదలు బొట్టు గంధంవరకు, పెళ్ళికూతురిని అలంకరించడంనుంచి పెళ్ళికొడుకుని ఏడిపించడంవరకు అన్నింటిలో పాల్గొని నిజమయిన స్నేహితులమని నిరూపించారు.
    జ్యోతి పెళ్ళి జరిగిపోయింది - అందరూ కడుంగడు సంతసించారు.
    సంతోషించనిది ఎవరయినా వున్నారంటే - ఒక్కరే! ఆమె జ్యోతే! అంటే ఇది ఆమెకుఇష్టంలేని పెళ్ళా? తల్లీ తండ్రి మెడలువంచి బలవంతంగా తాళికట్టించారా? అంటే జవాబు జ్యోతికే తెలియదు. ఇష్టమో అయిష్టమో తనకే తెలియని సందిగ్ధత ఆమెది. ఏదో అసంతృప్తి, ఆవేదన మాత్రం జ్యోతిలో వున్నాయి. ఆమె అనుకున్నది, కోరుకున్నది ఇదికాదు. ఆమె కన్నకలలు ఇవికావు! ఆమెకి తెలియకుండానే ఆమె ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోతూంటే జరుగుతున్నదానితో తనకేం సంబంధం లేనట్టు వూరుకోలేక, అలా అని పూర్తిగా సంతృప్తిపడలేక నలిగిపోతూంది. ఎంతో అద్భుతమయిన చిత్రం చూస్తాం అని ఆశించి టిక్కెట్టుకొని లోపలికి వెళ్ళాక పరమ చెత్త సినిమా తెరమీద కనిపిస్తూంటే డబ్బు ఖర్చు పెట్టాం చూడకపోతే ఎలా అన్నట్టు వెళ్ళలేక మానలేక పడేఅవస్థ ఆమెది! తనకేం కావాలో ఆమెకి తెలుసు! తెల్సినా ఎవరితో చెప్పలేక, చెప్పినా జరగదని, అంగీకరించరని అర్థం అయ్యాక పరిస్థితులకి బానిస అయింది. "పెళ్ళి" ప్రతి జీవితంలో ముఖ్యసంఘటన.
    ఆ పెళ్ళి గురించి జ్యోతి చాలా అందమైన కలలు కంది! జ్యోతి జీవితాన్ని కాచి వడపోయకపోయినా ఎన్నెన్నో పుస్తకాలు, సినిమాలు చూసి అదంతా కాచి వడబోసి తాగేసింది - ఆ పుస్తకాలలో మదురఘట్టాలు. ఆ సినిమాలలో అద్భుత దృశ్యాలు అన్నీ కలవేసి రంగులకలలు కనేది - స్వప్నాలలో తేలిపోయేది. ఏ రైలులోనో ప్రయాణం చేస్తుంటే అందమైనవాడు, ఆజానుబాహుడు, సూటుబూటు వేసుకున్న పెద్ద ఉద్యోగస్థుడు తటస్థపడి వాడు - తనతో కల్పించుకుని పలకరిస్తాడు. తను అతన్ని ఆకర్షిస్తుంది. అతను తన కళ్ళలోకి తదేకంగా చూస్తాడు - తను మైమరచిపోతుంది. సిగ్గుపడి కళ్ళు వాల్చుకుంటుంది - అతను కొంటెగా నవ్వుతాడు - ఇద్దరి మనసులు ప్రధమ వీక్షనంలోనే కలిసిపోతాయి- ప్రయాణం ఆఖర్న అతను రాయబోయే ఉత్తరంకోసం ఆరాటంగా ఎదురు చూస్తుంది ఆఖరికి రానేవస్తుంది ఆ వుత్తరం. ఆ ఉత్తరం చదివి పొంగిపోతుంది.
    తనంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోతుంది. పెద్దలతో మాట్లాడటం, తరువాత దృశ్యం పెళ్ళి! లేదూ అంటే తను బి.ఏ. చదివి ఓ పెద్ద కంపెనీలో పని సంపాదించుకుంది. బాస్ అందమైనవాడు, అల్లరివాడు, అయినా గంభీరుడు. ముందురోజే ఇంకెవరిమీదా చూపని శ్రద్ధా సక్తులు తనమీద కనపరుస్తాడు. కల్పించుకుని మాట్లాడతాడు, కాఫీ యిస్తాడు.
    అలా రోజు రోజుకీ ఇద్దరూ దగ్గరవుతారు. ఆకర్షించుకుంటారు, ప్రేమించుకుంటారు, అతనికి మనస్సు అర్పించేస్తుంది. అతను మరి ఇంకెవరితో మాట్లాడినా ఆమె గుండెకి సూదులు గుచ్చినట్లుంటుంది. బాస్కావాలని ఆమెని ఏడిపించడానికి టైపిస్టుతో చనువుగా వుంటాడు. అసూయపడి బాస్ తో మాటలు మానేస్తుంది.                                

 Previous Page Next Page