Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 27


    కెమెరాలు ఆమెవైపు ఫోకస్ చేయబడి వున్నాయి.

    ఆమె చదువుకుపోతోంది.

    "....అయితే కాలం గడుస్తున్నకొద్దీ, అధికారంలో వున్న వారు ఈ వ్యవస్థలోని లోపాలని తమ స్వార్ధానికి ఉపయోగించుకోసాగారు. ఢిల్లీలో బోఫోర్స్, బొంబాయిలో సెక్యూరిటీ స్కామ్, బీహార్ లో పశుగ్రాస్ కుంభకోణం, జార్ఖండ్ లో ఎం.పీ.ల కొనుగోలు, సెయింట్ కిట్స్ వ్యవహారం, జైన్ డైరీ హవాలా వ్యవహారం, ఇపుడు కొత్తగా యూరియా స్కామ్- ఇవన్నీ ఉదాహరణలు- నాయకుల ధనదాహానికి ప్రతీకలు."

    ఆమె తల వంచుకొని వ్యాసాన్ని చదువుతోంది.

    ".... అయితే నేనిప్పుడు ప్రస్తావిస్తున్నది ధనదాహం గురించి కాదు. ప్రజల్లో 'మంచి పేరు' తెచ్చుకోవాలనే తపనతో ఆర్ధిక అవగాహన లేని కొందరు నాయకుల ప్రణాళికల గురించి- మనకున్న వనరులు- బంగారు గుడ్లు పెట్టే బాతులలాంటివి. పేరుకోసం వాటిని కొందరు నాయకులు ఎంతో తెలివిగా చంపేస్తూంటారు. ఉదాహరణకి పూర్వం వాహనాలమీద పన్ను ఉండేది. ప్రతి ఏడాదీ వాహనదారులు పన్ను కట్టేవారు. దాన్ని తొలగించి 'లైఫ్ టాక్స్' పద్ధతిని పరిచయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడింది. దానితో సబ్సిడీ బియ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఒక నాయకుడు. ప్రజలు అతడికి జేజేలు కొట్టారు. మరణించాక బుద్ధుడి స్థానంలో అతడికి సమాధి కట్టారు. ఏటేటా వచ్చే కొన్ని కోట్ల ఆదాయాన్ని ఒకేసారి పీల్చేసి ఈ విధంగా చేసాడని గుర్తించలేకపోయారు. మద్యనిషేధాన్ని అమలు జరుపుతూ బీదలు జీవితాల్ని బాగుచేస్తానని నినదించే ఒక నాయకుడు- నగరం మధ్యలో వున్నా విశాలమైన జైలు ఆవరణని రియల్ ఎస్టేట్స్ గా మార్చి అమ్మేస్తానంటున్నాడు. జైళ్ళని ఊరి బయటికి తరిమేస్తానంటున్నాడు. 'రాష్త్రంలోటు బడ్జెట్ పూరించడం కోసం కేంద్రం సాయపడాలి' అని ప్రతిపక్షంలో వున్నంతసేపూ గోలచేస్తాడు. తన తృతీయ ఫ్రంట్ అధికారంలోకి రాగానే ఆ విషయం కన్వీనియెంట్ గా మర్చిపోతాడు. మాటిమాటికీ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాడు. దాన్ని తీర్చే బాధ్యత తర్వాత తరాలకి వదిలేస్తాడు. ప్రతీ ఏడూ ఇంటిపన్ను కట్టే స్థానే ఒకేసారి లైఫ్ టాక్స్ ప్రవేశపెట్టే విధానం కూడా ఆలోచనలో వుంది. బంగారు బాతుల్ని చంపే ఈ ఆర్థికఅవగాహన లేనివారిని గొప్ప నాయకులుగా గుర్తించడం మన అజ్ఞానానికి ఉదాహరణ."

    దర్శకుడు ఆమె వ్యాసాన్ని వింటూ అభినందనపూర్వకంగా తలూపాడు. ఆమె కొనసాగించింది.

    "... అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు జరుపవలసిందే! కానీ దానికి మూల్యం చెల్లిస్తున్నది ఎవరు? ప్రజలే! తన హయాంలో ఖజానా ఖాళీచేసి మరణిస్తాడు ఒక ముఖ్యమంత్రి. ప్రజలు అశ్రుతర్పణం వదులుతారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మింగలేక, కక్కలేక చచ్చిపోతాడు. మరణించిన వ్యక్తి గురించి ప్రజలకి చెప్పలేడు...." అని ఆగి కొనసాగించింది.

    "ధనదాహం, అధికారదాహం కన్నా కీర్తి దాహం గొప్పది. అన్నిటికన్నా ప్రమాదకరమైనది కూడా! ఈ మూడు దాహాలూ నాయకులలో ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం కన్నా కమ్యూనిజమే మంచిదన్న భావం ప్రజలలో క్రమక్రమంగా కలుగుతుంది. కమ్యూనిజంలో అందరికీ కనీసావసరాలు తీరతాయి. బీద, గొప్ప తారతమ్యం ఉండదు. కానీ మనం చాలా స్వతంత్రాలు కోల్పోవలసి వస్తుంది. తమ స్వార్ధంతో నాయకులు ఈ రకమైన పరిస్థితి కలగచేస్తున్నారు. ఎక్కడయితే ఆర్ధికావగాహన లేదో అక్కడ శాశ్వతమైన అభివృద్ధి వుండదు. స్వాతంత్ర్యం రాకముందు మన దేశంలో ఎన్ని వేల కిలోమీటర్ల రైలుమార్గం ఉందో- స్వాతంత్ర్యం వచ్చాక దానిలో ఐదు శాతం రైలుమార్గం కూడా నిర్మింపబడలేదు. వర్షాకాలంలో రాబోయే ప్రమాదాల్ని నివారించడం కోసం వేసవిలోనే చెరువుగట్లు బలపరుచుకోవడానికి, డ్రైనేజి మార్గాలు విస్తృతం చేసుకోవడానికి కావలసినంత డబ్బు ప్రభుత్వానికి లేదు. గత ఇరవై సంవత్సరాల్లో ఒక ఆనకట్ట నిర్మించడం కానీ, ఒక కాలువ తవ్వడం కానీ జరగలేదు. దీనికంతటికీ కారణం ఏమిటి? శాశ్వత అభివృద్ధి కన్నా తాత్కాలిక ఆకర్షణే ప్రజానాయకుడికి కావలసింది అన్న విషయాన్ని పొలిటీషియన్స్ గ్రహించడం! దీన్ని ఏదో విధంగా అడ్డుకోకపోతే మనదేశం ఏ అటామిక్ బాంబో అవసరం లేకుండానే 'మరో హిరోషిమా'గా మారుతుంది. నాయకుల స్వార్ధం నుంచి మనల్ని రక్షించుకోవలసిన బాధ్యత మనమీదే వుంది. జైహింద్!"

    "కట్" అన్నాడు దర్శకుడు. ఆపోగ్రాం సమర్పకుడు కెమెరా ముందుకొచ్చి "ఇప్పటి వరకూ మీరు మేము వారం వారం సమర్పిస్తున్న 'భారతంలో భాగోతం' అన్న కార్యక్రమంలో ఆఖరి అంశంగా కుమారి హిమసమీర వాస్తవిక విశ్లేషణ 'మరో హిరోషిమా' ప్రసంగాన్ని వీక్షించారు. దీనిపై మీ అభిప్రాయాల్ని మాకు తెలియపరచండి" అని ముగించాడు.

    షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

    "నీ విశ్లేషణ చాలా బావుందమ్మా!" అన్నాడు దర్శకుడు ఆమె దగ్గరకోచి.

    "ఆ ఖ్యాతి అంతా మా అన్నయ్యకి దక్కుతుందండీ!" అంది హిమసమీర.  ".... తను ఎప్పుడో రాసుకున్న కాగితాల్లోంచి సేకరించిన సమాచారమే ఈ ప్రసంగానికి ఉపయోగపడింది." అంటూ ఆమె కాషియర్ గదిలోకి వెళ్ళి చెక్కు తీసుకుంది. తిరిగి ముందుగదిలోకి వచ్చి బయటికి నడవబోతుండగా వార్తలు ప్రారంభమయ్యాయి. అది లోకల్ ఛానెల్ అవడంతో స్టూడియో నిర్మాణం పూర్తిగా జరగలేదు. అద్దాల అవతలినుంచి వార్తలు చదువుతున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. అతడు శ్రీహర్ష. అన్నయ్య స్నేహితుడు. ఆమెకి కూడా బాగా తెలుసు.

    అతడు బయటికి వచ్చేవరకూ ఆగి, కలిసి వెళదామన్న ఉద్దేశ్యంతో హిమసమీర ఆ గదిలోనే కూర్చుని వుండిపోయింది.

    టీ.వీ లో శ్రీహర్ష చదువుతున్న వార్తల ప్రత్యక్షప్రసారం జరుగుతోంది.

    ".... గతరాత్రి నక్సలైట్లు తూర్పు అడవుల్లో ఒక గ్రామం వద్ద ఒక బాబాపై కాల్పులు సాగించారు. ఆ కాల్పుల్లో రత్నాబాయి అనే స్త్రీ మరణించింది. 'ఓంఫట్ బాబా' అని పేరు పడ్డ స్వామీజీ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. అతడి పరిస్థితి ప్రమాదకరంగా వుంది. ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి వారిని అంతం చేస్తామని కొంతకాలం క్రితమే నక్సలైట్లు ఆ ప్రాంతమంతా పోస్టర్లు అతికించారు. ప్రత్యక్ష సాక్షి ఇన్ స్పెక్టర్ సరళరేఖ కధనం ప్రకారం అర్ధరాత్రి వచ్చిన ఒక నక్సలిట్లు మిషన్ గన్ తో ఈ బృందం మీద కాల్పులు సాగించాడు. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా గతజన్మలో డాకూ మంగళ్ సింగ్ గా సంచలనం సృష్టించిన బృహస్పతి అనే మరో యువకుడి జాడ తెలియడంలేదు. బుల్లెట్ల దాడికి గురయిన అతడి శరీరం నదిలో కొట్టుకుపోయింది. అతడు కూడా మరణించి వుంటాడని భావిస్తున్నారు."

    హిమసమీర కెవ్వున కేక వేసింది.


                    *    *    *


    తల్లి ఏడుస్తోంది. తండ్రి వ్యాకులంగా పచార్లు చేస్తున్నాడు. హిమసమీర, ఆమె తమ్ముడు దిగులుగా గదిలో ఓ మూల కూర్చుని వున్నారు. తల్లి వెక్కుతూ అంటోంది. "బతికి ఉన్నవాళ్ళూ వాడి ఛాయలకే వెళ్ళలేదు. ప్రజల్ని మోసం చేస్తూ బతికేవాడు ఉన్నా లేనట్టే అని కట్టడి చేసారు. బతికి ఉండగానే శ్రాద్ధం పెడతానన్నారు. భగవంతుడు ఇప్పుడు ఆ మాటే నిజం చేసాడు. ఆఖరిచూపు కాదుకదా, ఆఖరికి శవం కూడా దక్కనీకుండా చేసాడు" అంటూ గొల్లుమంది.   

    సమీరకి కూడా బాగా దుఃఖం వస్తోంది. ఆ ఇంట్లో బృహస్పతికి ఎక్కువగా అభిమానించేది ఆ అమ్మాయే! అన్నయ్య తెలివి తేటలమీద ఆ అమ్మాయికి అపారమైన నమ్మకం వుంది. అతడ్ని ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేదని ఆమె అభిప్రాయం. ఎప్పటి కయినా అతడు చాలా గొప్పవాడు అవుతాడని ఆమె అనుకుంటూ వుండేది. అటువంటి అన్నయ్య ఇకలేడంటే ఆమెకి ఎందుకో నమ్మబుద్ధికాలేదు.


                                                16


    కిటికీలోంచి పడిన సూర్యకాంతికి బృహస్పతికి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి బయట ప్రకృతివేపు చూస్తూండిపోయాడు. తను బతికే ఉన్నానన్న నమ్మకం ఇప్పుడిప్పుడే అతడికి కలుగుతోంది.

    నీళ్ళలోపడి స్పృహ కోల్పోయిన తర్వాత అతడికి మెలకువ వచ్చింది ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగాకే! దాదాపు ఎనిమిది గంటలపాటు డాక్టరు అతడి తరఫున మృత్యువుతో పోరాడాడు.

    ఆపరేషన్ అయిన ఇరవై నాలుగుగంటల తర్వాత అతడికి మెలకువ వచ్చింది కళ్ళు విప్పగానే అతడికి కనబడింది ప్రశాంత నివాళి.

    కడుపుకి కట్టూ, తలకి బాండేజీ.... చుట్టూ హాస్పిటల్ వాతావరణం- ఇదేమీ కాదు అతడిని ఆశ్చర్యపరిచినవి! ఆ సమయంలో ఆ అమ్మాయి అక్కడ వుండడం!!

    ఆ అమ్మాయే తనని ఆస్పత్రిలో చేర్పిందని డాక్టరు చెప్పి నప్పుడు అతడు విస్మయం చెందాడు.

    "మీ విషయం నేను పోలీసులకి తెలియజేయవలసి వుంటుంది. నిజానికి హత్యా సంబంధిత కేసులు మేము చేపట్టకూడదు. అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేయక తప్పలేదు" అన్నాడు డాక్టరు.

    "నేను ఇక్కడికెలా వచ్చాను?"

    "ఆ అమ్మాయే తీసుకొచ్చింది. మీ విషయం బయటికి తెలియనివ్వకూడదని ప్రాధేయపడింది."

    "ఎందుకు?"

    ఆ ప్రశ్నకి సమాధానం ప్రశాంత నివాళి నాలుగురోజుల తర్వాత అతడికి చెప్పింది.

    ".... నది ఒడ్డున మీరు కనబడగానే నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. నలుగుర్నీ పిలుద్దామంటే- ఈ విషయం అందరికీ తెలుస్తుందని భయం! అందుకని నేను మిమ్మల్ని ఈ ఆస్పత్రిలో చేర్పించాను. ఎంతో బతిమాలితే కానీ డాక్టరు చేర్చుకోలేదు. ఆపరేషన్ ఖర్చులు కాకుండా అదనంగా మరో పదివేలు అడిగాడు."

    "దేనికి?"

    "మీరు బతికివున్న విషయం పోలీసులకీ, పత్రికల వాళ్ళకీ తెలియనివ్వకుండా వుండడం కోసం!"

    "నాకేమీ అర్ధంకావడం లేదు. నేను బతికి ఉన్నట్లు నలుగురికీ తెలిస్తే ఏమిటి?"

    "మీరు బతికివున్నారని తెలిస్తే నక్సలైట్లు ఊరుకోరు. అదీ నా భయం! వాళ్ళు పాంప్లెట్లు వేసి, పోస్టర్లు అంటించినప్పుడే ఈ ప్రమాదం జరుగుతుందని నాకు అనిపించింది. అందులోనూ హత్యాప్రయత్నం చేసిన తర్వాత కూడా మీరు ప్రాణాలతో బయట పడ్డారంటే ఆ నక్సలైట్లు ఈ ఆస్పత్రిని బాంబులతో ధ్వంసం చేసినా అందులో ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితిల్లో నాకు ఏం చెయ్యాలో తోచలేదు. సలహా చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేరు."

    "నన్ను చంపబోయింది నక్సలైట్లు కాదు."

    ఈసారి ఆశ్చర్యపోవడం ప్రశాంత నివాళి వంతయింది.

    "మీకెలా తెలుసు" అడిగింది.

    "అతడెవరో బొంబాయికి సంబంధించిన మాఫియా మనిషిలా వున్నాడు. నార్త్ ఇండియన్! పైగా అంత అత్యాధునికమైన టెలిస్కోప్ కి మిషన్ గన్లు నక్సలైట్ల దగ్గరలేవు. అతడ్ని నేను గుర్తు పట్టగలను. నిశ్చయంగా నక్సలైటు కాదు" అంటూ ".... అన్నట్లు రావు పరిస్థితి ఎలా వుంది?"

 Previous Page Next Page