"ఆ విషయాలు నేను చిన్నప్పుడే తెలుసుకున్నా బ్రదర్! అదే ఫోటో బ్లాక్? ఆ ఫోటో వివరాలేమిటి?"
లోటస్ లేడీస్ వెల్ఫేర్ క్లబ్ వాళ్ళ ఫంక్షన్ ఫోటో అండీ! ఆ క్లబ్ లో ఏ సంబరం జరిగినా ఫోటోలు తీసి మన పేపర్లో వేయాలని శివతాండవం గారి భార్య మహేశ్వరీదేవి గారి అర్దర్సండీ!' వినయంగా చెప్పాడు రాజేష్.
"వెరీ బాడ్ , వెరీ బాడ్ రాజేష్! మన తెలుగు కిరణం తక్షణ కర్తవ్యం ఇలాంటి భయంకరమయిన ఫోటోల నుంచి తప్పించు'కోవటం! నీలాంటి యువకులందరూ నడుము బిగించి ఈ స్త్రీల మహాసభల ఫోటోలు, మహా పురుషుల సన్మాన సభల ఫోటోలు మన పత్రిక పరిధిలోకి రాకుండా పోరాడాలి రాజేష్! అంతిమ విజయం మనదేనని గుర్తుంచుకో."
"అలాగే సర్!' ఉత్సాహంగా అని చెస్ లో నుంచి మహేశ్వరీదేవి వాళ్ళ క్లబ్ ఫోటో తీసి గది మూలకు విసిరికొట్టాడు.
సరిగ్గా అప్పుడే పోలీస్ ఇన్ స్పెక్టర్ తో పాటు అక్కడి కొచ్చి నిలబడ్డాడు శివతాండవం ! భవానీశంకర్ అతనిని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు.
"హల్లో మేజర్ శివతాండవం!"
"నన్ను మేజర్ అనవద్దు?"
"మేజర్ అనేది టెర్రీటోరియల్ ఆర్మీలో గౌరవం కోసం అంటారు బ్రదర్! అంతేగానీ నిజంగా నువ్వు మేజర్ వని కదు౧ బైదిబై మీ రాకకు గతం బెద్ది?"
"నిన్ను బయటకు గెంటిచడానికి!"
"అందుకు అధికారం ఎవరికీ లేదు మేజర్!"
ఇన్ స్పెక్టర్ కల్పించుకున్నాడు.
"కోర్టు యిచ్చిన 'స్టే' ఆర్డర్ ప్రకారం శివతాండవంగారే చీఫ్ ఎడిటర్ గా కొనసాగాలి - మిస్టర్! మీ పేరు నాకు తెలీదు!"
"భవానీశంకర్ అని పిలవండి ఇన్ స్పెక్టర్! ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ నేనే! సరే, ఆ విషయం అలా ఉండనిస్తే - మీ కోర్ట్ 'స్టే' ఆర్డర్ సంగతి తెలిసే చిరంజీవి నన్ను అసిస్టెంట్ ఎడిటర్ గా ఎపాయింట్ చేశాడిందాక. అంచేత నేను బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిస్టర్ శివతాండవం! నన్ను అంతగా బయటకు గెంటించాలని మీకు కోరికగా ఉంటే, ఇంకో స్టే ఆర్డర్ భవానీశంకర్ అసిస్టెంట్ ఎడిటర్ గా ఉండకూడదని అని తీసుకు రావాల్సి ఉంటుంది."
"యూ ఆర్ కరెక్ట్ మిస్టర్ భవానీ శంకర్! ఆ శివతాండవంగారూ! మీరు చీఫ్ ఎడిటర్ గా కంటిన్యూ అవడానికి ఇక్కడ ఎలాంటి ప్రతిఘటనా లేనందున మేము వెళ్తున్నామిక?"
శివతాండవం మొఖం మాడిపోయింది.
"మరి ఇతనిని బయటకు పంపటం....."
"అతను అసిస్టెంట్ ఎడిటర్ గా అపాయింట్ అయానంటున్నారు కదా? అయినా అది దీని ప్రోప్రయిటర్ తెల్చుకోవాల్సిన విషయం! మీరూ , నేనూ కాదు!"
భవానీశంకర్ ఆప్యాయంగా శివతాండవం భుజం మీద చేయి వేశాడు.
"మనం పాత విషయాలన్నీ మర్చిపోదాం మేజర్ శివతాండవం! ఇక నుంచీ ఇద్దరం పాలూ నీరులా కలిసిపోయి అన్యోన్యంగా పేపర్ నడిపిద్దాం!....."
శివతాండవం తన భుజం మీద నుంచీ చేయి విసిరికొట్టాడు.
"నువ్వు నన్ను తాకావంటే మర్యాదగా ఉండదు!" కోపంతో రొప్పుతూ అన్నాడు శివతాండవం.
ఇన్ స్పెక్టర్ బయటకు వెళ్ళడానికి నాలుగడుగులు వేసి అక్కడ ఆగిపోయి వెనక్కు తిరిగి మళ్ళీ ఓసారి భవానీశంకర్ వేపు చూశాడు.
"మిస్టర్ భవానీశంకర్ ! భై చాన్స్ - మీరు సెయింట్ మేరీస్ స్టూడెంట్ కాదు గదా?" అడిగాడు అనుమానంగా.
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"వైనాట్? ప్యూర్ సెయింట్ మేరీస్ స్టూడెంట్ ని! మీరు...."
అతను తన టోపీ తీసేశాడు.
"నేను జైరాజ్ ని ! గుర్తుపట్టలేదూ?"
"మైగాడ్! అవును! ఇప్పుడు పోలికలు కనబడుతున్నాయ్! దిసీజ్ సింప్లీ ఒండర్ పుల్ మైడియర్ జైరాజ్. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు పాత స్నేహితులు కలుసుకోవడం!" దగ్గరకు నడిచి అతని భుజం మీద ఆప్యాయంగా చేయి వేశాడు భవానీశంకర్.
"మూడోవాడేవరు?"
"చిరంజీవి - ది గ్రేట్ ప్రోప్రయిటర్ ఆఫ్ 'తెలుగు కిరణం' డెయిలీ!"
"అరె! చిరంజీవి కూడా ఇక్కడే ఉన్నాడా?"
"మొత్తం శరీరమంతటితో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. అవునూ! అదివరకేమో యన్.సి.సి. ఇప్పుడేమో పోలీస్ డిపార్ట్ మెంటూ! మొత్తానికి జీవితం అంతా కాకి బట్టలే ధ్యేయంగా పెట్టుకున్నావన్నమాట!"
"డిస్టినీ! అది సరే నువ్వెక్కడున్నావ్ ఇన్నాళ్ళూ?"
"అదో పెద్ద కధ బ్రదర్! తెలుగు సినిమాలాగా గందరగోళంగా గడిచిపోయింది. లైఫ్ ఇంతవరకూ! ఈసారి మీ పోలీస్ స్టేషన్ లో దొంగలు, రౌడీలు , హంతకులు అరిచే అరుపుల మధ్య ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అంతా చెప్తాను!"
"తప్పకుండా రావాలి! చిరంజీవిని కూడా తీసుకురా! రాకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో? ఏదో న్యూసెన్స్ కేస్ కింద ఇద్దరినీ బుక్ చేసి మా కానిస్టేబుల్స్ తో బలవంతంగా రప్పించాల్సి ఉంటుంది!"
"తెలుసు బ్రదర్ మీ డిపార్ట్ మెంట్ ప్రతిభ! దేశ ప్రజలందరూ వేనోళ్ళ కొనియాడుతుండగా వినటం తటస్థించింది...."
"ఓకే - సీయూ - ఎగైన్!"
జైరాజ్ వెళ్ళిపోయాడు.
"ఓరేయ్ రాజేష్! నేను వస్తుంటే విసిరికొట్టావ్ చూడు, ఆ ఫోటో బ్లాక్ తీసుకుని నా రూమ్ కి రా! ప్రసాద్! నువ్వు కూడా న్యూస్ అయిటమ్స్ మొత్తం తీసుకురా! అన్నీ నేను చెక్ చేయాలి!" అనేసి ఠీవిగా తన గడివేపు నడిచాడు. అతను వెళ్ళగానే భవానీశంకర్ ప్రసాద్ దగ్గరకెళ్ళాడు.
"మీరెవ్వరూ శివతాండవం దగ్గరికి రానక్కరలేదు బ్రదర్! నేనే శివతండవంతో మాట్లాడి ఇవాళ్టికేమీ మార్పులు చేర్పులూ లేకుండా సెటిల్ చేసేస్తాను!" అనేసి తనూ శివతాండవం వెనుకే అతని గదికి చేరుకున్నాడు భవానీశంకర్.
"నువ్వెందుకొచ్చావ్? వెళ్ళిక్కడినుంచి !" కోపంగా అరిచాడు శివతాండవం.
"మీకో విషయం చెప్దామని వచ్చాను మేజర్ శివాతండవం! రెండు రోజుల్నుంచీ మీ మానసిక ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నాను. మీ మానసిక ఆరోగ్యం ఎప్పటిలా మూడు పూలూ, ఆరు కాయలుగా ఉండాలంటే మీరు జయానాగరాజ్ అనే సైక్రియాటిస్ దగ్గర కేల్లండి! ఆమె హైదరాబాద్ లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందారని విన్నాను! ఈ విషయం చెప్దామనే వచ్చాను!"
"గెటౌట్-"
"ఇంకొక్క విషయం మేజర్ శివతాండవం! ఈ ఒక్క రోజుకీ మీరు తెలుగు కిరణంలో ఏమీ జోక్యం చేసుకోకండి! కావాలంటే రేపట్నుంచీ మీ ఇష్టం! నేను మీ కడ్డు రాననీ హామీ ఇస్తున్నాను."
"ముందు బయటివెళ్తావా , సెక్యురిటీ గార్డ్ ని పిలిచి గెంటించమంటావా?"
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"టిట్ ఫర్ టాట్ స్కీమ్ చేద్దామని నీ ప్రయత్నం ! అవునా మేయర్! కానీ దానికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం - అంచేత నా మాట విని డాక్టర్ జయానాగరాజ్ కి ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకో, రెండు 'షాక్' లు మీకు పూర్తీ ఆరోగ్యం చేకూరుస్తాయని నా అభిప్రాయం -"
శివతాండవం సెక్యురిటీ కి రింగ్ చేశాడు.
"ఒరేయ్ హనుమాన్ - ఇంకో సెక్యురిటీ గార్డ్ ని త్వరగా తీసుకురా!' అన్నాడు కోపంగా.
"మేజర్ శివతాండవం! నా మాట వినండి! కనీసం ముందు ఒక్క 'షాక్' అయినా తీసుకుంటే గానీ -"
శివతాండవం కోపం పట్టలేక టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తీసి భవానీ శంకర్ మీదకు విసిరేశాడు కసిగా.
భవానీశంకర్ ముందే అలా జరుగుతుందని ఊహించడం వల్ల - పక్కకు తప్పుకోవడంతో అప్పుడే మరో సెక్యురిటీ గార్డ్ తో సహా రూమ్ లోకి అడుగు పెట్టిన హనుమాన్ ముక్కుకి తగిలి కింద పడింది.
హనుమాన్ 'అబ్బా' అంటూ ముక్కు పట్టుకుని కింద కుర్చుండిపోయాడు.
"నేను నీకు అదివరకే చెప్పాను మైడియర్ రామభక్త హనుమాన్! మనం అనుకున్నట్లే మేజర్ శివతాండవం మానసిక ఆరోగ్యం క్షీణించి పోతోంది! పరిస్థితి మరింత ప్రమాదకరం కాకముందే మనం మేజర్ శివతాండవాన్ని వేస్ట్ పేపర్ రూమ్ లో బంధించటం మన వర్కర్స్ క్షేమం దృష్ట్యా అవసరమని నా అభిప్రాయం - నీ అభిప్రాయం ఏమిటి హనుమాన్?"
"అవున్సార్! ముందు బంధించేయ్యాలి-" ముక్కు పట్టుకుని కోపంగా అన్నాడు హనుమాన్.
"అయితే ఇంకా ఆలస్యం చేయకు! నువ్వు అటు నుంచి రా , నేను ఇటునుంచీ వస్తాను. సెక్యురిటీ గార్డ్ తలుపు దగ్గర నిలబడతాడు. ఎందుకంటె మతి భ్రమించిన వారు ఎటునుంచి పారిపోతారో వారికే తెలీదు -"
శివతాండవానికి కోపంతో నిజంగానే పిచ్చెక్కినట్లయింది 'ఆప్టరాల్ ఓ కుర్రకుంక తననింత అట పట్టిస్తాడా?"
"దగ్గరకొచ్చారంటే చచ్చారే! కాసుకోండి-" మరో పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు రెండడుగులు వెనక్కు వేసి.
"మతి భ్రమించినవారు గురి చూసి విసరలేరు మైడియర్ హనుమాన్! అంచేత భయపడకు -" అంటూ మరో అడుగు ముందుకి వేశాడు భవానీ శంకర్. శివతాండవం ఇంక ఆలస్యం చేయలేదు. తన బలమంతా ఉపయోగించి పేపర్ వెయిట్ భవానీ శంకర్ మీదకు విసేరేశాడు. సరిగ్గా అప్పుడే బయటనుంచి వస్తూ గది బయట నిలబడి "హలో" అని ఏదో మాట్లాడబోతున్న పోలీస్ ఇన్ స్పెక్టర్ తలకి బలంగా ఆ పేపర్ వెయిట్ తగలడంతో 'అబ్బా' అంటూ కూలబడిపోయాడు రెండు చేతుల్లో తల పట్టుకుని.


