మెల్లమెల్లగా తన మనసు తనకి అర్థమవుతోంది భానురేఖకి. తనకీ బతుకుమీద ఇష్టం కలగడమే కాదు. ఎలాంటి బతుకు కావాలనే ఇష్టాఇష్టాలు కూడా ఏర్పడుతున్నాయి! ఎందుకింత మార్పు వచ్చింది తనలో? తనని ఇష్టంగా చూసుకునే వ్యక్తి ఒకతను - కాదు కాదు - తనని ప్రాణానికి ప్రాణంలా చూసుకునే వ్యక్తి ఒకతను తారసపడటం వల్లనా?
రవిచంద్ర గుర్తు రాగానే అప్రయత్నంగా భానురేఖ పెదిమలు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి. ఇప్పుడు అర్థమవుతోంది అతను తనని చంపడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫెయిలయిపోయాయో! తనని చంపడానికి ఏర్పాట్లతోబాటు, చివరి క్షణంలో తనని రక్షించడానికి ఏర్పాట్లు కూడా అతనే చేసి ఉంచాడన్నమాట! ఆ లెక్కన చూస్తే ఇందాక తన వెంటపడ్డ రౌడీ కూడా రవిచంద్ర పంపితే వచ్చినవాడే అయిఉండాలి. అనవసరంగా భయపడిపోయి, పరిగెత్తింది గానీ, అబ్బే అతను అసలు అతను నిజం రౌడీలాగానే లేడు. గళ్ళలుంగీ, పెద్ద బెల్టూ, ఎర్ర చొక్కా, మొహం మీద పులిపిరికాయ - అచ్చం వీధి నాటకంలో పాత్రలా ఉన్నాడు.
అతన్ని తలుచుకున్న కొద్దీ నవ్వొస్తోంది భానురేఖకి. రవిచంద్ర అమెచ్యూరిష్ గా చేసిన, చేయించిన హత్యా ప్రయత్నాలు తలుచుకుంటే ఇంకా నవ్వొస్తోంది. నవ్వి నవ్వి ఆమె కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి. ఆ నవ్వు వాక్యూమ్ క్లీనర్ లా ఆమె మనసులోని భయాలనన్నిటినీ పారద్రోలగా, ఆ ఆనందభాష్పాలు ఎక్కడో గుండె మారుమూల మిగిలిపోయిన దిగుళ్ళని కూడా కడిగేశాయి. తను నవ్వుతుంటే ఫోటోలోని అమ్మ కూడా చెప్పలేనంత రిలీఫ్ తో నవ్వు మొహం పెట్టినట్లు అనిపిస్తోంది.
అగమ్యగోచరంగా చీకట్లో కొట్టుమిట్టాడుతున్న తనకి రవి ఉదయించి, దారి చూపినట్లుగా అనిపించింది భానురేఖకి. తమ పేర్లలో ఉన్న సామ్యం గుర్తుకు వచ్చింది. అతను రవి - తను భానురేఖ. అతను సూర్యుడు - తను కిరణం!
ఎంత బాగుంది ఈ సంబంధం! దీన్ని మూడుముళ్ళు వేసి వీడని బంధంగా ఎందుకు మార్చుకోకూడదు? చేసుకోకూడదు?
ఒక నిశ్చయానికి వచ్చి లేచింది భానురేఖ. పిరుదులు దాటివచ్చే వాలు జడను విప్పి, మళ్ళీ వేసుకుంది. స్నానం చేసి పాల నురుగులాంటి తెల్లటి సింథెటిక్ చీరె కట్టుకుంది. నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంది. కళ్ళకు కాటుక దిద్దుకుంది. పౌడరు రాసుకుంది. ఇంపోర్టెడ్ సెంటు మెడ వంపు కిందా, చెవుల వెనకా స్ప్రే చేసుకుంది. అన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇష్టంగా అలంకరణ చేసుకుంది భానురేఖ. నిస్సాన్ కారు తాళాలు అందుకుని, గాల్లో తేలిపోతున్నట్లు నడుస్తూ వచ్చి, కార్లో కూర్చుంది.
"ఎక్కడికి?" అని అడిగింది విలాసిని అనుమానంగా.
"ఇప్పుడే వస్తాను" అని కారు స్టార్ట్ చేసింది భానురేఖ. గేటు దాటగానే స్పీడందుకుంది కారు.
విండ్ స్క్రీన్ సినిమా స్క్రీనులా అయిపోయి దానిమీద ఫ్లాష్ బ్యాక్ లా దృశ్యాలు కనబడటం మొదలెట్టాయి. మాంటేజెస్. మొదటగా డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో ఒక అపరిచితుడు తనవంక కళ్ళార్పకుండా చూడడం.
తర్వాత, తను పార్కులో బొమ్మతో ఆడుకుంటూ ఉంటే అతను వచ్చి మాట్లాడటం-
లిఫ్టులో జయరాజ్ అల్లరి పెట్టబోతే అతను రక్షించడం -
ఉద్వేగంగా కారు గేరు మార్చి స్పీడు పెంచింది భానురేఖ. త్వరగా రవిని చేరుకోవాలి తను. తన నిర్ణయం గురించి చెప్పాలి. అతని మొహంలో కనబడే వర్ణనాతీతమైన ఆనందాన్ని వందేళ్ళపాటు గుర్తుచేసుకుంటూ బతకాలి.
మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు -
రవి లిఫ్ట్ ఆపరేటర్ గా చేరటం, తర్వాత తన కారుకి డ్రయివర్ గా పనిచేయడం-
ఎర్రగా మారిన తెల్ల గులాబీ! తనకోసం రక్తం చిందించిన రవి!
పరవశంతో ఆమె పాదం యాక్సిలేటర్ ని పూర్తిగా అదిమి పట్టేసింది. విమానంలా వెళ్ళిపోతోంది కారు.
ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు సినిమా ఫ్రేముల్లా అతివేగంగా కదిలిపోతున్నాయి.
అతను చెప్పిన జోకులు - అతని నవ్వు - అతని ప్రేమ - అతని ఆర్ద్రత, తనని చంపెయ్యమని అడిగినప్పుడు గుండెలో గులాబి ముల్లు గుచ్చుకున్నట్లు అతను చూసిన చూపు, అతను చేసిన ఉత్తుత్తి హత్యా ప్రయత్నాలు.
మళ్ళీ వీటన్నిటి మీదా సూపర్ ఇంపోజ్ అవుతూ ఎర్రగా మారుతున్న తెల్లగులాబి!
ఉన్నట్లుంది ఈ దృశ్యాలన్నీ అదృశ్యమైపోయాయి. విండ్ స్క్రీన్ లో ఒక మనిషి ఆకారం మాత్రమే కనబడుతోంది ఇప్పుడు. అతను రవి కాదు. రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తున్న ఒక పిచ్చివాడు.
పిచ్చి అనేది ఒక మానసిక రుగ్మత అనీ, పిచ్చివాణ్ణి సానుభూతితో చూడాలి గానీ, అపహాస్యం చెయ్యకూడదనీ గ్రహించలేని పిల్లలూ, పెద్దలూ కొందరు అతని వెంటబడి వేధిస్తున్నారు.
వెంటనే ఎడమ వైపుకి కారుని మళ్ళించింది భానురేఖ. పిచ్చివాణ్ణి తరుముతున్న గుంపు కారుకి అడ్డంగా వచ్చింది.
స్టీరింగుని గబగబా కుడి చేతి వైపుకి తిప్పేసి రోడ్డు మధ్యకి వచ్చింది భానురేఖ. అక్కడ మిడిగుడ్ల రాక్షసి లాంటి లారీ ఒకటి ఎదురు వస్తోంది. సడన్ బ్రేకు వేసింది భాను.
స్క్రీచ్ చ్ చ్ చ్! టైర్లు దొర్లడం ఆగింది కానీ కారు వేగం ఆగలేదు.
ప్రచండమైన వేగంతో రాష్ గా వచ్చి కారుని గుద్దేసింది లారీ. వెంటనే హృదయ విదారకమైన కేక పెట్టింది భానురేఖ. "రవీ!"
అదే ఆమె గొంతులో నుంచి వచ్చిన చివరి మాట. ఆ తర్వాత గుండెలోని రక్తం గొంతులో నుంచి తన్నుకొచ్చి ఫౌంటెన్ లా డాష్ బోర్డుని తడిపేసింది. పెదిమల కదలిక ఆగిపోయింది. అంగుళం మేర ఖాళీ లేకుండా వళ్ళంతా తగిలిన గాయాలు తెల్ల చీరెను ఎర్రగా మార్చేశాయి రక్తంతో. తెల్లగులాబి ఎర్రగా మారినట్లు!
భానురేఖ తనని వెదుక్కుంటూ వచ్చినన్నిరోజులూ తప్పించుకు తిరిగిన మృత్యువు, ఆమె వెనుదిరగగానే అకస్మాత్తుగా, అతివేగంగా, అనూహ్యమైన విధానంలో కాటు వేసింది. నిశ్చలంగా అయిపోయింది నిర్జీవమైన భానురేఖ శరీరం.
* * * *
హాస్పిటల్ లోకి ఒక కారూ, ఒక టాక్సీ ఒకే సమయంలో దూసుకు వచ్చాయి. గేటుముందు ఎదురుబొదురుగా ఆగిపోయాయి.
టాక్సీలో నుంచి తల బయటికి పెట్టి చూశాడు రవిచంద్ర. రక్త వర్ణంలో ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. రక్తమే లేనట్లు పాలిపోయి ఉంది అతని మొహం. పెదిమలు వణుకుతున్నాయి. ఎదుటి కారులో కూర్చుని ఉన్న మదన్ మోహన్ ని చూశాడు.
"ముందు మీరు" అన్నాడు బొంగురు గొంతుతో.
'కాదు ముందు మీరు" అన్నాడు మదన్ మోహన్. అతని గొంతు కూడా కంపిస్తోంది.
టాక్సీ లోపలికెళ్ళింది.
ఒళ్ళు తూలిపోతూ, మనసు సోలిపోతూ ఉండగా, గది గుమ్మాన్ని ఆసరాగా చేసుకుని చూశాడు రవిచంద్ర.
తెల్లగులాబీ ఎర్రగులాబీగా మారినట్లు, రక్తంతో తడిసిన అతని ప్రాణం మంచం మీద కనబడింది.
సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడమేగానీ, చేరువకావడం ఎరుగని సూర్యకిరణం ఒకటి. విశ్వంతరాళాలను చీల్చుకుంటూ వెళ్ళిపోతోంది.
* సమాప్తం *