Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 29

    కోపంగా ఆమె వేపు చూసి, తల తిప్పుకుని బేరర్ ని పిలిచి ఇంకో కాఫీ ఆర్డర్ చేశాడు.
   
    "నిన్ను నేను వదలను. అవసరమయితే రెండోసారి కూడా 'రేప్' చేస్తాను. నువ్వే చేశావని ఫ్రూఫ్ చేస్తాను. గుర్తుంచుకో" అంది పచ్చిగా మాయాదేవి.
   
    ఆ పచ్చితనానికి విస్తుపోయాడు మనోహర్.
   
    బేరర్ వచ్చి కాఫీ కప్పుని టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు.
   
    గబగబా తాగుతున్నాడు మనోహర్.
   
    "ఈ కోర్టులో ఈ కేసు తేలడానికి చాలా రోజులు పడుతుంది. నువ్వెందుకు మొండి పట్టుదల పడుతున్నావో నాకర్ధం కావడం లేదు. చేతి కందుతున్న స్వర్గాన్ని కాలదన్నుకుంటున్నావ్....ఆలోచించుకో. కోర్టులో తీర్పు వెలువడే అరగంట ముందైనా, నేనంటే నీకిష్టమని చెప్తే, నిన్ను నా కంపెనీకి ఎమ్.డి.ని చేస్తాను. నేను నీ భార్యనవుతాను" అని ఒక క్షణం ఆగి-
   
    "ఇవాళ నువ్వు కనీసం లీవ్ అప్లయ్ చెయ్యకుండా, అబ్ స్కాండ్ అయ్యావు. పర్సనల్ ఆఫీసర్ దగ్గర్నుంచి, నీకు మెమో రాకుండా ఉండాలంటే- నీ హీరోహోండా ఇక్కడ వదిలేసి, నా కారెక్కు" అందామె.
   
    చాలా అసహనంగా వుంది మనోహర్ కి.
   
    తాగుతున్న కాఫీని అలాగే వదిలేసి, బిల్లు తెచ్చిన బేరర్ చేతిలో ఇరవైరూపాయల నోటు పెట్టి, విసురుగా ఏ.సి. రూమ్ లోంచి బయట కొచ్చాడు.
   
    అతని వెనకే బయటకొచ్చింది మాయాదేవి.
   
    కారు డోర్ తెరుస్తూ, హీరోహోండా ఎక్కి అంతే విసురుగా స్టార్టు చేశాడతను.
   
    సాయంత్రం ఆరు గంటలు దాటింది.
   
    హీరోహోండా ఇంటి ముందు ఆగ్గానే వరండాలో అటూ యిటూ కంగారుగా తిరుగుతూ, కనిపించిన మేనమామ కుటుంబరావు, తండ్రి సూర్య ప్రకాశరావుల్ని చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్.
   
    సూర్యప్రకాశరావు ఆ సమయంలో ఇంట్లో వుండటం అరుదు కుటుంబరావు పంటల సీజన్ లో పనులు మానుకుని ఎందుకొచ్చినట్లు....
   
    "ఏం మావయ్యా....బాగున్నావా?" మెట్లపక్కన హీరోహోండాని పెట్టి, మెట్లెక్కి వరండాలోకెళుతూ అడిగాడు మనోహర్.
   
    "బాగున్నాం" అన్నాడు మేనమామ కుటుంబరావు హీనస్వరంతో.
   
    "కోర్టునుంచా...ఆఫీసు నుంచా రావడం" తండ్రి ప్రశ్నించాడు.
   
    "డాక్టర్ దగ్గర్నుంచి" చెప్పి లోనికి నడిచాడు.
   
    లోపల హాల్లో ఒకపక్క మేనత్త విశాలాక్షి, తల్లి గుసగుసలాడుకుంటున్నారు.
   
    మనోహర్ ని చూడగానే వాళ్ళ గుసగుసలు ఆగిపోయాయి.
   
    తన రూమ్ లో కొచ్చి, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో మేనమామ, తండ్రి ఆ రూమ్ లోకొచ్చారు. మేనమామ కుటుంబరావు డోర్ ని దగ్గరగా వేశాడు.
   
    ఓరకంట వాళ్ళని చూస్తున్న మనోహర్ కి ఏదో సీరియస్ సంభాషణకు వాళ్ళు ఉద్యుక్తులవుతున్నారనే విషయం అర్ధమయింది.
   
    "ఏమిటి...చెప్పండి" అన్నాడు బెడ్ మీద కూర్చుంటూ.
   
    నువ్వే చెప్పాలి....మేమే వినాలి" అన్నాడు తండ్రి సూర్యప్రకాశ రావు.
   
    "ఎక్కడో దగ్గర ఏదో విధంగా కాంప్రమైజ్ కాకపోతే జీవితాలు పాడైపోతాయి. బతుకంటే, నీకేమీలెక్క కాకుండా వుంది" ఉపోద్ఘాతంలా అన్నాడు కుటుంబరావు.
   
    "ఎక్కడ కాంప్రమైజ్ కావాలి...." ప్రశ్నించాడు మనోహర్.
   
    "నువ్వు ఆ మాయాదేవి మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకో...." సీరియస్ గా చెప్పాడు తండ్రి సూర్యప్రకాశరావు.
   
    "ఎందుకు చేసుకోవాలి" సూటిగా తండ్రి ముఖంలోకి చూసి ప్రశ్నించాడు మనోహర్.
   
    "ఇందుకు..." అంటూ ఒక న్యూస్ పేపర్ లోని పేజీని అతడికి చూపిస్తూ.
   
    "ఇది చదువు" అన్నాడు మేనమామ కుటుంబరావు.
   
    "న్యూస్ పేపర్స్ లో ఈ కేసు న్యూస్ ప్రతి రోజులువస్తోంది. చిన్న చిన్న ఊహాగానాలతో. అది సర్వసాధారణమే. ఇంతకు పూర్వం పత్రికల్లో రియల్ న్యూస్ లు వచ్చేవి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజమ్ పేరిట, స్కూప్స్ పేరిట ఇష్టం వచ్చిన కథలు...ఎడిటోరియల్స్ రాసేస్తున్నారు ఈ మధ్య.
   
    డబ్బూ, విలువయిన బహుమతులు, మందు పార్టీలూ ఇచ్చినవాళ్ళకి అనుగుణంగా ఎడిటోరియల్స్ రాసే ఎడిటర్లు కొంతమంది తయారయ్యారు. వీళ్ళు 'న్యూస్ జాకాల్స్?' పవిత్రమయిన జర్నలిజాన్ని, స్వార్ధ ప్రయోజనము కోసం ఉపయోగించుకుంటూ, ఫోర్త్ ఎస్టేట్ ని, ఫాల్స్ ఎస్టేట్స్ గా మార్చేస్తున్నారు.
   
    ఇలాంటి న్యూస్ లు, ఈ పేపర్ లోనే కాదు....అన్ని పేపర్స్ లోనూ వచ్చాయి" అన్నాడు మనోహర్ నిరసనగా.
   
    "అది కాదు_ఇది ముందు చదువు" అంటూ పేపర్ ని చేతిలో పెట్టాడు మేనమామ కుటుంబరావు.
   
    అది "జనాంధ్ర" దినపత్రిక, సెకెండ్ పేజీలో బాక్స్ కట్టివేసిన మూడు కాలాల ఐటమ్ అది.
   
    హైదరాబాద్, జూన్ 22.
   
    హైదరాబాద్ కు చెందిన మాయా ఎంటర్ ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్.డి.మిస్ మాయాదేవి, ఆ కంపెనీలో ఉన్నతోద్యోగి అయినా ఎమ్ మనోహర్ ల మధ్య జరుగుతున్న కోర్ట్ కేసుకు సంబంధించిన వాదోపవాదాల గురించి మా పాఠకులకు తెల్సు.
   
    ఇది ఇద్దరు స్త్రీ, పురుషుల వ్యక్తిగతమయిన విషయం అయినప్పటికీ, పబ్లిక్ లోకి వచ్చిన విషయం కాబట్టి, దీనిపట్ల పాఠకులు కూడా ఉత్సాహం చూపుతున్నారన్న విషయం మా దృష్టికొచ్చింది. ఈ కేసు కోసం 'స్పెషల్ కోర్ట్' ఎందుకు ఏర్పాటు చేశారన్నది ఆసక్తిదాయకమయిన ప్రశ్న.
   
    "ఇల్లీ గల్ కాంటాక్ట్" ఈ కేసుకు మూలమని అందరికీ తెల్సిన వాస్తవం. కాగా ఇప్పటి వరకూ అందరికీ తెల్సినట్లుగా మనోహర్ అనే వ్యక్తి, మిస్ మాయాదేవి తనను రేప్ కు గురి చేసిందనేది పాయింట్ - ఈ పాయింట్ అన్నిచోట్లా చర్చనీయాంశమవుతోంది.

 Previous Page Next Page