Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 28


    వాతావరణం ముసురు ముసురుగా వుండి వర్షమొచ్చే సూచనలు.
    "మా యింటికి వెళదాం" అంది.
    అతనేం మాట్లాడలేదు.
    ఇద్దరూ నడుస్తున్నారు.
    "రిక్షాలో వెళదామా?" అంది.
    "వొద్దు"
    "ఏం? ఎవరయినా ఏమన్నా అనుకుంటారని భయమా?"
    "అలాంటి భయాలు నాకేం లేవు. అది పద్ధతి కాదు కాబట్టి"
    "తప్పుపడే వారికి ఏదీ పద్ధతి కాదు. వాళ్ళకు నచ్చనివీ, చేతకానివీ, అసూయ కలిగించేవీ _ మహా నేరాలుగా ఎంచి విమర్శిస్తూ వుంటారు."
    "అయినా మనం చేసే ప్రతిపనికీ మనకై మనం నిర్మించుకునే పద్ధతి అంటూ ఒకటి వుండాలి. లేకపోతే ఈ మనుగడకి విలువలేదు.
    "విజయ్. నువ్వు నీ ఉద్యోగ ధర్మం చాలా నీతిగా నిర్వర్తిస్తూ నీ పద్ధతి ప్రకారం జీవించావు. ఏం సాధించావు?"
    "ఇంకో రకంగా జీవిస్తే ఏమయినా సాధించి వుండేవాడినని అనుకోవటంలేదు."
    "విజయ్! ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితుల్లో నీతి అనే మాటకు విలువలేదు. ఎవరు అవినీతిపరులో, ఎవరు స్వార్థపరులో, ఎవరు కాఠిన్యంతో కరుడుగట్టు పోయారో వాళ్ళే విజయం సాధిస్తారు. సక్సెస్ చవిచూడని లైఫ్ కి అర్థంలేదు. నీతి సూత్రాలు వల్లించుకుంటూ నిరర్థకంగా గడపటం జీవితం కాదు."
    "నువ్వు చెప్పేది డబ్బు విషయంలో"
    "కాదు. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఆఖరికి ఆర్ట్ ఫారమ్స్ లో కూడా గేమ్స్ లో, స్పోర్ట్సులో, కళ్ళల్లో... ఎవరో వెయ్యికి ఒక్కడు మహాశక్తి సంపన్నుడయితే తప్ప...ఎక్కడి అక్కడ అడ్డదారి తొక్కక తప్పదు. ఒకసారి విజయలక్ష్మి వరించాక కళ్ళాలు అతని చేతుల్లో కొచ్చేస్తాయి. ఇహ విధి కూడా అతను చెప్పినట్లు నడుచుకుంటుంది."
    విజయ్ జవాబు చెప్పకుండా మౌనంగా నడుస్తున్నాడు.
    "మాట్లాడవేం?" అంటూ అనురాధ చనువుగా అతని చెయ్యి పట్టుకుంది.
    అదే సమయానికి షాపింగ్ కని వచ్చిన రాధాప్రియ రోడ్డుకు అటుకేసి వున్న ఫుట్ పాత్ మీద నడుస్తూ ఈ దృశ్యాన్ని చూసింది. అదేమిటో ఇలాంటి అపురూప దృశ్యాలన్నీ అలాంటివాళ్ళ కళ్ళే పడుతుంటాయి. వెంటనే ఆ చూపుల్లో ఆశ్చర్యం, అసూయ, ఒంట్లోకీ వెచ్చటి ఆవిరి, నరాల్లో ఉద్రేకం అన్నీ గబగబ వచ్చేశాయి.
    "ఓహో! ఇదన్నమాట సంగతి. బయటకు నంగనాచుల్లా అమాయకుల్లా కనబడుతూ మీరు వేసే వెధవ్వేషాలన్నీ ఇదన్నమాట. చూస్తా మీరెలా సుఖంగా వుంటారో చూస్తా"
    ఇతరుల శ్రేయస్సు కోరే ఆమె హృదయం ఆవేశంతో నిప్పులు గ్రక్కుతుంది.
    విజయ్ అనురాధ చేతినుండి తన చేతిని మృదువుగా విడిపించుకున్నాడు.
    "ఇన్ని అవినీతులు మధ్య ఎక్కడో అక్కడ ఓ నీలి తళుక్కుమంటూ వుంటుంది."
    "ఆ నీతి నక్షత్రాలవి నువ్వు కావాలని నిజాయితీతో కూడిన ఆరాటం! విజయ్ ఈరోజు నువ్వింత భయంకరమైన అన్యాయానికి గురయినా కూడా నీ ఆలోచనా దృక్పథంలో మార్పు రాలేదా?"
    విజయ్ మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు.
    "అదిగో. ఆ నవ్వే..."
    అతని ముఖంలోకి చూసింది. ఎంతో కొంత జీవకళ లోపించినట్లు కనబడింది.
    "విజయ్!"
    "ఊ"
    "ఈ రొటీన్ లో, వ్యాకులపాటులో ఎంతో కొంత రిలీఫ్ పొందాలని అనిపించదా?"
    "ఏ మనిషి రిలీఫ్ లేకుండా యాంత్రికంగా గడపాలని అనుకోడు. కాని చాలా కృత్రిమంగా వెతుక్కునే రిలీఫ్ ఏమీ ఆనందాన్ని కలిగించదు. ఓ భ్రమ లేక ఆత్మవంచన అవుతుంది."
    "నిజమైన రిలీఫ్ లభిస్తే?"
    "నిజమని నేననుకోవాలిగా."
    అతను చాలా యాదృచ్చికంగా ఆ మాటన్నాడు. ఆమెను ఉద్దేశించి కాదు. అసలా ఆలోచన కూడా అతనికి లేదు. కాని ఆ సమయంలో అనూరాధ ముఖంలోకి చూసివుంటే ఆమె ఎంత నొచ్చుకున్నదీ, బాధపడిందీ తెలిసి వుండేది.
    "విజయ్ నువ్వు చాలా కఠినుడివి. నేనెంత సున్నితమైన దాన్నీ, నా మనసులోని భావాలెంత హాయిగా వీచే మృదు సుగంధ వదనాలవంటి పోనీ నీకర్థంకాదు. నిన్నారాధించే అదృష్టం. ఓదార్చే భాగ్యం నీ భార్య ఒక్కరికే దక్కాలా? ఆ అవకాశం అంతే మంచి మనసున్న మరో స్త్రీకి పంచుకోకూడదా? ఓ వివాహ వ్యవస్థ ఎంత బలీయమైన హక్కుని ప్రసాదిస్తుంది!"
    చిరుచిరు గాలులతోబాటు, చిన్నగా జల్లుకూడా పడుతున్నది.
    అలాగే నడుస్తూ అనూరాధ అపార్టుమెంటున్న కాంప్లెక్స్ దగ్గరకొచ్చారు.
    "విజయ్. లోపలకురా"
    "ఉహు"
    "ఏం?"
    "కారణమేంలేదు. నాకేం ఉత్సాహంగా లేదు."
    "విజయ్"
    ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
    "రేపట్నుంచీ కనిపించవుగా"
    అతనేం మాట్లాడలేదు.
    "ఇహనుంచి ఏం చేస్తావు?"
    "తెలీదు."
    "ఎందుకు నువ్విలా హింసించబడుతున్నావు?"
    నవ్వి వూరుకున్నాడు.
    ఈ లోకంలో _ మన ప్రమేయం లేకుండా విరుచుకుపడే దుస్సంఘటనలకు విషాదంగా నవ్వి వూరుకోవటం మినహాయించి గత్యంతరంలేదు.
    ఆ నవ్వు...ఎంత మనోహరంగా వుంటుందో, అంత విషాదం కూడా వుంటుంది.

 Previous Page Next Page