Previous Page Next Page 
మగబుద్ధి పేజి 29


    నరేష్ హడావుడిగా బయల్దేరుతున్నాడు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా అలసటగా ఫీల్ కావడం లేదు అతని మనసంతా టెన్షన్ తో బిగదీసుకుపోయింది. ఇంకాసేపట్లో 'ఆపరేషన్ టూ' ప్రారంభం కాబోతోంది. ఆపరేషన్ నెంబర్ వన్ లో పొస్టుమేన్ లే విలన్లయి అతనిని ఒక ఆట ఆడించారు. అలా కాకుండా 'నెంబర్ టూ' సక్సస్ అయితే రజని తన ఒళ్లో వాలిపోతుంది. ఆమె దృష్టిలో తను ఒక హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికే అతను ఈ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ సక్సస్ కావాలని అతను అప్పటికే చాలాసార్లు భగవంతుడ్ని ప్రార్థించాడు.

 

    బట్టలు మార్చుకోబోతుండగా ప్రసాద్ వచ్చాడు.

 

    "హలో నరేష్! ఎక్కడికి ప్రయాణం?" అడిగాడు అతను.

 

    ఇప్పుడు ఇతను తగలడ్డాడేమిటని అతను మనసులోనే విసుక్కుంటూ "అలా బజారుకు వెళదామని బయల్దేరాను సార్" అని చెప్పాడు.

 

    "బజారుకా! నాకూపనుందయ్య. నేనూ వస్తాను, ఇద్దరం నా మోపెడ్ లో వెళదాం" అన్నాడు ప్రసాద్ ఆనందంగా.

 

    నరేష్ కి అతని వాలకం కొత్తగా వుందనిపించి, పరిశీలించి చూశాడు తెల్లటి జుబ్బా, గోచి పోసిన టెరికాటన్ పంచెలో అచ్చు అతను ఫస్ట్ నైట్ పెళ్ళికొడుకులా ఉన్నాడు.  

 

    "ఏం సార్! కొత్త పెళ్ళికొడుకులా మెరిసిపోతున్నాడు."

 

    "అవునయ్యా! ఈరోజూ శుభదినం. మధ్యాహ్నం నేను చిరంజీవిని అద్భుతంగా అనుకరిస్తున్నానని, తనకు పడక మూడ్ వస్తోందని, ఈరోజే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయమని మా ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరాత్రి గడిస్తే బ్రహ్మచర్యం చెరనుంచి నాకు విముక్తి కలుగుతుంది" ఆనందం అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది.

 

    "కంగ్రాచ్యులేషన్స్ సార్"నరేష్ చెప్పాడు.

 

    "థాంక్ యూ, ఈ శుభవార్తతో పాటు ఇంకొక అశుభవార్త కూడా ఉందయ్యా" ప్రసాద్ ముఖంలో చీకట్లు ప్రవేశించాయి.

 

    "ఏమిటి సార్?"

 

    "వక్కపొడి, సిగరెట్లు, మాన్పిద్దామని విస్కీ ఇమ్మన్నావా? ఆ మహానుభావుడు, అదే నా తండ్రిగాడు ఇప్పుడు గొప్ప తాగుబోతుడై పోయాడయ్యా. ఇప్పుడు మౌడు ఔన్సుల విస్కీ తాగి, వక్కపొడి నములుతూ, సిగరెట్లు, తగలేస్తున్నాడయ్యా, ఎలా చావను? గుడ్డిలో మెల్లలాగా నా శ్రీమతి నన్ను చిరంజీవి అని అంగీకరించింది. అంతేచాలు. చిరంజీవిలా భావప్రకటన చేయడానికి నేను పడ్డ తిప్పల్ని కళ్ళారా చూశావు కదా. నిద్రలేస్తే మరోపని లేకుండా నిలువుటద్దం ముందు నిలబడి కష్టపడి చిరంజీవి మేనరిజమ్స్ ప్రాక్టీసు చేశానయ్యా."   

 

    "మీ నాన్నగారూ బాగుపడతారులే సార్."

 

    "ఇప్పుడు ఆయనచేత ఆ మూడు దురలవాట్లూ మాన్పించాలంటే ఏం చేయాలో చెప్పు" అడిగాడు ప్రసాద్.

 

    కొంతసేపు ఆలోచించాక చెప్పాడు అతను. "ఆ మూడు దురలవాట్ల నుంచి ఆయన మనసు మళ్లించే ఓ కొత్త అలవాటు నేర్పించాలి సార్. అప్పుడు మిగిలిన మూడింటినీ మరిచిపోతారు. కొత్త అలవాటును మెల్లగా మాన్పిద్దాం సార్. అందువల్ల ఈసారి మీనాన్నగారికి చీట్లపేక నేర్పివ్వండి సార్. ఆయన ఆ ధ్యాసలో పడి మిగిలిన అలవాట్ల జోలికి వెళ్ళరు."

 

    ప్రసాద్ తలవూగించి "నేను బజారు వెళుతున్నాను. గదిని అలంకరించడానికి మల్లెలు తేవాలి. నువ్వూ వస్తే డ్రాప్ చేస్తాను" అంటూ పిలిచాడు.

 

    "లేదు సార్. మీరెళ్ళండి. చిన్న పనులున్నాయి. వాటినీ పూర్తి చేసి బయలుదేరుతాను."  

 

    ప్రసాద్ వెళ్ళిపోయాడు.

 

    అప్పుడే సంజె చీకట్లు ముసురుకుంటున్నాయి. టైమ్ చూశాడు నరేష్. ఆరున్నరైంది. ఖచ్చితంగా ఏడుగంటలకల్లా తను శ్మశానం దగ్గరుండాలి. మరో అరగంట మాత్రమే వుంది. ఇందిరానగర్ కాలనీ నుంచి శ్మశానం సుమారు నాలుగు ఫర్లాంగులు వుంటుంది. ఇప్పుడెళితే తప్ప ఏడు గంటలకు చేరుకోలేనని అనుకుంటూ గదికి తాళం వేశాడు.

 

    మొదటి నెల జీతంతో తాళం, వాచ్ కొన్నాడు.

 

    మెట్లు దిగి, వీథంట నడవసాగాడు.

 

    ఆరోజు సావిత్రి ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ మీటింగు ఉంది. దానికి ఛైర్మన్ శ్రీనివాసరావు. రజని కూడా డైరెక్టర్. ఆమేకాక మరో అయిదుగురు డైరెక్టర్సు వున్నారు. ఆ కంపెనీలో ఎనభైశాతం షేర్లు శ్రీనివాసరావువి. అందుకే ఆయన ఛైర్మన్ అయి కూతురిని డైరెక్టర్ చేశాడు.

 

    ప్రతినెలా ఆరవతేదీ సాయంకాలం ఆరుగంటలకు కంపెనీలోని కాన్ఫరెన్స్ హాల్ లో డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుందని తెలుసుకున్నాడు నరేష్. మీటింగు అటూ ఇటూగా ఏడుగంటలకు ముగుస్తుంది. రజని ఒంటరిగా కారులో ఇంటికి వెళుతుంది. ఆ మార్గంలో శ్మశానం దగ్గర జనసంచారం ఏమీ వుండదు. అక్కడ వీధి దీపాలు కూడా వుండవు. అది తగిన స్థలంగా జగ్గారావు, నరేష్ నిర్ణయించారు.  

 

    సరిగ్గా ఏడున్నరకల్లా రజని కారు ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడే మాటువేసిన జగ్గారావు, అతని సహచరులు కారుని బలవంతంగా ఆపు చేస్తారు. ఆమె వేసుకున్న నగలను ఇవ్వమని వాళ్ళు బెదిరిస్తారు. ఆ నగలు తీసుకున్నాక ఆమెను చెరచాలని ప్రయత్నిస్తారు. నగలు ఇవ్వమని వాళ్ళు కత్తి చూపి బెదిరిస్తున్నప్పుడు నరేష్ అక్కడికి వూడిపడతాడు. షర్ట్ ను వెనక్కు తోసుకుని, కాలర్ సవరించుకుని అతను వాళ్ళతో కలయబడతాడు అతని ముష్టి ఘాతాలు తగలగానే వాళ్ళు బెదిరిపోయి పిరికిపందల్లా పరుగెడతారు.

 

    అప్పుడు రజని మెల్లగా కారుదిగి, దుఃఖంతో, కృతజ్ఞతా భావంతో అతనిని గట్టిగా కౌగిలించుకుంటుంది.

 

    "ఆపరేషన్ నెంబరు టు" అంతా బావుంది గానీ, రౌడీలు వెళ్ళిపోయాక రజనీ తనను కౌగిలించుకుంటుందా అన్నదే అనుమానంగా ఉంది అతనికి.

 

    రజని అప్పటికి 'ఐ లవ్ యు' అనకపోతే ఆపరేషన్ నెంబర్ త్రీని అమలు చేయాల్సి వుంటుంది. అయితే ఆ అవసరం రాదన్న నమ్మకం కూడా వుందతనికి. తనే వుత్తరాలు రాసినట్టు తెలిసిపోయింది. ఆ ఉత్తరాల్లో తన ప్రేమనంతా చెప్పేశాడు. ఈ పాటికి రజని ఏదో నిర్ణయించుకునే వుంటుంది. అంతా సవ్యంగా జరిగిపోతే ఫరవాలేదు. రజని తనను ప్రేమించకపోతే ఏమిటి గతి? తన జీవితంలో మొట్టమొదటిసారి ప్రేమించిన అమ్మాయి తనను రిజెక్టు చేస్తే తను తట్టుకోగలడా? భగ్న ప్రేమికుడిగా తనను తాను వూహించుకున్నాడు నరేష్.  

 

    తెల్లటి శాలువాను కప్పుకుని, లాల్చీ పైజమాలో తను పిచ్చివాడిలా తిరుగుతుంటాడు. జేబులో ఎప్పుడూ క్వార్టర్ బాటిల్ విస్కీ ఉంటుంది. అప్పుడప్పుడు దాని బిరడా తీసి, 'రా'నే తాగేస్తుంటాడు. ఆ విస్కీ లోపలికెళ్ళి తన గుండెల్లోని మంటను ఇంకాస్త మండిస్తుంది.             

 Previous Page Next Page