చంద్రశేఖర్ మాటలు ఆ ఇంగ్లీషు లెక్చరర్ కి నచ్చలేదు.
"ఏమిటండీ మీరు! ఆ రౌడీ మూకని వెనకేసుకొస్తున్నారు? పసివాళ్ళా వీళ్ళు! పచ్చినెత్తురు త్రాగే రాక్షసులు కాని! 'అభిమానిస్తూ, మన్నిస్తూ' మనం మాట్లాడితే మన మాట వినే దెవడండీ? మన మంచితనాన్ని మెదకదనంగా_మన సహృదయతని చవటతనంగా_వ్యాఖ్యానించుకుని మనసు మరింత ఏడిపిస్తారుగాని, అర్ధం చేసుకుని గౌరవిస్తారా? అసలు వీళ్ళలో ఎవరైనా చదువుకోవటానికి కాలేజి కొస్తున్నారా? అల్లరి చెయ్యటానికీ, రౌడీ వేషాలు వెయ్యటానికీ వస్తున్నారు కాని....ఛీ! ఛీ! వీళ్ళకు చదువు చెప్పాలనుకోవటం బుద్ధి తక్కువ. ఒక్కొక్కడినీ చింతబరికె పుచ్చుకుని చావబాదినా పాపం లేదు."
"మీరు పొరపాటు పడుతున్నారు. పిల్లలెప్పుడూ సహజంగా చాలా మంచివాళ్ళు. పరిస్థితులే వాళ్ళనిలా తయారు చేస్తున్నాయి. ఎవరైనా సమర్ధులు పూనుకొని అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితులు చక్కదిద్దగలిగితే అప్పుడు మీకే అర్ధమవుతుంది."
"హుఁ! అలాంటి రోజు వస్తుందా అసలు?"
"తప్పకుండా వస్తుంది. 'సంభవామి యుగే యుగే' అన్న గీతా వాక్యంలో అర్ధమిదే! పరిస్థితులు మరీ విషమించినప్పుడు తప్పకుండా దక్షుడొకడు ప్రభవిస్తాడు...."
"ఏమిటో-తెలుగు లెక్చరర్ గారి వేదాంతం...." వెటకారంగా నవ్వేశాడు ఇంగ్లీషు లెక్చరర్.
చూస్తూ ఉండగా పరిస్థితులు మరో మలుపు తిరిగాయి. యాజమాన్యం వారి బంధువుల తాలూకు ఎవరో ఇంగ్లీష్ లో ఎం.ఏ. పాసయి ఉద్యోగం లేకుండా ఉన్నాడు. ఆ బంధువు కోసం యాజమాన్యంలో ఒక మెంబరు, ఆ ఇంగ్లీష్ ఎం.ఏ. ను తమ కాలేజీలోనే వేసుకోవాలనుకున్నారు.
ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీలలో యాజమాన్యం వారు అతి సునాయాసంగా తమకు ఇష్టం లేని వ్యక్తిని ఉద్యోగంలో నుండి తొలగించి, తమకు కావలసిన అభ్యర్ధిని వేసుకునేవారు. ఇటీవల అలాంటి అవకతవకలు జరగకుండా కొన్ని రూల్స్ వచ్చాయి. అంచేత తమ అభ్యర్ధిని వేసుకోవటం కోసం యాజమాన్యంలోని మెంబరే తెర వెనుక ఉండి విద్యార్ధులచేత ఈ అల్లరి చేయిస్తున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసేసరికి ఇంగ్లీష్ లెక్చరర్ మరింత రెచ్చిపోయాడు.
"నేను అంత చేతకానివాళ్ళనుకుంటున్నారు! మూడేళ్ళ సర్వీస్ ఉన్న తర్వాత ఇప్పుడు తమ అభ్యర్ధి ఉన్నాడని నన్ను తీసెయ్యాలనుకుంటున్నారా? నాకూ పాలక వర్గంలో పరపతి ఉంది. చూస్తాను, నన్నెలా తీసేస్తారో?" అని ఛాలెంజ్ చేశాడు.
ఇంగ్లీష్ లెక్చరర్ కి పై అధికారంలో ఉన్నవాళ్ళెవరో తెలుసు. తన అభ్యర్ధి కోసం ఆ అధికారి తనూ తెర వెనుక నిలబడి విద్యార్ధులను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు.
"కుమార్ చంద్రశేఖర్ సార్ కొడుకు-బ్రాహ్మడు. ఇంగ్లీష్ సార్ కి కుమార్ మీద ఏ కోపమూ లేదు. పాఠం చెపుతుండగా నగ్న సుందరి బొమ్మ మీద పడేస్తే సహించలేక, ఒక లెక్చరర్ గా విద్యార్ధి మేలు కోరి కుమార్ ని చెంపమీద కొట్టారు. అది సాకుగా తీసుకుని షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్ధులు బ్రాహ్మణ ద్వేషంతో ఇంగ్లీష్ లెక్చరర్ ని తొలగించాలని ఆందోళన లేవదీశారు!" అని విద్యార్ధులలోనే మరొక గ్రూప్ సమ్మెకు వ్యతిరేకంగా ప్రతిఘటన ప్రారంభించింది.
ఇదంతా చూసి మతి పోయింది చంద్రశేఖర్ కి!
తమ స్వప్రయోజనాల కోసం ఈ విద్యార్ధులను పావుల్లా వాడుకుంటున్నారు. తెర వెనుకవున్న పెద్దమనుష్యులు! అతి సామాన్యమైన విషయాలకు, ప్రాంతీయాభిమానాల పేరుతో, కుల మతాభిమానాల పేరుతో__లేనిపోని రంగులు పులిమి కక్షలూ, కార్పణ్యాలూ రెచ్చగొడుతున్నారు.