Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 29


                      అధివాస్తవికుల ప్రవేశం


    కాసరమా వికారములు కార్చకు పూసరమా మసారపున్
    రాసులలో కపాలములు రాల్చకు తావళమా విషాదపున్
    వేసములో కుశాసనము పేర్చకు రాసభమా సమాధిలో
    మీసముపెంచి మా తొడలమీద నటించకు పుణ్యమయ్యెడున్

 

    నిచ్చెన పచ్చి నెత్తురులు నింపి నిలింపుల దుంప త్రెంపి కా    
    ర్చిచ్చులు త్రచ్చుకొన్నది శచీపతి పీచుమిఠాయి వేటలో
    పచ్చిక మచ్చికైనది క్షపాకర భీకర సూకరాకృతుల్
    పిచ్చిదనాలు పోయిరి కబీరును త్రాగిన రోషనారలై

 

    ప్రాతది సూదికన్ను పొరపాటున తా తెరచాటు చేసి ఘో
    షా తిలకించబోయి వెదజల్లును గుమ్మడి పూదుమారముల్
    లేతది రావికొమ్మ పడలేదు భయానక దందశూక ని
    ర్ఘాత పతాక దానికొరకై యిరుకైనవి సందులెందుకో

 

    గంధముగా మెడన్ పులుమగా తలపోయుదు వంధకారపున్
    బంధకి యూర్చు జాలి చనుబాలను గాలము వేసి లాగుచున్
    సింధువు పిల్చెనా పరిహసించెడు సైగల? సుప్తశోణ పా
    ణింధమ ఖడ్గదార హవణించకుమీ తిలకాష్ఠ వహ్నిలోన్

 

    మ్రింగి తిమిగిలాంగల తమిస్రగుహాంతర మీనమేష పా
    రంగతులైన బొంగరములార యెరింగిన తెల్పుడా పరి
    ష్వంగము పాడుటెందుకు? విపంచికి కంచికి దూరమెంత? వ
    డ్రంగుల రంగులా గులకరాళ్ళగు మా గుడిలోని లింగముల్?

 

    ఉద్యమ నాయకా చదువుకోః వినిపించని కంచుకాగడా
    వాద్యములన్ నిశానిశిత వల్లరి అల్లరి యల్లికన్ సము
    త్పాద్య సుధావృథావ్యథలు భాషకు లొంగని భావశాఖలో
    చోద్యము లూహలో మలుపు చూడ్కులు నీతలమున్క కాన్కలై

 

    కైకొని కాకికన్ను కలకాలపు చూపులు రెక్క రిక్కపై
    పైకొని మేకుతాకిడికి ప్రాణము హాయి బజారు జారుడై
    డాకయికై కడాని పగడాల గుడారములో విడాకులై
    రోకలి రోదనాకులత రోదసినిండిన రోగభోగమై

 

    మౌనము శంఖమై చెరగుమాయగ నేత్రపతంగ బింబ ని
    ధ్వానము కొంగనెత్తురులు త్రాగెడు నల్లతురాయి పూవుగా
    వేనలిపై అవే అయిదువేల కుళీర కుఠార దారుణ
    ప్రాణ శిలీంధ్రముల్ తిరుగుబాటు తుపాకి తుపాను కానుపుల్

 

    వచ్చెడువాడు ఫల్గుణుడు వార్దితరంగ మృదంగ ఘోషలో
    విచ్చెడు మచ్చునందు పలవించెడు కించి దుషస్తుషారముల్
    పచ్చిక మచ్చికైనది ప్రపంచపు నెత్తురు మంటపాటలన్
    మెచ్చనివాడ నీ మెడలమీద నివే ఉదయాద్రి రౌద్రముల్

 

                                                                 - కాగడా - 1950 - 41...

 Previous Page Next Page