"కోర్ట్ ఆర్డర్ సాబ్!"
చిరంజీవి సంతకం చేసి కవరు అందుకున్నాడు.
"ఏమిటది?" కలవరపాటుతో అడిగింది స్వప్న.
"ఏమో? ఏదో కోర్టు నోటీస్ లాగుంది!" కవరు చింపి లోపలి కాగితం బయటికి లాగి త్వరత్వరగా చదువుకున్నాడతను. అతని ముఖం పాలిపోయింది. స్వప్న కళ్ళల్లో ఆందోళన చోటు చేసుకుంది.
"ఏమిటది? మాట్లాడవేం?" అతన్ని కుదుపుతూ అడిగింది.
"భవానీశంకర్ ని చీఫ్ ఎడిటర్ గా నియమించటం మీద "స్టే" ఆర్డర్" తీసుకుచ్చాడు శివాతండవం-"
"ఈ విషయం భవానీశంకర్ కి చెప్పకపోవడం మంచిదేమో! అతను నిరుత్సాహపడతాడు!" అందామె కొద్ది క్షణాలాగి.
"అవును!" అన్నాడు చిరంజీవి.
"మరిప్పుడేమిటి చెయ్యటం?" అడిగింది స్వప్న.
"నాకూ అదే అర్ధం కావటం లేదు స్వప్నా!"
ఇద్దరూ అశాంతితోనే ఇల్లు చేరుకున్నారు. స్వప్న వంట చేయడం ప్రారంభించింది.
చిరంజీవి చాప మీద పడుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు.
మర్నాడేలాగూ శివతాండవం రావటం, భవానీశంకర్ ని ఆ పోస్ట్ నుంచీ తొలగించటం ఖాయం. భవానీశంకర్ ఆ పదవిలో లేకపోయినా, మరో అర్హతతో పనిచేయవచ్చు. కానీ శివతాండవం మళ్ళీ వస్తే మాత్రం అన్ని విధాల తమకు తలనొప్పే. అన్నిటికీ అడ్డంకులు అభ్యంతరాలు, గొడవలు - వెన్నెల నెమ్మదిగా కిటికీ లో నుంచి అతని మీదకు ప్రసరించసాగింది. స్వప్న వంట ముగించి అతని దగ్గరకొచ్చింది.
"భోజనం వడ్డించాను - పద!"
అతను అన్యమనస్కంగానే లేచి లోపలి కెళ్ళి భోజనం ముందు కూర్చున్నాడు. నాలుగు ముద్దలు తిని చేయి కడుక్కున్నాడు.
"అదేమిటి? మధ్యలో భోజనం మానేయడం ఎందుకు?" చిరుకోపంతో అడిగిందామె.
"ఏమో - స్వప్నా - తినబుద్ది కావటం లేదు !"
"అలాగా! బదులు తీర్చుకుంటాను. ఇప్పుడు నన్ను తినిపించమంటావా?" గారంగా అడిగింది.
అతను నవ్వాడు - "ఇంకా మర్చిపోలేదులే - ఆ రోజులు - " అన్నాడు.
స్వప్న సిగ్గుపడింది. - పెళ్ళయిన కొత్తలో ఇద్దరూ నాగార్జునసాగర్ కి హనీమూన్ వెళ్ళటం- అక్కడ రెండు రోజులు గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాకుండా గడపడం - తనకు అతను చిన్నపిల్లాడిలా భోజనం తినిపించటం - అన్నీ గుర్తుకొచ్చేశాయ్.
ఇద్దరూ కొద్ది క్షణాలు భోజనం ముందు కూర్చూనే నాగార్జునసాగర్ లో విహరించారు.
ముందు ఆ ఊహాలోకం నుంచి స్వప్న తేరుకుని తనూ చేయి కడిగేసుకుంది.
"ఏమిటలా కూర్చున్నావ్?" అంది నవ్వుతూ.
ఇద్దరూ లేచివచ్చి వెన్నెల్లో కూర్చున్నారు.
"స్వప్నా! ఈ గొడవల్లో పడి - మనం ప్రేమికులమనీ, ఇద్దరం యవ్వనంలోనే ఉన్నామనీ మర్చిపోతున్నాం! కదూ?' ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడతను.
హటాత్తుగా స్వప్న అతని చేతుల్నుంచీ తప్పించుకుని అతని కళ్ళల్లోకి ఉత్సాహంగా చూసింది.
"శివతాండవం మళ్ళీ మన ఆఫీస్ కి రాకుండా ఉండే ఉపాయం చెప్పవా?"
చిరంజీవి ఆశగా ఆమె వంక చూశాడు.
"ఏమిటా ఉపాయం?"
"కోర్టు "స్టే" ఆర్డర్ ఇచ్చినమాట నిజమే గానీ - అది 'వెకేట్' చేయించటం కష్టమేమీ కాదు"
"నిజం గానా స్వప్నా?" ఆనందంగా ఆమె చేతిని పట్టుకుని అడిగాడతను.
"అవును! సర్క్యులేషన్ పైల్స్ అన్నీ చూస్తుంటే ఏజెంట్స్ తో మన పత్రిక కొచ్చిన పేచీలలో చాలాసార్లు వాళ్ళు స్టే ఆర్డర్ తేవటం, వెంటనే మనవాళ్ళు స్టే 'వెకేట్ ' చేయించటం గురించి చదివాను - మనం వెంటనే మంచి లాయర్ దగ్గర కెళ్తే - రేపే స్టే వెకేట్ చేయించవచ్చు -"
చిరంజీవి చప్పున లేచి నిలబడ్డాడు.
"అయితే రాత్రీ పగలు అనేవి లేవు స్వప్నా! ఆరునెలల వరకూ మనం రాక్షసులం! అంతే-"
స్వప్న లేచి అద్దం ముందు నిలబడి బయటకు వెళ్ళేందుకు సిద్దమవసాగింది.
*****
నైట్ షిప్ట్ సబ్ ఎడిటర్ ప్రసాద్ తన సీట్లో కూర్చుని ఆ రాత్రికి పబ్లిష్ అవాల్సిన అద్భుతమయిన న్యూస్ ఐటమ్ తయారుచేస్తున్నాడు.
"భారత సరిహద్దుల్లో పాక్ సేనలు మోహరింపు" అన్న హెడ్ లైన్ వెనుకనుంచీ చదివి ఆప్యాయంగా అతని భుజం తట్టాడు భవానీశంకర్.
"నీ దేశభక్తికి నేను జోహర్లిర్పిస్తున్నాను. మైడియర్ ప్రసాద్! 'భారత్ సరిహద్దుల్లో పాక్ సేనలు' 'పాక్ సరిహద్దుల్లో భారత్ సేనలు ' అని హెడ్ లైన్స్ రాయటమే దేశభక్తి కాదు డియర్! సేనలనేవి సరిహద్దుల్లో కాకపోతే ఇళ్ళల్లో ఉంటాయా? లార్డ్ నార్త్ క్లిఫ్ ఏమన్నాడు? "కుక్క మనిషిని కరిస్తే అది వార్తా కాదు! కానీ మనిషి కుక్కను కరిస్తే అది వార్త" అన్నాడు అంచేత మన తెలుగుకిరణం క్షేమం కోరితే ముందు సెన్సేషనల్ న్యూస్ అయిటమ్స్ తయారుచేసి మొదటి పేజీలో కళ్ళు మిరుమిట్లు గొలిపెట్లు, వళ్ళు జలదరించేట్లు ప్రచురించాలి! ఇదిగో ఈ మూలపడేశావ్ ఈ న్యూస్ - ఇది చూడు!
"నెల్లూరి గెస్ట్ హౌస్ వెనుక యువతి మానభంగం - హత్య - ఇదీ మొదటి పేజీ న్యూస్. యిది రాయాల్సిన పద్దతి కూడా ఇదిగో ఇలా మారాలి.
"ఈ నేరంతో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధం ఉందని ప్రజల అనుమానం -"
ప్రసాద్ ఉలిక్కిపడ్డాడు.
"అదేమిటి సర్ రాజకీయనాయకుడికి సంబంధం ఉందని ఆ న్యూస్ లో లేదు కదా?"
"అక్కడే నీ అద్భుతమయిన ఎడిటోరియల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి బ్రదర్! ఒకవేళ అది నీకు లేకపోతే పోనీ కామన్ సెన్స్ అన్నా ఉపయోగించు! మనదేశంలో ఏ నేరమయినా ఎవరు చేస్తారు? రేప్, మర్డర్ చేసేంత ధైర్యం , రాక్షసత్వం ఎవరి కుంటుంది? నీకూ నాకూ ఉంటుందా? నో! ఆ నేరాన్ని కప్పి పెట్టి , తాము తప్పించుకోగలమనే రాజకీయనాయకులే చేయగలరు! ఆ నిజం తర్వాతేలాగూ బయటపడక తప్పదు. అది మనం ముందే రాస్తే క్రెడిట్ ఎవరికి? తెలుగు కిరణం పేపర్ కి! అంచేత ఈరోజు నుంచీ "నిప్పుల్లో కలం వేయకు - కలం లో నుంచి నిప్పులు రాల్చు" అనేది మన నినాదం!
కనుక ప్రతి న్యూస్ అయిటమ్స్ లోనూ నిప్పులు రావాలి బ్రదర్! తెలుగు కిరణం పేపర్ కొన్నవారికి చేతులు కాలి బొబ్బలేక్కేంత నిప్పుల సెగ తగలాలి! న్యూస్ లో పొగ కనబడితే - మనం మంటలున్నట్లు రాయాలి! పోగలేకపోతే - పొగ సృష్టించాలి! దిసీజ్ మోడ్రన్ జర్నలిజం మైడియర్ ప్రసాద్! జర్నలిజం లో కొత్తలో చదివిన టెక్ట్స్ పుస్తకం మర్చిపో! అమెరికన్ జర్నలిస్ట్ జేమ్స్ రెష్టన్ ఏమన్నాడు!
"19 వ శతాబ్దం నవలా రచయితల యుగం -
20వ శతాబ్దం జర్నలిస్టుల యుగం -"
ప్రసాద్ కళ్ళల్లో ఓ కొత్త ఉత్తేజం కనిపించింది.
చటుక్కున లేచి నిలబడ్డాడు.
"ఇంక మీరు చెప్పకండి సార్! ఈ క్షణం నుంచీ చూడండి! నిప్పులు! నిప్పులు!"
భవానీశంకర్ అతని భుజం మీద మరోసారి ఆప్యాయంగా తట్టాడు.
"శభాష్ ప్రసాద్! కాపిటల్ ఉంటే "శభాష్ ప్రసాద్" అనే సినిమా తీసేవాడిని - నిన్ను హీరోగా వేసి ! కమాన్ హరియప్- పేపర్లో ప్రతి అంగుళం ఇంప్రూవ్ అవాలి!"
హనుమాన్ వడి వడిగా వచ్చి సెల్యూట్ కొట్టాడు.
"సార్ ! ఓ గొడవ జరిగింది!" అన్నాడతను ఆందోళనగా.
"ఏం జరిగింది మైడియర్ హనుమాన్! ప్రవహించు త్వరగా!"
"శివతాండవంగారొచ్చారండీ అయిదు నిమిషాల క్రితం-"
"అతనీ ప్రాంతంలో కొస్తే భవానీశంకర్ గారు జారీ చేసిన షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ అమల్లో కొస్తాయని చెప్పావా?"
"చెప్పలేదు గానీ మెడ మీద చెయ్యేసి గెంటేశానండీ!"
"అద్భుతమయిన దృశ్యం హనుమాన్! ముందుగా నాకు తెలియజేసి నట్లయితే మన స్టాఫ్ అందరం వచ్చి కనులపండుగగా తిలకించేవాళ్ళం! సూపర్బ్ యాక్షన్"
"ఆయనోచ్చిన కారణం ఏమిటంటే -- తమర్నీ ఉద్యోగం చేయనీకుండా కోర్ట్ నుండి 'స్టే' ఆర్డర్ తీసుకొచ్చారటండీ!"
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు . "ఐసీ!"
"ఇప్పుడు పోలీస్ స్టేషన్ కెళ్ళి పోలీసుల సహాయం తీసుకోస్తాననీ , అప్పుడు తననేవరడ్డుకుంటారో చూస్తాననీ కూడా అన్నారండీ!"
"ఓహో! అయితే ఈసారి చట్టబద్దంగా వస్తాడన్నమాట! డోంట్ వర్రీ మైడియర్ రామభక్త హనుమాన్! పోలీసుల సాయంతో వస్తే మాత్రం అడ్డగించబోకు! లోపలకు పంపించు!"
"అలాగే సర్!"
మళ్ళీ సెల్యూట్ కొట్టి అతను వెళ్ళి పోయాడు.
భవానీశంకర్ కంపోజింగ్ సెక్షన్ లోకి నడిచాడు. అక్కడ ప్రింటవబోయే మేటర్ 'చెస్' లో బిగిస్తున్నాడో కుర్రాడు. అందులో ఓ ఫోటో బ్లాక్ అతనిని ఆకర్షించింది.
"రాజేష్! ఈ బ్లాక్ ఏమిటి?"
"ఫోటో బ్లాక్ సార్!"