Previous Page Next Page 
ఆత్మబలి పేజి 29

   
    "కొంత వయసువరకే అది. మీరు ఉద్యోగం చేస్తూ మీ అమ్మగారి కాధారంకాగలవయసు మీకుంది. ఇంకొకరి కాధారం కావటం సంగతలా ఉంచి ముందు మీరు నిలబడండి."
    "ఇప్పుడు నాకుద్యోగ మెవరిస్తారు?"
    "ఇప్పుడెవరూ ఇవ్వరు. మీరు చదువుకోవాలి. చదువుకుంటే ఉద్యోగమదే వస్తుంది."
    "చదువా?" భయంగా చూశాడు.
    "అంత భయపడవలసిందేమీలేదు. మొదట్లో నవలలు చదవగలిగేవారా? ఇప్పుడు చదువుతున్నారు గదా! అలాగే! మొదట్లో విసుగ్గా ఉంటుంది. మనసు నిలవదు. కొంత శ్రమపడండి. కొన్నాళ్ళయ్యాక అదే అలవాటవుతుంది. మీ సంపాదనతో నాకొక్క పువ్వు కొని ఇవ్వరూ?"
    చలపతికి ఉమమీద తనకే అర్థంకాని వల్లమాలిన మమకారం ఉంది. ఉమ ప్రార్ధన కాదనగలిగే శక్తి అతనికి లేదు.
    ఖిన్నుడై అక్కడినుండి వెళ్ళిపోయిన చలపతి ఆ రాత్రి తనంత తానే మెట్రిక్ పుస్తకాల దగ్గర కూర్చున్నాడు. ఉమ సంతోషానికి అవధులు లేవు. తన తపస్సు ఫలిస్తుందా? ఉమ అతనిప్రక్కనే కూర్చుని ఆ పుస్తకాలు అతనితోపాటు తానూ చదవనారంభించింది. అతనికి విసుగు రాకుండా ఉండటం కోసం మధ్య మధ్య చదువాపి పాఠాలను గురించే చర్చలు మొదలుపెట్టేది. మొదట విసుగనిపించినా ఉమ తన కూడా ఉండటంతో, చలపతికి క్రమంగా చదువులోనూ శ్రద్ధ కలిగింది. ఈ కారణంగా తనకు ఉమ సాంగత్యం అధికంగా లభిస్తోంది.
    తను చదువుకుంటే ఉమకు చాలా సంతోషం. అంతేకాదు. తను బి.ఏ. పాసయితే ఉమ తనదయిపోతుంది.
    చలపతి కష్టపడి చదవసాగాడు.


                                       19


    "నాకేం చెయ్యాలో తోచటంలేదు వదినా!" ఉమ దగ్గిరకొచ్చి కూర్చుని అంది కాళి.
    "ఏ విషయంలో కాళీ!"
    "అదే! ఆ సుధాకరరావుగారి విషయంలో. నన్ను పెళ్ళి చేసుకోమని ప్రాణాలు తినేస్తున్నారు. అందంగానే ఉంటారనుకో. అయినా చదువూ, అందం ఉన్నంత మాత్రాన చూస్తూ చూస్తూ ఆస్తి లేనివాడినెలా చేసుకోను వదినా!"
    పైకేమీ అనకపోయినా లోలోపల ఆశ్చర్యపోయింది ఉమ. చలపతి కంటే మరికాస్త వికారంగా ఉంటుంది కాళి. చలపతి వెఱ్ఱిబాగులతనంలో అమాయకత్వంతో కూడిన సరళత్వం ఉంది. కాళి వెఱ్ఱిబాగులతనంలో గడుసుతనంతో కూడిన వక్రత ఉంది. ఐశ్వర్యమూ అంతంత మాత్రమే! అలా అలా రోజులు గడుస్తున్నాయి. అట్లాంటి కాళిని అందమూ, చదువూ ఉన్న యువకుడు కోరటమూ, కాళి కాదనటమూనా?
    "పోనీ. చేసుకోరాదా కాళీ!" అంది.
    "ఎలా వదినా! ఆస్తిపాస్తులు లేకుండా ఎలా సుఖపడగలను? పుట్టింటా దరిద్రం అత్తింటా దరిద్రమేనా? నేను పడలేను బాబూ!" అంటూ వెళ్ళిపోయింది కాళి. ఆ విషయం అంతటితో మరిచిపోయింది ఉమ.
    తరువాత కొద్దిరోజులకు మళ్ళీ ఎవరో చంద్రశేఖరాన్ని గురించి చెప్పింది కాళి. ఇతనికి అందమూ, డబ్బు ఉన్నాయి కాని, చదువులేదుట.
    "నాలాంటి తెలివిగలది ఒక చదువురాని వాడితో కాపురం చెయ్యగలదా వదినా?" అంది కాళి. ఎంత అణచుకున్నా నవ్వు పొంగివచ్చింది ఉమకు. తన ముఖం కనపడకుండా పక్కకు తిప్పుకుని "అవును" అంది శాంతంగా.
    అక్కడితో ఆగక కాళి, తరువాత కొద్దిరోజులకు మళ్ళీ ఎవరో కిశోర్ గురించి చెప్పింది.
    మళ్ళీ భానుమూర్తి గురించి.
    అప్పటికి ఉమకు ఒక విషయం అర్ధమయింది. సుధాకరరావు దగ్గర్నుండి భానుమూర్తి వరకూ కాళి చెప్పిన వ్యక్తులు సజీవ మూర్తులు కారు; కాళి ఊహామూర్తులు. కాళికి అందం లేకపోయినా వయసుంది. వయసులో ఉన్న మనసు రేపే కల్లోలాన్ని ఇలాంటి కథలతో కప్పుకోవాలనుకుంటోంది. వాస్తవంతో ఏ మాత్రమూ సంబంధంలేని భావనలతో తనను తాను మోసగించుకుంటూ తృప్తిపడుతోంది.
    నవ్వూ, జాలీ రెండూ కలిగాయి ఉమకు. ఇంటికేమొగవాడు వచ్చినా, అతని దృష్టి నాకర్షించాలని కాళి చేసే ప్రయత్నాలు చూస్తుంటే ఒక వంక చికాకూ, మరొక వంక ఆవేదనా కలిగేవి. అన్నింటికంటే పెద్దవాళ్ళు కాళిని మందలించకపోవటం మరింత ఆశ్చర్యం కలిగించేది.
    పరీక్ష రోజులు దగ్గరపడుతున్నాయి. చలపతి పట్టుదలగానే చదువుతున్నాడు. మధ్యలో పిలిచింది వర్ధనమ్మ. పుస్తకం మూసి వెళ్ళాడు చలపతి.
    "ఇది విన్నావుట్రా?" అంటూ మొదలుపెట్టి, మధ్య మధ్య కాళి అందిస్తుండగా, పక్కింటి భార్యాభర్తల దెబ్బలాట వివరించటం మొదలుపెట్టింది వర్ధనమ్మ. మొదటినుండే అలాటి వాతావరణాని కలవాటుపడ్డవాడు గనుక కొద్ది క్షణంలోనే పుస్తకం మాట మరిచి ఆ కబుర్లలో లీనమయిపోయాడు చలపతి. ఒక అరగంటవరకూ సహనంతో ఉంది ఉమ. ఆ కబుర్లకు ఒక అంతంటూ ఉన్నట్లు కనిపించలేదు. ఇంక సహించలేక చలపతి నుద్దేశించి "మీకు పరీక్షలు దగ్గిరపడుతున్నాయి. ఆ కబుర్లు పెద్ద ముఖ్యమైనవి కావు. చదువు అశ్రద్ధ చెయ్యకండి" అంది.
    వెంటనే చలపతి కూర్చున్నచోటినుంచి లేచాడు. వర్ధనమ్మ ఈ అవమానం సహించలేకపోయింది.
    "చదువుకోవచ్చులేరా! చదువు వంకతో ఆ గదిలో కూర్చోవటమేగా! కొంచెంసేపు నాదగ్గిర కూర్చో!" అంది.
    చలపతి ఒక్కసారి ఉమ కళ్ళలోకి చూసి తలవంచుకుని గదిలో కెళ్లిపోయి పుస్తకం ముందు కూర్చున్నాడు. ఉమ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. వర్ధనమ్మ నిర్ఘాంతపోయింది. ఈ పరాజయం ఆమె సహించలేకపోయింది. ఉమ మీద విరుచుకుపడింది.
    "ఏం మహాతల్లీ? తల్లీ కొడుకులు ఒక్క నిమిషం మాట్లాడుకోకూడదా? వాడు అస్తమానూ నీ కొంగుపట్టుకునే తిరగాలా? ఎంతకు తెగించావ్! నా ఎదురుగానే నా కొడుకును నా దగ్గిరనుండి లేచిపొమ్మని ఆజ్ఞాపించావు."
    "మీరు పొరపాటు పడుతున్నారు అత్తగారూ! ఆయనకు పరీక్షలు దగ్గిరపడుతున్నాయి. అందుకని చదువుకోమన్నాను. తల్లీ కొడుకులను వేరు చెయ్యాలని నా ఉద్దేశంకాదు." నెమ్మదిగా అంది ఉమ.

 Previous Page Next Page