"రావు ఎవరు?"
బృహస్పతి క్షణం తటపటాయించి "అదే! ఓంఫట్ బాబా" అన్నాడు.
"అతడ్ని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఒక కాలు తీసేయవలసి వచ్చింది."
బృహస్పతి బాధగా కళ్ళు మూసుకున్నాడు. కొంచెం సేపు ఆ గదిలో మౌనం రాజ్యమేలింది.
".... మీరు ఇద్దరూ యింతకుముందే స్నేహితులు కదూ! నన్నూ, మా బామ్మనీ మోసం చేయటానికి ఆ నాటకం ఆడారు అవునా?"
బృహస్పతి నిశ్శబ్దంగా తల వూపాడు. ఆమె నెమ్మదిగా నిట్టూర్చి "నాకు ముందే అనుమానం వచ్చింది" అంది.
బృహస్పతికి చాలా గిల్టీగా అనిపించింది. "అనుమానం వచ్చినా, ఆ బాబాకి.... అదే.... మా రావుకి పాతికవేలు ఎందుకిచ్చారు?" అనడిగాడు.
"పాతికవేలు కాదు.... ఏభై వేలు!" విషాదంగా నవ్వింది ప్రశాంత నివాళి. ".... రెండో దఫా పాతికవేలు ఇచ్చిన సంగతి మా నాయనమ్మ ఆ తర్వాత నాకు చెప్పింది...." దీర్ఘంగా శ్వాస వదులుతూ ప్రశాంత నివాళి కొనసాగించింది. ".... నేను వద్దన్నా మా నాయనమ్మ ఒప్పుకోదు. అందుకని నేనెక్కువ వాదించలేదు. అన్నిటికన్నా పెద్ద హాస్యాస్పదమైన చేదునిజం ఏమిటో తెలుసా? ఎవరి మరణం ఆపడంకోసం మా నాయనమ్మ ఆ డబ్బు ఇచ్చిందో- ఆ పెళ్ళి కొడుకే కట్నం తక్కువయిందన్న కారణంగా- ఈ పెళ్ళి నిరాకరించాడు."
బాధ, ఆశ్చర్యం మిళితమైన స్వరంతో "ఏమిటీ? మీ పెళ్ళి ఆగిపోయిందా?" అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
"మా వల్ల .... మాకు డబ్బులు ఇవ్వడంవల్ల.... మీ పెళ్ళి ఆగిపోయింది కదా?" అన్నాడు.
ఆమె దానికి కూడా మాట్లాడలేదు.
తనలో తనే అనుకుంటున్నట్టు "ఛీ!" అన్నాడు.
అంతలోనే ఏదో అప్పుడే స్ఫురించినట్లు అతడు పక్కమీద లేచి కూచుంటూ "మేము మోసగాళ్ళమని తెలుసు. మా వల్లే మీ పెళ్లి ఆగిపోయిందని కూడా నీకు తెలుసు. అయినా.... అయినా నన్ను రక్షించావు. కట్నంలో మిగిలిన డబ్బుతో ఆపరేషన్ కూడా చేయించావు. ఎందుకు? ఎందుకు చేసావు నువ్వు ఇదంతా?"
"మరేం చేయను? నా పెళ్ళి పాడుచేసిన వారికి దేవుడు సరయిన శిక్షే విధించాడన్న తృప్తితో ఆ నది ఒడ్డున మిమ్మల్ని అలాగే వదిలేయనా?" సూటిగా ప్రశ్నించింది నివాళి.
బృహస్పతి మాట్లాడలేదు. అతడికి మనసంతా చాలా భారంగా అనిపించింది.
ఆమె నాయనమ్మ అమాయకత్వం మీద ఆడుకుని రెండు విడతలుగా తాము ఆమె కట్నంలో సగం డబ్బు కొట్టేసారు. అయినా తనను రక్షించడం కోసం ఆమె మిగతా సగం డబ్బు ఖర్చుపెట్టింది.
ఇంత త్యాగాన్నీ, మానవత్వాన్నీ అతడు భరించలేకపోతున్నాడు. దేదీప్యమానమయిన ప్రశాంతతతో వెలుగుతున్న ఆ నివాళి మొహం చూడటానికి అతడికి సిగ్గు వేసింది. ఆ నిశ్శబ్దం అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
"నేను.... నేను మీ నాయనమ్మని చూడాలి" అన్నాడు.
ఆమె నెమ్మదిగా కళ్ళెత్తి అతడి మొహంలోకి అభావంగా చూసింది.
"ఎక్కడ వుంది ఆవిడ? తీసుకురాగలరా?" తిరిగి అడిగాడు.
"ఇక్కడే వుంది. చూస్తారా?"
"ఇక్కడా?"
"ఔను. చూడాలంటే మీరే లేవాలి."
గుండెలో బాధతో పోల్చుకుంటే కడుపులో బాధ ఎక్కువకాదు. అతడు అతికష్టంమీద పక్క దిగాడు. నివాళి అతడిని ఆస్పత్రి పక్కగదిలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలో మంచంమీద ఒక బోను లాంటి దోమతెర కట్టబడి వుంది.
అందులో వుంది నాయనమ్మ!
గుండె లోంచి గొంతులోకి రాబోతున్న కేకని అతికష్టంమీద ఆపుకున్నాడు బృహస్పతి.
చర్మం అంతా కాలిపోయి, ఉడికిన మాంసపు ముద్దలా వికృతంగా వుందావిడ! నిస్తేజమయిన కళ్ళతో- చలనం లేకుండా- రెప్పవాల్చకుండా అతడివేపే చూస్తోంది. ఆవిడ జేగురురంగు కళ్ళలో నుంచి ఏదో ఒక అస్పష్టమయిన ప్రహేళిక అతడి గుండెల్లోకి బాణాలు దింపుతోంది.
"ఎలా .... ఎలా జరిగిందంతా?" తిరిగి గదిలోకి వచ్చాక ప్రశ్నించాడు.
"పెళ్ళి ఆగిపోయిందని తెలిసాక నాయనమ్మ చాలా వ్యాకుల పడింది. రెండో దఫా ఓంఫట్ బాబాకి డబ్బు ఇచ్చినట్లు నాకు చెప్పలేదు. ఒకవేపు డబ్బిచ్చానన్న దిగులూ, మరోవేపు నేను ఏమంటానోనన్న భయం! ఆ రాత్రే ఆవిడ కిరసనాయిలు పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఎలాగో కష్టపడి రక్షించాం! కానీ ఇక ఆమె జీవితాంతం అలా పక్కమీద బతకాల్సిందే!" బృహస్పతికి కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి. తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం సేపటికి తేరుకుని అతడు నెమ్మదిగా - తనలో తానే అనుకుంటున్నట్లుగా అన్నాడు.
"నేను ముందే వాడికి చెప్పాను. ప్రజలకు నాలుగు చల్లని మాటలు చెప్పి, వారికి మనశ్శాంతి కలిగించి, తృణమో పణమో పొందడంలో తప్పులేదనీ.... అలా కాకుండా - వారిలో లేనిపోని భయాలు సృష్టించి డబ్బులు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించాను. అతడు నాకో ఎదురు ప్రశ్న వేసాడు. బాబాగా తను ప్రజల ఆస్థి కొల్లగొడుతూంటే, రాజకీయాల్లో చేరి నేను ప్రభుత్వ ఆస్థి కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు. రెండింటికీ తేడా లేదని వాదించాడు."
"నిజమేగా!"
వాక్ప్రవాహానికి అడ్డుపడినట్టయింది. అతడు అప్రతిభుడై ఆమెవైపు చూసాడు.
ఆమె ఏదో చెప్పబోయి ఆగింది. మళ్ళీ సందిగ్ధం. లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. వెనుతిరిగి వచ్చి కుర్చీలో కూచుంది.
ఆమె తటపటాయింపుని గుర్తించినట్లు "మీరేమైనా చెప్పదల్చుకున్నారా?" అనడిగాడు బృహస్పతి.
ఆమె సమాధానం చెప్పలేడు.
"చూడండీ! మేము చేసిన పనికి బదులుగా మీరు నాకు చేసిన సహాయం- ఇప్పటికే నన్ను సిగ్గుతో తల వంచుకునేలా చేస్తోంది. కృతజ్ఞతా భారంతో నా శిరసు వంగిపోతోంది. మీరు ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం మీలోనే దాచుకుంటే మేము మీ పట్ల ఇంకా ఎన్ని తప్పులు చేసామో తెలియక ఆ న్యూనతా భావం నన్ను మరింత కుంగిపోయేలా చేస్తుంది."
"ఛ.... ఛ.... అటువంటి దేమీలేదు" ఆమె చప్పున అడ్డు తగిలింది అతడి మాటలకి. "మీరు చేసినది ఏమీ లేదు. నేను చెప్పదల్చుకున్నది మీ గురించి కాదు. మీలాంటి వాళ్ళందరి గురించీ!"
"మాలాటివాళ్ళ గురించా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
"ఔను బృహస్పతిగారూ!" ఆమె కంఠం మంద్రంగా పలికింది. "....ఇదంతా చెప్పవచ్చో, చెప్పకూడదో కూడా నాకు తెలీదు. నేను చాలా సామాన్యమైన మనిషిని. మరో మాటలో చెప్పాలంటే సామాన్యులకి ప్రతినిధిని! మాకు మీ అంత తెలివి తేటలు లేవు. మా భయాలకీ, అజ్ఞానానికీ మేము మీలాంటివారి దగ్గర స్వాంతన పొందడంతప్ప మరో మార్గంలేదు. మేము బాబాలని ఆశ్రయించినా, రాజకీయ నాయకులకి పదవులు కట్టబెట్టినా- మాకు వారు మంచి చేస్తారనే! మాకు పెద్ద పెద్ద ఆశలు లేవు. ఎదో మా జీవితాలు గడిచిపోతే చాలు" ఆమె ఆపి కొనసాగించింది.
"....భగవంతుడు మనుషుల్ని రెండు రకాలుగా సృష్టించాడు. తెలివైనవాళ్ళు, సామాన్యులు! అవునా? సామాన్యులని పరిరక్షించడం కోసం తెలివైనవాళ్ళు తమ తెలివితేటలని ఉపయోగించాలి. బహుశా దేవుడి ఉద్దేశం అదే అయుంటుంది! కానీ ఈ తెలివైన వాళ్ళందరూ తమ తెలివితేటలని వేరేరకంగా ఉపయోగించుకుంటున్నారు. చిన్న పూరి గుడిసెలో తన బతుకేదో తను బతుకుతున్న కూలీని కూడా కొల్లగొట్టటానికి వారు సంశయించడం లేదు. వందకోట్లు సంపాదించిన ప్రధానమంత్రి కొడుకు కూడా పదికోట్ల కోసం కక్కుర్తిపడి పేద రైతుకి రావలసిన యూరియాని కడుపారా భక్షిస్తున్నాడు. ఇంత డబ్బు తను ఏం చెసుకుంటానని కూడా ఆలోచించడంలేదు. పోనీ అతడేమన్నా సుఖంగా వున్నాడా అంటే- ఏ క్షణం కేసు వస్తుందో అన్న దిగులుతో క్షణక్షణం మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాడు. తెలివితేటలు వున్న వాళ్ళందరూ ఇలా చంబల్ వాలీ దొంగలు అయిపోతే మాలాంటి అమాయకుల, అజ్ఞానుల గతేమిటి? మమ్మల్ని రక్షించాల్సిన జ్ఞానులు మీరే మమ్మల్ని భక్షిస్తుంటే మేమిక ఎవరి పంచన తలదాచుకోవాలి? ఏ వ్యవస్థని ఆశ్రయించాలి?" ఆమె అడిగింది.
"....తెలివైనవాడు ఒక రూపాయి సంపాదించాలంటే అమాయకుడు ఒక రూపాయి కోల్పోవాలి. ఒక రాజకీయ నాయకుడు వందకోట్లు సంపాదించాలంటే- ఒక ఆనకట్ట నిర్మాణం ఆగిపోయి వందకోట్ల మందికి కనీసాహారం కూడా 'ఖరీదయినవస్తువు' కావాలి. అందుకని నేను మీకందరికీ చేతులు జోడించి వినయంగా విన్నవించే విషయం ఒకటే! ఓ మేధావుల్లారా! మీ మేధస్సుని రాజకీయంతో మేళవించి మాలాంటి అర్భకుల జీవితపు పునాదులమీద మీ భవంతులు కట్టుకోకండి! మమ్మల్నీ మీతోపాటు బతకనివ్వండి" ఉద్విగ్నతవల్ల రుద్ధమైన కంఠంతో ఆమె ఆఖరి వాక్యం పూర్తి చేసింది. "బృహస్పతి గారూ! కనీసం మీరయినా మా వైపు నిలబడండి" అందామె.
17
కత్తెర తాలూకు చిన్నశబ్దంతో రిబ్బన్ తెగింది. అక్కడున్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. ఎంతోమంది లేరు. శ్రీహర్ష, హిమసమీర, తల్లీ, తండ్రి.... అంతే! రావు ఒంటికాలితో కుంటుకుంటూ వెళ్లి కేష్ కౌంటర్ దగ్గర కూచున్నాడు.
"కుడికాలు ముందుపెట్టు అన్నయ్యా!" అంది హిమసమీర నవ్వుతూ.
"నోర్ముయ్!" చెల్లెల్ని ముద్దుగా కోప్పడ్డాడు బృహస్పతి. "నాకు ఇటువంటి వాటిమీద నమ్మకం లేదని తెలిసి కూడా ఇన్ని ఏర్పాట్లు చేసి ఇబ్బందిలో పడేసావు."
"పోన్లేరా! దాని ఆనందం దానిది. ఇన్నాళ్ళకి నువ్వు మామూలు మనిషివి అయ్యావని దాని సంతోషం."
"అంటే - ఇంతకు ముందంతా నేను రాక్షసుడి లాగానో, మృగం లాగానో వుండేవాడినా?"
"కాదు! అపురూపమైన తెలివితేటలున్నాయని నీకు నీవే అనేసుకుని ఎగిరెగిరి పడేవాడివి" కత్తెర బ్రహ్మానందానికిస్తూ అన్నాడు తండ్రి.
అందరూ లోపలికి ప్రవేశించారు.
నగరానికి పది కిలోమీటర్ల దూరంలో బృహస్పతి పెట్టిన ధాబా అది! నేషనల్ హైవే పక్కన చిన్న ఇల్లు లీజుకి తీసుకుని, ఆ యింటిముందు తాటాకులతో చిన్న పందిరిలాగా వేయించాడు. ఒక డజను నులకమంచాలూ వగయిరా ఏర్పాటు చేసాడు. ఒక పంజాబీ వంటవాడ్ని పనిలో పెట్టాడు.
"ధాబా పెట్టాలన్న ఆలోచన నీకు రావడం గమ్మత్తుగా వుంది" అన్నాడు శ్రీహర్ష. ".... సాధారణంగా యిలాంటి ఆలోచన ఎవరికీ రాదు....