Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 28


    ఆక్రందన.

 

    ఆ బిడ్డ తల్లి రోదనలా అంది రుత్వితో  -

 

    "ఈ పక్క వీధిలోనే వుంటాం బాబు. వంటగదిలో ఆడుకుంటున్న నా బిడ్డని తేలు కుట్టిందయ్యా.

 

    వెంటనే స్పందించిన రుత్వి బాధతో మెలితిరిగిపోతున్న పసిబిడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు.

 

    ఆ జంటతో పాటు వేగంగా ఇంట్లోకి నడిచాడు.

 

    ఐదు నిమిషాలపాటు విలేఖరులు ఆత్రంగా ఎదురుచూస్తుంటే బిడ్డతోపాటు బయటికి వచ్చారు ఇందాకటి జంట.

 

    నొప్పి తగ్గినట్టు ఆపసికందు తండ్రి భుజాలపై పడుకుని వున్నాడు. ఇందాకటి ఆందోళనలేదు.

 

    ఆ ఇద్దరూ రుత్వికి నమస్కరించి వెళ్లగానే ఓ విలేఖరి ఉత్సాహాన్ని ఆపుకోలేనట్టుగా అడిగాడు  -

 

    "ఏదో మంత్రం వేసినట్లు పిల్లాడు సైలెంట్ అయిపోయాడు."

 

    "మంత్రం కాదు"

 

    మృదువుగా అన్నాడు రుత్వి.

 

    "మందు వేశాను"

 

    "అదేంటో తెలుసుకోవచ్చా?"

 

    "కుంకుడుకాయని అరగతీసి ఆ గంధాన్ని అంటించాను. చన్నీళ్లలో కాస్త ఉప్పు కలిపి తాగించాను అంతే!"

 

    "కుంకుడుకాయ అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా?"

 

    "ఒక్క తేలుకాటుకు మాత్రమే కాదు. కందిరీగ, తేనెటీగలాంటి కీటకాలు బారి నుంచి మనిషిని కాపాడుతుంది. అంతెందుకు ఈ కుంకుడుకాయ గంధాన్ని ఓతులం మోతాదులో మింగేస్తే పాము కాటునుంచి మనిషి రక్షింపబడతాడు అంటారు వైద్య నిపుణులు"

 

    "చన్నీళ్లతో ఉప్పు కలిపి ఎందుకు తాగించారు?"

 

    "విష ప్రబావం వేగంగా విరిగిపోతుంది."

 

    "ఇట్స్ రియల్లీ సర్ ప్రయిజ్."

 

    ఓ ఇంగ్లీషు డెయిలీ విలేఖరి అన్నాడు.

 

    "ఆయుర్వేదం గొప్పతనాన్ని ప్రాక్టికల్ గా డిమాన్ స్ట్రేట్ చేసి చూపించారు."

 

    "నేను కోరేది ఒక్కటే. ఇలా ఇప్పుడు మిమ్మల్ని సర్ ప్రయిజ్ చేసిన ఆయుర్వేదం రేపు ప్రాచుర్యంలోకి వచ్చి ఈ దేశంలేని ప్రతిమనిషికీ ఓ ప్రైజ్ లా అనిపించాలి."

 

    "మీరు ఇలాగే ప్రయత్నిస్తే అదంత కష్టం కాదు" అంటున్న విలేఖరి నాలుక తడబడింది.

 

    "సార్! నాకు జర్దాపాన్ అలవాటు. ఇందాక పాన్ లో సున్నం ఎక్కువై నాలుక  పూసిపోయింది."

 

    అతడేదో చెబుతుంటే లోనికెళ్లి అరనిముషంలో తిరిగి వచ్చిన రుత్వి -

 

    "ఈ బెల్లముక్కని కాస్త చప్పరించండి" అంటూ యిచ్చాడు.

 

    ఇది మరో విరుగుడులా పనిచేయడాన్ని అక్కడున్న వాళ్లు గ్రహించడానికి రెండు నిముషాలు పట్టింది.

 

     ఉత్సాహంగా అన్నాడు ఇందాకటి జర్మలిస్ట్.

 

    "ఇట్స్ గ్రేట్. ఇప్పుడు నా నాలుక మామూలుగా మారిపోయినట్టుంది.. అదికాదు" ఉద్వేగంగా అన్నాడా విలేఖరి.

 

    "ఒక పక్క కంప్యూటర్ యుగానికి చెందిన ఇంజనీర్ ఇంత ఎఫెక్టివ్ గా మన ప్రాచీన ఆయుర్వేదంలో నిష్ణాతుడు కావడం చూసి మేం గర్వపడుతున్నాం"

 

    వాళ్లు మాత్రమే కాదు.

 

    ఇందాక తేలుకుట్టిన పసివాడితో ఓ జంట రావడం మొదలుకుని ఇంతసేపూ ద్వారం దగ్గర నిలబడి అంతా గమనిస్తున్న విజూష పరిస్థితీ అలాగే వుంది.

 

    రుత్విలో ధన్వంతరి కనిపించాడో లేక నవయుగ వైతాళికుడైన మరో యువకుడే కనిపించాడో దిగ్ర్బాంతిగా చూస్తూ  వుండిపోయింది.

 

    "హలో"

 

    రుత్వి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చిన విజూష తేరుకోవడానికి పది సెకండ్లు పట్టింది.


 
    "విష్ చేసినట్టు తల పంకించిందే తప్ప" నేను క్విజ్ కాంపిటీషన్ లో పాల్గోను"అని వున్న ఆ రోజు దినపత్రికలోని అతడి స్టేట్ మెంట్ గురించి వెంటనే అడగలేకపోయింది.

 

    "ప్లీజ్ కమిన్" రుత్వి సభ్యతగా ఆహ్వానించినా ఆమె ముందుకు నడవలేదు.

 

    అప్పుడు ఆమె ఆలోచిస్తున్నదొక్కటే.

 

    పోటీలో గెలిచిన రుత్విని తను గెలుచుకుంటానని స్పూర్తితో పందెం కాసిందే. అవతలతడు  పోటీకే సిద్దపడకబోతే ఎలా.......

 

     ఓ అరగంట క్రితం డెయిలీ న్యూస్ పేపరుతోపాటు స్పూర్తి విజూష యింటికి వచ్చింది.

 

    రుత్వికి సంబంధించిన స్టేట్ మెంట్ చూపించి రుత్వి ఇంటి ఫోన్ నెంబరు ఇచ్చింది.

 

    స్పూర్తి ఏ ఉద్దేశ్యంతో ఇలా తనను డ్రైవ్ చేస్తున్నదీ తెలుసుకునే మూడ్ లో లేదు విజూష. అందుకే ఫోన్ నెంబరు ద్వారా ఇంటి అడ్రసూ తెలుసుకుని సరాసరి వచ్చేసింది.

 

    ఇలా వంటరిగావచ్చి తను ఎంత పొరపాటు చేసిందీ ఇప్పటికిగానీ అర్దంకాలేదు.

 

    అక్కడ వున్నది అందరూ మగాళ్ళే. పైగా ప్రెస్ కాన్ ఫరెన్స్ లాంటిది జరుగుతోంది.

 

    వెనక్కి వెళ్లిపోవాలో లేక రుత్వి ఆహ్వానాన్ని అంగీకరించి వెళ్లి కూర్చోవాలో తోచలేదు అరనిముషందాకా.

 

    విజూష వచ్చింది దేనికో తెలీకపోయినా మరోసారి, మర్యాదపూర్వకంగా పిలిచాడు "మిమ్మల్నే"

 

    ముళ్ళ మధ్య గులాబీలా చూసిందామె.

 

    అవిరామంగా కదులుతున్న ఆలోచనల అలల మహార్నవమై 'అడవి చెట్లన్నింటినీ 'జడలో తురిమి  ఊళ్ళు దండలగుచ్చి మెళ్లోన వాల్చి ఉప్పొంగిన" బాపిరాజు వరదగోదావరియై......

 

    "ఆ ప్రశాంత నిసాజఠరాంతమందు కలత నిదురలో కలల్గాంచి చున్న గౌతమీనది. నా మనోగత విశాదతమము నంతయు తనలోనే దాచుకొనియె "ననే వేదుల అవృత్తియై......

 

    నెమ్మదిగా నడిచి ఆవరణలో విలేఖర్ల పక్కనేవున్న ఓ ఖాళీ కుర్చీలో సెటిలైపోయింది విజూష మంత్రముగ్దలో..........

 

    "ఈ మధ్య యువతీ యువకుల మధ్య ఆకర్షణల సంబంధాలూ ఎక్కువ మోతాదులో చాసా స్పీడ్ గా డెవలప్ అవుతున్నాయి"

 

    ఉన్నట్టుండి ఓ విలేఖరి ఇలాంటి ప్రసక్తి తీసుకొచ్చేసరికి రుత్వి మాత్రమే కాదు ఒంటరి ఆడపిల్లగా అక్కడ కూర్చున్న విజూష కూడా రియాక్టయింది.

 Previous Page Next Page