Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 28


    విశ్వనాథరావుగారింట్లో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. జగన్నాథంగారు పనిలో చాలా సాయపడ్డారు. కొడుకులిద్దరూ తండ్రిని కష్టపడనీయకుండా అన్ని వ్యవహారాలూ తామే చూసుకున్నారు.

 

    ఇంట్లో ఎవరికీ ఇబ్బంది సమయం లేకుండానే జాగ్రత్తగా చూసె ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్ళి ఎల్లుండనగా చుట్టాలంతా చాలామంది వచ్చేశారు. సరిగ్గా ఆ సాయంత్రం ఎవ్వరూ అనుకోని విధంగా ఆశ యింట్లోకి రా వీల్లేకుండా అయి కూచుంది.

 

    ఈ విషయం లలితమ్మగారు వెళ్లి భర్తతో చెప్పేసరికి ఆయన ముఖంలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేకపోయింది. "యిప్పుడెలాగే! రేపు సాయంత్రం వాళ్ళు వచ్చేస్తున్నారు" అన్నాడు తడబడే గొంతుకతో.

 

    "మరి ఏం చేద్దామండీ? ముహూర్తాన్ని వాయిదా వెయ్యక తప్పదు అన్నది లలితమ్మగారు భయపడుతూ.

 

    విశ్వనాథంగారు కోపంతో మండిపడ్డాడు. "యిప్పుడు ప్రయత్నాలన్నీ చేసుకుని వాయిదా వెయ్యటమా? వీల్లేదు. అసలు మీకు బుద్ధిలేదు. అన్నీ సరిగ్గా చూసుకోండర్రా అని నెత్తీనోరూ కొట్టుకున్నానా? అంత అజాగ్రత్తగా ఎందుకు వుండాలి?" అన్నాడు భార్యమీదకు లేస్తూ.

 

    "ఇంత ముందుగా వస్తుందని అనుకోలేదండీ. పరీక్ష పెట్టినట్లు యీసారే యిలా జరిగింది" అన్నది లలితమ్మగారు విచారంగా.

 

    "ఏమయినా సరే, గుట్టుచప్పుడు గాకుండా పెళ్ళి చేసేస్తాను. ఇప్పుడు ఆపుచేస్తే నలుగురిలోనూ ఎంత అభాస!"

 

    లలితమ్మగారికి గుండెల్లో రాయిపడింది. "అలా చేయటం చాలా అపవిత్ర మండీ. కీడూనూ. మనకే మంచిది కాదు. నా మాట విని కష్టమో, నష్టమో ముహూర్తాన్ని వాయిదా వేద్దాం" అంది ప్రాధేయపడుతూ.

 

    ఆవేశంతో ఏమయినా సరే చేసిపారేస్తానని ప్రగల్భం పలికాడేగాని విశ్వనాథంగారికీ మనసులో సందిగ్ధంగానే వుంది. అందుకని జగన్నాథంగారికి కబురుపెట్టారు.

 

    జగన్నాథంగారు విషయం విని "అమ్మయ్యో! ఏమన్నాకానీ పిల్ల అవతలచెరి వున్నప్పుడు సూత్రధారణ కానేకాకూడదు. ఈ పిచ్చిక హృదయుడు చెప్పేమాట విని బయల్దేరవద్దని పెళ్లివారికి టెలిగ్రాం కొట్టండి. ఆనక తాపీగా మనం వెళ్ళి నచ్చచెప్పి మరో ముహూర్తం ఏర్పాటు చేసుకుందాం" అని సలహా ఇచ్చాడు.

 

    విశ్వనాథంగారికి ఆ సలహా ఆచరించక తప్పలేదు.

 

    ఈ తతంగంతో పెద్ద గడబిడ చెలరేగింది.

 

    ముందుగా కట్టుదిట్టంగా అన్నీ చూసుకుని ఎందుకు తొందరపడి ముహూర్తం నిర్ణయం చెయ్యలేదని పెళ్ళివాళ్ళంతా యింత ఎత్తున లేచారు. తీరా బయల్దేరబోతూంటే ఇలాంటి అవాంతరం వచ్చినందుకు తమకు నలుగుర్లోనూ అవమానం వాటిల్లిందని ఎగిరిపడ్డారు. అసలే తమకు ఇష్టం లేకపోయినా యీ సంబంధానికి ఒప్పుకున్నామనీ, ఇలాంటి అడ్లు వచ్చేటప్పటికి తమకు తల తిక్కరేగుకొస్తున్నదనీ చెలరేగారు.

 

    విషయం పరిష్కరించటానికి వెళ్లిన జగన్నాథంగారు "అయ్యా, మేము ఎంత జాగ్రత్తగా ఆలోచించిపెట్టినా అనుకోకుండా జరిగిపోయింది. తమరు దయతో క్షమించి, శీఘ్రంగానే వుండేటట్లు మరో ముహూర్తం కుదర్చమని కోరుతున్నాము" అని వినయంగా వేడుకున్నాడు.

 

    "అసలు బాధ్యత లేనట్లు ఆయన రాకుండా నిన్ను పంపించటమేమిటయ్యా? మేమంటే అంత ఆషామాషీగా వుందా?" అన్నాడు పెళ్లివారి తరపు ఓ పెద్దమనిషి.

 

    "చిత్తం. ఈ సంబంధం మొదట్నుంచీ నావల్లనే రాయబారాలు జరిగాయి కాబట్టి నన్ను పంపించటం జరిగిందండి" అవసరమనితోస్తే వారు తప్పకుండా వొచ్చి వుండేవారు" అని మనవి చేశాడు జగన్నాథంగారు.

 

    కాసేపు తర్జన భర్జన జరిగిన మీదట పెళ్ళికొడుకు తండ్రి "సరే కానివ్వండయ్యా. ఏమయినా మనం మర్యాదస్తులం. సహించక చేసేదేముంది? పోయి సిద్ధాంతిగార్ని పిల్చుకురండి. మరో ముహూర్తం మనమే పెట్టిద్దాం" అన్నాడు ఔదార్యం ప్రదర్శిస్తూ.

 

    సిద్ధాంతిగారు వచ్చి జాతకాలు పరిశీలించి సరిగ్గా వారంరోజుల్లో జరిగేటట్లు మరొకటి నిర్ణయించి చక్కాపోయాడు.

 

    "ఇదిగో పంతులుగారూ! మా వీలు చూసుకున్న పెళ్ళి యిది. దీనికి మళ్లీ అడ్డు చెప్పారంటే వ్యవహారం చీదర అవుతుంది. చెబుతున్నా. నేటికి అయిదోరోజుకల్లా తరలివస్తున్నాం. పోయి మీ ప్రయత్నంలో వుండండి" అని వియ్యంకుడు గంభీరంగా వాక్రుచ్చాడు.

 

    జగన్నాథంగారు సెలవుతీసుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని తిరుగుముఖం పట్టాడు.

 

    కాని ఎంతో గర్వంగా చేసుకొచ్చిన ఘనకార్యాన్ని గురించి వర్ణిస్తున్న ఆయన మాటలు విని విశ్వనాథం దంపతులిద్దరూ కొయ్యబారిపోయారు.

 

    "మాకు చెప్పాపెట్టకుండా ఇంత తొందరగా ఎందుకు నిశ్చయించుకొచ్చా వయ్యా మహానుభావా? సరిగ్గా ఆనాటికి యీవిడగారు యింట్లోకి రాకూడని సమయం. మీరు చాలా తొందరపడిపోయారు. ఇప్పుడు ఎలా చావటం?" అని విశ్వనాథంగారు విసుక్కున్నారు.

 

    ఇక్కడ ఇలాంటిదేదో వుంటుందని తాను ఎందుకు ఊహించలేకపోయానా అని జగన్నాథం తెగ సిగ్గుపడిపోయాడు. తన తెలివితక్కువకు, అప్రయోజకత్వానికి తనమీద ఏవగింపు కలిగింది. "మరి యిప్పుడేమిటి చేయటం?" అన్నాడు అసమర్థతగా.

 

    "పడిన వాయిదా ఎలానూ పడింది. ఎవరికీ ఏ యిబ్బందీ ఆటంకం లేనిరోజు చూసి మనమే నిర్ణయిద్దాం. తీరా వాళ్లు తరలి వచ్చాక ఈవిడగారు మూలచేరితే ఎంత అభాసు? తల్లి పీటలమీద కూర్చోకుండా పెళ్లెలా జరుగుతుందని? అక్కడికి మళ్ళీ ప్రయాణం కట్టండి. ఈసారి క్షుణ్ణంగా అన్నీ సవ్యంగా పరిష్కారం చేసుకుని రండి" అన్నారు విశ్వనాథంగారు.

 

    తాను అక్కడికి మళ్ళీ వెళ్ళాలనేసరికి జగన్నాథంగారికి గుండెల్లో రాయి పడింది. ఈసారి తన మర్యాద దక్కదు. "బాబోయ్! వాళ్ళంతా చండశాసనుల్లాగా వున్నారు. ఈసారి అక్కడికి వెళ్ళానంటే నన్ను బ్రతకనివ్వరు. ఇప్పటికే మీరు రాలేదని వాళ్ళంతా అక్కసు వెళ్ళబోసుకుని కారాలు, మిరియాలు నూరుతున్నారు. తమరు వెళ్ళివస్తేనే శ్రేయస్కరంగా వుంటుందని నా ఉద్దేశం" అన్నాడు భయపడుతూ.

 Previous Page Next Page