Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 29


    "ఎందుకుకాదు అనగానే సరిపోయిందా! అది చేతుల్లో చూపించాలి. వాడేమో నామాట అసలు వినడాయె." అని కొంచెం ఖేదంగా "యీ ఇంట్లో నా స్థితి అలావుంది ఒక్కపని చేయటానికీ, ఒక్క అధికారం చలాయించటానికి నాకర్హత లేదు. చూడు! నారాయణ పెళ్ళి చూద్దామని మరీ కుతూహలపడుతోంది. ఇప్పుడుకూడా పెళ్ళి చేసుకోకపోతే యెలా చెప్పు?" అని సానునయంగా వాక్యం ముగించాడు.

    శారదాంబ మాట్లాడలేదు.

    "నాతో మాట్లాడటానికి వాడికి యిష్టంగా వున్నట్లులేదు. బాధ్యత అంతా నీ మీద పెడుతున్నాను. ఏం చేస్తావో ఏమో, వాడిని ఒప్పించే భారం నీది" అంటూ ఆయన అక్కడినుంచి పేకగదిలోకి నిష్క్రమించాడు.

    శారదాంబ సందిగ్ధంగా కొంచెంసేపు అలానే నిలబడి తిరిగి వంటపనిలో నిమగ్నమయింది. ఉన్నట్లుండి భర్త ఇటువంటి బాధ్యత తనమీద పెడతాడని ఆమె అనుకోలేదు. అది నిర్వర్తించటం యెలాగో ఆమెకు బోధపడలేదు. వెనుక ఓసారి ఆ అనుభవం అయిన్పట్నుంచీ ఆమె నారాయణ ముందు ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఏం చేయటమా అని మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక వంటయింటి ప్రక్క నున్న గదిలో నేలమీద కూర్చుని ఆలోచించసాగింది.

    "ఏమిటమ్మా?"

    తల్లి ఇలా కూర్చుని ఆలోచిస్తున్నదంటే ముఖ్యమైన విషయం యేదో వుండి వుంటుందని రాధకు తెలుసు. లోపలకు వస్తూ ఆమెను చూసి అడిగింది.

    కూతురి దగ్గర దాచిపెడదామని ఆమె అనుకోలేదు! భర్త చెప్పిన విషయం సబబుగా వుండటం మాట అటుంచి, ఆమెకు సత్యసమ్మతంగా కూడా కనబడింది. కొడుక్కి పెళ్ళి అవటం తనకు మాత్రం ఇష్టంకాదా? అందుచేత భర్త అభిప్రాయంలా కాకుండా తన అభిప్రాయం అన్నట్లే ఆమె రాధకు విపులంగా చెప్పింది.

    "ఏం చేయమంటావే?" అంది తర్వాత.

    "నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకోడంటావా?"

    "ఉహుఁ. ఒకసారి అయింది."

    రాధ పూచీవహిస్తూ "అయితే ఆ విషయం నామీద వదిలివేయవమ్మా!" అంది.

    తల్లి సంతోషం నిండిన కళ్ళతో కూతురువంక చూస్తూ "నిజంగానా?" అంది.

    "నిజం. అన్నయ్యని నేను వొప్పిస్తాను."

    శారదాంబకు కూతుర్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. కాని తన విషయం బొత్తిగా విస్మరించి అన్నగారి వివాహంకోసం ఉబలాటపడుతూన్న ఆ అమాయకురాలి కుతూహలం చూసి ఆమె హృదయం ద్రవీభూతమైంది. జాలిగా చూస్తూ "నాకు నిద్ర వస్తోంది! నువ్వుపోయి కాసేపు పడుకోవమ్మా" అంది.

    ఆ సాయంత్రం అన్నగారిని అంగీకరింపజేయటమే ముఖ్యమైన పనిగా పెట్టుకొంది రాధ. అతను వంటరిగా గదిలో కూర్చున్నప్పుడు కాఫీ తీసుకొని వెళ్ళి యిస్తూ "నీతో కొంచెం మాట్లాడాలి అన్నాయ్!" అంది.

    "నాతో ఏమి మాట్లాడటానికైనా నీకు సర్వ స్వతంత్రం ఇచ్చాను కదూ."

    "నువ్వు ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది సావధానంగా వింటేనే నేను మాట్లాడేది. లేకపోతే లేదు."

    నారాయణ చిన్నగా నవ్వుతూ "సరేలే చెప్పు" అన్నాడు.

    రాధ అడ్డుత్రోవలు తొక్కకుండా సూటిగా "నువ్వు పెళ్ళిచేసుకోవటానికి ఎందుకు సంశయిస్తున్నావు?" అని అడిగింది.

    హఠాత్తుగా చెల్లెలినోటినుండి ఈ ప్రశ్న వెలువడేసరికి నారాయణ మొదట నిర్ఘాంతపోయాడు. తరువాత తెప్పరిల్లి పొడిగా "అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవలసిన విషయాలు. నీకెందుకమ్మా."

    రాధ కొంచెం ముఖం ముడుచుకుంటూ "నేను పెద్దదాన్ని కాకపోవచ్చు. కాని మన కుటుంబం బాగోగులు చూడవలసిన బాధ్యత నా మీద కూడా కొంత వుందంటావా? లేదని ఒక్కమాట చెబుతే అడగనులే." అంది.

    "లేదని నే నెలా అంటాను. తప్పకుండా వుంది."

    "అయితే సమాధానం చెప్పు. ఎందుకు సంశయిస్తున్నావు?"

    నారాయణ చిన్న చిక్కులోపడ్డాడు. ఇటువంటి ప్రశ్నలు వినటానికీ, జవాబు చెప్పటానికీ అతనికి ఏ మాత్రం సమ్మతంగా లేదు. కాని చెల్లెలితో బుకాయించడం ఇష్టంలేక సమాధానం సూటిగానూ, సూక్ష్మంగానూ చెప్పాడు.

    "మన పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో పెళ్ళిచేసుకోవడం శ్రేయశ్రేయస్కరం కాదు."

    "మన పరిస్థితులు ఎప్పటికైనా మారుతాయని నీకు నమ్మకముందా?"

    నారాయణ మాట్లాడలేదు.

    "తెలిసినవాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలలో యెందుకింత పొరబాటు చేస్తారో నాకు సరిగ్గా అర్ధంకాదు. పరిస్థితులకోసం ప్రపంచం ఆగదు. ప్రపంచ ధర్మాలూ ఆగవు. కొందరు వ్యక్తులు ఆగి అతీతంగా ప్రవర్తించి యేం సాధిద్దామని."

    నారాయణ ఇంకా మాట్లాడకబోయేసరికి, తనే "చూడు, ప్రతి విషయాన్నీ నువ్వు  చాలా తార్కికదృష్టితో చూస్తూంటావు కదా! నీ చదువు నీకోసం మానివేయలేదు. ఉద్యోగం చేయటం నీకోసం కాదు. అలాగే పెళ్ళికూడా యితరులకోసమే యెందుకు చేసుకోరాదు?" అంది.

    నారాయణ ఆమె వదనంలోకి కటువుగా చూస్తూ "నేను పెళ్ళిచేసుకోకపోవటం కూడా 'నాకోసం కాదు' అని నువ్వు గుర్తించే ఇలా మాట్లాడుతున్నావంటే ఆశ్చర్యంగా వుంది" అన్నాడు.

    "నేను మొదటినుంచీ చెబుతున్నదే అది. నువ్వు కేవలం భ్రమలో వున్నావుంటున్నాను. పోనీ, మెజారిటీ తీసుకొందాం. మా పక్షమే ఎక్కువవుతుంది" అని రాధ అంత గంభీరమైన సన్నివేశంలోనూ ఫక్కున నవ్వేసింది.

    నారాయణ ఆమెతో అంతగా వాదించటం యిష్టంలేక "అసలు ఇవ్వాళ నువ్వు యీ  విషయంలో ఎందుకింత పట్టుబడుతున్నావో కాస్త చెబుదూ" అన్నాడు.

    "బామ్మకు చాలా సీరియస్ గా వుందని తెలుసుగా."

    "ఊఁ"

    "ఆమె బ్రతకటం యిక దుర్లభమని డాక్టరుగారు చెప్పారని నువ్వే అన్నావు."

    నారాయణ ఈసారి విసురుగా "నాకు తెలుసు, ఆవిడ యిటువంటిదేదో తెచ్చి పెడుతుందని ఎందుకీ అర్థంలేని కోరికలు. వెనక ఓసారినన్ను చాలా విషమస్థితికి ఈవిడే తీసుకువచ్చింది" అన్నాడు.

    "ఆవిడను నిందించి ప్రయోజనం ఏమిటన్నాయ్? అయినా అలా కోరతంలో తప్పుకూడా నాకు కనబడలేదు."

    నారాయణ చెల్లెలు చెప్పింది వినిపించుకోకుండా "మీరూ, మీరూ కలిసి ఎన్నయినా చెప్పండి, నేను చేసుకొనేది లేదు" అని యిహ అక్కడ వుండకుండా వెళ్ళిపోయాడు.

    "అన్నాయ్!" రాధ గొంతు అవమానంతో, కోపంతో అవస్వరాలు పలికింది. ఈ దెబ్బను ఆమె తట్టుకోలేక గట్టిగా అరిచేసింది.

    నారాయణ తెల్లబోయి వెనక్కితిరిగి, అదే విధంగా ఆమెనుచూస్తూ "రాధా!" అన్నాడు.

    రాధ అతికష్టంమీద దుఃఖాన్ని అరికట్టుకొంటూ "నీ జవాబు చివరికి యిదేనా?" అని అడిగింది.

    నారాయణ చాలా యిరుకులో చిక్కుపడినట్లు బాధపడుతూ "నువ్వు నా కన్నా చిన్నదానివే అయినా వేడుకొంటున్నాను. నా  సిద్దాంతాల్తో నన్ను బ్రతకనియ్యి" అన్నాడు.

    "నారాయణా!"

    బలహీనంగా వినవచ్చిన యీ పిలుపు విని అతను స్తబ్థుడై నిలబడి పోయాడు.

    అతను వెనక్కి తిరిగేలోపులే రాధ బొమ్మలా పెదాలు కదిలిస్తూ అంది "బామ్మ పిలుస్తూంది."

    అతను లోనికి వెళదామా వద్దా అని సంశయిస్తూండగానే మళ్ళీ ఇంకోసారి లోపలనుండి ముసలమ్మగారు బలహీనంగా పిలిచినా "నారాయణా!" అన్న కేక వినవచ్చింది.

    ఈసారి అతను సంశయించలేదు. విషయమేదో సూటిగా ఆవిడతోనే తేల్చుకొందామని మెల్లగా లోపలకు నడిచాడు.

    రాధ అచేతనంగా అక్కడే నిలబడివుంది. ఎల్లా అయినా ఆమె రకరకాల వేదనలతో కుమిలిపోతోంది. అన్నగారు తనమాట కాదంటాడని ఆమె ఎప్పటికీ తలపోయలేదు. ఒక విధమైన ఆత్మ విశ్వాసంతోనే అతన్తో సంభాషణకు తలపడింది.

    ఒక పావుగంట గడిచేసరికి నారాయణ చలనంలేనట్లు యివతలకు వచ్చాడు. అతని ముఖం పాలిపోయివుంది. నుదుటిమీద అక్కడక్కడా స్వేదబిందువులు మెరుస్తున్నాయి.

    "అన్నాయ్!" రాధ పిలిచింది. ఆ పిలుపులో అర్థం చేసుకున్న వారికి ఎన్నో భావాలు ధ్వనిస్తాయి.

    నారాయణ ఒకసారి ఆమెవంక మౌనంగా చూసి వూరుకున్నాడు.

    "ఏమిటి?"

    నారాయణ ఈసారి పెదాలు కదిలించాడు.

    "నేనూ మనిషినే" విషాదంగా అన్నాడు.

    రాధ అతనివంక ఆశ్చర్యంగా చూస్తోంది.

    "అందుకనే...... కొంచెం ఆగి వణుకుతూ అన్నాడు. "పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొన్నాను."


                        *    *    *


    ఈ మధ్య రాధ ప్రమీల వాళ్ళింటికి తరచుగా వెళ్ళటంలేదు. వెళ్ళకపోవటానికి కారణం ఏమీలేదు. ఇంట్లో ఒత్తిడి మరీ ఎక్కువకావటమే. కాలు కదపలేనివారు ఒకరికి ఇద్దరయ్యారు. తమ్ముడిని గురించి బాధ్యత అంతా రాధే వహించాల్సి వచ్చింది. అత్తగారి పనులన్నీ శారదాంబ చూసుకొంటోంది. ఇంట్లో పరిస్థితులన్నీ మరీ దీనంగా పరిణమించసాగాయి.

    ఈ రోజు రాధ స్నేహితురాలి యింటికి పోయేందుకు నిశ్చయించుకుంది. ఉదయంపూట ఎలానూ తీరదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరింది.

    ఆమె వెళ్ళేసరికి ప్రమీల తీరిగ్గా కూర్చుని వీణ వాయిస్తోంది. ప్రక్కన కుర్చీలో సుభద్రమ్మగారు కూర్చొని వింటోంది. శ్రీపతి యింట్లో వున్నాడో లేడో రాధకు తెలీదు. సుభద్రమ్మగారు అన్నంతపనీ చేసింది. చూసిచూసి ఒకరోజు అల్లుడిని అడిగేసింది. శ్రీపతి ఆలోచించుకునేందుకు కొద్దిరోజులు గడుపు కోరాడు. తర్వాత ఇంకోరోజు అత్తగారు మళ్ళీగట్టిగా అడిగేసరికి యిష్టమేనని చెప్పాడు. ఇంచుమించు యిల్లరికంలాగా అతను యింట్లోనే వుంటున్నాడు. అలా అని అతని గౌరవమర్యాదలకు యేమీ లోటులేదు.

    రాధను చూసి సుభద్రమ్మగారు "రావమ్మా కూర్చో" అంది.

    రాధ లోపలకు వచ్చి ప్రమీల ప్రక్కన చాపమీద కూర్చుంది. ప్రమీల ఒక్క క్షణం వీణ వాయించటం ఆపి రాధను ఓరగా చూసి నవ్వింది. రాధ జవాబుగా ఆమె నవ్వుతో శృతి కలిపింది. ప్రమీల మళ్ళీ వీణలో మునిగిపోయింది.

    ఒక పావుగంట ఈ విధంగా గడిచాక ప్రమీల వీణ ఆపేసి వొక ప్రక్కన పెట్టి "ఈ మధ్య రావటం బొత్తిగా మానేశావేం?" అంది.

    "తీరికవుంటే వచ్చేదాన్నే."

    "అంతేకదా? పెళ్ళి సంబంధం ఏదయినా కుదిరిందనుకొన్నాను."

    రాధ సిగ్గుపడి "అనుకుంటావు, అనుకుంటావు. మరీ మితిమీరిపోతేనూ" అంది.

    సుభద్రమ్మగారు అక్కడ కొంచెంసేపు కూర్చుని ఆ మాటా యీ మాట మాట్లాడి లోపలకు వెళ్ళిపోయింది.

    కొద్ది నిముషాలు సంభాషణ సామాన్యంగా గడిచాక ప్రమీల రాధ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొంటూ "పెళ్ళెప్పుడూ" అంది.

    రాధ హఠాత్తుగా స్నేహితురాలి నోటినుంచి వెలువడిన ఈ ప్రశ్నకు తెల్లబోయి ఆమె ముఖంలోకి తేరిపార చూసింది. చిరునవ్వుతో అడుగుతోంది. అలా అడిగిందేమిటి అంత కొత్తగా. తన విషయం ఆమె కేం తెలియదా?

 Previous Page Next Page