Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 28

    "నీకేంరా నాయనా బంగారు పిచ్చుకవి అమ్మాయిల కలల్లో హీరోలా ఆజానుబాహుడువి, అరవిందదళాయతాక్షుడివి, నాలుగంకెల జీతంవాడివి, కారున్నవాడివి. నిన్నెవరన్నా ఎగిసి గంతేసి ఎగరేసుకుపోతారు" సుబ్బారావు హాస్యంగా అన్నాడు.
    "అమ్మాయిల కలల హీరో అంటున్నారు. ఏం పాపం మీ మగాళ్ళు కలలు కనరేమిటి? అందానికి రంభ, చదువుకి సరస్వతి, లక్ష్మీపుత్రి ఇవన్నీ వుండాలి.
    కాస్త మోడ్రన్ గా ఇంగ్లీషు గట్రా మాట్లాడాలి. అలాఅని మళ్ళీ అల్ట్రామోడల్ గా క్లబ్బులు, తాగుడులు మీతో సమంగాచేస్తే భరించలేరు. నవనీత ఆధునికత వేషభాషలలో వుండాలిగాని భావాలలో వుంటే సహించలేరు.
    అణుకువగా, మాట జవదాటకూడదు మళ్ళీ. ఏం? మీ కోరికలు కావా ఏమిటి ఇవన్నీ, మేమేనేమిటి కలలు కనేవాళ్ళం?" జ్యోతి పౌరుషంగా అంది.
    మురారి సుబ్బారావు ఒక్కక్షణం మొహాలు చూసుకున్నారు జవాబు చెప్పలేనట్టు.
    "భలే దెబ్బకొట్టారే మా మగాళ్ళమీద. ఏరా, ఏం చెపుతావు?" మురారి హాస్యంగా నవ్వాడు.
    "మా జ్యోతి పెళ్ళవకముందు చాలాచాలా కలలు కందిట. నీలాంటి హీరో మొగుడు, ఓ సినిమా సెట్టింగు ఇల్లు, విమానంలాంటి కారులో జంటగా డ్యూయెట్లు పాడుకుంటూ షికార్లు.... పాపం అవేం చేతకాదని ఉక్రోషంకొద్దీ అంటుందిలే, అంతే!" అన్నాడు వేళాకోళంగా సుబ్బారావు.
    జ్యోతి మొహం సిగ్గుతో ఎర్రబడింది.
    మురారి పకపక నవ్వాడు.
    "వీడింతేనండి - ఏమున్నా, లేకపోయినా కబుర్లతో కడుపు నింపేస్తాడు. వీడితో ఏంకానీ - పదండి ఆలా పబ్లిక్ గార్డెన్ కో, లేక ఏదన్నా పిక్చర్ కో పోదాం" అన్నాడు మురారి.
    జ్యోతి సంబరంగా "ఉండండి కాఫీ తెస్తున్నాను. తాగేసి వెడదాం" అంది చిన్నపిల్లలా ఆనందంగా లోపలికి పరిగెత్తింది.
    "ఎందుకురా? మళ్ళీ బోలెడు ఖర్చు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే పోదూ?" అన్నాడు మొహమాటంగా.
    "నా దగ్గిర నీకు మొహమాటం ఏమిటిరా, లే.... ఒక్కడ్నీ పిక్చర్ చూడబుద్ధివేయదు కంపెనీ లేకపోతే. బట్టలు మార్చుకురా" తరిమాడు మురారి సుబ్బారావుని.
    ఆ సాయంత్రం కాసేపు గార్డెన్స్ లో కూర్చుని అక్కడనించి సినిమాకెళ్ళి రాత్రి తాజ్ లో భోంచేశాక పదిన్నరకి యింట్లో విడిచాడు మురారి.
    "ఏదో మీ ధర్మమా అని అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. మీకెలా థాంక్స్ చెప్పుకోవాలి -" అంది జ్యోతి కారుదిగుతూ.
    "డోంట్ బి సిల్లీ" అన్నాడు మురారి చనువుగా.
    "ఒరేయ్! నీవు నాలుగుసార్లు తీసుకెళితే నేను ఒకసారన్నా నిన్ను పైకి తీసుకెళ్ళి భరించేశక్తి లేదు నాకు. నాతోపాటు ఇంట్లో ఇంత అన్నం పెట్టగలను. నీ కభ్యంతరం లేకపోతే ఏ రోజన్నా శలవురోజు రారా!" అన్నాడు ఆదరంగా సుబ్బారావు.
    "విత్ ప్లెజర్! ఇంటి భోజనం పెడతానంటే రానూ? ఈ ఆదివారం వూర్లోనే వుంటా. లంచ్ కి వస్తాలే."
    "తప్పకుండా రావాలి.... మరిచిపోకూడదు" జ్యోతి ఆనందంగా అంది.
    "ఒయస్. మరి వస్తా. గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు మురారి.
                          *         *          *         *
    మురారి ఆ ఆదివారం భోజనానికి వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. ఆ సాయంత్రం గార్డెన్స్ కి షికారు వెళ్ళారు.
    ఆ ఆదివారమే కాదు మురారి వూళ్ళో వున్నప్పుడు, తీరుబాటు వున్నప్పుడు వస్తుండేవాడు.
    అంతా కలిసి బయటికి వెళ్ళడం, లేదంటే మురారికి ఏదన్నా పచ్చళ్ళు, కూరలు తినాలనివుంటే ఇంట్లో జ్యోతికి చెప్పి చేయించుకుని ఆ పూట ఇంట్లో భోంచేసేవాడు.
    రోజంతా సరదాగా పెకాడుకోడం, సాయంత్రం సినిమాకి వెళ్ళడం. మొత్తానికి రెండు మూడు నెలల్లో మురారి ఆ కుటుంబానికి చాలా చేరువ అయ్యాడు.
    జ్యోతికీ చాలా చనువయ్యాడు. మురారి కొత్తపాత లేకుండా "జ్యోతిగారూ"అంటూ పిలవడం సాగించాడు.
    సుబ్బారావుకంటె కూడా జ్యోతి, మురారి ఎక్కువ మాట్లాడుకునేవారు.
    సినిమాలు, పుస్తకాలు గురించి చర్చించుకునేవారు, వాదించుకునేవారు. సుబ్బారావు శ్రోతగా మిగిలేవాడు.
    ఏదన్నా మంచి సినిమావస్తే..... ఆ సినిమాకి వెళ్ళాల్సిందే పదండి అని అడిగేంత చనువు వచ్చేసింది.
    అసలు మురారి వస్తూనే చనువుగా "ఏమండోయ్! ఏం సినిమాలున్నాయి? ఏవి చూడవచ్చు? లిస్టు చెప్పండి" అనేవాడు.
    జ్యోతి సినిమా సమాచారం సేకరించడంలో ఫస్టు ఏమో గడగడ కొత్త రిలీజులు, అందులో చూడతగ్గవి వల్లించేది.
    "అబ్బ! మీముందు ఏ సినిమా మేగజైన్ పనికొస్తుంది? ఎక్కడ సంపాదిస్తారండీ ఈ ఇన్ ఫర్మేషన్?" నవ్వేవాడు మురారి వేళాకోళం నటిస్తూ.
    సుబ్బారావుకి సినిమాలు అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో చూస్తాడుకాని పిచ్చిలేదు.
    వాళ్ళ కంపెనీకోసం బయలుదేరేవాడుగాని వెర్రెక్కినట్టు ఆ కబుర్లే చెప్పుకోవడం చిరాకు.   

 Previous Page Next Page