Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 27


    నన్నర్థం చేసుకోవేం?
    మాధురీ! నేను చేస్తున్న పని తప్పేమోనని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. నిన్ను ఇబ్బందిపెడుతున్నానేమోనని నీ ఛాయలకు రాకుండా వుండటానికి ప్రయత్నించాను.
    కానీ నావల్ల కాలేదు.
    నువ్వు లేకుండా బ్రతకలేనని తెలుసుకుని, తప్పనిసరై నీవైపు దూసుకొస్తున్నాను.
    ఒకటి మాత్రం గుర్తుంచుకో.
    కేవలం ఓ అందమైన ఆడపిల్లవనే వ్యామోహముతో నిన్ను వశం చేసుకుందామనే ఉద్దేశం నాకు లేదు.
    నాది ప్రేమ. ఆకర్షణ కాదు.
    నువ్వు నాకు కావాలి.
    నీ కోసము ఎంత త్యాగమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.
    అందుకే...
                                                       నీ హృదయంలో స్థానాన్ని అర్ధిస్తూ
                                                                        దీక్షిత్
    మాధురి సైలెంట్ గా కూర్చుండి పోయింది.
    ఈ మనసు...ఆ ప్రభావానికి గురికాకుండా వుండటానికి ఎంత ప్రయత్నిస్తున్నా...సాధ్యం కాదేం?
    ఇల్లు, అన్నయ్యలు, వదిన, తల్లి, తండ్రీ...యీ వాతావరణాన్ని కలవరపరచేలా ఎందుకీ సంఘటనలు?
    మనిషి కంటే సంఘటన బలమైనదా?
    మనసు కంటే ప్రభావం బలమైనదా?
    "ఇష్టం"అనేది ఒక స్పష్టమైన స్వరూపం లేకుండా వుంటుందా?
    కలకాలం సృష్టించే కొన్నిటి నుంచి మనిషి ఎందుకు తప్పించుకోలేక పోతున్నాడు?
    ఆమెకర్థం కావటం లేదు.
    గుండె బరువెక్కుతోంది.
    కళ్ళ నుండి అమాయకమైన అశ్రుబిందువులు.
    మృదు రోదనలతో అలసిపోయి ప్రక్కమీద వాలిపోయింది.


                                    10


    పార్కులో......
    చీకటి పడింది. అక్కడక్కడా చెదురుగా మనుషులు.
    "నాకు భయంగా వుంది" అన్నది మాధురి.
    వాళ్ళిద్దరూ చాలా దగ్గర దగ్గరగా కూర్చున్నారు. ఉండి ఉండి ఆహ్లాదం కలిగిస్తూ క్రోటన్స్ మీదుగా వీస్తోన్న చిరుగాలులు.
    "దేనికి" అన్నాడు దీక్షిత్.
    "ఒక అబ్బాయీ, అమ్మాయి...పెద్దవారికి తెలీకుండా ఇలా కలుసుకోవటం తప్పు కాదా?"
    "ఈ లోకం దృష్టిలో...వక్రమైన చూపుల్తో చూస్తే ఏదయినా తప్పే."
    "ఇంకోరకంగా చూసే అవగతం లోకానికేముంది?"
    "అలా అనుకుంటే మనుషులు చాలా పోగొట్టుకోవలసి వుంటుంది. తమది కాని జీవితాలు జీవించాల్సి వస్తుంది."
    "కాని__"
    "చెప్పు మాధురీ"
    "ప్రపంచంలో తప్పు_ఒప్పు అని రెండు వున్నాయా లేదా?"
    "ఉన్నాయి. కాని ఇతరులు అనుకునేదంతా తప్పు కాదు. అలాగే ఒప్పు కూడా"
    మాధురి ఏదో ఆలోచిస్తున్నట్లు నిశ్శబ్దంగా వుండిపోయింది.
    "మాధురీ! ఏమిటలా సైలెంట్ గా వుండిపోయావు.
    "దీక్షిత్" అంది. ఆమె గొంతు చిన్నగా వణుకుతోంది. "మా అమ్మా, నాన్న కంటే కూడా అన్నయ్యా, వదినా అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. వాళ్ళిద్దరూ కల్లాకపటం లేని దేవతా మూర్తులు. నా వల్ల వాళ్ళకెలాంటి కష్టం కలక్కూడదు.
    "నీ వల్ల__వాళ్ళకే కాదు ఎవరికీ కష్టం కలిగించేలా ప్రవర్తించను మాధురి. దేవుడు ఉన్నాడో లేదో ఎవరికీ తెలీదు. కాని వున్నాడని నమ్మినవారికే ఆ దివ్యానుభూతి తెలుస్తుంది. అలాగే ప్రేమను త్రికరణ శుద్ధిగా నమ్మినవారికే అందులోని వున్నతమైన మాధుర్యం తెలుస్తుంది.
    "కాని..."
    "చెప్పు మాధురి"
    "ఇది కేవలం నీకూ నాకూ మధ్య జరిగే సంఘటనే కాదు. దీని వెనుక నా కుటుంబమూ, మీ కుటుంబమూ నిలబడి వున్నాయని మరిచిపోకూడదు.
    "ఆ సత్యం నేనెలా విస్మరిస్తాను మాధురీ?"
    "స్వార్థం సత్యం కంటే బలమైనది దీక్షిత్."
    "మన విషయంలో అలా జరగనివ్వను."
    మాధురి ఆలోచిస్తూ వుండిపోయింది. ఈ మాధుర్యం వెనక గుప్తంగా దాగివున్న అశాంతి ఆమెను తరిమి తమిరి కొడుతున్నది.


                            *    *    *    *


    ఆఫీసు నుంచి ఒకరొకరుగా అంతా వెళ్ళిపోయారు. విజయ్ తన సీట్లో నుంచి కదలకుండా నిశ్చలంగా వుండిపోయాడు.
    "విజయ్!"
    చాలా దగ్గర్నుంచీ ఓ కంఠస్వరం.
    అతనికి వినబడలేదు.
    "విజయ్" ఈసారి అతని భుజం మీద ఒక మృదువైన హస్తమొచ్చి ఆనింది.
    "ఊ" అంటూ తల ప్రక్కకి తిప్పాడు.
    "రా. బయటకు పోదాం" అంది అనురాధ."
    "ఇక్కడే...కాసేపు కూచుంటాను అనురాధా"
    అతన్లో చెలరేగుతున్న భయంకరమైన తుఫానూ, సుడిగాలివంటి వ్యాకులపాటూ__వీటికి కారణమామెకు తెలుసు.
    "ఊ. ఇవేళ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను. నాతోబాటు తీసుకెళతాను."
    "అనురాధా ప్లీజ్"
    "ఉహు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళను."
    అతను తప్పనిసరై లేచాడు. ఇద్దరూ కలిసి బయటికొచ్చారు.

 Previous Page Next Page