స్థాణువైపోయాడు భాగవతార్. ఎంత ధైర్యంగా తెగేసి చెప్తోంది? ఏం చేస్తే పాపముంది యిలాంటివాళ్ళని?
"ఎవరావ్యక్తి?"
"ఇప్పుడు చెప్పను. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది...."
* * *
ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి? అందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మృదుల స్నేహితుల్ని ఒక్కొక్కర్నీ యింటికి పార్టీకి ఆహ్వానించాలి. మాట్లాడుతూ మధ్యలో పని ఉన్నట్టు బయటికెళ్ళాలి. వెళుతూ వెళ్తూ అంతకుముందే రహస్యంగా దాచిన టేప్ రికార్డ్ ఆన్ చేసి తను లేనప్పుడు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో రికార్డు చెయ్యాలి. అప్పుడు తెలిసిపోతుంది అసలు రహస్యం. ఆలోచించినకొద్దీ ఈ ప్లాను అద్భుతంగా తోచింది. ఇంపోర్టెడ్ మినీ టేప్ రికార్డర్ ముందు పెట్టుకుని సరిగ్గా రికార్డు అవుతుందో లేదోనని చూడాలని నోటికొచ్చినట్లు వాగి టెస్టు చేసుకున్నాడు. తరువాత రీవైండ్ చేసి ఆ టేప్ రికార్డర్ ని టీపాయ్ కింద పాత న్యూస్ పేపర్ల కట్టమీద దాచి అనంగ్ కి ఫోన్ చేశాడు పార్టీకి రమ్మని.
"ఇప్పుడు ఈ పార్టీలూ యివన్నీ ఏవిటి? నా కసలు టైమ్ లేదు." అని విసుక్కుంది మృదుల.
"ప్లీజ్ నాకోసం- సరదాగా ఒక రోజు-నీ పనులు ఎప్పుడూ వుండేవేగా?" భాగవతార్ యిటీవల దిగాలుగా వుంటున్నాడని అతనికోసం ఒప్పుకుంది మృదుల.
"ఎవరెవర్ని పిలుస్తున్నావు?" అడిగింది.
"అనంగ్ ని."
"అతడ్ని ఒక్కడినేనా? ఇదేం పార్టీ?"
"ఫరవాలేదు. ఎక్కువమంది అయితే గంద్రగోళంగా వుంటుంది."
ఎక్కువగా వాదించలేదు మృదుల. ఈ పార్టీలో ఆ అమ్మాయికి పెద్దగా అంత ఉత్సాహం లేదు. భాగవతార్ ఫోన్ కాల్ అందుకుని వచ్చాడు అనంగ్. అతడికి మృదులమీద కోపం పోలేదు. అయినా వచ్చాడు. ఆమెనెలాగైనా సాధించాలని వుందతనికి. ఉపాయం తోచటం లేదు.
అనంగ్ - భాగవతార్ - మృదుల ముగ్గురూ హాల్లో కూర్చున్నారు. అనంగ్ - భాగవతార్ లు చీర్స్ చెప్పుకుని విస్కీ తాగుతూంటే మృదుల ఫ్రూట్ జ్యూస్ తెచ్చుకుంది.
"ఇప్పుడు మీరేం రాస్తున్నారండీ?" అడిగాడు భాగవతార్.
"అంతర్జాతీయ రాజకీయరంగం నేపథ్యంగా చేసుకుని రాద్దామనుకుంటున్నాను."
"అలాగా. ఎన్ని పాత్రలుంటాయి?"
తెల్లబోయి చూశాడు అనంగ్.
"అలా లెక్కపెట్టలేమండీ! అయినా ముందుగానే ఎలా చెప్పగలను?"
"ఒహో! నవల పూర్తిగా రాసేసాక ఆలోచించడం మొదలుపెడతారన్నమాట" మరోసారి తెల్లబోయాడు అనంగ్.
భాగవతార్ కి నవలల గురించి ఏమీ తెలియదని తెలిసిన మృదుల నవ్వు ఆపుకోలేక పైకి నవ్వేసింది. అనంగ్ ముఖం ఎర్రబడింది. మృదుల వెంటనే "ఐయామ్ సారీ! నవల ప్లానింగ్ అంటే ఎలా వుంటుందో భాగవతార్ కి తెలియదు. అతను పూర్తిగా మ్యూజికల్ లైన్. భాగవతార్ మాటలకి నవ్వేను. మిమ్మల్ని చూసికాదు" అంది. భాగవతార్ గుటక మింగి "ఇంతకీ యిప్పుడేం రాస్తున్నారు?" అని అడిగాడు మళ్ళీ.
అనంగ్, మృదుల ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
"వీళ్ళు నా ముఖం ఎదురుగానే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకుంటున్నారు. నేను లేనప్పుడు ఏం మాట్లాడుకుంటారో చూడాలి" కసిగా అనుకున్నాడు మనసులో. లేచి నిలబడి "చిన్న పనుంది. ఇప్పుడే పది నిముషాల్లో వస్తాను. మీరు మాట్లాడుకుంటూ వుండండి" అని పేపర్ తీసుకుంటున్నట్టుగా టీపాయి కింద ఒంగి అక్కడ దాచిన టేప్ రికార్డ్ ఆన్ చేసాడు.
"యూ ఫూల్ - రోగ్ - బిచ్ - నన్నే మోసం చేద్దామనుకున్నావా? నాకు తెలియదనుకుంటున్నావా? ఐవిల్ ప్రూవిట్ - ఐవిల్ కిల్ యూ!"
టేప్ రికార్డర్ లోంచి భాగవతార్ మాటలు పిచ్చివాడి ప్రేలాపనలాగ రూమ్ లో ఖంగున మార్మోగాయి. టెస్టింగ్ కోసం భాగవతార్ మొదట రికార్డు చేసిన మాటలు తుడిపేయడం మర్చిపోయాడు. రికార్డర్ ఆన్ చేసినప్పుడు అవే మాటలు రికార్డ్ లోంచి వినిపించాయి.
సడన్ గా భాగవతార్ తిట్లు గదిలో ఖంగున వినిపించేసరికి వులిక్కిపడ్డారు మృదుల, అనంగ్. భాగవతార్ కి ముచ్చెమటలు పోస్తూండగా హడావిడిపోతూ టేప్ రికార్డర్ ఆఫ్ చేసేసి ఆ ఖంగారులో దాన్ని చేత్తో పట్టుకుని నిఠారుగా నిలబడి "హి-హి-హి" అని అర్ధరహితంగా నవ్వేడు.
"ఈ జోక్ ఏమిటో నాకర్ధంగాలేదు. మీ తిట్లు ఎవర్నీ? రికార్డ్ చేసి మరీ వినిపిస్తున్నారెందుకు?" కోపంగా అడిగాడు అనంగ్.
భాగవతార్ తడబిడలాడుతూ "అదీ.... అదీ.... నవల.... నవల. బాగుందా?" అన్నాడు.
"చాలా బాగుంది. మన పాఠకులకు నవల ప్రారంభంలోనే ఈ మాత్రం కిక్ అవసరం" చెప్పాడు అనంగ్.
కుసాయిగుడాలో దేవకి ఇంటిముందు నిలబడి తలుపు కొట్టింది మృదుల. వెనకటిలాగే నడి వయసు స్త్రీ తలుపు తెరిచింది. మృదులని చూడగానే ముఖం చిట్లించింది. మృదులతోపాటు మరో స్త్రీ గూడా వుంది. వాలు జడ కొద్దిగా మోకాళ్ళ పైకి కట్టుకున్న పుల్లే టుకుర్రు చీర- జడలో అంతకుముందు రోజు విసిరినా కొద్దిగా వడిలిన గులాబీ పూల చెండు- రెండు చేతులకి బోలెడన్ని మట్టిగాజులు- చిరునవ్వుతో నడివయసు స్త్రీకి నమస్కరించి, డాక్టరుగారున్నారా?" అని అడిగింది. ఆ మాటలతో తలుపు తెరిచినావిడ మొహం కొద్దిగా తేరుకున్నా మృదులని అనుమానంగా చూడటం మాత్రం మానలేదు.
"ఫ్లెమింగ్ గారున్నారా? పోనీ దేవకిగారున్నా పిలు" తనూ నవ్వుతూనే అంది మృదుల.
ఆ స్త్రీ లోపలికెళ్ళింది. దేవకి, ఫ్లెమింగ్ ఇద్దరూ బయటికొచ్చారు. దేవకి మృదులని చూసి నవ్వింది కాని జీవం లేనట్లుగా వుందా నవ్వు. ఏదో జబ్బు పడి లేచిందాన్లా పడిపోయి ఉంది.
"ఏం కావాలి మీకు?" కరుగ్గా అడిగాడు ఫ్లెమింగ్.
"ఈవిడ నా స్నేహితురాలికి దూరపు బంధువు. గర్భంతో వుంది. ఇంట్లో అత్తగారూ, భర్త మగపిల్లవాడిని కనకపోతే ఊర్కోమని బెదిరించారట. మీ హాస్పిటల్ లో గర్భంలో ఉన్న శిశువు ఆడో- మగో తెలుసుకునే సదుపాయాలున్నాయని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాను. కొంచెం హెల్ప్ చెయ్యండి. ప్లీజ్. ప్లీజ్ ఇచ్చుకోగలదు" ప్రాధేయపడుతున్నట్లు అంది. కన్విన్స్ అయ్యాడు ప్లెమింగ్.
"ఆ ఎక్విప్ మెంట్ అంతా మా హాస్పిటల్ లో ఉంది. అయితే మీరు కోరేదేమిటి? కేవలం మీ గర్భంలో ఉన్న శిశువు ఆడో - మగో తెలుసుకోవడం మాత్రమేనా?"
"అంతేకాదు. ఒకవేళ ఆడ శిశువైతే అబార్షన్ చేయించుకోవాలని ఇందుకు కూడా ఇక్కడవకాశాలున్నాయి కదా!" తల వొంచుకుని సిగ్గుపడుతూ- బాధపడుతూ చెప్పింది ఆ అమ్మాయి.
నమ్మలేనట్లు కళ్ళప్పగించి చూస్తోంది దేవకి.
"ఏం చేస్తాం? నలుగురితోపాటూ మనం. అత్తగారికి, మొగుడికి మగపిల్లవాడు కావాలనుకుంటే ఆరోగ్యాన్ని పణంగా పెట్టయినా మగపిల్ల వాడిని కనవలసిందేగా! మరి" నిట్టూర్పు, నిరాశగా అంది. దేవకి మాట్లాడలేదు. మృదుల ఈ రకంగా మాట్లాడడం ఇష్టంలేనట్లుగా వుంది ఆవిడ మొహం చూస్తూంటే.
"మీ పేరు?" గర్భిణీ స్త్రీని అడిగాడు ప్లెమింగ్.
"నాంచారమ్మ."
"స్క్రీనింగ్ టెస్ట్ కి తరువాత అబార్షన్ కి అయిదు వేలవుతుంది. హాస్పిటల్ లో ఇన్ పేషంటుగా కనీసం వారం రోజులుండాలి. సమ్మతమేనా?"
"అలాగే"
"మరొకటి. ఈ విషయాలన్నీ కాన్ఫిడెన్షియిల్ గా ఉంచాలి. బయటపడడం ఎవరికీ మంచిదికాదు."
"అదేమిటండీ! మే మాత్రం ఇలాంటివి ఎలా బయట పెట్టుకుంటాం? పరువుపోదూ! మళ్ళీ తలెత్తుకు తిరగ్గలమా?"
"ఓ.కే. ముందు ఎడ్వాన్సుగా వెయ్యి రూపాయలు కడితే బ్లడ్ టెస్ట్ వగైరాలు ప్రారంభిస్తాను."
"అబార్షన్ కి బ్లడ్ టెస్ట్ ఎందుకండీ?" అమాయకంగా అడిగింది మృదుల.
"మా అమెరికన్ డాక్టర్స్ మీ ఇండియన్ డాక్టర్స్ లా కాదు. ఎంత చిన్న ఆపరేషన్ కైనా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు."
"ఔను. అందుకే మీకంత పేరు, ప్రఖ్యాతులు."
మృదుల మాటల్లోని వ్యంగ్యం ఫ్లెమింగ్ పట్టుకోలేకపోయాడు కాని దేవకి అర్ధం చేసుకుంది. చురుక్కున చూసింది.
నాంచారమ్మ పర్సు తెరిచి వంద రూపాయిల నోట్లు పది లెక్కపెట్టి, ప్లెమింగ్ ముందు బల్లమీదుంచుంది. డబ్బు చూడగానే వికసించింది అతడి మొహం. దేవకి కళ్ళు మాత్రం అశాంతితో సంచలిస్తున్నాయి.
ఏదో చెప్పబోయి ఆగిపోయినట్లు నోరు తెరచి మూసుకుంది.
"మీరు రేపుదయమే ఏమీ తినకుండా వస్తారా? లేక ఇప్పుడే హాస్పిటల్ లో జాయినై ఈ రోజంతా విశ్రాంతి తీసుకుంటారా? ఇక్కడ మీకే లోటూ రాదు."
పిట్ట జారిపోతుందేమో అన్నట్టు ఆరాటంగా అన్నాడు ఫ్లెమింగ్.
"స్క్రీనింగ్ టెస్ట్ ఇప్పుడే జరపడానికి వీలౌతుందా?" అడిగింది మృదుల.
"రేపు బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ తీసుకున్నాక స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తాను" చెప్పాడు ఫ్లెమింగ్.