Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 27


    దాన్నలా అడిగితే అదేం చెబుతుందండీ! కుర్రాడికేం! నిక్షేపంగా వున్నాడు. ఏమయినా సరే ఈ సంబంధం మనం వదులుకోకూడదు" లలితమ్మగారు భర్తకు ప్రోత్సాహం ఇచ్చింది.

 

    ఆమె పెండ్లిచూపులకు ముందు కూతురితో అన్నమాటలు మరిచిపోయింది. కూతురి నిశ్శబ్దరోదన ఆ దంపతులకి వినిపించలేదు. అంతకంటే గట్టిగా ఎదురు చెప్పలేకపోయింది ఆశ.

 

    అప్పటికి జ్యోతి ఇంకా కాపురానికి రాలేదు.

 

    ఆశ పెళ్ళి కుదిరిపోయింది.

 

    ఆ సాయంత్రం ఆశ పై డాబా ఎక్కి సూర్యాస్తమయంలో శూన్యాన్ని చూస్తూ నిల్చున్నది. పెళ్ళా తనకు? ఇప్పట్లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోనిది. పంజరంలాంటిది. తనని మారుస్తున్నది. స్నేహితురాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. ఆటపట్టిస్తున్నారు.

 

    పెళ్ళివయసు వచ్చిందా తనకు!

 

    ఆశకు తెలీదు.

 

    "ఆశా!"

 

    ఆమె తలత్రిప్పి చూసింది. ప్రసాదరావు ఎంతో మృదువయిన కంఠంతో ఆమెను పిలిచి, ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు.

 

    అతనికప్పటికి చదివింకా పూర్తికాలేదు. అతను ఆశతో ఎంతో చనువుగా వుంటాడు. ఆత్మీయంగా మాట్లాడతాడు.

 

    "ఏమిటి బావా!" అంది ఆశ ఆప్యాయంగా.

 

    "ఒంటరిగా ఇక్కడ నిల్చుని ఏమిటి ఆలోచిస్తున్నావు!"

 

    "నా గురించి" అంది చప్పున.

 

    అతనామె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. "ఎందుకు కన్నీళ్ళు!"

 

    ఆశముఖం ప్రక్కకి త్రిప్పుకొని "ఏమీలేదు బావా" అంది పొడిగా.

 

    ఒకటి రెండుక్షణాలు ప్రసాద్ మౌనంగా ఊరుకొన్నాడో లేక మనసులో సతమతమవుతున్నాడో...! "నీకీ పెళ్ళి ఇష్టం లేదుకదూ!" అన్నాడు హటాత్తుగా.

 

    ఆమె ఉలిక్కిపడి అలాంటిదేమీ లేదే! అయినా నా యిష్టం ఏముంది? మన బాగోగులు పెద్దవాళ్ళకు తెలుసు, వాళ్ళే నిర్ణయిస్తారు" అంది సర్దుకుని.

 

    "ఆ నిర్ణయం శాసనంగా మారితే?"

 

    "అది శాసనం అని ఎందుకనుకోవాలి? మన తలిదండ్రులకి మనమీద పగ వుండదు కదా!"

 

    "కొన్ని సమయాల్లో వాళ్ళు పొరపాటు పడవచ్చుగా!"

 

    ఆశ నిట్టూర్చి మెల్లగా "మన నిర్ణయాలని గురించి మనమూ పొరబడుతున్నామని ఎందుకనుకోగూడదు" అన్నది.

 

    ప్రసాద్ కి ఈ సమాధానం విని కోపం వచ్చి "నీవు వట్టి మందమతివి ఆశా. నీలో విప్లవభావాలు లేవు" అన్నాడు కసిగా.

 

    "నీకు వున్నాయా? అని ప్రశ్నించింది ఆమె ఆశ్చర్యంగా.

 

    "వుండి నేను చేయగలిగిందేముంది? వట్టి అసమర్థ కుటుంబంలో పుట్టాను. ఒకరి ఆధారంమీద బ్రతుకుతున్నాను. నన్నూ నా ఆవేదనని ఎవరు గుర్తిస్తారు?" అన్నాడు ప్రసాద్ నిస్పృహగా.

 

    "ఆవేదనా!" అన్నది ఆశ మరింత ఆశ్చర్యంగా.

 

    "అవును. ఇన్నాళ్ళబట్టీ మీ ఇంట్లో వుంటున్నాను. నీతో ఇంత చనువుగా వుంటున్నాను. మనమిద్దరం బావా మరదళ్ల వరస. నీకెప్పుడూ స్ఫురించలేదా?" అన్నాడతను ఆవేశంగా.

 

    ఆమె విస్మయంలో మునిగిపోయింది. "నాకు అర్థం కావటంలేదు బావా!" అంది భయంగా, అయోమయంగా.

 

    అతను నిరాశగా "నువ్వు నా గురించి విడిగా ఎప్పుడూ ఆలోచించలేదా?" అన్నాడు.

 

    "ఉహు" అన్నదామె అమాయకంగా తలత్రిప్పుతూ.

 

    "ఏం పని జరిగింది ఆశా! నేను నీగురించి ఎంత మధనపడ్డాను" అన్నాడతను కృంగిపోయి.

 

    "ఎందుకు?"

 

    "ఎందుకా? నేను నిన్ను మనసారా ప్రేమించాను కాబట్టి."

 

    ఆశ గుండె వడివడిగా కొట్టుకుంది. కోపం, సిగ్గు, ఆందోళన, భయం... వీటి సమ్మేళనా ప్రభావంతో ఆమె బుగ్గలోకి రక్తం పొంగుకువచ్చింది. యెదురు చూడని ఈ ప్రసంగం, అతని ముఖంలోని విచిత్ర ఉద్రేకం, జీవితంలో మొదటిసారిగా తనకు తగిలిన ప్రేమ ప్రశంస ఆమెను కలవరపరిచినయ్. అతన్నుంచి అనుకోకుండా కొంచెం దూరంగా జరిగింది.

 

    "నేనెప్పుడూ అలాంటివి ఆలోచించలేదు. వాటినిగురించి నాకు తెలీదు" అన్నది బయటికి చూస్తూ.

 

    ప్రసాద్ మరింత అధీరుడయినట్లు కనిపించాడు. "పోనీ ఇప్పుడేమనిపిస్తోంది" అని ప్రశ్నించాడు చివరకు.

 

    "ఏమీ అనిపించటంలేదు."

 

    "నేను నా మనస్సుని వ్యక్తం చేసినా, ఇంత దీనంగా అడిగినా నీకేమీ అనిపించటంలేదా! నేనంటే నీకేమీ లేదా?"

 

    "లేదు."

 

    "నాకంటే ఆ పెళ్లికొడుకే నీకు ప్రీతిపాత్రమైనాడా?"

 

    "నేనేమయినా కఠినంగా మాట్లాడానా?" అనుకుంది తన గదిలో కూర్చుని. బావకు తననిద్దామనే ఉద్దేశం తమ ఇంట్లో ఎప్పుడూ లేదు. అలాంటి భావ సంచలనం తనకూ కలగలేదు. తనను వొట్టి కసాయిదానిలా చిత్రించుకుంటాడేమో బావ. తనేమి చేస్తుంది? అతను బీదవాడని తనకేమీ అలక్ష్యం లేదు. అతన్ని తృణీకారదృష్టితో ఎన్నడూ చూడలేదు. కాని ఇలాంటిది తను ఊహించలేదు.

 

    తల్లి భోజనానికి కేకేసేవరకూ ఆమె మంచంమీద ఆలోచిస్తూ పడుకుంది.


                                                                *  *  *


    ముహూర్తం నిశ్చయించారు. పెళ్ళివారు అనుకున్నంత సౌమ్యులు కారని మొదట్లోనే తెలిసిపోయింది. ప్రతి చిన్ని విషయాన్ని గురించీ మొహమాటం లేకుండా అడిగి, తమకు లాంఛనాల పేరిట, వేడుకల పేరిట రావలసినవి ఏమేమిటో ముందుగానే తేల్చుకున్నారు.

 Previous Page Next Page