"నేను మింగియార్ దగ్గరికి వెళుతున్నమాట నిజమే. అయితే నేను ఏ గ్రూపులోనూ కలవను. అక్కడకి వెళ్ళడంలో నా ప్రయోజనం వేరు. అయినా మింగియార్ గారితో మాట్లాడి విషయమేమిటో తెలుసుకోడానికి ప్రయత్నిస్తాను."
"థాంక్యూ! ఇదిగో నా విజిటింగ్ కార్డు, మీకేదేనా సమాచారం దొరికినా, నా సహాయం అవసరమైనా నాకు ఫోన్ చెయ్యండి. సోమనాథ్ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ పొప్రయిటర్ సోమనాథ్ నా ఫ్రెండ్. అవసరమైతే అతని సాయం తీసుకోండి. బిల్లు నాకు పంపమనండి."
నమస్కారం చేసి వెళ్ళిపోయాడు మహావీర్. అతడు వెళ్ళగానే సుడిగాలిలో లోపలికొచ్చాడు భాగవతార్ జేవురించిన మొహంతో. "ఏమిటి? అతడు మాట్లాడిన కాన్సిడెన్షియల్ విషయాలు?" అడిగాడు.
"దేవకి జీవితానికి సంబంధించినవి.
జేవురించిన భాగవతార్ మొహం పాలిపోయింది.
పిడికిళ్ళు బిగించి "దేవకి! దేవకి! దేవకి జోలి ఒదిలేయి. ఆ ప్లెమింగ్ గాడు, కేబరే డాన్సులు- నువ్వు ఏదో ఒకనాడు ప్రమాదంలో చిక్కుకుంటావు" అన్నాడు.
"భయంలేదు. అవసరమైతే సోమనాథ్ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ ప్రొప్రయిటర్ సోమనాథ్ సహాయం తీసుకోమన్నాడు మహావీర్".
దబ్బున నేలమీద కూలబడ్డాడు భాగవతార్.
* * *
"మీ దగ్గరకొచ్చేవాళ్ళల్లో దేవకి అనే క్లబ్ డాన్సర్ కూడా వుందా?" ఏ రకమైన ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అడిగేసింది మృదుల.
"క్రిస్టియన్స్ లో మరణ శయ్యమీది రోగులు మతగురువుల ముందు జీవితంలో తాము చేసిన తప్పులను ఒప్పుకుంటారు. వాటిని కన్ఫెషన్స్ అంటారు. క్రిస్టియన్ ఫాదర్ ఎట్టి పరిస్థితులల్లోనూ ఆ కన్ఫెషన్ ని బయటపెట్టరు. మా నియమాలు కూడా యించుమించు అలాంటివే. తమ సమస్యలతో, భయాలతో, బాధలతో మా దగ్గిరకొచ్చే వాళ్ళ రహస్యాలను బయటపెట్టము."
"కాని లోక కళ్యాణంకోసం, అవసరమైతే బయటపెడతానని మీరే అన్నారు. దేవకితో ముడిపడివుంది ప్లెమింగ్ రహస్యం. అతని ధోరణి సభ్య సమాజానికి ప్రమాదకరమైనదిగా తోస్తోంది.
ఆలోచనల్లో పడ్డాడు మింగియార్.
"ఇంతకూ మీకేం కావాలి?"
"మీ దగ్గరకొచ్చే వ్యక్తుల్లో దేవకి వుందా?"
"నేను చెప్పబోయే విషయాలు సమాజ శ్రేయస్సుకి అవసరమైన తప్పని పరిస్థితుల్లో తప్ప బయటపెట్టనని ప్రమాణం చెయ్యగలరా?"
"దేనిమీద ప్రమాణం చెయ్యను?"
"మాట యివ్వండి చాలు. మీ మాటలో నాకు నమ్మకముంది."
"థాంక్యూ! దేవకిమీద నాకు నిజమైన అభిమానముంది. ఆమె ప్లెమింగ్ తో సంతోషంగా వుంటే క్లబ్ లో డాన్స్ లు చేసినా మరేంచేసినా నేను పట్టించుకోను. కాని ప్లెమింగ్ ఏదేనా వ్యూహం పన్నుతోంటే మాత్రం నేను తప్పకుండా ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో ఒకవేళ దేవకికి కూడా కష్టం కలిగినా లక్ష్యపెట్టను."
"దేవకి ఇక్కడికొచ్చే వారిలో వున్నారు. ఆవిడ అభ్యర్ధనమీదనే నేనారోజు రాజభూషణంగారిచ్చిన పార్టీకొచ్చాను. ఆ పార్టీకి ఎందరో వి.ఐ.పి. లొస్తారని, వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పండి."
"మీకెందుకు వి.ఐ.పి.లతో పరిచయాలు?"
"అది వేరే విషయం. మీ ప్రశ్నకి సంబంధించినంతవరకు చెప్తాను."
"దేవకి ఏ సమస్య పరిష్కారం కోసం మీదగ్గరకొచ్చింది?"
"సమస్యకాదు. "సోమ" గురించి తెలుసుకోవాలని వచ్చింది."
"అంటే?"
నవ్వాడు మింగియార్.
"అదొక మిథికల్ ప్లాంట్, వేదాలలో దీనిగురించిన వర్ణనవుంది. యజ్ఞ యాగాదులలో ఆర్యులు ఈ సోమరసాన్ని తాగేవారట. ఇది తాగిన వాళ్ళకి అద్భుతమైన దర్శనాలు కలిగేవట. శరీరానికి నూతనోత్తేజం వచ్చేదట...."
"రంభా, ఊర్వశీ, మేనకా, తిలోత్తమలు, మాంచి నిషాయిచ్చే అమృతభాండం- కావలసివచ్చినప్పుడు అప్పులిచ్చే కుబేరుడి లాంటి బేంకరు మొదలైన హంగులన్నిటితోనూ వున్న స్వర్గం ఆర్యులు సోమరసం స్వీకరించాక కలిగిన దర్శనమేనేమో?"
నవ్వేడు మింగియార్.
"కావచ్చు. దేవకిగారు ఈ సోమ మూలిక గురించి నాకు తెలుసేమో కనుక్కోవాలని వచ్చారు. అది నేను కనిపెట్టగలిగితే ఎంత డబ్బైనా యిచ్చి కొనుక్కుంటారట. దానివల్ల అమరత్వం సిద్ధిస్తుందనే నమ్మకం ఆమెకు కూడా కలిగినట్లుంది."
"ఓ గాడ్? దేవకిని ఈ రకంగా ఊహించలేకపోతున్నాను. నేనెరిగిన దేవకి వేరు. ఇంతకీ ఈ సోమ మూలికలు దేవకికి ఎందుకట? ఆ సోమరసం తాగి చిరంజీవిగా వుండాలనుకుంటోందా?"
"సరిగ్గా చెప్పలేను. ఆమె భర్త దీనికి సంబంధించిన రీసెర్చి చేస్తున్నాడనుకుంటాను. మృత్యువు లేకుండా వుండటానికోలేక చాలాకాలం జీవించడానికో మందు కనిపెట్టాలని అతని ప్రయత్నం."
"ఇంపాసిబుల్. ఎలా సాధ్యం అది?"
"చెప్పలేము. సైంటిఫిక్ గా రుజువయ్యెవరకూ అన్నీ అసాధ్యంగానే తోస్తాయి. పూర్వ యుగాల వాళ్ళు నిజంగా సాధించారో లేక తమ ఊహలని వర్ణించారోకాని దూరదృష్టి-దూరశ్రవణం- ఆకాశ గమనం మొదలయినవన్నీ పేర్కొన్నారు. శాస్త్రీయంగా రుజువయ్యేవరకూ అన్నీ అభూతకల్పనలే అనుకున్నాము. ఇప్పుడవన్నీ సైంటిఫిక్ గా నిజమని రుజువై మన నిత్య జీవితంలో అనుభవించడం లేదూ. నయంకావడం అసంభవం అనుకున్న ఎన్నో రోగాలకి మందులు కనిపెట్టలేదూ! మానవ శరీరపు సగటు ఉష్ణోగ్రతని 98.4 ఫారన్ హిట్ కంటె తక్కువలో వుంచగలిగితే ఎక్కువకాలం జీవించే అవకాశాలున్నాయనే సిద్ధాంతం" ఒకటుంది. ఈ విషయంలో చాలామంది ప్రయోగాలు చేస్తూనే వున్నారు."
"ప్లెమింగ్ కూడా అలాంటి ప్రయోగాలు చేస్తున్నాడంటారా?"
"అనుకుంటాను. దేవకి సజెస్టివ్ గానే తప్ప వివరంగా చేపలేదా విషయాలు."
"అయితే గర్భిణీ స్త్రీలు అతడు హాస్పిటల్ అనే పేరుతో నడుపుతోన్న లేబ్ కి ఎందుకు వెళుతున్నట్లు? గర్భంలో వుండగానే తమ బిడ్డలని దీర్ఘాయువులుగా చేయడానికా?"
"మాట్లాడలేదు మింగియార్. ఏదో ఆలోచిస్తూన్నట్లుగా వుంది అతని మొహం.
"మీకేమైనా తెలుస్తే చెప్పండి. సంకోచించకండి ప్లీజ్."
"చెప్పడమే మేలేమో, లాండివిటీ (దీర్ఘ కాలిక జీవితం) మీద జరుగుతున్న ప్రయోగాలలో మరొక కొత్త ప్రయోగం కూడా చేస్తున్నారని విన్నాను. మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని కలిగించేవి రక్తంలోని తెల్లకణాలు. ఇది శక్తిమంతంగా వున్నంతవరకూ మానవుడు రోగాలబారి నుంచి కాపాడుకోగలడు. ఆరకంగా మృత్యువుని దూరంగా నెట్టగలడు. ఈ సిద్ధాంతంమీద ఆధారపడి ఒక వ్యక్తి శరీరంలోని బ్లడ్ గ్రూప్ కి సమానమైన మరొక బ్లడ్ గ్రూప్ లోని తెల్లకణాలను మనిషి శరీరంలోనికి ప్రవేశపెట్టగలిగితే రోగ నిరోధక శక్తి తద్వారా ఆయుర్దాయం మరింతగా పెంపొందించవచ్చేమోనని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ పద్దతిని "క్లోనింగ్" అని వ్యవహరిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళుతున్నది తమ గర్భంలోని శిశువుల ఆయుర్దాయం పెంచడానికి కాదు. తమ గర్భంలో వున్నది ఆడశిశువో - మగశిశువో తెలుసుకోడానికి."
తెల్లగా పాలిపోయింది మృదుల మొహం.
"ఒకవేళ స్త్రీ శిశువైతే అబార్షన్ చేయించుకోడానికి?...."
మాట్లాడలేదు మింగియార్.
"అంటే - ప్లెమింగ్ చేస్తున్న ప్రయోగం సజీవంగా వున్న ఫీటస్ లోని ...." మళ్ళీ మాట్లాడలేదు మింగియార్. తలదించుకున్నాడు.
"హరిబుల్- అమానుషం- కిరాతకం. ఇవా ప్రయోగాలు? బహుశా ఈ కారణంగానే అమెరికాలో అరెస్ట్ అయ్యాడేమో?"
కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మృదులకి. ఇంకా భూమ్మీద పడకుండానే. ఎలాంటి అత్యాచారాలు తలపెడ్తూన్నారు స్త్రీజాతి మీద? అందుకు తల్లులే పూనుకుంటే ఈ తల్లులు వ్యక్తిత్వమున్న మనుషులా? తరతరాలుగా బ్రెయిన్ వాష్ చేయబడ్డ మరలు, సమాజానికి పనిముట్లు!....
* * *
మృదుల రానురానూ మరీ యిల్లు పట్టకుండా తిరుగుతోంది. భాగవతార్ లో ఉక్రోషం రోజురోజుకీ పెరిగిపోతోంది.
"నువ్వు నామాట లక్ష్యపెట్టడం లేదు. నువ్విలా తిరగడం నేనెంత మాత్రం సహించను." సీరియస్ గా అన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే మృదుల కూడా సీరియస్ గా అయింది.
"ప్రస్తుతం కొన్ని పనులమీద నేను తిరగక తప్పదు. అంతగా నువ్వు సహించలేకపోతే నేను వెళ్ళిపోతాలే."
గుండె గుభీల్లుమంది భాగవతార్ కి. అతడేమాత్రం సహించలేని విషయం అది. మృదుల తన్ని ఒదిలివెళ్ళిపోవడం- ఆ తరువాత వచ్చే స్కాండల్స్ తన బ్రతుకు నవ్వులపాలు కావడం.... 'నో' అలా జరగడానికి వీల్లేదు.
"మీ అమ్మా నాన్నా, నువ్వేం చేస్తే దానికి తందానతాన అంటారు కాబట్టి వాళ్ళదగ్గరకి వెళ్ళిపోతానంటున్నావు కదూ!"
"కాదు. నేను మా అమ్మా నాన్నల దగ్గిరికి వెళ్ళను. మరోవ్యక్తి దగ్గరకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను."