Previous Page Next Page 
ఆత్మబలి పేజి 28


    ముఖం తిప్పుకుని వడివడిగా నడిచి ఇంటికి చేరుకుని తన చాపమీద వాలిపోయింది. అగ్నిపర్వతం బద్దలైంది. 'లావా' శోభ కళ్ళనుండి స్రవించింది.


                                     18


    చలపతికి చదువులోకి దింపటం సామాన్య విషయంలా తోచలేదు ఉమకు. ఉమ మాట దానకలేక పుస్తకాన్ని చేత్తో పుచ్చుకునేవాడు. కాని 'చదువు' అనగానే అతనినొక 'విసుగు' లాంటిది ఆవరించేది. మనసు బండబారిపోయేది. ఆ కారణంగా అతను చదివింది గోడలకూ, వాసాలకూ అయినా వంటపట్టేది కాని, అతనికి మాత్రం అబ్బేదికాదు. ఉమ కృంగిపోయింది. చదువు డిగ్రీలకూ ఉద్యోగాలకూ మాత్రమే కాదు మానసిక వికాసానికి కూడా అవసరం. చదువుకున్న వాళ్ళలో కూడా మూర్ఖులుండవచ్చు. కాని చదువుకోని మూర్ఖుల సంఖ్యకంటే, చదువుకున్న మూర్ఖులసంఖ్య తక్కువ.
    చలపతి మనసులోని మూర్ఖత్వాన్ని తొలగించి దానిని సవ్యమార్గంలో ఎలా ప్రవేశపెట్టాలా అనేది ఉమను అహర్నిశలూ బాధించే సమస్య అయిపోయింది.
    ఒకనాడు వర్ధనమ్మా, కాళీ, ఎవరి గురించో ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళకది ఎప్పుడూ అలవాటే! అలాంటి సంభాషణలంటే ఉమకెంత విసుగయినా, తన విసుగును తనలోనే అణచుకుని వీలయితే అక్కడినుంచి లేచిపోయేది. వీలుకాకపోతే, వాళ్ళ మధ్య కూర్చునే, వాళ్ళ మాటల్లో ఒక్కటీ వినిపించుకునేది కాదు. ఆనాడు అలా విధిలేక కూర్చుంది. చలపతి కూడా అక్కడే కూర్చున్నాడు. చలపతి అలా ఆడవాళ్ళమధ్య కూర్చుని ఆడంగి కబుర్లు వినటం ఉమకిష్టం లేదు. అలా కూర్చోవద్దని ఒకటి రెండుసార్లు చెప్పింది కాని ప్రయోజనం లేకపోయింది. వాళ్ళమధ్య కూర్చునే వాళ్ళ మాటలతో సంబంధం లేకుండా పరధ్యానంగా ఆలోచించుకుంటున్న ఉమ "ఆ తర్వాత ఏమయిందీ?" అని కుతూహలంగా అడుగుతున్న చలపతి కంఠంతో ఈ లోకంలోకి వచ్చింది. ఆ కుతూహలం క్షణకాలం వెగటనిపించినా ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. విషయాలను వినటంలో ఇంత ఆసక్తిని చూపిస్తున్న వ్యక్తికి కథలలోనూ ఆసక్తి ఉండచ్చు. కథలవైపు మనసు మళ్ళించి నవలలు చదవటంలో ఆసక్తి కలిగించి, తద్వారా పుస్తకాలు చదవటం అలవాటు చేయగలిగితే? ఏమో! ప్రయత్నించాలి.
    ఆ రాత్రి ఉమ చలపతికి తను చదివిన నవలలో కథ వినిపించింది. చలపతి ఎంతో శ్రద్ధగా విన్నాడు. అంతేకాదు, "నాకు కథలంటే చాలా ఇష్టం. నీకు చాలా కథలు వచ్చులా ఉంది. నాకు చెప్పవా?" అన్నాడు.
    "నేను చెప్పటం దేనికి? ఎన్నో మంచి కథలు పుస్తకాలలో ఉంటాయి. చదువుకోండి."
    చదువుకోమనగానే చలపతి ముఖం మలినమయింది. మాట్లాడకుండా తన మంచంమీద పడుకున్నాడు. ఉమంటే చలపతికి మమకారం. చదువుకున్నదని ఏదో భయం; చదువున్నా ఇంత నమ్రతగా ఉన్నదని అంతులేని గౌరవం.
    ఉమను స్పృశించాలనీ, మాట్లాడాలనీ ఎన్నో కోరికలు చెలరేగుతున్నా, ఉమ మాటకు కట్టుబడి దూరంగానే ఉండిపోయాడు. ఉమ కోసమైనా చదవాలని ప్రయత్నించేవాడు. తనకు దూరంగా ఉండమని కోరటంలో ఉమ ఆశించింది ఇదే! కాని, మనసు చదువుపై లగ్నం చెయ్యలేకపోయేవాడు. విచ్చలవిడిగా అజ్ఞానమార్గంలో పెరిగిన మనసు క్రమబద్ధంగా జ్ఞానమార్గంలో కేంద్రీకరింపబడటం సాధారణ విషయం కాదుమరి!
    మరునాడు ఉమ ఒక మంచి నవల ఏరి అతనికిచ్చింది, చదవమని. రెండువాక్యాలు చదివి విసుగ్గా "ఇందులో కథలేదు." అన్నాడు చలపతి.
    "అంతలోనే విసుగా? ఓపిగ్గా చదవండి."
    "అబ్బా! ఇన్ని పేజీలు ! నేను చదవలేను. నువ్వు చెప్పెయ్యి." అంటూ పుస్తకం విసిరేశాడు.
    ఉమ హతాశురాలైంది. కొంతసేపు తీవ్రంగా ఆలోచించిన మీదట ఆమెకొక ఆలోచన వచ్చింది. మరీ మంచి నవలలు కాక చందమామలాంటి చిన్న పత్రికలు చదవటానికిస్తే చదువుతాడేమోనని వెంటనే చందమామ తీసుకొచ్చి "ఇదిగో చూడండి! మొత్తం పది పేజీలే. ఈ కథ చాలా బాగుంటుంది. చదవండి" అంది. విసుగ్గానే అందుకున్నాడు చలపతి. పది పేజీలే కదా అని ఓపిగ్గా చదవటం ప్రారంభించాడు. మొదటిపేజీ పూర్తయ్యేసరికే కథలో లీనమయిపోయి మిగిలిన తొమ్మిది పేజీలూ నెమ్మదిగానే అయినా, విసుగులేకుండా చదివేశాడు.
    "చాలా బాగుంది కథ" అన్నాడు.
    ఉమ బ్రహ్మానందభరితురాలయింది. క్రమక్రమంగా చలపతికి 'చందమామ'లు చదవటం అలవాటయిపోయి చదవకుండా ఉండలేని స్థితికి వచ్చాడు. నెమ్మదిగా నవలలోకి దింపగలిగింది ఉమ.
    ఒకనాడు ఉమ ఏదో చదువుకుంటూ ఉండగా వెనుకనుండి వచ్చి ఉమ తలలో పువ్వులు పెట్టాడు చలపతి. ఉమ ఆశ్చర్యంగా అతనివంక చూసింది. కొంచెం బెదిరి చేతులు నలుపుకొంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నవాడిలా అన్నాడు.
    "నేను చదివిన నవలలో అతను పువ్వులు తెచ్చిస్తే ఆవిడ 'ఇవి చాలు నాకు. భద్రంగా హృదయంలో దాచుకుంటాను. మెత్తని ఈ పూలలో వెన్నవంటి మీ మనసును చూస్తూ, కమ్మని ఈ పరిమళాలలో మీ అనురాగాన్ని అర్థం చేసుకొంటూ ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతురాలినని గర్వించగలను. నాకింకేం బహుమతులూ అక్కర్లేదు.' అంటుంది. నువ్వూ అలా అంటావేమోనని తెచ్చాను."
    ఉమ ఆశ్చర్యానికి అంతులేదు. నవలలు చదివి అందులో విషయాలు అర్థం చేసుకుని గుర్తుంచుకోగలగటమేకాక, అనుభవంలోకి తెచ్చుకోవాలని ఆరాటపడేటంతవరకూ ఎదిగాడా తన భర్త?
    నెమ్మదిగా తలలో పూలుతీసి భర్త చేతిలో పెట్టింది. చలపతి బిత్తరపోయి చూశాడు.
    "నన్ను క్షమించండి. మీరు నవలలో చదివిన యువతిలా అనాలనే నా ఆశ. అలా అనగలిగే శుభఘడియకోసమే ఆత్రుతగా ఎదురుచూస్తుంటాను. కాని, ఇప్పుడుమాత్రం అలా అనలేను."
    "ఏం? ఎందుకని అనలేవు?"
    "మీరు మీకాళ్ళమీద నిలబడి మీ సంపాదనతో నాకొక్క పువ్వు కొనివ్వండి. దానిని నేను భద్రంగా హృదయంలో దాచుకుంటాను. ఈ పూలు మీ అమ్మగారిని డబ్బడిగి కొనితెచ్చి పెట్టినవి. మీ బహుమానంగా వీటిని అందుకోలేను."
    "అమ్మ డబ్బులు నా డబ్బు కాదా?"

 Previous Page Next Page